సకలం... సుందరం | Sundaram sakalam ... | Sakshi
Sakshi News home page

సకలం... సుందరం

Published Thu, May 22 2014 10:57 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

సకలం... సుందరం - Sakshi

సకలం... సుందరం

సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ  దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో  సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం.
 
భగవద్గీత అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చినట్లుగానే, సుందరకాండ అనగానే హనుమంతుడు జ్ఞప్తికి రావడం సహజం. గీత లాగే సుందరకాండ కూడా చక్కటి వ్యక్తిత్వ వికాస గ్రంథం. వాల్మీకి శ్రీమద్రామాయణ రచన ప్రారంభించిన క్రమంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ పూర్తయ్యాయి.
 
తర్వాతి కాండకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించాడు. కానీ మంచి పేర్లేమీ ఆయనకు తోచలేదు. అప్పుడు ఆయన మనసులో రామభక్తుడైన హనుమంతుడు మెదిలాడు. కొత్తకాండకు హనుమత్కాండ అని పేరు పెడదామనుకున్నాడు. అదే విషయాన్ని హనుమను పిలిచి ఆయనకు చెప్పబోతున్నాడు.
 
ఇంతలో అంజనాదేవి ‘‘మహర్షీ! సుందరుడిని ఒకసారి నా వద్దకు పంపించు’’అని అనడం వాల్మీకికి వినిపించింది. వాల్మీకి మహర్షి ‘‘సుందరా! మీ తల్లిగారు పిలుస్తున్నారు, వెళ్లిరా నాయనా!’’అని చెప్పారు. హనుమకు కూడా ‘‘నాయనా, సుందరా! ఎక్కడున్నావు తండ్రీ’’ అంటున్న తల్లి గొంతు వినిపించింది.
 
వెంటనే హనుమ తన తల్లి వద్దకు వెళ్లి, ‘‘అమ్మా! సుందరుడెవరు?’’ అని అమాయకంగా అడిగాడు. అప్పుడు అంజనాదేవి ‘‘నీకన్నా సుందరుడెవరు నాయనా? బాల్యంలో నువ్వు బాలభానుడిలా సుందరంగా భాసించేవాడివి. అందుకే నేను నీకు సుందరుడనే పేరే పెట్టాను. అయితే ఇంద్రుడు నీ హనువుపై వజ్రాయుధంతో కొట్టడం వల్ల నీకు హనుమంతుడనే పేరు వచ్చింది.

మహర్షి రాయబోయే కాండకు నీ పేరు పెట్టడమే బాగుంటుంది. ఎందుకంటే ఆ కాండకు సంబంధించిన వారందరూ సుందరమైన వారే! రాముడు సుందరుడు, ఆయన సతీమణి సీత  ఎంతో సుందరమైనది. వారిద్దరికీ సంబంధించిన ఈ కథ సుందరమైనది. ఆ తల్లి నివసించబోయే అశోకవనం కూడా సుందరమైనదే. ఆ కావ్యానికి అనుసంపుటి చేసిన గాయత్రీ మాత ఎంతో సుందరమైనది. అన్నింటికీ మించి ఆ కావ్యరచన సుందరంగా సాగుతోంది కాబట్టి ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడమే సముచితం’’ అంది అంజనాదేవి.
 
ఈ సంభాషణనంతటినీ ఆలకిస్తున్న వాల్మీకి వెంటనే ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు. హనుమ గురించి అధికంగా ఉండే సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భక్తితో పారాయణ చేసిన వారి కోర్కెలను తీర్చే కల్పతరువు.
 
ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలంటే నియమాలను పాటించాలేమో అని చాలామంది భయపడతారు. అయితే ఏవైనా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించినప్పుడు నియమాలను పాటించక తప్పదు కానీ, మానసికానందం కోసం పఠించేవారు సర్వకాల సర్వావస్థలలోనూ హాయిగా చదువుకోదగ్గ సద్గ్రంథమిది. నేడు హనుమజ్జయంతి. భక్తి ప్రధానం అని గుర్తుంచుకోండి. ఈ వేళ అయినా ఈ గ్రంథ పారాయణ మొదలు పెట్టండి... ఆధ్యాత్మికానందంలో ఓలలాడండి.
 
- డి.వి.ఆర్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement