Pokemon Go
-
డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్
కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అందరూ ఇంట్లోనే ఉండేసరికి స్మార్ట్ ఫోన్, పీసీ, పియస్4, ఏక్షబాక్స్ వన్, నింటెండో స్విచ్, గూగుల్ స్టేడియా వంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడు బిలియన్లకు పైగా మంది ఏదో ఒక గేమ్ అడుతున్నారని పేర్కొంది. పోకీమాన్ గో, పబ్జి మొబైల్ వంటి ప్రసిద్ధ గేమ్ సంస్థలు లాక్డౌన్ సమయంలో స్టే-ఎట్-హోమ్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాయి. 2020 మొదటి తొమ్మిది నెలల్లో గ్లోబల్ మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మన దేశ పౌరులు 2020 మొదటి 9 నెలల్లో 7.3 బిలియన్ గేమ్ లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త మొత్తం డౌన్లోడ్లలో ఇది దాదాపు 17% అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ ఏడాది తోలి త్రైమాసికంలో భారతీయులు దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ చేసుకున్నారు. తరువాతి త్రైమాసికంలో మన దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల గేమ్ డౌన్లోడ్ 50% పెరిగాయి. దింతో గేమింగ్ ప్రియుల సంఖ్య భారిగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో గేమ్ డౌన్లోడ్లలో వృద్ధి 7% పెరిగి 2.9 బిలియన్ డౌన్లోడ్లకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్త గేమ్ డౌన్లోడ్ లలో 10శాతం ఇన్స్టాల్ లతో యుఎస్ రెండవ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో బ్రెజిల్ (8 శాతం) ఉంది. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) 2020 మొదటి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో గారెనా ఫ్రీ ఫైర్ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో పబ్జి, సబ్వే సర్ఫర్ గేమ్ లు నిలిచాయి. ఇండియాలో అక్టోబరులో పబ్జి నిషేధం తర్వాత తిరిగి "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో ఇన్నర్స్లోత్స్ అమాంగ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చితే గూగుల్ ప్లే డౌన్లోడ్లు మొదటి తొమ్మిది నెలల్లో 40% కంటే ఎక్కువ పెరిగాయి, అలాగే ఆపిల్ యొక్క యాప్ స్టోర్ ఇన్‌స్టాల్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరిగాయి. -
మళ్లీ వచ్చిన ‘పోకేమాన్ గో’ పెద్దాయన!
ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన 'పోకేమాన్ గో' ఆండ్రాయిడ్ గేమ్‌తో తైవాన్‌కు చెందిన చెన్‌సున్ యాన్ మరోసారి దర్శనమిచ్చాడు. ఏకంగా 64 మొబైల్ ఫోన్లతో పోకేమాన్ ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. వాటన్నింటినీ నెమలి పించం మాదిరిగా సైకిల్‌కు అమర్చి న్యూ తైపీ నగరం వీధుల్లో తిరుగుతూ గేమ్ ఆడుతున్నాడు. పిల్లలు, పెద్దవారిని ఆకర్షిస్తున్నాడు. 72 ఏళ్ల చెన్‌సున్ తనకు ఈ గేమ్ వ్యసనంలా మారిపోయిందని, దాన్ని వదలబుద్ధి కావడం లేదని చెప్తున్నాడు. కొన్నేళ్ల కిందట తన మనుమడితో సరదాగా ఆడిన ఈ ఆటకు బానిసనయ్యానని తెలిపాడు. అయితే, పోకేమాన్ గో తనకు ఎంతో ఇష్టమైన ఆన్లైన్ గేమ్ అని, ఇదంతా పిల్లల సరదాకోసం కూడా చేస్తున్నానని అంటున్నాడు. కాగా, గతంలో సైకిల్‌పై 20 ఫోన్లు, 30 ఫోన్లు అమర్చి పోకేమాన్ ఆడిన చెన్‌సున్ 2019లో ఆ సంఖ్యను 45కు చేర్చాడు. తాజాగా 64 ఫోన్లను సైకిల్‌కు ఫిక్స్ చేసి తన రికార్డును తనే తిరగరాశాడు. ఇక దేశీయ అసుస్ మొబైల్ ఫోన్లతో పోకేమాన్ ఆడుతున్న పెద్దాయనకు గతేడాది ఓ ఆఫర్ వచ్చిందట. అసుస్ మొబైల్ సంస్థ తన ‘అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎం2’ మొబైల్ లాంచింగ్‌కు ఆహ్వానించిందట! ఇక చెన్‌సున్ లక్ష్యం 72 మొబైల్ ఫోన్లతో పోకేమాన్ ఆడటమని తెలిసింది. కానీ, మొబైళ్లు, వాటికి పవర్ బ్యాంకులు, కేబుళ్లు, అమర్చడానికి ప్లాస్టిక్ హ్యాండిళ్లతో కలిపి మొత్తం బరువు 22 కిలోలు. ఇది మరింత పెరిగితే సైకిల్ పాడవుతుందనే ఉద్దేశంతో చెన్‌సున్ ఆ ప్రయతాన్ని వాయిదా వేసుకున్నాడట. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల విలువ అక్షరాల రూ.3,40,000. మరోవైపు అంతభారీ స్థాయిలో గేమ్ ఆడటం వల్ల చెన్సున్కు కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. (చదవండి: అమ్మకానికి చే గువేరా జన్మించిన భవనం) -
పొకెమెన్ గో గేమ్ ఆడుతూ.. ఔరా అనిపించాడు.
-
తైవాన్ తాత అద్భుతం.. ఒకే సారి 15 మొబైల్స్‌తో..
తైవాన్ : ఓ తైవాన్ తాత అద్భుతం సృష్టించాడు. ఒకేసారి 15 మొబైల్స్‌లో వివాదస్పద పొకెమెన్ గో గేమ్ ఆడుతూ.. ఔరా అనిపించాడు. ఈ గేమ్ ఆడటం కోసం ఆ తాత.. ఏకంగా ఓ ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. 15 మొబైల్స్‌ను పెట్టుకునే విధంగా సైకిల్ హ్యాండిల్ తయారు చేసి.. ఆ మొబైల్స్‌కు బ్యాటరీ బ్యాకప్ కూడా సిద్దంగా ఉంచుకున్నాడు. ఇలా సైకిల్‌పై 15 మొబైల్స్‌తో పొకోమెన్ గేమ్ ఆడుతూ అందరిని అబ్బూర పడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పెన్షనర్ అయిన ఆ తైవాన్ తాత పేరు సాన్ యూయాన్. వయస్సు 70 ఏళ్లు. మొబైల్ ఉపయోగిస్తున్నప్పటి నుంచి ఈ గేమ్ ఆడుతున్నాని, ఒక్క ఫోన్‌తో మొదలైన తన ఆట.. నెల తిరిగేసరికి మూడు, ఆ తరువాత ఆరు, తొమ్మిది 15కు చేరిందని చెప్పుకొచ్చాడు ఈ తైవాన్ తాత. తన మనవడు ఈ గేమ్‌ను తనకు చూపించాడని ఈ క్రెడిట్ అంతా అతనిదేనని తెలిపాడు. ప్రస్తుత ఈ తాతా పొకెమెన్ గో తాతాగా ఫేమస్ అయ్యాడు. ఈ మొబైల్స్, పరికరాల కోసం 4800 యూఎస్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపాడు. ఇక ఈ తాత శక్తి మాములుది కాదని, అతని స్నేహితులు అంటున్నారు. -
ఏదైనా మన మంచికే!!
వాషింగ్టన్: ఆ మధ్య ఓ స్మార్ట్‌ఫోన్ గేమ్ బాగా పాపులర్ అయ్యింది. దాని పేరు పొకెమన్. ఫోన్లో ఈ గేమ్ ఆడడం కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగాయి. దీంతో చాలా దేశాలు ఆ గేమ్‌ను నిషేధించాయి కూడా.ఈ గేమ్ ఆడుతూ దేశాలు సరిహద్దులును కూడా దాటిపోయి కటకటాలపాలైన సందర్భాలున్నాయి. అయితే ఈ గేమ్‌తో ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం తాజా పరిశోధనలో తేలింది. పోకెమన్ గేమ్ ఆడినవారు తమకు తెలికుండానే చాలా బరువు తగ్గారట. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసే జనం.. రూపాయి ఖర్చు చేయకుండానే కేవలం పొకెమన్ ఆడడం వల్ల బరువు తగ్గినట్లు గుర్తించారట. కారణం... ఈ గేమ్‌లో పొకెమన్ బొమ్మల కోసం ఫోన్‌ను చేతిలో పట్టుకొని దానిని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా తమకు తెలియకుండానే రోజువారీ నడక పెరిగిందని, శారీరక శ్రమ కూడా పెరిగిందని, ఫలితంగా బరువు తగ్గామని చెబుతున్నారు. ఈ గేమ్ ఆడేవారు రోజుకు సగటున 10వేల అడుగులు వేస్తున్నారంటే వారికి ఎంతగా మేలు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
పార్లమెంటులో 'పోకేమాన్ గో' ఆడిన ప్రధాని!
-
పార్లమెంటులో 'పోకేమాన్ గో' ఆడిన ప్రధాని!
ఓస్లో: 'పోకేమాన్ గో' ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన ఆండ్రాయిడ్ గేమ్. ఈ మధ్యకాలంలో గేమ్ కు కొంచెం క్రేజ్ తగ్గినట్లు కనిపించినా.. అది నిజం కాదని తాజా ఘటన చెబుతోంది. సాక్ష్యత్తూ ఒక దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ లో పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోయారు. సభలో రసవత్తరమైన డిబేట్ జరుగుతున్నా ఏమీ పట్టనట్లుగా పోకేమాన్ గోలో మునిగిపోయారు నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్ బర్గ్. గతంలో అధికారిక పర్యటన మీద సోల్వాకియా దేశానికి వెళ్తున్న సమయంలో పోకేమాన్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. పర్యటన సమయంలో సోల్ బర్గ్ పోకేమాన్ ఆడుతున్న ఫోటోలు ఓ నార్వేయన్ పత్రికలో కూడా ప్రచురితమయ్యాయి. కాగా, పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోవడంపై మాట్లాడిన ఆమె మహిళలు ఒకే సమయంలో రెండు పనులను చక్కబెట్టగలరని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. నార్వేకు చెందిన మరో రాజకీయ నేత కూడా విదేశాంగ, రక్షణ శాఖల సమావేశంలో పోకేమాన్ గో ఆడుతూ కనిపించారు. దీంతో సదరు నేతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలపై స్పందించిన నేత తాను గేమ్ ఆడుతున్నప్పుడు మరింత శ్రద్ధగా వినగలుగుతానని చెప్పారు. -
డ్రైవింగ్ లోనూ 'పోకేమాన్ గో'..!
వాషింగ్టన్ః డ్రైవింగ్ చేస్తున్నపుడు కూడా వేలాదిమంది పోకేమాన్ గో ఆడుతున్నట్లు తాజా అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. 'ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ అండ్ డ్రైవింగ్' కు సంబంధించి వచ్చిన ట్వీట్లు, వార్తాంశాల ఆధారంగా తాజా పరిశోధనలను చేపట్టగా... విశ్లేషణల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. అనేక దేశాల్లో విడుదలై.. జనాన్ని పిచ్చెక్కిస్తున్న పోకేమాన్ గో ఆటలో పడి కొందరు బాహ్య ప్రపంచాన్నే మరచిపోయి ప్రమాదాలను సైతం కొని తెచ్చుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ అండ్ డ్రైవింగ్ అన్న అంశంపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించారు. పోకేమాన్ గో ఆడుతూ డ్రైవింగ్ చేసిన ఘటనలకు సంబంధించి.. ట్విట్లర్ లో నివేదించిన 100000 అంశాలను పరిశీలించిన శాండియాగో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు.. గేమ్ ఆడుతూ డ్రైవ్ చేసిన సందర్భంలో 14 మందిలో ఒకరు చెట్లకు ఢీకొట్టినట్లు తెలుసుకున్నారు. డ్రైవర్, పాసింజర్, పాదచారులు మొదలైనవారు కేవలం పదిరోజుల్లో 113,993 పోకేమాన్ ఘటనలను ట్వీట్ చేసినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. వీటిలో 18 శాతం ట్వీట్లు పోకేమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేసినవి, 11 శాతం పాసింజర్లు, 4 శాతం పాదచారులకు సంబంధించినవిగా ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాగే గూగుల్ న్యూస్ లోని పోకేమాన్, డ్రైవింగ్ పదాల ఆధారంగా విశ్లేషించిన పరిశోధకులు అదేసమయంలో 321 ట్రాఫిక్ ఘటనలు, 14 ఇతర ప్రమాదాలు జరిగినట్లు నివేదించారు. భవిష్యత్తులో డెవలపర్లు డ్రైవింగ్ లో గేమ్ ఆడటంపై నష్టాలను పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు చెప్తూ తమ అధ్యయనాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు. -
పోకేమాన్ ఆడుతూ గుద్దేశాడు
టోక్యో: పోకేమాన్ వీడియో గేమ్ పిచ్చి ముదిరిపోతోంది. పోకేమాన్ గేమ్ ఆడుతూ జపాన్ లో ఓ ట్రక్కు డ్రైవర్ మహిళ మరణానికి కారకుడయ్యాడు. పోకేమాన్ గేమ్ లో మునిగిపోయి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తన వాహనంతో ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తుకుషిమా పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. మృతురాలి కుటుంబానికి నింటెండో సంస్థ సంతాపం తెలిపింది. వినియోగదారులు పోకేమాన్ వీడియో గేమ్ ఆడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు గేమ్ ఆడకుండా ఉండేందుకు పాప్-అప్ ను జోడించనున్నట్టు వెల్లడించారు. పోకేమాన్ గేమ్ కారణంగా ప్రమాదాలు పెరుగుతుండం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు పోకేమాన్ ఆడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశాయి. -
పోకేమాన్ గో ఆడుతున్న 42 మంది అరెస్ట్...!
బ్యాంకాక్ః ఇప్పటిదాకా మనకు మద్యంతాగి వాహనం నడిపేవారిని అరెస్ట్ చేయడమే తెలుసు. కానీ థాయ్ ల్యాండ్ లో తాజగా పోకేమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేసేవారిపైనా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వినియోగించడం ఇప్పటికే నేరంగా పరిగణిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు డ్రైవింగ్ లో పోకేమాన్ గేమ్ ఆడటం కూడా నేరంగా గుర్తించి సదరు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. థాయ్ ట్రాఫిక్ పోలీసులు పోకేమాన్ గో ఆడేవారిపై దృష్టి సారించారు. వాహనాలు నడుపుతూ పోకేమాన్ ఆడటం ప్రమాదాలకు దారితీస్తుండటంతో దాన్ని నేరంగా పరిగణిస్తున్న పోలీసులు.. తాజాగా నిబంధనలను అతిక్రమించిన 42 మందిని అరెస్టు చేశారు. పోకేమాన్ ఆడుతూ వాహనాలు నడిపిన వారికి 800 నుంచి 1000 రూపాయలవరకు జరిమానా విధిస్తామని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు 'ట్రాఫిక్ నో గో' పేరిట ప్రచారం చేపట్టారు. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వినియోగంతోపాటు, పోకేమాన్ గో ఆడటం ల్యాండ్ ట్రాఫిక్ చట్టానికి విరుద్ధమని చెప్తున్నారు. ట్రాఫిక్ లైట్ల వద్ద ఆగినప్పుడు, ప్రయాణంలో వాహనదారులు పోకేమాన్ గో ఆడుతూ.. సెల్ ఫోన్ బయటకు పెట్టి పోకేమాన్ లను పట్టుకునే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణంలో పోకేమాన్ ఆడటం చట్ట విరుద్ధ చర్య అని, వారివద్దనుంచీ సెల్ ఫోన్లు లాక్కోవడంతోపాటు, వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. పోకేమాన్ గో క్రీడాకారులతో సంభవిస్తున్న ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా బ్యాంకాక్ లోని భారీ ట్రాఫిక్ ఉండే 10 ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ప్రచారాన్ని ప్రారంభించారు. -
‘పోకెమాన్ గో’తో ఎన్నో వైద్య ప్రయోజనాలు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిచ్చిగా ఆడుతున్న ‘పోకెమాన్ గో’ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఆట వల్ల ప్రమాదాలకన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. ప్రత్యక్ష ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పరోక్ష ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని వారే అంటున్నారు. నెల రోజుల క్రితమే బ్రిటన్‌లో విడదలైన ఆగ్మెంటెడ్ రియాలిటీ ‘పోకెమాన్ గో’ గేమ్ స్క్రీన్‌ను ఇప్పుడు బ్రిటన్ వైద్యులు, నర్సులు రోగి రక్తనాళాలను కనుగొనేందుకు ఉపయోగిస్తున్నారు. మానవ చర్మం కింద ఉండే రక్తనాళాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటాయని, రక్తనాళాల్లోకి ఇంజెక్షన్లు ఇవ్వాలన్నా, లిక్విడ్స్ ఎక్కించాలన్నా కొందరిలో రక్తనాళాలు సులభంగా దొరుకుతాయని, మరికొందరిలో ఎంతకష్టపడినా దొరకవని బ్రిటన్ హెల్త్ స్కీమ్‌కు చెందిన వైద్యులు చెప్పారు. పోకెమాన్ గో గేమ్ స్క్రీన్‌ను రోగుల నరాలపై ఫోకస్ చేయగా వాళ్ల రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుండడమే కాకుండా ఆ నాళాల ఇమేజ్ కూడా చర్మంపై కనిపిస్తోందని వారు తెలిపారు. మానవ శరీర నిర్మాణానికి సంబంధించి డాక్టర్లకు, నర్సులకు శిక్షణ ఇచ్చేటప్పుడు సాధారణంగా మానవ అంతర్గత అవయవాల ఆకారంలో తయారు చేసిన బొమ్మలను ఉపయోగిస్తారు. ఇకముందు ఆ అవసరం లేకుండా రోగుల శరీర భాగాలను వీడియోలు తీసి వాటిని పోకెమాన్ గో లాంటి గేమ్ స్క్రీన్లపై సూపర్ ఇంపోజ్ చేసి శిక్షణ ఇవ్వొచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. ఓ దేశంలో ఉన్న వైద్య నిపుణుడి సూచనలను పాటిస్తూ వీడియో కాన్ఫరెన్స్ లాంటి వ్యవస్థ ద్వారా మరో దేశంలో వైద్యులు రోగికి శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ విధానంలో ఓ ఇబ్బంది ఉంది. రోగి శస్త్ర చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణుడు వైద్యులకు లిఖిత లేదా డ్రాయింగ్ ద్వారా తెలియజేసేందుకు పక్కనున్న మరో స్క్రీన్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. అలా కాకుండా రోగి శస్త్ర చికిత్స కనిపిస్తున్న స్క్రీన్‌పైనే వైద్య నిపుణులు అవసరమైన సూచనలు ఇవ్వడానికి పారదర్శక డిస్ప్లే స్క్రీన్‌ను ఉపయోగించవచ్చని పోకెమాన్ గో గేమ్ ద్వారా తేలింది. ఇప్పుడు అమెరికాలో ఇదే టెక్నాలజేని ఉపయోగించేందుకు ఇండియాన, అలబామా యూనివర్శిటీలు కృషి చేస్తున్నాయి. పోకెమాన్ గో సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగించి లండన్‌కు చెందిన ‘ఆక్స్సైట్’ కంపెనీ ‘విజర్ కెన్’ అనే స్మార్ట్ కళ్లజోడును రూపొందించింది. కంటి చూపు మసగ్గా ఉండేవారు ఈ కళ్లజోడును ఉపయోగించినట్లయితే వారి చూసే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. దృశ్యాలను జూమ్ చేసుకుని చూసే వెసలుబాటు కూడా ఈ కళ్లజోడులో ఉంది. ఈ కళ్లజోళ్లను ఈ ఏడాదే మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ పోకెమాన్ గో గేమ్ వల్ల కలుగుతున్న ప్రత్యక్ష ప్రయోజనాలుకాగా, గేమ్ ఆడుతుండడం వల్ల పరోక్ష ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని బ్రిటన్ వైద్యులు తెలుపుతున్నారు. ఎన్నడు వీధుల్లో నడవని వాళ్లు ఈ గేమ్ కారణంగా రోజుకు కిలోమీటరు నుంచి ఆరు కిలోమీటర్లు నడుస్తున్నారని, దాని వల్ల వారిలో స్థూలకాయ సమస్య తగ్గడమే కాకుండా డయాబెటీస్ వ్యాధి తగ్గుతోందని చెప్పారు. ఎప్పుడూ ఇంటికే పరిమితమై మానసిక సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు పోకెమాన్ గే వల్ల వీధుల్లోకి రావడం వల్ల వారికి మానసిక సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని, పైగా అపరిచితుల పరిచయం వల్ల కూడా మానసిక ఉల్లాసం కలుగుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజలు పోకెమాన్ గో గేమ్ ఆడుతున్నట్లు ఓ తాజా సర్వేలో తేలింది. -
13 వందల కోట్లు దాటిన 'పోకెమాన్ గో' ఆదాయం..!
ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఆటగాళ్ళను అమితంగా ఆకట్టుకున్న 'పోకెమాన్ గో' గేమ్ రెవెన్యూ 13 వందల కోట్ల మార్క్ దాటిపోయింది. గేమ్ ను ప్రారంభించి ఒక్క నెల దాటక ముందే ఆదాయం... వందల కోట్లకు చేరిపోయింది. అయితే గేమ్ పై అనేక ఫిర్యాదులు, అవరోధాలు ఉన్నప్పటికీ ఈ స్టార్ పవర్ ఫీచర్.. భారీ లాభాలను తెచ్చిపెట్టేందుకు దోహదపడింది. ఈ గేమ్ ను ముఖ్యంగా జపాన్ లో ప్రారంభించిన అనంతరం భారీ లాభాలను లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పోకెమాన్ గో గేమ్ కు ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఏర్పడుతున్నా వినియోగదారుల్లో ప్రతికూల ప్రభావం తోడవ్వడంతో గేమ్.. లాభాల బాటలో నడుస్తోంది. యాప్ అనలటిక్స్ ప్లాట్ ఫాం సెన్సార్ టవర్ అంచనాలను బట్టి గేమ్.. ఆటగాళ్ళ ఆధారంగా 200 మిలియన్ డాలర్లు అంటే సుమారు 13,34,90,00,000 కోట్ల రూపాయల.. నికర ఆదాయం పొందగల్గినట్లు తెలుస్తోంది. మిగిలిన యాప్ ఆధారిత గేమ్స్ తో పోలిస్తే ఈ సంవత్సరం పోకెమాన్ కు అత్యంత ఆదరణ లభించడంతోపాటు.. దాదాపుగా రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చినట్లు నివేదికలు చెప్తున్నాయి. అంతకు ముందు ఎంతో ఆకర్షించిన కాండీ క్రష్ సోడా సాగా వంటి గేమ్స్ తో పోలిస్తే నాలుగు రెట్లు అధిక లాభాలను పొందినట్లు అంచనాలను బట్టి తెలుస్తోంది. జూలై మధ్యలో జపాన్ లో గేమ్ ప్రారంభించిన అనంతరం లాభాలు అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు డేటా సెన్సార్ టవర్ ఆధారంగా తెలుస్తోంది. ఆన్ లైన్ గేమ్ పోకెమాన్ కు జపాన్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీనికి తోడు ఆసియాలోని మరో 15 దేశాల్లో కూడా ఆటకు అమితమైన ఆదరణ లభించడం రెవెన్యూ రెట్టింపయ్యేందుకు దోహదపడింది. స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా ఆడే పోకెమాన్ గో.. జీపీఎస్ ఆధారంగా ఆడాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే దగ్గరలో ఉన్న పోకెమాన్ లను చూపించడంతో వాటిని పోకే బాల్ ద్వారా కొట్టి సొంతం చేసుకోవడమే పోకె మాన్ గో ఆట విధానం. మొదట్లో అమెరికాలో విడుదల చేసిన రెండు వారాల్లోనే అద్భుత విజయాన్ని సాధించిన పోకెమాన్ గో.. ఇప్పుడు అనేక దేశాల్లో విడుదలవ్వడంతో పాటు.. లాభాల మార్కెట్లో దూసుకుపోతోంది. -
తలలుపట్టుకున్న మలేషియా అధికారులు!
కౌలాలంపూర్: మొబైల్ గేమ్ 'పోకిమన్ గో' ఫివర్‌తో ఇప్పుడు మలేషియా ఊగిపోతోంది. అక్కడ రెండు రోజుల క్రితమే ఈ గేమ్‌ను లాంచ్ చేశారు. అయితే.. అప్పటికే ఆశగా ఎదురుచూస్తున్న మలేషియా వాసులు పెద్ద సంఖ్యలో తమ ఫోన్లలో ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకొని రోడ్లమీద పడ్డారు. దీంతో.. పలు దేశాలు ఇప్పటికే ఈ గేమ్ విషయంలో ఆందోళన చెందుతుండగా.. ఇప్పుడు మలేషియా అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. ఫోన్లలో తలదూర్చి రోడ్లమీద ఈ గేమ్ ఆడుతూ..ప్రజలు కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు కూడా ఈ గేమ్ ఆడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. పోకిమన్ గో ఆడుతూ కారు నడుపుతున్న ఓ వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేయొద్దంటూ సోమవారం స్వయంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తియోంగ్ లై ప్రజలను కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మతపెద్దలు సైతం ఈ గేమ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
మరో15 దేశాల్లో అఫీషియల్ గా 'పోకిమాన్ గో'
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారిన పోకిమాన్ గో గేమ్ మరో మైలు రాయిని అధిగమించింది. జీపీఎస్ ఆధారిత అగ్మెంటెడ్ గేమ్ ఆసియా-పసిఫిక్ లోని మరో 14 ఇతర దేశాలతో పాటు థాయిలాండ్ లో కూడా అధికారికంగా శనివారం ప్రారంభమైంది. ఆసియా అండ్ ఓషియానియా అంతటా గేమర్స్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా పోకీమాన్ గో ఇప్పుడు అధికారికంగా గేమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని బ్యాంకాక్ పోస్ట్ ఒక ప్రకటన లో తెలిపింది. బ్రూనే, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఫిజి, సోలమన్ దీవులు, మైక్రోనేషియా, పలావు ఫెడరేటెడ్ స్టేట్స్ లో ఇక పోకిమాన్ గో సందడి అధికారికంగా మొదలైందని నియాంటిక్ ఒక ప్రకటన లో తెలిపింది. ఈ పోకిమాన్ గో ఆటను నియంత్రించే అంశాలపై పరిశీలిస్తోందని థాయిలాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. అయితే పర్యాటకులకోసం, గేమ్ డెవలపర్లను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు బ్యాంకాక్ పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం దేవాలయాలు, పురాతన ప్రదేశాల దగ్గర పోకిమాన్ గో ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఐసీటీ మంత్రిత్వ శాఖకు సమాచారం అందిస్తామని కల్చరల్ మినిస్ట్రీ హెచ్చరించింది. కాగా థాయిలాండ్ లో, ఈ ఆట ప్రయోగ వార్తలపై అధికారులు మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతుండడం విశేషం. -
అక్కడ.. పోకెమాన్ గేమ్ బ్యాన్!
పోకేమాన్ గో ప్లేయర్స్ కు వడోదరా మ్యూజియం తలుపులు మూసేసింది. మ్యూజియం ప్రాంగణంలో పోకేమాన్ గేమ్ ఆడకూడదన్న నిబంధన విధించింది. సెక్యూరిటీ కారణాల నేపథ్యంలోనూ, సందర్శకుల ఫిర్యాదుల మేరకు మ్యూజియం లోపల పోకేమాన్ ఆటను ను బ్యాన్ చేసినట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు. ప్రపంచాన్ని మత్తులో దింపేసిన పోకేమాన్ గో గేమ్ ను ఇప్పుడు వడోదరా మ్యూజియం బ్యాన్ చేసింది. మ్యూజియం ప్రాంగణంలో పోకేమాన్ ఆడకూడదన్న నిబంధనను విధించినట్లు అధికారులు తెలిపారు. అనేక భద్రతా కారణాలకు తోడు, సందర్శకుల ఫిర్యాదుల మేరకు పోకేమాన్ ను మ్యూజియంలో ఆడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఈ నేథ్యంలో మ్యూజియం ప్రధాన ద్వారం వద్ద పోకేమాన్ ప్లేయర్స్ కు లోపలికి అనుమతి లేదంటూ ఓ నోటీసును కూడా అంటించారు. మ్యూజియం భద్రతను పెంచడంతోపాటు, సందర్శకుల రక్షణలో భాగంగా మ్యూజియం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. వందేళ్ళనాటి మ్యూజియం, పిక్చర్ గ్యాలరీ సందర్శించేందుకు వచ్చిన వారికి సింహద్వారం వద్ద కనిపించేట్లుగా అధికారులు నోటీసులు అంటించారు. మ్యూజియంలో నడిచే సమయంలోనూ, అలాగే ప్రాంగణంలోని గడ్డిపై నడుస్తూ కూడా సందర్శకులు పోకేమాన్ ఆడటం న్యూసెన్స్ ను క్రియేట్ చేస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ పోకేమాన్ గో గేమ్ ఆటగాళ్ళ దృష్టిని దెబ్బతీస్తోందని, ఓ ఇన్ఫెక్షన్ లా మారిపోయిందని మ్యూజియం క్యూరేటర్ విజయ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంగణంలోని గడ్డిలో అనేక విష సర్పాలు, కీటకాలు ఉంటాయని, అక్కడ ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆటగాళ్ళు పట్టించుకోవడం లేదని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాక మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకులకు కూడా పోకేమాన్ ఆడేవారు పెద్ద సమస్యగా మారుతున్నారని, అందుకే మ్యూజియంలో పోకేమాన్ గో గేమ్ బ్యాన్ చేసినట్లు వివరించారు. -
'పొకిమాన్ గొ'తో జంట లీనమై..
పొకిమాన్ గొ గేమ్ ఆడుతూ ప్రమాదాల బారినపడుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాలకు గురైతే, ఓ వ్యక్తి ఏకంగా దేశ సరిహద్దును దాటేశాడు. తాజాగా ఓ జంట రెండేళ్ల కొడుకును ఇంట్లో వదిలిపెట్టి మొబైల్ ఫోన్లో ఈ గేమ్ ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని మరిచిపోయారు. పోలీసులు వచ్చి బాలుడ్ని రక్షించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఆరిజోనాలో ఈ ఘటన జరిగింది. గత గురువారం రాత్రి బ్రెంట్ (27), బ్రియన్నె డాలీ (25) అనే దంపతులు కొడుకును ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పొకిమాన్ గొ గేమ్ ఆడుతూ, వీధుల వెంటతిరుగుతూ 90 నిమిషాలు వెళ్లిపోయారు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేరు. పాపం ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి నీళ్లు కూడా అందుబాటులో లేవు. ఇంటి బయట ఏడుస్తున్న చిన్నారిని చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారించారు. తొలుత ఇంధనం కోసం కారులో వెళ్లామన్న బ్రెంట్ జోడీ.. తర్వాత అసలు విషయం ఒప్పుకున్నారు. ఇలాంటి గేమ్‌లు ఆడేముందు వ్యక్తిగత భద్రత గురించి ఆలోచించాలని పోలీసులు వారిని హెచ్చరించారు. -
పోకిమన్ గో సృష్టికర్త ట్విట్టర్ ఖాతా హ్యాక్!
గత నెలలో పోకిమన్ గో సెర్వర్లను హ్యాకింగ్ చేసిన 'అవర్ మైన్' అనే హ్యాకింగ్ గ్రూపు వాళ్లు.. తాజాగా ఆ గేమ్‌ను సృష్టించిన నియాంటిక్ కంపెనీ సీఈవో జాన్ హాంక్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. జపాన్‌కు చెందిన నింటెండో కంపెనీతో కలిసి ఈ గేమ్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. హాంక్ ఖాతాను తమ నియంత్రణలోకి తీసుకున్న హ్యాకర్లు.. అందులో అనేక ట్వీట్లు పోస్ట్ చేశారు. వాటిలో హాంక్ పాస్‌వర్డ్‌ను కూడా పెట్టేశారు. #అవర్‌మైన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వాళ్లు ఈ ట్వీట్లను పోస్ట్ చేశారు. జూలై నెలలో ఇదే హ్యాకింగ్ గ్రూప్ వాళ్లు పోకిమన్ గో లాగిన్ సెర్వర్లను హ్యాక్ చేశారు. దాంతో చాలామంది గేమ్ యూజర్లు అసలు గేమ్‌లోకి లాగిన్ కాలేక చాలా ఇబ్బంది పడ్డారు. పోకిమన్ గో ప్రతినిధులు తమను సంప్రదించేవరకు తాము దాడులు ఆపబోమని గ్రూప్ సభ్యులు చెబుతున్నారు. ఈలోపు ఎవరూ ఆ గేమ్ ఆడే అవకాశం ఉండబోదని, గేమ్ నిర్వాహకులకు దాన్ని ఎలా కాపాడుకోవాలో తాము చెబుతామని తమ సొంత వెబ్సైట్లో పేర్కొన్నారు. డీడీఓఎస్ ఎటాక్ అంటే..ఒకేసారి భారీమొత్తంలో ఆ సెర్వర్లోకి ట్రాఫిక్‌ను పంపుతారు. దాంతో అసలైన యూజర్లు అసలు లాగిన్ కావడానికి కూడా అవకాశం ఉండదు. ఇంతకుముందు తాము ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ సీఈవోల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేశామని అవర్ మైన్ చెబుతోంది. -
'పోకెమాన్ గో'పై 'న్యూయార్క్' సంచలన నిర్ణయం
న్యూయార్క్: మెరీనా 14 ఏళ్ల విద్యార్థిని. ఇటీవలే తన మొబైల్ లో వర్చువల్ రియాలిటీ గేమ్ పోకెమాన్ ను డౌన్ లోడ్ చేసుకుని పోకె ట్రైనర్ గా మారింది. స్కూల్ నుంచి వచ్చీరాగానే మొబైల్ ఫోన్ పట్టుకుని.. రోడ్డు మీద, వీధి సందుల్లో, నీటిలో, కొండల మీద, అడవిలో, బస్టాప్‌ల వద్ద, ఆసుపత్రుల వద్ద.. ఎక్కడపడితే అక్కడ ఉండే పోకెమాన్ల కోసం తిరుగాడేది. అలా ఒక సాయంకాలం మ్యాప్ ఆధారంగా పోకెమాన్ ను వెతుక్కుంటూ ఓ సందులోకి వెళ్లింది. చుట్టుపక్కల జన సంచారం లేదన్నసంగతే మర్చిపోయి గేమ్ లో మునిగిపోయిన ఆమెపైకి.. మృగంలా దూకాడొకడు. నోరు మూసేసి ఓ గదిలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. పోకెమాన్ ఆడటం ఆ చిన్నారి తప్పు కాకపోవచ్చు.. కానీ వెళ్లిన చోటే ప్రమాదకరమైనది! నిజానికి ఇది వాస్తవ సంఘటన కాదు కానీ అలాంటి పరిస్థితులే ఎదురైతే పిల్లల్ని కాపాడేది ఎవరు? పోకెమన్ కంపెనీయా? తల్లిదండ్రులా? పోలీసులా? ఇలాంటి ప్రశ్నకు సమాధానంగా, సంచలనాత్మక ఆదేశాలు జారీచేశారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో. న్యూయార్క్ స్టేట్ లో 3000 మందికిపైగా సెక్స్ అఫెండర్లు ప్రస్తుతం పెరోల్ పై ఉన్నారు. వాళ్లందరి చిరునామాలు, ఇతర వివరాలు పోలీసుల దగ్గర ఉంటాయి. ఆ వివరాలను పోకెమాన్ రూపకర్తలకు పంపాలని, దోషులను పోకెమన్ గో ఆడనివ్వకుండా చేయడమేకాక వాళ్లు నివసించే ప్రాంతాల్లో పోకెమన్లు లేకుండా చేయాలని గవర్నర్.. ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గేమ్ పబ్లిషర్లు, డెవలపర్లు అయిన నియాంటిక్, నింటెండో సంస్థలకు గవర్నర్ కార్యాలయం నుంచి మెయిల్స్ పంపారు కూడా! (డేంజర్ గేమ్..పోకెమాన్ గో..) 'అమెరికాలో పోకెమాన్ ట్రైనర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లు దాటింది. వాళ్లలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదాల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకే సెక్స్ అఫెండర్లు నివసించే చోట్ల దానిని(గేమ్) అదుపుచేయాలని కోరుతున్నాం. టెక్నాలజీ బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ మార్చుకుంటూ పోవాలి' అని న్యూయార్క్ గరవర్నర్ తన ప్రకటనలో పేక్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నియాంటిక్, నింటెండో సంస్థలు ఇప్పటికైతే స్పందించలేదు. '13 ఏళ్ల దాటిన వారు మాత్రమే రిజిస్ట్రేషన్ ద్వారా పోకెమాన్ గో గేమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు' అని ఆ సంస్థలు చెబుతున్నాయి. గవర్నర్ నిర్ణయంతో న్యూయార్క్ సిటిజన్లు చాలామంది ఏకీభవిస్తుండటం గమనార్హం. (న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో) -
ఖరీదైన ఫోన్లలో ఆ గేమ్ ఆడొద్దు..!
లండన్: ఖరీదైన మొబైల్ ఫోన్లలో పోకిమన్ గో గేమ్ ఆడుతున్న వారికి లండన్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఒళ్లు మరచిపోయి, చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడకుండా.. ఫోన్లలో తలదూర్చే వారిని దొపిడి దొంగలు ఇటీవల టార్గెట్‌గా చేస్తున్నారు. దీంతో పిల్లలు, పెద్దలను ఖరీదైన ఫోన్లలో పోకిమన్ గో ఆడుతూ వీధుల వెంట తిరగొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నార్త్ లండన్ పార్క్‌లో ఇటీవల పోకిమన్ గో ఆడుతున్న ముగ్గురు టీనేజ్ పిల్లల ఫోన్లను దుండగులు దోచుకున్నారు. పిల్లల కణతలకు గన్ పెట్టి బెదిరించిన దుండగులు ఖరీదైన ఫోన్లను తీసుకొని పారిపోయారు. ఈ ప్రమాదకర గేమ్ ఆడేవారు 'తమ చుట్టూ ఏం జరుగుతుంది' అనే విషయం కూడా మరచి.. ఫోన్లలో పోకిమన్లను వెతికే పనిలో ఉంటున్నారు. దీంతో దోపిడిదారుల పని సులువౌతోందని పోలీసులు తెలిపారు. -
ఆ.. ప్రేమలో పడ్డ 'అనుష్క'
ముంబైః ప్రపంచాన్ని పిచ్చెత్తిస్తున్న పోకేమాన్ గో గేమ్.. ఇప్పుడు సాధారణ పౌరుల్నే కాదు సెలబ్రిటీలను వదలడం లేదు. ఇటీవలే పోకేమాన్ గో గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పోకేమాన్ గో గేమ్ కు ఫిదా అయిపోయింది. బయటకు వెళ్ళి పోకేమాన్ లను వెతికి పట్టుకోవడంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తోందని, ఈ గేమ్ తనకు ఎంతో ఇష్టంగా ఉందని అంటోంది. నిజంగానే జంతువులను వేటాడేందుకు వెళ్ళిన వేటగాడిలా పోకేమాన్ లను వెతుక్కుంటూ వెళ్ళడం వాటిని వేటాడి పట్టడం ఎంతో అద్భుతంగా ఉందంటోంది. ఇటీవల సుల్తాన్ సినిమాలో తనదైన పాత్రతో అభిమానులకు మరింత చేరువైన అనుష్కా.. సినిమా షూటింగ్ లు, డైలీ రొటీన్ లైఫ్ కు భిన్నంగా పోకేమాన్ గో ఆడుకుంటూ సరదాగా టైమ్ పాస్ చేయాలని సంబరపడిపోతోంది. మొబైల్ గేమ్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న సరికొత్త ఆట పోకేమాన్ గో బాలీవుడ్ నటి అనుష్కా శర్మకూ ఎంతో నచ్చేసిందట. పోకేమాన్ లను వెతుక్కుంటూ బయటకు వెళ్ళి ఒక్కోటి పట్టుకోవడంలో ఆనందమే వేరంటూ ఇప్పుడు ఆ బాలీవుడ్ తార తెగ సంబరపడిపోతోంది. తానో నైపుణ్యంగల పోకేమాన్ హంటర్ గా మారిపోవాలని ఉందని చెప్తున్న ఆమె.... మొదటి పోకేమాన్ ను పట్టుకున్న తర్వాత.. ఆటపై తనకు మరింత మక్కువ పెరిగిందని, పో్కేమాన్ల కోసం వెతుకుతూ ప్రయాణించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తోంది. మొదటిసారి పోకేమాన్ క్యాచ్ చేసిన అనంతరం తాను సాధించిన అద్భుతానికి గుర్తుగా ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఫోన్ లో గేమ్ ఆన్ చేసి ఇంటర్నెట్ కు కనెక్ట్ అయిన తర్వాత జీపీఎస్ ఆధారంగా ఆడే పోకేమాన్ గో... ఇంతకు ముందున్న మొబైల్ గేమ్ లకు భిన్నంగా అందర్నీ ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఫోన్ లో ఉన్న కెమెరా కనెక్ట్ అవ్వడంతోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కెడెక్కడ పోకేమాన్ లు ఉన్నాయో జీపీఎస్ వ్యవస్థ ద్వారా స్క్రీన్ లో కనిపిస్తుంటుంది. ఒకేచోట ఉండేకన్నా.. అలా నడుస్తూ కారిడార్లు, రోడ్లు, ఆఫీస్ లు, పార్క్ లు, మైదానాలు ఎక్కడికైనా వెళ్ళి ఈ పోకేమాన్ లను పట్టుకోవచ్చు. కనిపించిన వెంటనే పసిగట్టి, వాటిని పోకేబాల్ తో కొడితే చాలు అవి మన సొంతం అయిపోతాయన్న మాట. అలా ఆడుతూ ముందుకు పోతుంటే ఆటలో ఒక్కో లెవెల్ ను దాటే అవకాశం ఉంటుంది. ఇలా గేమ్ ఆడుతూ మొత్తం పోకేమాన్ లు తనసొంతమే చేసుకోవాలనుంది అంటోంది అనుష్క. అంతేకాదు తాను ఓ మంచి పోకేమాన్ హంటర్ గా కూడా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్తోంది. -
డేంజర్గేమ్ బారినపడ్డ తొలి ఇండియన్
ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న డేంజర్ గేమ్‌కు తొలిసారి ఓ ఇండియన్ బాధితుడయ్యాడు. ఈ గేమ్ ఆడుతూ తన మెర్సిడీస్ కారును తీసుకెళ్లి ఆటో గ్యారేజ్‌ను ఢీకొట్టాడు. దాన్ని ఢీకొట్టిన తర్వాతగానీ అతడికి తానొక యాక్సిడెంట్ చేశానన్న స్పృహరాలేదు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. దీంతో అతడు మరొకరి పరిస్థితి తనలా అవ్వకూడదని హెచ్చరిస్తూ అవగాహన కల్పించడం కోసం తన అనుభవాన్ని చెప్పాడు. జబ్బీర్ అలీ (26) అనే వ్యక్తి ఓ కారు డీలర్. అతడు బ్యాండ్ స్టాండ్ లోని కార్డర్ రోడ్డులో గల తన నివాసానికి వచ్చేందుకు మెర్సిడీస్ కారును డ్రైవ్ చేస్తూ పోక్‌మాన్ గో ఆడుకుంటూ వచ్చాడు. ఆ ఆట మాయలో పడి కారును తీసుకెళ్లి గ్యారేజ్ కేసి కొట్టాడు. ఈ ఆట అతి తొందరగా ఓ వ్యక్తిని బానిసగా మార్చుకుంటుందని, వీలయినంత జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని అతడు చెప్పాడు. ఇప్పటికే ఈ గేమ్ కారణంగా జపాన్, అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రమాదాలు జరుగుతుండగా ముంబయిలో తొలి కేసు నమోదైంది. -
డేంజర్ గేమ్..పోకెమాన్ గో..
ప్రపంచాన్ని పిచ్కెక్కిస్తున్న మొబైల్ గేమ్ మొబైల్‌ని చూస్తూ తిరగాల్సి రావటంతో ప్రమాదాలు - తొలిసారి వర్చువల్ రియాలిటీతో అనుసంధానం - రోడ్లపై డ్రైవింగ్‌లోనూ ఆటే; ప్రమాదాలు- పోలీసుల హెచ్చరిక - అమెరికాలో శ్మశానంలో ఇరుక్కున్న మహిళ - తమను గుర్తుపట్టేశాడని యువకుడిని కాల్చేసిన దుండగులు - ఇండియాలో మూడునాలుగు రోజుల్లో విడుదల: నింటెండో - ఇక్కడ విదేశాల మాదిరి రోడ్లపై ఆడితే చాలా ఇబ్బందికరం - మొబైల్ సిగ్నల్స్ కూడా వీక్‌గా ఉంటాయి కనక ఇక్కడ కష్టం - నింటెండో కంపెనీకి కిక్కిచ్చిన గేమ్; 10 రోజుల్లో షేరు డ బుల్ - పోకెమాన్ పేరున్న ప్రతి వ్యాపారానికీ భలే గిరాకీ స్కూలు పిల్లలే కాదు. కాలేజీ కుర్రాళ్లనైనా సరే... ఉన్నట్టుండి ‘మన రాష్ట్రపతి ఎవరు?’ అని అడిగారనుకోండి. చాలామంది కాసేపు ఆలోచిస్తారు. కొందరైతే చెప్పలేరు కూడా. కానీ వారిని... ‘పోకెమాన్ గురించి తెలుసా?’ అని అడిగారనుకోండి. గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. అంతేకాదు!! నాకు 50 క్యారెక్టర్ల పేర్లు తెలుసు!! అని ఒకరంటే... నాకు 80 తెలుసు!! అని మరొకరు... ఇలా పోటీలు పడి పేర్లు కూడా చెప్పేస్తారు!!. అదీ... పోకెమాన్ పవర్.!! పోకెమాన్ అంటే జపనీస్‌లో ‘పాకెట్ మాన్స్టర్’కు సంక్షిప్త రూపం. ఇదో టీవీ షో. సినిమాలూ వచ్చాయి. గేమ్స్ కూడా ఉన్నాయి. పోకెమాన్ ట్రయినర్ యాష్... తన స్నేహితులు మిస్టీ, బ్రోక్తో కలిసి పోకెమన్ భాగస్వాముల్ని తీసుకుని కల్పిత ప్రపంచంలో తిరగటమే ఈ షో కథ. మరి యాష్ లక్ష్యమేంటి? పోకెమాన్ మాస్టర్ కావాలి. ఈ గేమ్ ఆడే పిల్లల లక్ష్యం కూడా అదే. సాధ్యమైనన్ని పోకెమాన్లను సంపాదించి, వాటిని ట్రెయిన్ చేసి మాస్టర్ కావటమే. జంతువులు, మాయలు, అద్భుతాలు... ఇలా కావాల్సిన మసాలాలన్నీ ఉండటంతో పోకెమాన్ అంటే పిల్లలకు, యువతకు పిచ్చి. జూలై 6న పోకెమాన్ ప్రపంచంలో ఓ సంచలనం!! ఇంకా చెప్పాలంటే... పోకెమాన్ ప్రపంచం మొత్తం ఓ అడుగు ముందుకేసింది. మొబైల్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తూ... అగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత ‘పోకెమాన్ గో’ గేమ్ కొన్ని దేశాల్లో విడుదలయింది. నిజం చెప్పాలంటే... అగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా రూపొందిన తొలి పాపులర్ గేమ్ ఇదే. ఇది విడుదలైన క్షణంలోనే... మొబైల్ గేమ్స్ అభిమానుల క్రేజ్ తారస్థాయికి వెళ్లిపోయింది. క్షణాల్లోనే వేల డౌన్లోడ్లు. రోజులు తిరక్కుండానే అవి లక్షలుగా మారిపోయాయి. వారం తిరక్కుండా కోట్లు దాటిపోయాయి. ఇండియా సహా పలు దేశాల్లో ఇది ఇంకా విడుదల కాకపోయినా... ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లేస్టోర్లలో అత్యధిక డౌన్లోడ్లు చేసుకున్న గేమ్‌గా రికార్డులు బద్దలుగొట్టేసింది. అంతేకాదు!! పలు దేశాల్లో వివాదాలకూ కారణమవుతోంది. కొన్ని దేశాలైతే నిషేధించాయి కూడా!! మరి ప్రపంచాన్ని ఇంతలా పిచ్కెక్కిస్తున్న ఈ గేమ్ విశేషాలేంటి? ఎందుకింత క్రేజ్ ? అసలు ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుంది? ఒకవేళ ఇండియాలో విడుదలైతే మిగతా దేశాల్లాగే మనమూ ఆడగలమా? ఇవన్నీ వివరించేదే ఈ వారం ‘ఫోకస్’... - సాక్షి, బిజినెస్ విభాగం సాధారణంగా ఏ మొబైల్ గేమైనా స్థిరంగా ఒకచోట కూర్చుని ఆడేదే. కానీ ‘పోకెమాన్ గో’ అలా కాదు. నడుస్తూ... వాహనాలపై ఎక్కడెక్కడికో వెళుతూ... మొత్తంగా కదులుతూ ఆడే గేమ్. ఈ గేమ్ ఆడాలంటే మొదట గూగుల్ లేదా యాపిల్ ప్లేస్టోర్ల నుంచి ‘పోకెమాన్ గో’ ఫ్రీ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే ఇండియాలో ఇంకా ఇది విడుదల కాలేదు కనక... ‘మీ దేశంలో ఇది లభ్యం కావటం లేదు’ అనే సందేశం మాత్రం వస్తుంది. కాస్త టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా ఉన్నవారైతే... ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్కో అనుసంధానమై దీన్ని డౌన్లోడ్ చేసేయొచ్చు. కాకపోతే అధికారికంగా విడుదలయ్యాకే దీన్లోని ఫీచర్లన్నీ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇండియాలో వచ్చేవారంలోనే విడుదల చేస్తామని కూడా వెల్లడించింది. మరి దీన్నెలా ఆడాలి..? డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యాక... మీరు పోకెమాన్ ట్రెయినర్‌గా మారాలి. హెయిర్ నుంచి స్కిన్, కళ్లు, దుస్తులు, స్టయిల్స్‌తో సహా ఒక అవతార్‌ను ఎంచుకోవాలి. లొకేషన్‌ను ఆన్ చేస్తే... ఆ వెంటనే మీరున్న చోటు ఫోన్లో మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంటుంది. అదే మ్యాప్‌లో పోకెమాన్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కడ ఉన్నాయనేది కరెక్ట్‌గా తెలియకపోయినా... ఎంత దూరంలో ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. సదరు ప్రాంతానికి నిజంగా వెళితేనే కనిపిస్తాయవి. దీంతో... మనం ఫోన్ పట్టుకుని, కెమెరాలోంచి చూస్తూ ముందుకు వెళ్లాలన్న మాట. ఎక్కడైనా పోకెమాన్ ఉన్న ప్రదేశంలోకి వెళ్లగానే... ఫోన్లోని కెమెరా నుంచి చూస్తాం కనక... ఆ కెమెరా, గైరోస్కోప్ ఆధారంగా అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పోకెమాన్ చిత్రం మొబైల్లో కనిపిస్తుంది. మన ఎదురుగా కనిపిస్తున్న పోకెమాన్ని... ఫోన్లోని పోకెబాల్తో కొట్టాలి. ఈ బాల్ ఎలా ఉంటుందంటే గూగుల్ మ్యాప్స్‌లో పిన్ మాదిరి. కావాలంటే ఆటగాళ్లు పోకెమాన్లను ఫొటోలు కూడా తీసుకోవచ్చు. ఈ పోకెమాన్లు ఎక్కడుంటాయి? రోడ్డు మీద, రెస్టారెంట్ల పక్కన, నీటిలో, కొండల మీద, అడవిలో, బస్టాప్‌ల వద్ద, ఆసుపత్రుల వద్ద... ఇలా ఎక్కడైనా పోకెమాన్స్ ఉండొచ్చు. సరైన సమయంలో సరైన బాల్‌ను వినియోగించడంపైనే ఆటగాడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఎన్కౌంటర్ చేసిన తరువాతో..? పోకెమాన్లను ఎన్కౌంటర్ చేశాక ఆటగాడికి రెండు రకాలుగా పాయింట్లొస్తాయి. 1. క్యాండీస్ 2. స్టార్‌డస్ట్. పోకెమాన్ పోరాట శక్తిని పెంచేందుకు ఆటగాడు అవసరమైతే క్యాండీస్, స్టార్‌డస్ట్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. అన్ని పోకెమాన్ల శక్తీ ఒకేలా ఉండదు. లెవల్స్ పెరుగుతున్న కొద్దీ వాటి శక్తి కూడా ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. అవసరమైతే ఆటగాడు పోకెమాన్‌ను తిరిగి వెనక్కి పంపించి మరో పోకెమాన్‌ను సృష్టించుకునే వీలుంటుంది. ఈ ఆట ముగిసేదెక్కడ? ఐదు లెవల్స్ దాటాక ఆటగాడు వలోర్- రెడ్ టీం, మైస్టిక్- బ్లూ టీం, ఇన్స్టింక్ట్- ఎల్లో.. ఈ మూడు జట్లలో చేరొచ్చు. దీంతో పోకెమాన్ జిమ్‌లో తలపడటానికి అర్హత సాధిస్తాడన్నమాట. ఈ జిమ్‌లు కూడా రియల్ లొకేషన్లలోనే ఉంటాయి. అక్కడకు వెళితే కనిపిస్తాయి. జిమ్ మీద ఆధిపత్యం సాధించి, జిమ్‌లో శిక్షణ ద్వారా తన పోకెమాన్స్ను బలోపేతం చేయొచ్చు. పోకెమాన్ గోలో మొత్తం 151 పోకెమాన్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ప్రతీదానికో పేరుంది. ఫస్ట్ పోకెమాన్ పికాచు. తర్వాత మ్యూ, చార్మెండర్, హంటర్.. ఇలా జుబట్, ప్రిడ్జి, రట్టాటాతో ముగుస్తుంది. ఈ గేమ్ అంతిమ విజయం ఏంటంటే.. పొకెడెక్స్లో బందీలుగా ఉన్న పోకెమాన్లను విడిపించడమే. మన దేశంలో ఆడగలమా? ► ఇండియాలో ఇంకా ఈ గేమ్ విడుదల కాలేదు. విడుదలైనా సరే... ఆడటంలో చాలా ఇబ్బందులుండవచ్చనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ గేమ్కోసం వీధుల్లో తిరగాల్సి ఉంటుంది. మనుషులు మామూలుగా నడవటానికే వీలుకాని మన రోడ్లపై... ఫోన్‌వైపు చూస్తూ నడిస్తే ఇంకేమైనా ఉందా? విదేశాల్లో కన్నా ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందన్నది వారి భావన. ► ఈ గేమ్‌ను వీధుల్లో తిరుగుతూ ఆడాలి కనక వైఫైతో సాధ్యం కాదు. 2జీతో ఆడలేం. 3జీ లేదా 4జీ డేటాను వాడాల్సి ఉంటుంది. మన దేశంలో 3జీ సిగ్నల్స్ చాలా చోట్ల పనిచేయవు. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది. వీక్ సిగ్నల్ కారణంగా చాలా ప్రాంతాల్లో ఆడే అవకాశం ఉండదు. సిగ్నల్ బలంగా ఉన్నచోట ఆడదామనుకుంటే అక్కడ పోకెమాన్లు, పోకె జిమ్‌లు ఉండక పోవచ్చు. ► మనదేశమే కాదు. ఎక్కడైనా బ్యాటరీ సమస్యే. ఎందుకంటే కెమెరా, జీపీఎస్ ఒకేసారి వినియోగిస్తూ ఈ గేమ్ ఆడాలి. దీంతో బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది. గంట సేపు ఆడితే బ్యాటరీ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదముంది. అందుకని వేరే బ్యాటరీని వెంట తీసుకెళ్ళాలనేది గేమర్ల సూచన. ► బెంగళూరులోని బాబాజాబ్స్ సంస్థ ఇప్పటికే ‘పోకెమాన్ క్యాచర్స్’ కావాలంటూ కొత్త ఉద్యోగ ప్రకటన వేసిం ది. అంటే కాస్త బలంగా ఉండి అటూ ఇటూ పరుగులెత్తి పోకెమాన్లను పట్టుకుంటే... వాటిని విక్రయిస్తారన్న మాట. ► కొన్ని లెవెల్స్ చేరుకున్న వారు తమ ఖాతాల్ని కూడా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. వాటిని కొంటే... నిజంగా పోకెమాన్లను పట్టుకోకపోయినా మన ఖాతాలోకి వచ్చేస్తాయన్న మాట. ► పోకెమాన్ పేరిట ఇప్పటికే దుస్తులతో పాటు క్యాప్‌లు, కార్డ్‌లు, స్కూల్ బ్యాగ్‌ల వంటి రకరకాల యాక్సెసరీలు మార్కెట్లో ఉన్నాయి. తాజా గేమ్‌తో వాటి గిరాకీ అమాంతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ► పోకెమాన్ వస్తువులమ్మే ప్రతి వ్యాపారానికీ గి రాకీ పెరిగింది. పోకెమాన్ బొమ్మలతో కేకు లు తయారు చేస్తున్న ఓ బేకరీ షేరు జపాన్‌లో 10 రోజుల్లోనే 50% పెరిగింది. ప్రమాదాలే ప్రమాదాలు..! ► పోకెమాన్ గోపై భిన్న స్పందనలున్నాయి. ఈ గేమ్‌ను నడుస్తూ, పరుగెడుతూ ఆడతారు కనక.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరమైనదేనని కొందరు చెబుతున్నారు. అయితే రోడ్లు మీద వెళుతూ ఆడాల్సిన గేమ్ కావటంతో ప్రమాదకరమని మరికొందరు చెబుతున్నారు. ► నిజానికి ఇప్పటికే పోకెమాన్ గేమ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ పోకెమాన్లను వెతుకుతూ... ఏకంగా దగ్గర్లోని స్మశానంలోకి వెళ్లిపోయింది. పోకెమాన్లను పట్టుకునే క్రమంలో అక్కడ చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులొచ్చి ఆమెను రక్షించాల్సి వచ్చింది. ► స్టోర్బ్రిడ్జ్లో ఓ వ్యక్తి పోకెమాన్ గో ఆడుతూ... రోడ్డుపైకి చూడటానికి బదులు మొబైల్‌వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు కూడా పట్టుకున్నారు. చివరకు పోకెమాన్ గో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ... కొన్ని జాగ్రత్తలు చెబుతూ క్లీవ్‌లాండ్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ► గ్వాటెమాలాలో ఇద్దరు అన్నదమ్ములు పోకెమాన్ ఆడుతూ ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న దుండగులు తమను జీపీఎస్ సాయంతో వెతుకుతూ వచ్చేశారని భావించి ఇద్దరిలో ఒకరిని కాల్చిచంపేశారు. ► నార్త్ టెక్సాస్‌లో పోకెమాన్ ఆడుకుంటూ నిర్జీవ ప్రదేశానికి వెళ్లిన వ్యక్తిని పాము కాటేసింది. ఇదే ప్రాంతంలో మరొక వ్యక్తి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. మరొక వ్యక్తి పోలీస్ వాహనానికి ఢీకొన్నాడు. దీంతో నార్త్ టెక్సాస్ పోలీస్ విభాగం పోకెమాన్ గేమ్- భద్రత చిట్కాలను వివరిస్తూ నిమిషం నిడివిగల వీడియోను విడుదల చేసింది. ► మరోవైపు శుక్రవారం కెనడాలో పోకెమాన్ గో ఆడుతూ ఇద్దరు టీనేజర్లు దేశ సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించారు. వారిని బోర్డర్ పెట్రోల్ సిబ్బంది అదుపులోకి తీసుకుని వెనక్కి తీసుకొచ్చారు. ► ఒకవైపు ప్రమాదాలు పెరుగుతుండగా... ఇదొక జూదం లాంటిదంటూ దీన్ని నిషేధించాలని సౌదీ అరేబియా కౌన్సిల్ ఆఫ్ సీనియర్ స్కాలర్స్ ఫత్వా జారీ చేశారు. ఇది అనారోగ్యకరమని ఈజిప్ట్ రాజధాని కైరోలోనూ నిషేధించారు. ఇంగ్రెస్ గేమ్ డేటాతోనే పోకెమాన్ నియాంటిక్ మూలాలు గూగుల్వే. ఈ సంస్థ 2012లోనే ఇంగ్రెస్ గేమ్‌ను రూపొందించింది. కానీ అది పట్టాలెక్కలేదు. గూగుల్ కాస్తా ఆల్ఫాబెట్గా మారాక నియాంటిక్ సంస్థ పూర్తిగా విడిపోయింది. పోకెమాన్ సీఈఓ ట్సునికాజు ఐషిహారా, నింటెండో ప్రెసిడెంట్ అండ్ సీఈఓ సటోరూ ఐవాటా కలిసి... అగ్మెంటెడ్ రియాలిటీతో గేమ్ రూపొందించాలనుకున్నారు. నియాంటిక్తో చేతులు కలిపారు. ఇంగ్రెస్ను దీనికి వాడుకున్నారు. ఈ గేమ్ గురించి అగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీలో ఉన్న ఇమాజినేట్ సంస్థ సీఈఓ హేమంత్ సత్యనారాయణ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. + జీపీఎస్, కెమెరా, ఫోన్లోని కంపాస్ ఆధారంగా వర్చువల్ వరల్డ్‌లో భౌగోళిక ప్రాంతాల్ని గుర్తిస్తారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పోర్టల్స్‌ను ట్రాక్ చేసిపెడతారు. వీటిని నావిగేషన్ చేయాలంటే వాస్తవ ప్రపంచంలో వాటి వద్దకు వెళ్లాలి. మొబైల్లోని దిక్సూచి, సెన్సార్ కనెక్ట్ అయి ఉంటాయి కనక.. యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళ్లాలి. అయితే ఇక్కడ మనకొక సందేహం రావొచ్చు. అదేంటంటే.. పోకెమాన్ కోసం బహిరంగ ప్రదేశాల్లో తిరగాల్సి ఉంటుందని డెవలపర్లకు ముందే తెలిసినప్పుడు నిర్మానుష్య ప్రదేశాల్లో, ఓపెన్ ప్లేసుల్లోనో ఈ పోకెమాన్లను పెట్టొచ్చు కదా అని!. కరెక్టే.. కానీ పోకె మాన్లను వారెలా నావిగేట్ చేశారు? గూగుల్ ఏపీఐ ద్వారా కదా! అంటే ఎక్కడైతే పది మంది గుంపులుగా ఉంటారో అక్కడే పోకెమాన్లను పెట్టారు. బస్టాండ్లు, పార్కులు, మైదానాలు, రెస్టారెంట్ల వంటివన్నమాట. + ప్రపంచం మొత్తం మీద పోకెమాన్లను మాన్యువల్‌గా పెట్టలేం. గూగుల్ మ్యాప్స్‌లో ప్రతి పాయింట్‌ను ఎంచుకుని కూడా చేయలేం. అందుకే డెవలపర్లు ఏం చేశారంటే.. రాండమ్‌గా బస్టాండ్లు, పార్కులు, మైదానాలు, రెస్టారెంట్లు, ఆసుపత్రుల వంటి ప్రాంతాలను ఎంచుకున్నారు. అక్కడ గూగుల్ అప్లికేషన్ ప్రొగ్రాం ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా పోకెమాన్లను పెట్టేశారు. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్, ఏపీఐ రెండూ నావిగేషన్స్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. అక్కడ డెవలపర్లు అనుకున్న ప్రాంతం ఒకటైతే వాస్తవంగా వేరే ప్రాంతం ఉండొచ్చు. ఇదీ అసలు మ్యాటర్!! నకిలీలున్నాయ్ జాగ్రత్త.. ► పోకెమాన్ గో విడుదలైన రెండు రోజుల్లో నే యాపిల్, ఆండ్రాయిడ్ స్టోర్లలో ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న గేమ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. వారం రోజుల్లో 10 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం పోకెమాన్కు 35 మిలియన్ల యూజర్లున్నారని సెన్సార్ టవర్ లెక్కలు చెబుతున్నాయి. ► పోకెమాన్ గో ఆధారం చేసుకొని పోకె రా డార్, హెల్పర్ ఫర్ పోకెమాన్ గో వంటి 215 నకిలీ యాప్స్ చెలామణిలోకి వచ్చాయి. వీటి ని డౌన్లోడ్ చేసుకుంటే పలు వైరస్లు డౌన్లోడ్ అవుతాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ రిస్కీఐక్యూ హెచ్చరించింది. నకిలీ యాప్స్‌తో ఫోన్లోని డేటా బదిలీ అవుతుంది. మొబైల్ వ్యాలెట్లపై దాడి చేస్తుండటంతో ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదముంది. ►ఆండ్రాయిడ్ ఫోన్లలో రోజుకు సగటున ఈ గేమ్ వినియోగం స్నాప్‌చాట్, టిండర్, ట్విటర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ వినియోగాన్ని మించిపోయింది. ఐఓఎస్ ఫోన్లలో సగ టున రోజుకు 33 నిమిషాల 25 సెకన్ల పాటు ఈ గేమ్‌ను ఆడుతున్నారు. అదే ఫేస్‌బుక్‌ను 22 నిమిషాల 8 సెకన్లు, స్నాప్‌చాట్‌ను 18 నిమిషాల 7 సెకన్లు మాత్రమే వినియోగిస్తున్నారు. పోకెమాన్ సిరీస్ ఇవే... 1996లో పోకెమాన్ రెడ్ అండ్ బ్లూతో ప్రారంభమైన ఈ సిరీస్ మొదలైంది. తరవాత పలు ఎడిషన్ల అనంతరం... ఈ జూలై 6న పోకెమాన్ గో విడుదలైంది. నవంబరులో పోకెమాన్ సన్ అండ్ మూన్ కూడా విడుదలకానుంది. 30కి పైగా దేశాల్లో విడుదల జూలై 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాల్లో విడుదలయింది. తరవాత జర్మనీ, యూకే, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్... ఇలా 30కి పైగా దేశాల్లో విడుదలయింది. శనివారంనాడు జపాన్‌లో విడుదల సందర్భంగా... మూడు నాలుగు రోజుల్లో ఇండియాలోనూ విడుదల చేస్తామని దీని సృష్టికర్త నింటెండో సంస్థ ప్రకటించింది. సర్వర్లకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయలేదు. నింటెండో షేరు పరుగులు.. పోకెమాన్ సిరీస్ సృష్టికర్త జపాన్‌కు చెందిన నింటెండో. అమెరికాకు చెందిన నియాంటిక్ సహకారంతో నింటెండో ఈ గేమ్‌ను విడుదల చేసింది. జూలై 6న విడుదల చేసేనాటికి నింటెండో మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ షేరు పరుగులు పెట్టడంతో సంస్థ విలువ జూలై 20 నాటికి ఏకంగా 42 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే... రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. ప్రస్తుతం నింటెండోకు ఈ గేమ్ ద్వారా రోజుకు 2 మిలియన్ డాలర్ల... (రూ.14 కోట్ల) ఆదాయం సమకూరుతున్నట్లు అంచనా. -
పర్యాటక ప్రాంతాల్లో పోకిమన్ నిషేధం
టోక్యో : కాల్పనిక ప్రపంచనానికి వాస్తవికతకు ముడిపెడుతూ ఆవిష్కరించిన పోకిమన్ గో గేమ్‌పై జపాన్‌లో ఆంక్షలు విధించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడటాన్ని నిషేధిస్తూ ఆంక్షలు జారీచేశారు. ఈ గేమ్ ను రూపొందించిన సాప్ట్ వేర్ కంపెనీ నియాంటిక్ ల్యాబ్స్, ఇటీవలే జపాన్ లో ఈ గేమ్ ను లాంచ్ చేసింది. జపాన్ లో ఈ గేమ్ ను లాంచ్ చేయడంతో పోకిమన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే వీరి ఆనందానికి కొంత అడ్డుకట్ట వేస్తూ, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఈ గేమ్ ను ఆడవద్దని శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. జపాన్ లో రెండో అతి పవిత్రమైన స్థానంగా నిలుస్తున్న ఇజుమో-తైసా విగ్రహం పరిసర ప్రాంతంలో శుక్రవారం ఈ గేమ్ పై నిషేధం విధించారు. ఈ నిషేధం కేవలం గంభీరమైన అభయారణ్య ప్రాంతంలో సందర్శకులను రక్షించేందుకేనని అధికారులు ప్రకటించినట్టు ఈఎఫ్ఈ న్యూస్ రిపోర్టు చేసింది. ఏడాదికి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆరు మిలియన్ల మంది సందర్శకులు వస్తుంటారని, వారి సురక్షితం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. హిమేజీ కోట, జపాన్ లోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతం ఫ్యూడల్ పోర్ట్రెస్ ప్రాంతం. ఈ పరిసర ప్రాంతంలో నడిచేటప్పుడు ప్రజలు ఈ గేమ్ ను ఆడకూడదని నిషేధం విధించారు. జపాన్ లో మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ గేమ్ పై హెచ్చరికలు జారీచేశారు. ఈ హెచ్చరికలకు కట్టుబడి ఉండి...ప్రజలు తమ తమ స్మార్ట్ ఫోన్లలో గేమ్ ను సురక్షితంగా ఆడుకోవాలని అధికారులు చెబుతున్నారు. అటు ఈ గేమ్ ప్రభావంపై స్పందించిన ఇండోనేషియా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించగా, సౌదీమత పెద్దలు ఆటలు నిషేధిస్తూ ఫత్వాజారీ చేసిన సంగతి తెలిసిందే. -
‘పోకిమన్’ ఆడుతూ.. ఎంత పనిచేశారు!
‘పోకిమన్ గో’ మొబైల్ గేమ్ ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తోంది. వెనుకా ముందు చూసుకోకుండా ఈ గేడ్ ఆడుతున్న ప్రజలు నానా హంగామా చేస్తున్నారు. ‘పోకిమన్ గో’ గేమ్‌లో ‘జాంబీ’ అనే దెయ్యాన్ని పట్టుకోవడానికి వెతుకుతూ వెతుకుతూ కొందరు దేశాల సరిహద్దులే దాటేస్తుండగా.. మరికొందరు తాము ఎక్కడ ఉన్నామన్న స్పృహ కూడా మరిచి ఈ గేమ్‌లో మునిగిపోతున్నారు. తాజాగా ఫ్లోరిడాలోని స్థానిక న్యూస్ చానెల్ డబ్ల్యూటీఎస్పీలో ఊహించని ఘటన జరిగింది. యాంకర్ స్థానిక వాతావరణ వివరాలు చెబుతుండగా.. ఓ మహిళ ఏకంగా స్టూడియోలోకి వచ్చేసింది. దీంతో వాతావరణ వార్తలు చెబుతున్న యాంకర్ షాక్ తిని ఆమె వంక అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాత్రం ఆ యాంకర్ని, తాను టీవీ స్టూడియోలో ఉన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన మొబైల్లో మునిగిపోయి.. ‘జాంబీ’ దెయ్యాన్ని పట్టుకోవడానికి ఇటు అటు చక్కర్లు కొట్టింది. ఈ దెబ్బకు బిత్తరపోయిన టీవీ స్టూడియో సిబ్బంది తమ ఆఫీసు ‘పోకిమన్ జిమ్’ అయిపోయిందా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు అమెరికన్లు ‘పోకిమన్ గో’ ఆడుతూ.. కెనడా సరిహద్దులను దాటి వెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంది. -
జపాన్ లో మొదలైన ఆ సునామీ
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి నాంది పలికిన క్రేజీ గేమ్ పోకిమాన్ గో ఎట్టకేలకు జపాన్ లో లాంచ్ అయింది. ఈ గేమ్ ను రూపొందించిన జపాన్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నియాంటిక్ ల్యాబ్స్ స్వయంగా ప్రకటించింది. దీంతో పోకిమాన్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పోకీమాన్ గో యూజర్లు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ గేమ్ పై నిపుణుల హెచ్చరికలు, ప్రమాదాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు అక్కడి అధికారులు సందేశాలు జారీ చేశారు. హెచ్చరికలకు కట్టుబడి ఉండి...ప్రజలు తమ తమ స్మార్ట్ ఫోన్లలో గేమ్ ను సురక్షితంగా ఆడుకోవాలని చీఫ్ కేబినెట్ కార్యదర్శి యోషిండే సుగా ట్వీట్ చేశారు. దీంతో ఇది 15 వేల సార్లు రీట్విట్ అయింది. కాగా ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ ..అమెరికా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో జూలై ఆరున అధికారికంగా లాంచ్ అయ్యాయి. కెనడాలో జూలై 17న ఈ గేమ్ హవా మొదలైంది. అయితే మిగిలిన చాలా దేశాల్లో అఫీషియల్ లాంచింగ్ ముగియనప్పటికీ అనధికారంగా లక్షలమంది యూజర్లతో పోకిమాన్ గేమ్ మానియా కొనసాగుతోంది. గూగుల్ సెర్చ్ లో పోర్న్ సైట్లు, బ్రెక్సిట్ ను సైతం దాటేసిన పోకెమాన్ గో దూసుకుపోతోంది. అటు ఈ గేమ్ ప్రభావంపై స్పందించిన ఇండోనేషియా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించగా,సౌదీమత పెద్దలు ఆటలు నిషేధిస్తూ ఫత్వాజారీ చేయడం విశేషం. మరోవైపు పోకిమాన్ ఆవిష్కరణతో రికార్డ్ స్థాయిలాభాలను ఆర్జించిన నింటెండో షేర్లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. లాంచింగ్ తరువాతజపాన్ మార్కెట్లో సుమారు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ప్రముఖ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్ స్పాన్సర్ షిప్ డీల్ కుదుర్చుకోవడంతో నష్టాల్లో ఉన్న మెక్ డోనాల్డ్ ఊపిరి పీల్చుకుంటున్న సంగతి తెలిసిందే. Trainers in Japan, thank you for being patient. Pokémon GO is now available to download in Japan! — Pokémon GO (@PokemonGoApp) July 22, 2016