పోకేమాన్ గో ఆడుతున్న 42 మంది అరెస్ట్...!
బ్యాంకాక్ః ఇప్పటిదాకా మనకు మద్యంతాగి వాహనం నడిపేవారిని అరెస్ట్ చేయడమే తెలుసు. కానీ థాయ్ ల్యాండ్ లో తాజగా పోకేమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేసేవారిపైనా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వినియోగించడం ఇప్పటికే నేరంగా పరిగణిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు డ్రైవింగ్ లో పోకేమాన్ గేమ్ ఆడటం కూడా నేరంగా గుర్తించి సదరు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
థాయ్ ట్రాఫిక్ పోలీసులు పోకేమాన్ గో ఆడేవారిపై దృష్టి సారించారు. వాహనాలు నడుపుతూ పోకేమాన్ ఆడటం ప్రమాదాలకు దారితీస్తుండటంతో దాన్ని నేరంగా పరిగణిస్తున్న పోలీసులు.. తాజాగా నిబంధనలను అతిక్రమించిన 42 మందిని అరెస్టు చేశారు. పోకేమాన్ ఆడుతూ వాహనాలు నడిపిన వారికి 800 నుంచి 1000 రూపాయలవరకు జరిమానా విధిస్తామని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు 'ట్రాఫిక్ నో గో' పేరిట ప్రచారం చేపట్టారు. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వినియోగంతోపాటు, పోకేమాన్ గో ఆడటం ల్యాండ్ ట్రాఫిక్ చట్టానికి విరుద్ధమని చెప్తున్నారు.
ట్రాఫిక్ లైట్ల వద్ద ఆగినప్పుడు, ప్రయాణంలో వాహనదారులు పోకేమాన్ గో ఆడుతూ.. సెల్ ఫోన్ బయటకు పెట్టి పోకేమాన్ లను పట్టుకునే ప్రయత్నం చేయడంతో వారిని అరెస్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణంలో పోకేమాన్ ఆడటం చట్ట విరుద్ధ చర్య అని, వారివద్దనుంచీ సెల్ ఫోన్లు లాక్కోవడంతోపాటు, వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. పోకేమాన్ గో క్రీడాకారులతో సంభవిస్తున్న ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా బ్యాంకాక్ లోని భారీ ట్రాఫిక్ ఉండే 10 ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ప్రచారాన్ని ప్రారంభించారు.