ఏదైనా మన మంచికే!!
వాషింగ్టన్: ఆ మధ్య ఓ స్మార్ట్‌ఫోన్ గేమ్ బాగా పాపులర్ అయ్యింది. దాని పేరు పొకెమన్. ఫోన్లో ఈ గేమ్ ఆడడం కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరిగాయి. దీంతో చాలా దేశాలు ఆ గేమ్‌ను నిషేధించాయి కూడా.ఈ గేమ్ ఆడుతూ దేశాలు సరిహద్దులును కూడా దాటిపోయి కటకటాలపాలైన సందర్భాలున్నాయి. అయితే ఈ గేమ్‌తో ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం తాజా పరిశోధనలో తేలింది. పోకెమన్ గేమ్ ఆడినవారు తమకు తెలికుండానే చాలా బరువు తగ్గారట.
ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసే జనం.. రూపాయి ఖర్చు చేయకుండానే కేవలం పొకెమన్ ఆడడం వల్ల బరువు తగ్గినట్లు గుర్తించారట. కారణం... ఈ గేమ్‌లో పొకెమన్ బొమ్మల కోసం ఫోన్‌ను చేతిలో పట్టుకొని దానిని చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా తమకు తెలియకుండానే రోజువారీ నడక పెరిగిందని, శారీరక శ్రమ కూడా పెరిగిందని, ఫలితంగా బరువు తగ్గామని చెబుతున్నారు. ఈ గేమ్ ఆడేవారు రోజుకు సగటున 10వేల అడుగులు వేస్తున్నారంటే వారికి ఎంతగా మేలు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.