
ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్‌కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్‌లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి.
ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్‌క్లేవ్‌లో అన్నాడు.
వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్‌లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో పాటు 12 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్‌స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్‌లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు.
‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్‌కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్‌మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment