![Dommaraju Gukesh finishes last in Freestyle Grand Slam Chess Tour tournament](/styles/webp/s3/article_images/2025/02/16/gukesh.jpg.webp?itok=MXTe0G9L)
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు.
తొలి రౌండ్‌ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్‌లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment