రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలని ఎక్స్ సీఈఓ ఇలాన్‌మస్క్ అన్నారు. మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ సాయంతో త్వరలో ఏఐ ఆధారిత గేమింగ్ స్టూడియోను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గేమింగ్ పరిశ్రమలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఈ రంగాన్ని తిరిగి గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ విభాగంలోని ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆవిష్కరణలు కరవు
గేమింగ్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్, సోనీ వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మస్క్ తెలిపారు. ఈ పరిశ్రమలో ఆవిష్కరణలు లేక స్తబ్దత నెలకొందన్నారు. ఎక్స్‌ఏఐ ద్వారా ఈ పరిశ్రమను తిరిగి గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. డొజికాయిన్ గేమింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ఇటీవల ఈ రంగంపై స్పందిస్తూ ఈ పరిశ్రమలో కార్పొరేట్ ఆధిపత్యం అధికమైందన్నారు. ఆయా సంస్థల వ్యక్తిగత ఆసక్తుల వల్ల ‘మానిప్యులేటివ్’ కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. మార్కస్ వ్యాఖ్యలను మస్క్ అంగీకరిస్తూ ‘చాలా గేమ్ స్టూడియోలు పెద్ద సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. గేమింగ్ పరిశ్రమను మళ్లీ గొప్పగా చేయడానికి ఎక్స్‌ఏఐ గేమ్ స్టూడియోను ప్రారంభించబోతోంది. రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలి’ అని తెలిపారు.
ఎక్స్‌బాక్స్‌పై విమర్శలు
మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని గేమింగ్ బ్రాండ్ ‘ఎక్స్‌బాక్స్’లో వివక్షతతో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నట్లు ఇటీవల విమర్శలొచ్చాయి. కొన్ని గేమ్‌ల్లో నల్లజాతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, తెల్లవారిని ఆయా గేమ్‌ల్లో తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. దాంతో మస్క్ తన ఎక్స్ ఖాతాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ట్యాగ్ చేస్తూ ‘ఇది చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్ష
ఇరువైపులా సంభాషించే ఏఐ
మార్చి 2023లో మస్క్ ఎక్స్‌ఏఐను స్థాపించారు. దీన్ని ‘గ్రోక్’ ఏఐ సాయంతో అభివృద్ధి చేశారు. ఇరువైపులా సంభాషించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అమెరికాలోని టేనస్సీలోని మెంఫిస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలను సైతం కంపెనీ గతంలో ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment