'పోకెమాన్ గో'పై 'న్యూయార్క్' సంచలన నిర్ణయం
న్యూయార్క్: మెరీనా 14 ఏళ్ల విద్యార్థిని. ఇటీవలే తన మొబైల్ లో వర్చువల్ రియాలిటీ గేమ్ పోకెమాన్ ను డౌన్ లోడ్ చేసుకుని పోకె ట్రైనర్ గా మారింది. స్కూల్ నుంచి వచ్చీరాగానే మొబైల్ ఫోన్ పట్టుకుని.. రోడ్డు మీద, వీధి సందుల్లో, నీటిలో, కొండల మీద, అడవిలో, బస్టాప్‌ల వద్ద, ఆసుపత్రుల వద్ద.. ఎక్కడపడితే అక్కడ ఉండే పోకెమాన్ల కోసం తిరుగాడేది. అలా ఒక సాయంకాలం మ్యాప్ ఆధారంగా పోకెమాన్ ను వెతుక్కుంటూ ఓ సందులోకి వెళ్లింది. చుట్టుపక్కల జన సంచారం లేదన్నసంగతే మర్చిపోయి గేమ్ లో మునిగిపోయిన ఆమెపైకి.. మృగంలా దూకాడొకడు. నోరు మూసేసి ఓ గదిలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు.
పోకెమాన్ ఆడటం ఆ చిన్నారి తప్పు కాకపోవచ్చు.. కానీ వెళ్లిన చోటే ప్రమాదకరమైనది! నిజానికి ఇది వాస్తవ సంఘటన కాదు కానీ అలాంటి పరిస్థితులే ఎదురైతే పిల్లల్ని కాపాడేది ఎవరు? పోకెమన్ కంపెనీయా? తల్లిదండ్రులా? పోలీసులా? ఇలాంటి ప్రశ్నకు సమాధానంగా, సంచలనాత్మక ఆదేశాలు జారీచేశారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో. న్యూయార్క్ స్టేట్ లో 3000 మందికిపైగా సెక్స్ అఫెండర్లు ప్రస్తుతం పెరోల్ పై ఉన్నారు. వాళ్లందరి చిరునామాలు, ఇతర వివరాలు పోలీసుల దగ్గర ఉంటాయి. ఆ వివరాలను పోకెమాన్ రూపకర్తలకు పంపాలని, దోషులను పోకెమన్ గో ఆడనివ్వకుండా చేయడమేకాక వాళ్లు నివసించే ప్రాంతాల్లో పోకెమన్లు లేకుండా చేయాలని గవర్నర్.. ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గేమ్ పబ్లిషర్లు, డెవలపర్లు అయిన నియాంటిక్, నింటెండో సంస్థలకు గవర్నర్ కార్యాలయం నుంచి మెయిల్స్ పంపారు కూడా! (డేంజర్ గేమ్..పోకెమాన్ గో..)
'అమెరికాలో పోకెమాన్ ట్రైనర్ల సంఖ్య ఇప్పటికే రెండు కోట్లు దాటింది. వాళ్లలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదాల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకే సెక్స్ అఫెండర్లు నివసించే చోట్ల దానిని(గేమ్) అదుపుచేయాలని కోరుతున్నాం. టెక్నాలజీ బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ మార్చుకుంటూ పోవాలి' అని న్యూయార్క్ గరవర్నర్ తన ప్రకటనలో పేక్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నియాంటిక్, నింటెండో సంస్థలు ఇప్పటికైతే స్పందించలేదు. '13 ఏళ్ల దాటిన వారు మాత్రమే రిజిస్ట్రేషన్ ద్వారా పోకెమాన్ గో గేమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు' అని ఆ సంస్థలు చెబుతున్నాయి. గవర్నర్ నిర్ణయంతో న్యూయార్క్ సిటిజన్లు చాలామంది ఏకీభవిస్తుండటం గమనార్హం.
(న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో)