డ్రైవింగ్ లోనూ 'పోకేమాన్ గో'..!
వాషింగ్టన్ః డ్రైవింగ్ చేస్తున్నపుడు కూడా వేలాదిమంది పోకేమాన్ గో ఆడుతున్నట్లు తాజా అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. 'ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ అండ్ డ్రైవింగ్' కు సంబంధించి వచ్చిన ట్వీట్లు, వార్తాంశాల ఆధారంగా తాజా పరిశోధనలను చేపట్టగా... విశ్లేషణల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి.
అనేక దేశాల్లో విడుదలై.. జనాన్ని పిచ్చెక్కిస్తున్న పోకేమాన్ గో ఆటలో పడి కొందరు బాహ్య ప్రపంచాన్నే మరచిపోయి ప్రమాదాలను సైతం కొని తెచ్చుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ అండ్ డ్రైవింగ్ అన్న అంశంపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించారు. పోకేమాన్ గో ఆడుతూ డ్రైవింగ్ చేసిన ఘటనలకు సంబంధించి.. ట్విట్లర్ లో నివేదించిన 100000 అంశాలను పరిశీలించిన శాండియాగో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు.. గేమ్ ఆడుతూ డ్రైవ్ చేసిన సందర్భంలో 14 మందిలో ఒకరు చెట్లకు ఢీకొట్టినట్లు తెలుసుకున్నారు.
డ్రైవర్, పాసింజర్, పాదచారులు మొదలైనవారు కేవలం పదిరోజుల్లో 113,993 పోకేమాన్ ఘటనలను ట్వీట్ చేసినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. వీటిలో 18 శాతం ట్వీట్లు పోకేమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేసినవి, 11 శాతం పాసింజర్లు, 4 శాతం పాదచారులకు సంబంధించినవిగా ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాగే గూగుల్ న్యూస్ లోని పోకేమాన్, డ్రైవింగ్ పదాల ఆధారంగా విశ్లేషించిన పరిశోధకులు అదేసమయంలో 321 ట్రాఫిక్ ఘటనలు, 14 ఇతర ప్రమాదాలు జరిగినట్లు నివేదించారు. భవిష్యత్తులో డెవలపర్లు డ్రైవింగ్ లో గేమ్ ఆడటంపై నష్టాలను పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు చెప్తూ తమ అధ్యయనాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.