పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో.. జపాన్ లో లాంచింగ్ వాయిదా..!
పోకేమాన్ గో గేమ్.. జపాన్ లో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. లొకేషన్ ఆధారంగా ఆడే ఈ ఆగ్ మెంటెడ్ రియాల్టీ గేమ్.. ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసిందే.. గేమ్ తయారీ సంస్థ నియాంటిక్.. ప్రస్తుతం జపాన్ లో ఈ గేమ్ విడుదలను విరమించుకుంది. ఇంటర్నెట్ లో ఓ ఈ మెయిల్ వైరల్ గా మారడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై జనాన్ని కట్టిపడేస్తున్న 'పోకేమాన్ గో'.. విడుదల వాయిదా పడటం జపాన్ వాసులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే జపాన్లోనూ తమ గేమ్ కు నిస్పందేహంగా అత్యంత ఆదరణ లభిస్తుందని నియాంటిక్ సీఈవో జాన్ హంక్ తెలిపారు. పోకేమాన్ గో కోసం తగినన్ని సర్వర్లు కావాలంటే కొంత సమయం అవసరమని, దీంతో గేమ్ ప్రారంభం ఆలస్యం అవుతోందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అత్యధికంగా ఉండే జపాన్ లోని సుమారు 3000 జిమ్ లలో తమ స్టోర్లను ప్రారంభించేందుకు మొదటి స్పాన్సరర్ మెక్ డొనాల్డ్ అంగీకరించినట్లు తెలిపారు. అంతేకాక ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడ భాగస్వామ్యాన్ని అందించే ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు హంక్ వివరించారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన కనిపిస్తున్న ఈ పోకేమాన్ గో గేమ్ లో పడి కొందరు బాహ్య ప్రపంచాన్నే మరచిపోయి ప్రమాదాలను సైతం కొనితెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఓ ఆటగాడు పోకేమాన్ లను వెతికే పనిలో పడి.. న్యూయార్క్ లో ట్రాఫిక్ జామ్ కు కారణమవ్వగా.. ఓ వ్యక్తి పార్కులో ఆడుతూ పరధ్యానంగా పూల్ లో పడ్డ ఘటన వెలుగు చూసింది. రియాల్టీ గేమ్ ప్రపంచంలోకి ఆటగాళ్ళను తీసుకెళ్ళి వారికి కొత్త అనుభూతినివ్వడంతోపాటు.. ఈ గేమ్ ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతోందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోకెమాన్ గో గేమ్ యాప్ ను స్మార్ట్ ఫోనుల్లో డౌన్ లోడ్ చేసుకుని, పోకెమాన్ లను వెతికి పట్టుకోవడం కోసం క్రీడాకారులు వీధుల వెంట,పార్కుల వెంట పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నారు. వాటిని వెతుక్కుంటూ మైళ్ళకొద్దీ దూరాలు ప్రయాణించేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ లో యాప్ ద్వారా ఆడే ఈ ఆట.. ఇంటర్నెట్ తో కనెక్ట్ అవ్వగానే దగ్గరలోని పోకెమాన్ లను చూపిస్తుంటుంది. ఇలా కనిపించిన పోకేమాన్ లు ఉన్న ప్రాంతానికి జీపీఎస్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్ళి, పోకేబాల్ తో కొడితే అక్కడున్న పోకేమాన్ లు వారి సొంతమౌతాయన్నమాట. అంటే వారి లిస్టులో చేరిపోతాయి. ఇలా పలు దశల్లో ఈ ఆట ఆడే అవకాశం ఉంటుంది. అమెరికాలో విడుదలైన రెండు వారాల్లోనే పోకేమాన్ గో అద్భుత విజయాన్ని చవిచూసిందట. 30 మిలియన్ల డౌన్ లోడ్లతో, 35 మిలియన్ డాలర్లు సంపాదించేసి, ఏకంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్ వినియోగదారులను దాటిపోయింది. అయితే పోకేమాన్ స్వస్థలమైన జపాన్ లో ప్రారంభం కాకముందే ఈ వినూత్న గేమ్ ప్రపంచంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఇప్పటికే 30 దేశాల్లో పైగా అందుబాటులో ఉన్న పోకేమాన్ గో.. గతవారం యూరప్ మార్కెట్లలో స్థిరంగా ఉండటంపై సంస్థ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఒకసారి జపాన్ లో ఈ గేమ్ ప్రారంభమైతే.. ఆసియాలోనే ఇతర దేశాలకంటే ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.