‘పోకెమాన్ గో’తో ఎన్నో వైద్య ప్రయోజనాలు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిచ్చిగా ఆడుతున్న ‘పోకెమాన్ గో’ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఆట వల్ల ప్రమాదాలకన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. ప్రత్యక్ష ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పరోక్ష ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని వారే అంటున్నారు.
నెల రోజుల క్రితమే బ్రిటన్‌లో విడదలైన ఆగ్‌మెంటెడ్ రియాలిటీ ‘పోకెమాన్ గో’ గేమ్ స్క్రీన్‌ను ఇప్పుడు బ్రిటన్ వైద్యులు, నర్సులు రోగి రక్తనాళాలను కనుగొనేందుకు ఉపయోగిస్తున్నారు. మానవ చర్మం కింద ఉండే రక్తనాళాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటాయని, రక్తనాళాల్లోకి ఇంజెక్షన్లు ఇవ్వాలన్నా, లిక్విడ్స్ ఎక్కించాలన్నా కొందరిలో రక్తనాళాలు సులభంగా దొరుకుతాయని, మరికొందరిలో ఎంతకష్టపడినా దొరకవని బ్రిటన్ హెల్త్ స్కీమ్‌కు చెందిన వైద్యులు చెప్పారు. పోకెమాన్ గో గేమ్ స్క్రీన్‌ను రోగుల నరాలపై ఫోకస్ చేయగా వాళ్ల రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుండడమే కాకుండా ఆ నాళాల ఇమేజ్ కూడా చర్మంపై కనిపిస్తోందని వారు తెలిపారు.
మానవ శరీర నిర్మాణానికి సంబంధించి డాక్టర్లకు, నర్సులకు శిక్షణ ఇచ్చేటప్పుడు సాధారణంగా మానవ అంతర్గత అవయవాల ఆకారంలో తయారు చేసిన బొమ్మలను ఉపయోగిస్తారు. ఇకముందు ఆ అవసరం లేకుండా రోగుల శరీర భాగాలను వీడియోలు తీసి వాటిని పోకెమాన్ గో లాంటి గేమ్ స్క్రీన్లపై సూపర్ ఇంపోజ్ చేసి శిక్షణ ఇవ్వొచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.
ఓ దేశంలో ఉన్న వైద్య నిపుణుడి సూచనలను పాటిస్తూ వీడియో కాన్ఫరెన్స్ లాంటి వ్యవస్థ ద్వారా మరో దేశంలో వైద్యులు రోగికి శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ విధానంలో ఓ ఇబ్బంది ఉంది. రోగి శస్త్ర చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణుడు వైద్యులకు లిఖిత లేదా డ్రాయింగ్ ద్వారా తెలియజేసేందుకు పక్కనున్న మరో స్క్రీన్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. అలా కాకుండా రోగి శస్త్ర చికిత్స కనిపిస్తున్న స్క్రీన్‌పైనే వైద్య నిపుణులు అవసరమైన సూచనలు ఇవ్వడానికి పారదర్శక డిస్‌ప్లే స్క్రీన్‌ను ఉపయోగించవచ్చని పోకెమాన్ గో గేమ్ ద్వారా తేలింది. ఇప్పుడు అమెరికాలో ఇదే టెక్నాలజేని ఉపయోగించేందుకు ఇండియాన, అలబామా యూనివర్శిటీలు కృషి చేస్తున్నాయి.
పోకెమాన్ గో సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగించి లండన్‌కు చెందిన ‘ఆక్స్‌సైట్’ కంపెనీ ‘విజర్ కెన్’ అనే స్మార్ట్ కళ్లజోడును రూపొందించింది. కంటి చూపు మసగ్గా ఉండేవారు ఈ కళ్లజోడును ఉపయోగించినట్లయితే వారి చూసే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. దృశ్యాలను జూమ్ చేసుకుని చూసే వెసలుబాటు కూడా ఈ కళ్లజోడులో ఉంది. ఈ కళ్లజోళ్లను ఈ ఏడాదే మార్కెట్‌లోకి విడుదల చేస్తామని కంపెనీ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఇవన్నీ పోకెమాన్ గో గేమ్ వల్ల కలుగుతున్న ప్రత్యక్ష ప్రయోజనాలుకాగా, గేమ్ ఆడుతుండడం వల్ల పరోక్ష ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని బ్రిటన్ వైద్యులు తెలుపుతున్నారు. ఎన్నడు వీధుల్లో నడవని వాళ్లు ఈ గేమ్ కారణంగా రోజుకు కిలోమీటరు నుంచి ఆరు కిలోమీటర్లు నడుస్తున్నారని, దాని వల్ల వారిలో స్థూలకాయ సమస్య తగ్గడమే కాకుండా డయాబెటీస్ వ్యాధి తగ్గుతోందని చెప్పారు. ఎప్పుడూ ఇంటికే పరిమితమై మానసిక సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు పోకెమాన్ గే వల్ల వీధుల్లోకి రావడం వల్ల వారికి మానసిక సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని, పైగా అపరిచితుల పరిచయం వల్ల కూడా మానసిక ఉల్లాసం కలుగుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజలు పోకెమాన్ గో గేమ్ ఆడుతున్నట్లు ఓ తాజా సర్వేలో తేలింది.