British Medical Journal
-
‘ఆ మందులతో ఎలాంటి ప్రయోజనం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: గుండెపోటు నివారణకు ‘స్టాటిన్’ ట్యాబ్లెట్లను బ్రిటన్‌లోనే కాకుండా భారత్‌లో ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. స్టాటిన్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్‌ను తగ్గించడం వల్ల గుండెపోటు రాకుండా అండుకోగలుగుతుందన్న విశ్వాసమే ఈ మందులను ఎక్కువగా వాడడానికి కారణం. కానీ వాస్తవానికి హృద్రోగులు స్టాటిన్స్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనమేమి కనిపించడం లేదని ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్’ తాజా సంచికలో పేర్కొంది. హృద్రోగులపై స్టాటిన్స్ ప్రభావానికి సంబంధించి ఇంతకుముందు నిర్వహించిన 35 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ఓ వైద్య బృందం ఈ అభిప్రాయానికి వచ్చింది. (చదవండి: టిక్‌టాక్ విక్రయం : చైనా వార్నింగ్?) స్టాటిన్స్‌ను వాడిన వారిలో మూడొంతుల మంది గుండెపోటు వల్ల మరణించారని, సగానికి సగం మంది రోగుల్లో స్టాటిన్స్ గుండెపోటు ప్రమాదాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయని వైద్య బృందం పేర్కొంది. స్టాటిన్స్ ప్రభావంపై తాజాగా అధ్యయనాలు జరపకుండానే, పాత అధ్యయనాలను సరిగ్గా విశ్లేషించకుండానే వైద్యులు సంప్రదాయబద్ధంగా ఇప్పటికీ స్టాటిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారని వైద్య బృందం అభిప్రాయాలను క్రోడీకరించిన డాక్టర్ రాబర్ట్ డ్యూబ్రాఫ్ తెలిపారు. ఆయన ‘యూనివర్శిటీ ఆఫ్ న్యూమెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. (ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..) -
రోజూ ఇవి తింటే బరువెక్కరు!
ఊబకాయం వచ్చేస్తోందని బాధపడుతున్నా రా? అయితే రోజూ బాదం, జీడిపప్పు, వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే సరి అంటోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్. శుద్ధి చేసిన మాంసం, చిప్స్, ఫ్రై లలో సగం మోతాదును ఈ ఆరోగ్యకరమైన గింజలు, పప్పులతో భర్తీ చేసినా బరువు పెరగడం తగ్గుతారని పరిశోధకులు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. వీటిల్లో అసంతృప్త కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం ఎక్కువగా కేలరీలు మాత్రం తక్కువగా ఉండటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం 14 గ్రాముల గింజలు, పప్పులు అధికంగా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయన్నది వీరి అంచనా. మొత్తం మూడు వర్గాల వారిని దీర్ఘ కాలం పాటు పరిశీలించిన తర్వాత ఈ అంచనాకొచ్చారు. సుమారు 51, 529 మంది (40–75 మధ్య వయస్కులు) పురుషులు, 1,21,700 మంది నర్సుల (35–55 మధ్య వయస్సు)తో పాటు సుమారు 1.16 లక్షల మంది యువ నర్సులపై ఇరవై ఏళ్ల పాటు బరువు, ఆహారం, వ్యాయామం వంటి వివరాలను సేకరించి మరీ ఈ అధ్యయనం చేశారు. నాలుగేళ్లకోసారి బరువును ప్రకటించడంతో పాటు అంతకు ముందు సంవత్సరంలో ఎంత తరచుగా గింజలు, పప్పులు తిన్నారో కూడా తెలిపేలా అధ్యయనం జరిగింది. పప్పులు, గింజల్లో దేని వాడకం ఎక్కువైనాసరే.. దీర్ఘకాలంలో బరువు పెరగడం తగ్గినట్లుగా తెలిసింది. -
కఠిన వీసా నిబంధనలు వద్దు
లండన్: కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ ‘స్క్రాప్ ద క్యాప్’పేరిట జరుగుతున్న ప్రచారానికి బ్రిటన్‌లోని ప్రముఖ భారతీయ వైద్యుల సంఘం (బాపియో) మద్దతు పలికింది. బ్రిటన్ జాతీయ వైద్య సేవా విభాగం (ఎన్హెచ్ఎస్) వైద్యుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన భారతీయ వైద్యులను తీసుకుని రావడానికి కఠినమైన వీసా నిబంధనలు అడ్డువస్తున్నాయని బాపియో పేర్కొంది. ‘స్క్రాప్ ద క్యాప్’ ప్రచారం ప్రారంభమైన కొద్ది రోజులకే ఎన్హెచ్ఎస్లో పనిచేయడానికి విదేశీ వైద్యులపై విధించిన కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఆన్లైన్ పిటిషన్‌ను యూకే పార్లమెంట్ వెబ్సైట్లో పెట్టింది. ఈ నేపథ్యంలో బాపియో అధ్యక్షుడు రమేశ్ మెహతా మాట్లాడుతూ.. ‘ఈ ప్రచారానికి మేం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాం. ఈ వీసా వ్యవస్థ వైద్య సేవల అవసరాలను తీర్చేదిగా ఉండాలి’అని అభిప్రాయ పడ్డారు. టైర్–2 వీసా కేటగిరీ కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెలుపల నుంచి ఏడాదికి 20,700 మంది నిపుణులను బ్రిటన్ కంపెనీల్లోకి తీసుకోవడానికి అనుమతి ఉంది. కిందటేడాది డిసెంబర్ వరకు గత ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే పరిమితికి మించి నిపుణులను తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు బ్రిటన్ హోం కార్యాలయం సుమారు 1,500 మంది డాక్టర్ల వీసా దరఖాస్తులను తిరస్కరించింది. ‘ఇక్కడ పదివేల మంది వైద్యులు అవసరం. ఈ మేరకు సరిపడే భారతీయ వైద్యుల జాబితా మా వద్ద ఉంది. నిబంధనలు అందుకు అంగీకరించడం లేదు. భారత్‌కు సైతం వైద్య నిపుణుల అవసరం ఉంది కాబట్టి మేధోవలసను మేం ప్రోత్సహించట్లేదు. వారికి ఇక్కడ శిక్షణ ఇచ్చి తిరిగి భారత్ పంపాలని అనుకుంటున్నాం’ అని మెహతా అన్నారు. -
‘పోకెమాన్ గో’తో ఎన్నో వైద్య ప్రయోజనాలు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిచ్చిగా ఆడుతున్న ‘పోకెమాన్ గో’ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. ఈ ఆట వల్ల ప్రమాదాలకన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. ప్రత్యక్ష ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పరోక్ష ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని వారే అంటున్నారు. నెల రోజుల క్రితమే బ్రిటన్‌లో విడదలైన ఆగ్మెంటెడ్ రియాలిటీ ‘పోకెమాన్ గో’ గేమ్ స్క్రీన్‌ను ఇప్పుడు బ్రిటన్ వైద్యులు, నర్సులు రోగి రక్తనాళాలను కనుగొనేందుకు ఉపయోగిస్తున్నారు. మానవ చర్మం కింద ఉండే రక్తనాళాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటాయని, రక్తనాళాల్లోకి ఇంజెక్షన్లు ఇవ్వాలన్నా, లిక్విడ్స్ ఎక్కించాలన్నా కొందరిలో రక్తనాళాలు సులభంగా దొరుకుతాయని, మరికొందరిలో ఎంతకష్టపడినా దొరకవని బ్రిటన్ హెల్త్ స్కీమ్‌కు చెందిన వైద్యులు చెప్పారు. పోకెమాన్ గో గేమ్ స్క్రీన్‌ను రోగుల నరాలపై ఫోకస్ చేయగా వాళ్ల రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుండడమే కాకుండా ఆ నాళాల ఇమేజ్ కూడా చర్మంపై కనిపిస్తోందని వారు తెలిపారు. మానవ శరీర నిర్మాణానికి సంబంధించి డాక్టర్లకు, నర్సులకు శిక్షణ ఇచ్చేటప్పుడు సాధారణంగా మానవ అంతర్గత అవయవాల ఆకారంలో తయారు చేసిన బొమ్మలను ఉపయోగిస్తారు. ఇకముందు ఆ అవసరం లేకుండా రోగుల శరీర భాగాలను వీడియోలు తీసి వాటిని పోకెమాన్ గో లాంటి గేమ్ స్క్రీన్లపై సూపర్ ఇంపోజ్ చేసి శిక్షణ ఇవ్వొచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. ఓ దేశంలో ఉన్న వైద్య నిపుణుడి సూచనలను పాటిస్తూ వీడియో కాన్ఫరెన్స్ లాంటి వ్యవస్థ ద్వారా మరో దేశంలో వైద్యులు రోగికి శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ విధానంలో ఓ ఇబ్బంది ఉంది. రోగి శస్త్ర చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణుడు వైద్యులకు లిఖిత లేదా డ్రాయింగ్ ద్వారా తెలియజేసేందుకు పక్కనున్న మరో స్క్రీన్‌ను ఉపయోగించాల్సి వస్తోంది. అలా కాకుండా రోగి శస్త్ర చికిత్స కనిపిస్తున్న స్క్రీన్‌పైనే వైద్య నిపుణులు అవసరమైన సూచనలు ఇవ్వడానికి పారదర్శక డిస్ప్లే స్క్రీన్‌ను ఉపయోగించవచ్చని పోకెమాన్ గో గేమ్ ద్వారా తేలింది. ఇప్పుడు అమెరికాలో ఇదే టెక్నాలజేని ఉపయోగించేందుకు ఇండియాన, అలబామా యూనివర్శిటీలు కృషి చేస్తున్నాయి. పోకెమాన్ గో సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగించి లండన్‌కు చెందిన ‘ఆక్స్సైట్’ కంపెనీ ‘విజర్ కెన్’ అనే స్మార్ట్ కళ్లజోడును రూపొందించింది. కంటి చూపు మసగ్గా ఉండేవారు ఈ కళ్లజోడును ఉపయోగించినట్లయితే వారి చూసే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. దృశ్యాలను జూమ్ చేసుకుని చూసే వెసలుబాటు కూడా ఈ కళ్లజోడులో ఉంది. ఈ కళ్లజోళ్లను ఈ ఏడాదే మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ పోకెమాన్ గో గేమ్ వల్ల కలుగుతున్న ప్రత్యక్ష ప్రయోజనాలుకాగా, గేమ్ ఆడుతుండడం వల్ల పరోక్ష ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని బ్రిటన్ వైద్యులు తెలుపుతున్నారు. ఎన్నడు వీధుల్లో నడవని వాళ్లు ఈ గేమ్ కారణంగా రోజుకు కిలోమీటరు నుంచి ఆరు కిలోమీటర్లు నడుస్తున్నారని, దాని వల్ల వారిలో స్థూలకాయ సమస్య తగ్గడమే కాకుండా డయాబెటీస్ వ్యాధి తగ్గుతోందని చెప్పారు. ఎప్పుడూ ఇంటికే పరిమితమై మానసిక సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు పోకెమాన్ గే వల్ల వీధుల్లోకి రావడం వల్ల వారికి మానసిక సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని, పైగా అపరిచితుల పరిచయం వల్ల కూడా మానసిక ఉల్లాసం కలుగుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజలు పోకెమాన్ గో గేమ్ ఆడుతున్నట్లు ఓ తాజా సర్వేలో తేలింది.