ఊబకాయం వచ్చేస్తోందని బాధపడుతున్నా రా? అయితే రోజూ బాదం, జీడిపప్పు, వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే సరి అంటోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్. శుద్ధి చేసిన మాంసం, చిప్స్, ఫ్రై లలో సగం మోతాదును ఈ ఆరోగ్యకరమైన గింజలు, పప్పులతో భర్తీ చేసినా బరువు పెరగడం తగ్గుతారని పరిశోధకులు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. వీటిల్లో అసంతృప్త కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం ఎక్కువగా కేలరీలు మాత్రం తక్కువగా ఉండటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు.
మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం 14 గ్రాముల గింజలు, పప్పులు అధికంగా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయన్నది వీరి అంచనా. మొత్తం మూడు వర్గాల వారిని దీర్ఘ కాలం పాటు పరిశీలించిన తర్వాత ఈ అంచనాకొచ్చారు. సుమారు 51, 529 మంది (40–75 మధ్య వయస్కులు) పురుషులు, 1,21,700 మంది నర్సుల (35–55 మధ్య వయస్సు)తో పాటు సుమారు 1.16 లక్షల మంది యువ నర్సులపై ఇరవై ఏళ్ల పాటు బరువు, ఆహారం, వ్యాయామం వంటి వివరాలను సేకరించి మరీ ఈ అధ్యయనం చేశారు. నాలుగేళ్లకోసారి బరువును ప్రకటించడంతో పాటు అంతకు ముందు సంవత్సరంలో ఎంత తరచుగా గింజలు, పప్పులు తిన్నారో కూడా తెలిపేలా అధ్యయనం జరిగింది. పప్పులు, గింజల్లో దేని వాడకం ఎక్కువైనాసరే.. దీర్ఘకాలంలో బరువు పెరగడం తగ్గినట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment