లండన్: కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ ‘స్క్రాప్ ద క్యాప్’పేరిట జరుగుతున్న ప్రచారానికి బ్రిటన్‌లోని ప్రముఖ భారతీయ వైద్యుల సంఘం (బాపియో) మద్దతు పలికింది. బ్రిటన్ జాతీయ వైద్య సేవా విభాగం (ఎన్‌హెచ్‌ఎస్) వైద్యుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన భారతీయ వైద్యులను తీసుకుని రావడానికి కఠినమైన వీసా నిబంధనలు అడ్డువస్తున్నాయని బాపియో పేర్కొంది. ‘స్క్రాప్ ద క్యాప్’ ప్రచారం ప్రారంభమైన కొద్ది రోజులకే ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేయడానికి విదేశీ వైద్యులపై విధించిన కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఆన్‌లైన్ పిటిషన్‌ను యూకే పార్లమెంట్ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో బాపియో అధ్యక్షుడు రమేశ్ మెహతా మాట్లాడుతూ.. ‘ఈ ప్రచారానికి మేం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాం.
ఈ వీసా వ్యవస్థ వైద్య సేవల అవసరాలను తీర్చేదిగా ఉండాలి’అని అభిప్రాయ పడ్డారు. టైర్–2 వీసా కేటగిరీ కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెలుపల నుంచి ఏడాదికి 20,700 మంది నిపుణులను బ్రిటన్ కంపెనీల్లోకి తీసుకోవడానికి అనుమతి ఉంది. కిందటేడాది డిసెంబర్ వరకు గత ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే పరిమితికి మించి నిపుణులను తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు బ్రిటన్ హోం కార్యాలయం సుమారు 1,500 మంది డాక్టర్ల వీసా దరఖాస్తులను తిరస్కరించింది. ‘ఇక్కడ పదివేల మంది వైద్యులు అవసరం. ఈ మేరకు సరిపడే భారతీయ వైద్యుల జాబితా మా వద్ద ఉంది. నిబంధనలు అందుకు అంగీకరించడం లేదు. భారత్‌కు సైతం వైద్య నిపుణుల అవసరం ఉంది కాబట్టి మేధోవలసను మేం ప్రోత్సహించట్లేదు. వారికి ఇక్కడ శిక్షణ ఇచ్చి తిరిగి భారత్ పంపాలని అనుకుంటున్నాం’ అని మెహతా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment