
లండన్: బ్రిటన్‌లో వీసా విధానాలపై భారత వృత్తినిపుణులు నిరసనకు దిగారు. ఇందుకు ప్రధాని థెరిసా మే అధికారిక నివాసముండే డౌనింగ్ స్ట్రీట్‌నే వేదికగా ఎంచుకున్నారు. ప్రభుత్వ విధానాలు అమానవీయం, అన్యాయమని వారు విమర్శించారు. భారత వృత్తి నిపుణులతో పాటు ఇతర దేశాలకు చెందిన డాక్టర్లు, ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఉపాధ్యాయులు లాంటి వలసదారులు కూడా బుధవారం జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. యూకే ప్రభుత్వ వీసా విధానాలను కోర్టులో సవాలుచేయడానికి 25 వేల పౌండ్లను సేకరించారు.
యూకే హోం శాఖ అవలంబిస్తున్న విధానాల వల్ల తాము చాలా నష్టపోతున్నామని వృత్తినిపుణులు, వలసదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి వీలు కల్పించే ‘ఇన్‌డెఫినిట్ లీవ్ టు రిమేన్’(ఐఎల్‌ఆర్) దరఖాస్తులను హోం శాఖ తిరస్కరించడం లేదా వాయిదా వేయడానికి వ్యతిరేకంగానే తాజా ఆందోళన చేపట్టారు. నేరస్తులు, పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చట్టంలోని నిబంధనల ఆధారంగా తమ దరఖాస్తులను నిలిపివేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment