సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీలంక కూడా చేరింది.
శ్రీలంక ప్రభుత్వం 2024 అక్టోబర్ 1 నుంచి ఇండియా, యూకే, అమెరికా వంటి 35 దేశాల పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. అంటే ఈ దేశ పౌరులు శ్రీలంకకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని శ్రీలంక టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు.
భారతదేశం, యుకె, చైనా, యుఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, దక్షిణ కొరియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్ దేశాల ప్రజలు వీసాతో పనిలేకుండానే శ్రీలంకను సందర్శించవచ్చు.
శ్రీలంక ప్రభుత్వం వీసా రహిత సందర్శన అవకాశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అందిస్తుంది. దీనికి శ్రీలంక క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగానే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment