కఠిన నిబంధనలతో వీసాల నిరాకరణ
గతంలో వీసా దరఖాస్తుల్లో 99 శాతానికి అనుమతి
తాజాగా 94–95 శాతానికి పడిపోయిన వైనం
5–6 శాతం తిరస్కరణ
సాక్షి, అమరావతి: ప్రముఖ పర్యాటక నగరమైన దుబాయ్‌లో విహరించాలనుకునే భారతీయులకు ఎదురుదెబ్బ తగులుతోంది. హాలీడే ట్రిప్పులు, కుటుంబ సభ్యులతో వెకేషన్ కోసం దుబాయ్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిరాశే మిగులుతోంది. ఒకప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే దుబాయ్ వీసా మంజూరయ్యేది.
కానీ, ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన దుబాయ్ ఇర్ముగ్రేషన్ నిబంధనలు భారతీయ పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని వారాలుగా వీసాల తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు వీసా దరఖాస్తుల్లో 99 శాతం ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు 94–95 శాతానికి పడిపోయింది.
ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణ..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కఠిన పర్యాటక వీసా నిబంధనలను అమలు చేస్తోంది. దుబాయ్‌లో పర్యటించాలనుకునేవారు తమ వీసా దరఖాస్తుతో పాటు ఏ హోటల్‌లో బస చేస్తారో.. ఆ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్, విమాన రిటర్న్ టికెట్లను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హోటల్‌లో కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలనుకుంటే.. సంబంధిత నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు తప్పనిసరి చేసింది. ఈ పత్రాలన్నీ ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది. అలాగే అదనంగా దుబాయ్‌లో ఉండటానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. హోటల్‌లో బస చేయాలనుకుంటే కనీస బ్యాలెన్స్ రూ.50 వేలు చూపిస్తూ చివరి మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, పాన్‌కార్డును సమర్పించాలి.
వీటిలో ఏది లేకున్నా వీసా మంజూరుకు అవరోధం ఏర్పడినట్టే. తాజాగా ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉన్నా.. వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ట్రావెల్ ఏజెన్సీలు వాపోతున్నాయి.
ఆర్థి కంగానూ నష్టమే..
వీసా దరఖాస్తుల తిరస్కరణ పర్యాటకులపై తీవ్ర ఆర్థి క భారాన్ని మోపుతోంది. వీసా దరఖాస్తు రుసుమును కోల్పోవడంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న విమాన, హోటల్ టికెట్ల కోసం చెల్లించిన డబ్బును కూడా నష్టపోతున్నారు. అలాగే ఒక కుటుంబ సభ్యుడి వీసా తిరస్కరణకు గురైతే.. కుటుంబంలోని మిగిలిన సభ్యులు కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోంది.
సెలవులు సీజన్ రాబోతుండటంతో పాటు డిసెంబర్, జనవరిలో దుబాయ్‌లో షాపింగ్ ఫెస్ట్ జరగబోతున్న సమయంలో పెద్ద ఎత్తున వీసాలు తిరస్కరణకు గురవుతుండటం భారతీయ పర్యాటకులతో పాటు ట్రావెల్ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. వారి సంఖ్యను కాస్త తగ్గించేందుకే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment