NHS
-
బహ్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగొస్తున్న వలస కార్మికులు
సాక్షి, అమరావతి: బహ్రెయిన్‌లో ఎన్హెచ్ఎస్ సంస్థలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటి వరకు 33 మందిని బహ్రెయిన్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు భోజనం, వసతి, స్వస్థలాలకు రవాణా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కార్మికులను వెనక్కి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎన్హెచ్ఎస్ సంస్థ దాష్టీకాలు భరించలేక ఇబ్బందులు పడుతూ అక్కడ ఇరుక్కుపోయిన కార్మికుల విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లగానే.. ఆయన తక్షణం స్పందించినట్టు తెలిపారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెప్టెంబర్ 13న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ తక్షణం స్పందించడంతో కార్మికులను స్వదేశానికి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. -
క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
లండన్: కేన్సర్ అంటే అందరికీ భయం కలిగించే వ్యాధితో పాటు అత్యధిక ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరికి వెన్నులోంచి భయం పుట్టుకొస్తుంది. కానీ బ్రిటన్‌కి చెందిన నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్(ఎన్హెచ్ఎస్) నిర్వహించిన పరిశోధనల్లో సామాన్యుడు సైతం వైద్యం చేయించుకోగలిగే రీతిలో సరికొత్త చికిత్స విధానాన్ని తీసుకు వచ్చింది. ఎన్హెచ్ఎస్ ప్రపంచంలోనే 'గ్యాలరీ రక్త పరీక్షకు" సంబంధించిన అతి పెద్ద పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలు ఎంతగా విజయవంతమయ్యాయి అంటే క్యాన్సర్ లక్షణాలు కనిపించేక మునుపే 50 రకాల క్యాన్సర్లను గుర్తించగలదు. దీంతో భారత్‌తో సహా అన్ని దేశాలు కేన్సర్ గుర్తింపు, చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఎన్హెచ్ఎస్ తెలిపింది. (చదవండి: పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఇక అంతే !: రాజస్తాన్) లక్షణాలు కనిపించక మునుపే..... ఈ సందర్భంగా ఎన్హెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా ప్రిట్ చార్డ్ మాట్టాడుతు...."ఇది అత్యంత త్వరితగతిన గర్తించే సరళమైన రక్త పరీక్ష . ఈ ప్రయోగం కేన్సర్ చికిత్సా విధానంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. అలాగే కేన్సర్ లక్షణాలు కనిపించక మునుపే గుర్తించడం వల్ల వైదులు రోగులకు మెరుగైన వైద్యం అందించగలరు. దీంతో కేన్సర్ బాధితుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది." అని అన్నారు. ఈ క్రమంలో యూకే కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ మమతరావు మాట్లాడుతూ...."ప్రపంచ దేశాలన్నింటికీ ఈ పరిశోధనలు ఎంతగానో ఉపకరిస్తాయి . కేన్సర్ లక్షణాల కనపడవ ముందే గుర్తిచడం అంటేనే తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఆ వ్యాధి నుండి బయటపడగలం" అని అన్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ 2018లో ప్రపంచ వ్యాప్తంగా సూమారుగా 17 మిలియన్ల మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నారని, దాదాపు 9 మిలియన్ల మంది చనిపోయినట్లు తెలిపింది. 2025 కల్లా అందరికీ అందుబాటులో..... భారత్‌లోని నేషనల్ కేన్సర్ రిజిస్టర్ ప్రోగ్రాం ప్రతి 68 మంది పురుషులలో ఒకరు ఊపితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి 29 మంది మహిళలలో ఒకరు బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో భారత వైద్యురాలు డాక్టర్ ప్రీత అరవింద్ మాట్లాడుతూ... "ఈ ప్రయోగాలు ఎంతో ప్రాధాన్యత గలిగినవి. కొన్ని రకాల కేన్సర్లని గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయడం సాధ్యం కాదు. ఈ సరికొత్త చికిత్స విధానం ఆ సమస్యను పరిష్కరించింది" అని అన్నారు. అయితే ఈ చికిత్స విధానాన్ని 2023 కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నహలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎన్హెచ్ఎస్ 2025 కల్లా దాదాపు ఒక మిలియన్ల మంది ప్రజలకు ఈ చికిత్స విధానం అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. 2026 కల్లా ఈ చికిత్స విధానం అన్ని దేశల ప్రజలకు అందే అవకాశం ఉంటుందని యూకే వైద్యురాలు డాక్టర్ మమతరావు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై) -
సలామ్ డాక్టర్
వెనుకబడిన ప్రాంతాలు లండన్‌లో కూడా ఉంటాయి. తూర్పు లండన్‌లోని న్యూహామ్ అలాంటి ఒక ప్రాంతం. అక్కడి ఎన్.హెచ్.ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) శాఖ హాస్పిటల్లో పని చేసే డాక్టర్ ఫర్జానా హుసేన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం బ్రిటన్‌లోని మూలమూలలా ఆమె నిలువెత్తు హోర్డింగ్‌లు ప్రదర్శితం కావడమే. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ బంగ్లాదేశి అక్కడే 1995లో మెడిసిన్ పూర్తి చేసి జనరల్ ప్రాక్టీషనర్‌గా పని చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన గత నాలుగు నెలలుగా తన క్లినిక్‌లో అలుపు లేకుండా పని చేస్తోంది. ఎన్.హెచ్.ఎస్ తన 72వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తన బ్రాంచ్ హాస్పిటల్స్‌లో కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లను గౌరవించదలచుకుంది. మొత్తం 12 మంది డాక్టర్లను ఎంపిక చేసి వారికి కృతజ్ఞతలు చెప్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. ఆ 12 మందిలో డాక్టర్ ఫర్జానా కూడా ఒకరుగా నిలిచి ప్రశంసలు పొందుతోంది. ‘నేను మెడిసిన్ చేస్తుండగా మా అమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను కాలేజ్ నుంచి 250 మైళ్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉన్నాను. కాని మా అమ్మ– ‘వెళ్లు... చదువుకో... నువ్వు డాక్టర్ అయ్యి నలుగురికీ సాయం చెయ్యి’ అని చెప్పింది. ఆ తర్వాత ఐదు రోజులకు ఆమె చనిపోయింది. నా దగ్గరకు ఏ పేషెంట్ వచ్చినా వారు ఎవరికో ఒకరికి కుటుంబ సభ్యులు అయి ఉంటారని, వారి ప్రాణాలు ముఖ్యమని భావిస్తాను. వారికి శ్రద్ధగా వైద్యం చేస్తాను’ అని చెప్పిందామె. ‘నేను ఏ వసతులు లేని ప్రాంతంలో పని చేస్తున్నాను. పిల్లలకు టీకాలు వేయడం కూడా ఇక్కడ పెద్ద విషయం. కాని ప్రజలు నన్ను ఇష్టపడతారు. ఇరువురం కలిసి జబ్బులపై పోరాటం చేస్తున్నాం’ అంటుందామె. గృహిణిగా ఇల్లు, పిల్లలను చూసుకుంటూనే ఆమె తన విధులను నాగా లేకుండా నిర్వర్తిస్తోంది. లండన్ కూడలిలో ఏర్పాటైన తన భారీ హోర్డింగ్ ముందు ఫర్జానా నిలబడి చూసుకునే ఫోటో చాలామందికి నచ్చింది. మంచి పనులు చేసే వారికి గుర్తింపు వచ్చే తీరుతుందని ఈ ఉదంతం తెలియచేస్తోంది. -
బ్రిటన్ ‘వీసా’ సరళతరం!
లండన్: బ్రెగ్జిట్ తర్వాత తీవ్రమైన మానవవనరుల కొరతతో సతమతమవుతున్న బ్రిటన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలుచేస్తున్న వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో సవరణలను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు మరింతమంది విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల భారత్‌కు చెందిన ఐటీ నిపుణులకు గణనీయమైన లబ్ధి కలగనుంది. ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాల్సిందిగా స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే నర్సులకు ఇస్తున్న టైర్–2 వీసాల గరిష్ట పరిమితిని బ్రిటన్ ఇంతకుముందు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
కఠిన వీసా నిబంధనలు వద్దు
లండన్: కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ ‘స్క్రాప్ ద క్యాప్’పేరిట జరుగుతున్న ప్రచారానికి బ్రిటన్‌లోని ప్రముఖ భారతీయ వైద్యుల సంఘం (బాపియో) మద్దతు పలికింది. బ్రిటన్ జాతీయ వైద్య సేవా విభాగం (ఎన్హెచ్ఎస్) వైద్యుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన భారతీయ వైద్యులను తీసుకుని రావడానికి కఠినమైన వీసా నిబంధనలు అడ్డువస్తున్నాయని బాపియో పేర్కొంది. ‘స్క్రాప్ ద క్యాప్’ ప్రచారం ప్రారంభమైన కొద్ది రోజులకే ఎన్హెచ్ఎస్లో పనిచేయడానికి విదేశీ వైద్యులపై విధించిన కఠిన వీసా నిబంధనలు రద్దు చేయాలంటూ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఆన్లైన్ పిటిషన్‌ను యూకే పార్లమెంట్ వెబ్సైట్లో పెట్టింది. ఈ నేపథ్యంలో బాపియో అధ్యక్షుడు రమేశ్ మెహతా మాట్లాడుతూ.. ‘ఈ ప్రచారానికి మేం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాం. ఈ వీసా వ్యవస్థ వైద్య సేవల అవసరాలను తీర్చేదిగా ఉండాలి’అని అభిప్రాయ పడ్డారు. టైర్–2 వీసా కేటగిరీ కింద యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెలుపల నుంచి ఏడాదికి 20,700 మంది నిపుణులను బ్రిటన్ కంపెనీల్లోకి తీసుకోవడానికి అనుమతి ఉంది. కిందటేడాది డిసెంబర్ వరకు గత ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే పరిమితికి మించి నిపుణులను తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు బ్రిటన్ హోం కార్యాలయం సుమారు 1,500 మంది డాక్టర్ల వీసా దరఖాస్తులను తిరస్కరించింది. ‘ఇక్కడ పదివేల మంది వైద్యులు అవసరం. ఈ మేరకు సరిపడే భారతీయ వైద్యుల జాబితా మా వద్ద ఉంది. నిబంధనలు అందుకు అంగీకరించడం లేదు. భారత్‌కు సైతం వైద్య నిపుణుల అవసరం ఉంది కాబట్టి మేధోవలసను మేం ప్రోత్సహించట్లేదు. వారికి ఇక్కడ శిక్షణ ఇచ్చి తిరిగి భారత్ పంపాలని అనుకుంటున్నాం’ అని మెహతా అన్నారు. -
యూకేకు అందని 'భారత' వైద్యం
లండన్: యూకే ఆసుపత్రుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, వైద్య సహాయకుల ఖాళీలను భారతీయులతో నింపాలని అక్కడి సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్)లో ఖాళీలపై కామెరాన్ సర్కారు పైవిధంగా ఆలోచించింది. అయితే.. యూకే వీసా విధానం, అక్కడి వైద్య నియమాలు ఇబ్బందికరంగా ఉండటంతో భారతీయులు ఆసక్తి కనబరచటం లేదు. -
చూయింగ్ గమ్ నమిలితే రూ. 80 కోట్లు ఆదా
చూయింగ్ గమ్ నమలడం ముఖానికి మంచి వ్యాయామమని, అది ముఖ ఆకృతిని అందంగా తీర్చిదిద్దుతుందని వ్యాయామ నిపుణులు చెబుతుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆరోగ్యం కోసం వెచ్చించే సొమ్ము బోలెడు ఆదా అవుతోందట. యూకేలోని ప్లిమౌత్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్‌కు ఏటా దాదాపు రూ. 80 కోట్లు (82 లక్షల పౌండ్లు) ఆదా అవుతుందని తేలింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రతివారం 10 లక్షల మంది ఎన్హెచ్ఎస్ ద్వారా దంత సంబంధిత సేవలు పొందుతున్నారు. తద్వారా ఎన్హెచ్ఎస్పై ఏటా దాదాపు రూ. 33,634 కోట్ల భారం పడుతోంది. దంత సంబంధిత సమస్యల కారణంగా 12 ఏళ్ల లోపు పిల్లల్లో 35 శాతం మంది హాయిగా నవ్వలేకపోతున్నారని ఓ అధ్యయనంలో గుర్తించారు. దీనికి సరైన పరిష్కారం చూయింగ్ గమ్ నమలడమేనని వారు పేర్కొంటున్నారు. ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత చక్కెర రహిత చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటిలో ఉమ్ము ఉత్పత్తి అవుతుందని, అది పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించడంలో సహకరించడమే కాకుండా.. పళ్లను బలహీనపరిచే ప్లేక్ యాసిడ్స్‌ను క్రమబద్ధీకరిస్తుందని చెప్పారు. అందువల్ల పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చూయింగ్ గమ్ నమలడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ లిజ్ కే స్పష్టం చేశారు. అధ్యయనం ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ప్రజలు తమ నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ విధానం ఎంతగానో సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు ఒక సుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమిలితే ఎన్హెచ్ఎస్ కు ఏడాదికి దాదాపు రూ. 27 కోట్లు ఆదా అవుతుందని వివరించారు. అదే రోజుకు రెండు చూయింగ్ గమ్స్ తీసుకోవడం వల్ల దాదాపు రూ.32 కోట్లు, మూడు చూయింగ్ గమ్స్ వల్ల దాదాపు రూ.80 కోట్లు ఆదా చేయొచ్చని తెలిపారు. ఈ విధానాన్ని కేవలం 12 ఏళ్ల లోపు పిల్లలకే కాకుండా మిగతావారికి వర్తింపజేస్తే మరింతగా సొమ్ము ఆదా అవుతుందని పేర్కొన్నారు. -
2017 నాటికి కృత్రిమ రక్తం
లండన్: మూలకణాలతో ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన కృత్రిమ రక్తాన్ని మరో రెండేళ్లలో మనుషులకు ఎక్కించి పరీక్షించనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ‘ఎన్హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్’ వెల్లడించింది. మూలకణాలతో కృత్రిమరక్తం ఉత్పత్తికి గాను యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు.. పెద్దల నుంచి, బొడ్డు తాడు నుంచి సేకరించిన మూలకణాలతో ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేశారు. తొలిదశలో ఈ రక్తాన్ని 20 మంది వలంటీర్లకు ఐదు నుంచి పది మిల్లీలీటర్ల చొప్పున ఎక్కించి పరీక్షించనున్నట్లు ఎన్హెచ్ఎస్ తెలిపింది. కాగా, మూలకణాలతో ప్రయోగశాలలో తయారు చేసిన రక్తాన్ని మనుషులకు వీరు మార్పిడి చేస్తే ఇలాంటి రక్త మార్పిడి ప్రపంచంలో ఇదే తొలిసారి కానుంది. ఈ పద్ధతిలో కృత్రిమ రక్తాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలిగితే గనక.. రక్తదానాలకు ఇక సరైన దాతల కోసం వేచిచూడాల్సిన అవసరం ఉండదు. తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే కొడవలి కణ రక్తహీనత, థలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకూ ఈ పద్ధతి చాలా ప్రయోజనకరం కానుంది.