పోకెమాన్ ఆడుతుంటే కాల్చిచంపారు!
గ్వాటెమాల సిటీ: ప్రపంచవ్యాప్తంగా పిచ్చి పిచ్చిగా ఆడుతున్న ‘పోకెమాన్ గో’ వర్చువల్ రియాలిటీ మొబైల్ గేమ్ ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారణమైంది. చికిములా సిటీలో జెర్సన్ లోపెజ్ డీ లియాన్ అనే 18 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల అతడి కజిన్ బుధవారం పోకెమాన్ గేమ్ ఆడుతూ ఇంటి నుంచి రోడ్డెక్కారు. ఓ రైలు పట్టాల పక్క నుంచి వారు ఈ గేమ్ ఆడుతూ ముందుకు నడచివెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపైన కాల్పులు జరిపారు. కాల్పుల్లో డీ లియాన్ అక్కడికక్కడే మరణించగా, ఆయన కజిన్ పిసెన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సంఘటనా స్థలంలో 20 ఖాళీ బుల్లెట్ల క్యాస్టింగ్స్ దొరికాయి. కాల్పుల సమయంలో అటుగుండా ఓ వ్యాన్ దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండడంతో అందులోని వ్యక్తులే కాల్పులు జరిపి ఉండవచ్చని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పోకెమాన్ గో గేమ్ కారణంగా జరిగిన మొదటి క్రైమ్ ప్రపంచంలో ఇదేనని పోలీసులు వెల్లడించారు. గేమ్‌కు, వ్యక్తుల హత్యకు ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉందా? అన్న అంశంపైనా కూడా దర్యాప్తు అధికారులు దృష్టిని సారించారు.