తలలుపట్టుకున్న మలేషియా అధికారులు!
కౌలాలంపూర్: మొబైల్ గేమ్ 'పోకిమన్ గో' ఫివర్తో ఇప్పుడు మలేషియా ఊగిపోతోంది. అక్కడ రెండు రోజుల క్రితమే ఈ గేమ్ను లాంచ్ చేశారు. అయితే.. అప్పటికే ఆశగా ఎదురుచూస్తున్న మలేషియా వాసులు పెద్ద సంఖ్యలో తమ ఫోన్లలో ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకొని రోడ్లమీద పడ్డారు. దీంతో.. పలు దేశాలు ఇప్పటికే ఈ గేమ్ విషయంలో ఆందోళన చెందుతుండగా.. ఇప్పుడు మలేషియా అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. ఫోన్లలో తలదూర్చి రోడ్లమీద ఈ గేమ్ ఆడుతూ..ప్రజలు కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు కూడా ఈ గేమ్ ఆడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. పోకిమన్ గో ఆడుతూ కారు నడుపుతున్న ఓ వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేయొద్దంటూ సోమవారం స్వయంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తియోంగ్ లై ప్రజలను కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మతపెద్దలు సైతం ఈ గేమ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.