మలేషియాలో జిల్లాకు చెందిన నిరుద్యోగులు , పోలీసు స్టేషన్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు
మందస: ఉద్యోగాల పేరిట మోసాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులను లక్ష్యం చేసుకుని, దళారులు రూ. కోట్లలో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం యువతకు విదేశీ, స్వదేశీ ఉద్యోగాల పేరిట గాలం వేస్తున్నారు. ఈ వలలో వందలాది మంది నిరుద్యోగులు చిక్కుంటున్నారు. ఆదాయం మాత్రం ఎలా ఉన్నా.. పీకల్లోతు అప్పులు పాలవుతున్నారు. కుటుంబాలకు, కుటుంబాలే నాశనమవుతున్నాయి. ఇటీవల వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, నందిగాం, కంచిలి, కవిటి తదితర మండలాల్లోని ఉద్దానం ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను, యువకులను విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బ్రోకర్లు నిలువునా ముంచేశారు. ప్రస్తుతం బాధితులు మలేషియాలో ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సింగపూర్, మలేషియాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ సంస్థ ప్రచారం చేసింది. పలాస మండలంలో ఓ సబ్ బ్రోకర్‌తో మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 60 వేలు నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
సుమారు 30 నుంచి 50 మంది వరకు ఉద్దానానికి చెందిన యువకులు ఈ వలలో చిక్కుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మందస మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగాల బ్రోకర్ ఈ ప్రాంతంలోని సుమారు 25 నుంచి 30 మందికి ఉద్యోగాల వల వేశాడు. విశాఖలోని ఉద్యోగాల సంస్థ, పలాస, మందస మండలాల్లోని బ్రోకర్లు అతి తెలివిగా, చక్కగా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న యువకులు మలేషియాకు చేరుకున్నారు. వీరిలో డి.ఖగేశ్వరరావు, ఎన్.పాపారావు, టి.గణేశ్, నర్తు దానయ్య, కె.మోహనరావు, పి.బాలరాజు, జుత్తు చిరంజీవి, ఎన్.సోమేశ్వరరావు, బి.కృష్ణారావుతో పాటు 25 మంది ఉన్నారు. వీరంతా వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లోని కిడిసింగి, కాశీబుగ్గు, పలాస, నారాయణపురం, మొగిలిపాడు, కేసుపురం, చిన్నకేసుపురం తదితర ప్రాంతాలకు చెందినవారిగా తెలిసింది. ఉద్యోగాల బ్రోకర్లు వీరికి టూరిజం వీసా అందజేసి, ఉద్యోగాలకు మలేషియా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బాధితులు గమనించలేదు. రెండు, మూడు నెలల పాటు చిన్న, చిన్న కంపెనీల్లో చిరు ఉద్యోగాలు చేసిన వీరి వీసా గడువు ముగిసిపోయింది. వాస్తవానికి మలేషియా టూరిజం వీసా మూడు నెలలు ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగానికి వెళ్లిన వీరంతా వీసా గడువు పూర్తి కావడంతో ఉద్యోగాలు పోయాయి. చేతిలో డబ్బులు కూడా చెల్లిపోయాయి. దీంతో మలేషియాలో బాధలు అనుభవిస్తున్న వారంతా కుటుంబసభ్యులకు తెలిపారు. ఉద్యోగానికి వెళ్లి, పైసా ఆదాయం లేకపోగా, తమ పిల్లలు నానా కష్టాలు పడుతున్నారని తెలియడంతో వారి కుటుంబాలు మందస పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.
మలేషియా నుంచి తీసుకురావడానికి డబ్బు డిమాండ్
ఉద్యోగం పేరిట మలేషియా వెళ్లిన నిరుద్యోగులు తాము పడుతున్న కష్టాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. బ్రోకర్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, వారు దొరకడంలేదు. దొరికినా, మలేషియా నుంచి తిరిగి తీసుకురావడానికి రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు వరకు మళ్లీ డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేకుండా తమ పిల్లలు పడుతున్న కష్టాలు విని కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
అయోమయంలో బాధితులు
ఓ బ్రోకరిది పలాస మండలం. మరో బ్రోకరిది మందస మండలం. వీరి ప్రధాన కార్యాలయం విశాఖపట్నం. బాధితులు సుమారు ఐదు మండలాలకు చెందిన వారు. దీంతో ఎవరిపై.. ఎలా.. ఏ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలో తెలియక బాధిత కుటుంబాలు మందస పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. పలాస పోలీసుల పరిధిలోకి కేసు వస్తుందని.. మందస మండలం పరిధిలోకి వస్తుందని చెబుతుండడంతో వాళ్లు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి, తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment