నొయిడా : కొన్నాళ్ల క్రితం బ్లూవేల్ గేమ్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ డేంజరస్ డెత్ గేమ్‌ను అదుపు చేయటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలే తీసుకున్నాయి. ఇంతలో మరో గేమ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైస్కూల్ గ్యాంగ్ స్టర్ ఎస్కేప్ అనే ఆట మూలంగా ఢిల్లీలో జంట హత్యలు చోటుచేసుకోవటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆటకు బానిసైన ఓ బాలుడు తల్లి, సోదరిలనే పొట్టనబెట్టుకున్నాడు.
ఏం జరిగింది...
మంగళవారం ఈ ఘటన చోటు చేసుకోగా... ఇంటి నుంచి పరారైన ఆ బాలుడు చివరకు పట్టుబడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నొయిడాలోని గౌర్ ప్రాంతంలో వ్యాపారవేత్త సౌమ్య అగర్వాల్ కుటుంబం నివసిస్తోంది. ఆయన భార్య అంజలి(42), కూతురు మణికర్ణిక(11) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో కంగారు పడిన ఆయన బంధువులకు పురమాయించి ఇంటికి పంపించగా.. వారు రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా వారి తనయుడి(16 ఏళ్లు) పై అనుమానపడ్డారు.
వారి మృత దేహాలను, పక్కనే క్రికెట్ బ్యాట్-కత్తెర పడి ఉండటం, బాత్ రూంలో రక్తపు మరకలు ఉన్న బాలుడి దుస్తులు లభ్యం కావటం, బాలుడు పరారీలో ఉండటంతో ఆ అనుమానాన్ని మరింత బలపరిచాయి. సీసీ పుటేజీలో బాలుడు రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లటం.. 11 గంటలకు బయటకు రావటం కనిపించింది. అందులో అతను మొబైల్ ఫోన్‌లోనే నిశీతంగా చూస్తూ వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గమనించారు. చివరకు రైలు మార్గం ద్వారా వారణాసి చేరుకున్న బాలుడు శుక్రవారం ఓ వ్యక్తి ఫోన్ నుంచి తండ్రికి కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. ఆ నంబర్ ఆధారంగా వెంటనే వారణాసికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నిజం ఒప్పుకున్నట్లు నొయిడా ఎస్‌ఎస్‌పీ లవ్ కుమార్ తెలిపారు.
హైస్కూల్ గ్యాంగ్ స్టర్ ఎస్కేప్ గేమ్‌కు బానిసైన బాలుడు.. తల్లి ఫోన్‌ను లాక్కుని అడ్డుకోవటంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఆయన తెలిపారు. శనివారం అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలాంటి డేంజరస్ గేమ్‌లు వైరల్ అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
ఆట నేపథ్యం ఏంటి?
హైస్కూల్ గ్యాంగ్ స్టర్ ఎస్కేప్.. ఇందులో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆటగాడు అడ్డువచ్చే పోలీసులను చంపుతూ పోతుండాలి. ఇందుకోసం బేస్ బాస్ లాంటి ఓ బ్యాట్ సహకారం తీసుకొవచ్చు. లెవల్స్ పెరిగే కొద్దీ తోటి విద్యార్థులతోసహా అడ్డువచ్చే ప్రతీ ఒక్కరినీ చంపుకుంటూ పోవాలి. నేర ప్రవృత్తిని పెంచే ఈ ఆట ఇప్పుడు యువతలో విపరీతమైన మోజును పెంచుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment