వాషింఘ్టన్: అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో వారం క్రితమే విడుదలైన ‘పోక్‌మన్ గో’ మొబైల్ యాప్ వీడియో గేమ్ దుమ్మురేపుతోంది. ప్రజలంతా పిచ్చి పిచ్చిగా ఈ గేమ్ వెంట పరుగులు తీస్తున్నారు. చర్చిలు, శ్మశానాలు, వార్ మెమోరియల్స్, మ్యూజియంలు ఏ స్థలాన్ని వదులకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ మొబైల్ స్మార్ట్ ఫోన్లలో వేలం వెర్రిగా ఈ ఆట ఆడుతున్నారు.
‘దయచేసి ఇక్కడ పోక్‌మన్ ఆడవద్దు. ఈ స్థలానికున్న పవిత్రతను కాపాడండి’ అంటూ న్యూయార్క్‌లోని సెప్టెంబర్ 11 దాడుల స్మారక కేంద్రం వద్ద, కొన్ని శ్మశానాల వద్ద హెచ్చరిక బోర్డులు వెలిసాయంటే ఈ గేమ్ పట్ల అమెరికాలో ఎంత పిచ్చి పెరిగిందో తెలుసుకోవచ్చు. వాషింఘ్టన్ డీసీలోని హోలోకాస్ట్ మ్యూజియం అధికారులు కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. ఇక సిడ్నీలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. సిడ్నీలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద దాదాపు 300 మంది మొబైల్ గేమ్ ప్లేయర్లు రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఈ గేమ్ ఆడుతూనే ఉన్నారు. చివరకు అపార్టుమెంట్ వాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి వారందరిని బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. అరుపులు, కేకలు, గొంతు చించుకొని మాట్లాడుతుండడం వల్ల రాత్రంతా తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని అపార్ట్‌మెంట్ వాసులు మీడియాతో వాపోయారు.
అమెరికాలోనైతే ఈ పిచ్చి పెళ్ళిళ్లకు దారితీసిందట. ‘పోక్‌మన్ గో’ ఆట ద్వారా తాము వీధులవెంట తిరగడం వల్ల అపరిచితులు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రణయానికి దారితీసి పెళ్లిళ్లు చేసుకున్నామని ఓ రెండు జంటలు చెబుతుండగా, ఈ వీడియో గేమ్ ద్వారానే పరిచయమై ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నామని ఎన్నో జంటలు చెబుతున్నాయి. ‘అరే! మీరు కూడా పోక్‌మన్ గో ఆడుతున్నారా?, నేను కూడా అదే ఆట ఆడుతున్నాను. ఇప్పటి వరకు ఎన్ని క్రియేచర్లను క్యాచ్ చేశారు? రేర్ పోక్‌మన్‌లు ఎక్కడ దొరికాయి? బై ది బై నా పేరు .....మరి, మీ పేరు...’ ఇలా పోక్‌మన్ గో ప్లేయర్ల మధ్య కొత్త పరిచయాలు పెనవేసుకుంటున్నాయట. ‘టిండర్’ లాంటి డేటింగ్ సైట్లు అవసరం ఇక లేదని, పోక్‌మన్ గో అడితే సరిపోతుందని ప్లేయర్లు అంటున్నారు. డేటింగ్ స్పాట్‌గా పేరుపడ్డ ప్రాంతాలను ‘పోక్‌స్పాట్, పోక్‌స్టాప్’గా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా తమ చిరునామా చెప్పాల్సి వస్తే పలానా పోక్‌మన్ షాప్ పక్కన సందులో అని చెబుతున్నార ంటే పిచ్చి ఈ స్థాయికి చేరిందో తెలిసిపోతోంది.
భారత్‌లో ఈ గేమ్ యాప్‌ను ఇప్పటి వరకు విడుదల చేయకపోయినప్పటికీ గేమ్ పట్ల క్రేజీ మాత్రం ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొన్న నాలుగు దేశాల పర్యటనకు వెళ్లిరాగా, పోక్‌మన్ క్యాచ్ చేయడానికే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారంటూ ట్వీట్లు వెల్లువెత్తాయంటే క్రేజీని అర్థం చేసుకోవచ్చు.
పోక్‌మన్ గో గేమ్‌ను ఎలా ఆడతారంటే.....
వీడియో గేమ్ విక్రేతల్లో ప్రసిద్ధి చెందిన ‘నింటెండో’ అనే జపాన్ కంపెనీ ఈ గేమ్ యాప్‌ను రూపొందించి మార్కెటింగ్ చేస్తోంది. జీఎపీఎస్ వ్యవస్థ ద్వారా ఈ గేమ్‌ను ఆడతారు. అందుకోసం ఈ కంపెనీ గూగుల్ మ్యాప్‌ను వాడుకునేందుకు ఫ్రాంచైజ్ తీసుకుంది. మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొబైల్ స్క్రీన్ గుండా కనిపించే పోక్‌మన్ క్రియేచర్లను క్యాచ్ చేయడమే ఈ ఆట లక్ష్యం. ఎవరైనా ఈ గేమ్ ఆడుతూ రోడ్డుమీద వెళుతున్నా, ఆ రోడ్డుపైన, మరెక్కడికెళితే అక్కడ పోక్‌మన్ ఫిక్షనల్ క్రియేచర్లు కనిపిస్తాయి. వాటిని క్యాచ్ చేస్తూ వెళ్లడమే. ఈ గేమ్ ఆడేవాళ్లు కనీసం సరాసరి రెండు కిలీమీటర్లు నడుస్తార న్నది ఏ లెక్క. అందుకనే దీన్ని వర్చువల్ రియాలిటీ గేమ్ అని కూడా పిలుస్తున్నారు.
ఈ గేమ్‌లో 150 రకాల పోక్‌మన్ క్రియేచర్లు ఉన్నాయి. వాటిలో పికాచు, జాప్‌డోస్, చారిజార్డ్, న్యూటూ అనేవి అరుదైన్ పోక్‌మన్‌లు. వీటిని క్యాచ్ చేయడం కోసం కొంత మంది ప్లేయర్లు రోడ్ల వెంట, పార్కల వెంట పరుగులు తీస్తున్నారు. పరిసరాలను మరచిపోయి గేమ్‌లో లీనమవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.