అక్కడ.. పోకెమాన్ గేమ్ బ్యాన్!
పోకేమాన్ గో ప్లేయర్స్ కు వడోదరా మ్యూజియం తలుపులు మూసేసింది. మ్యూజియం ప్రాంగణంలో పోకేమాన్ గేమ్ ఆడకూడదన్న నిబంధన విధించింది. సెక్యూరిటీ కారణాల నేపథ్యంలోనూ, సందర్శకుల ఫిర్యాదుల మేరకు మ్యూజియం లోపల పోకేమాన్ ఆటను ను బ్యాన్ చేసినట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు.
ప్రపంచాన్ని మత్తులో దింపేసిన పోకేమాన్ గో గేమ్ ను ఇప్పుడు వడోదరా మ్యూజియం బ్యాన్ చేసింది. మ్యూజియం ప్రాంగణంలో పోకేమాన్ ఆడకూడదన్న నిబంధనను విధించినట్లు అధికారులు తెలిపారు. అనేక భద్రతా కారణాలకు తోడు, సందర్శకుల ఫిర్యాదుల మేరకు పోకేమాన్ ను మ్యూజియంలో ఆడేందుకు నిరాకరించినట్లు తెలిపారు. ఈ నేథ్యంలో మ్యూజియం ప్రధాన ద్వారం వద్ద పోకేమాన్ ప్లేయర్స్ కు లోపలికి అనుమతి లేదంటూ ఓ నోటీసును కూడా అంటించారు. మ్యూజియం భద్రతను పెంచడంతోపాటు, సందర్శకుల రక్షణలో భాగంగా మ్యూజియం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. వందేళ్ళనాటి మ్యూజియం, పిక్చర్ గ్యాలరీ సందర్శించేందుకు వచ్చిన వారికి సింహద్వారం వద్ద కనిపించేట్లుగా అధికారులు నోటీసులు అంటించారు.
మ్యూజియంలో నడిచే సమయంలోనూ, అలాగే ప్రాంగణంలోని గడ్డిపై నడుస్తూ కూడా సందర్శకులు పోకేమాన్ ఆడటం న్యూసెన్స్ ను క్రియేట్ చేస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ పోకేమాన్ గో గేమ్ ఆటగాళ్ళ దృష్టిని దెబ్బతీస్తోందని, ఓ ఇన్ఫెక్షన్ లా మారిపోయిందని మ్యూజియం క్యూరేటర్ విజయ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంగణంలోని గడ్డిలో అనేక విష సర్పాలు, కీటకాలు ఉంటాయని, అక్కడ ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆటగాళ్ళు పట్టించుకోవడం లేదని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాక మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకులకు కూడా పోకేమాన్ ఆడేవారు పెద్ద సమస్యగా మారుతున్నారని, అందుకే మ్యూజియంలో పోకేమాన్ గో గేమ్ బ్యాన్ చేసినట్లు వివరించారు.