
పోకిమాన్ గేమ్ తో నింటెండో షేర్లు రికార్డు
వీడియో గేమ్ దిగ్గజం నింటెండో మార్కెట్ విలువలో దూసుకెళ్తూ మరో దిగ్గజ కంపెనీ సోనీని వెనక్కు నెట్టేసింది. పోకీమాన్ గో గేమ్ విడుదలతో, మార్కెట్లో ఈ గేమింగ్ దిగ్గజం దూసుకుపోతోంది. పోకిమాన్ గో గేమ్ రిలీజ్ అనంతరం నింటెండో తన స్టాక్ ను రెండింతలు పెంచుకుంది. నింటెండో కంపెనీ షేర్లు మంగళవారం రోజు దాదాపు 11శాతం జంప్ అయి, 290 డాలర్లుగా(రూ.19,472) నమోదయ్యాయి. జూలై6 ముగింపు అనంతరం ఇప్పటివరకూ ఈ షేర్లు 100 శాతంకు పైగా దూసుకెళ్లాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.36 ట్రిలియన్ యెన్(రూ.2,75,658 కోట్లకు పైగా)తో, జపాన్ లోని ఉత్తమ ప్రసిద్ధ కంపెనీల జాబితాలో ఒకటిగా నింటెండో చేరిపోయింది. శుక్రవారం ఒక్క రోజే జపాన్ లో అత్యధిక వాటాలు ట్రేడ్ అయి, రోజు వారీ వర్తకంలో నింటెండో రికార్డు సృష్టించింది.
రెండు వారాల క్రితమే ఈ గేమ్ ను లాంచ్ చేశారు. ఈ గేమ్ ప్రవేశంతో, మొబైల్ గాడ్జెట్స్ లో, స్మార్ట్ ఫోన్లలో దీనికి ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. పోకిమాన్ క్రేజ్ కేవలం నింటెండో కంపెనీకి మాత్రమే కాదంట. టోక్యోలో ట్రేడ్ అయ్యే ఇతర షేర్లకు ఇది లాభాలను పండిస్తోంది. ఆహార భద్రతా కుంభకోణాలతో ముప్పుతిప్పలు పడుతున్న జపాన్ మెక్ డొనాల్డ్ కు, భారీ ఊరట కలిగిస్తోంది. పీకాచు వంటి గేమ్ క్యారెక్టర్లతో హ్యాపీ మీల్స్ ను శుక్రవారం నుంచి మెక్ డొనాల్డ్స్ ఆఫర్ చేస్తోంది. దీంతో కంపెనీ షేర్లు 23శాతం పెరిగాయి. ఈ గేమ్ ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో మొదట లాంచ్ చేశారు. వారం నుంచి దాదాపు రెండు డజన్ల దేశాల్లో దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం జపాన్ లో ఈ గేమ్ రిలీజ్ కావాల్సి ఉంది.