తిరుపతి గోశాలలోని గోవులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి వెంకన్న లడ్డూకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక సేంద్రియ ఎరువులు, ఫ్లోర్ క్లీనర్లు, సువాసన వెదజల్లే సుగంధాల తయారీపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. ఈ వనరులను పుష్కలంగా కలిగిన టీటీడీ త్వరలో ఉత్పత్తుల తయారీ యూనిట్లు నెలకొల్పనుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పతంజలి గో ఆశ్రమం, పంజాబ్‌లోని దివ్యజ్యోతి సంస్థాన్ ఆయుర్వేద కేంద్రాలను సందర్శించిన టీటీడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే తరహాలో తిరుపతిలోనూ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
టీటీడీ వద్ద 3 వేలకుపైగా గోవులు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో 3,000కుపైగా ఆవులున్నాయి. పలమనేరు దగ్గర వంద ఎకరాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలలో మరో 400 ఆవులున్నాయి. గో సంరక్షణలో భాగంగా వట్టిపోయిన గోవులకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. పాలిచ్చే గోవుల కన్నా వట్టిపోయిన ఆవులు సంఖ్య పెరగటంతో నిర్వహణ వ్యయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గోవుల మూత్రం, పేడను వినియోగించి ఎరువులు, ఫ్లోర్‌క్లీనర్లు తయారు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల గోశాలల నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.
త్వరలో యూనిట్ ప్రారంభం....
ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, గో మూత్రంతో ఫ్లోర్ క్లీనర్ల తయారీకి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం ముగిసిం ది. గోశాల ఆవరణ లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నాం. మిషనరీ, టర్నర్‌లను కొనుగోలు చేయాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది.
–హరినాథరెడ్డి, తిరుపతి గోశాల డైరెక్టర్.
నెలకు 150 టన్నులు..
తిరుపతి గోశాలలో నిత్యం 15 టన్నుల మేర పేడ లభ్యమవుతోంది. దీన్ని ఎండబెడితే తేమ శాతం పోయాక నెలకు సుమారు 150 టన్నుల పేడ మిగులుతుంది. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, గో మూత్రం మిశ్రమాలతో కలిపి దీన్ని నిల్వ చేసి శాస్త్రీయ విధానంలో కొన్ని ముడి పదార్థాలు కలపటం ద్వారా ఎరువుగా మారుతుంది.గో మూత్రానికి పైనాయిల్, లెమన్ గ్రాస్ ట్రీ ఆయిల్ లాంటి ఆయుర్వేద ఉత్పత్తులను కలిపి మిశ్రమాన్ని వేడి చేయటం ద్వారా ఫ్లోర్‌క్లీనర్‌గా మార్చవచ్చు. ఆవు పేడతో తయారైన సేంద్రియ ఎరువులను వరి, చెరకు, వేరు శెనగ, కూరగాయల సాగుకు వినియోగించటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తొలిదశలో ఈ ఎరువులను టీటీడీ నిర్వహించే ఉద్యాన వనాలు, పండ్ల తోటలకు వినియోగిస్తారు. తరువాత బయట మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
వాడిన పుష్పాలతో సుగంధాల తయారీ
తిరుమల శ్రీవారికి నిత్యం అలంకరించే వివిధ రకాల పుష్పాలను వాడిపోగానే తొలగిస్తారు. ఇవి టన్నుల్లోనే ఉంటాయి. వీటిని వృథాగా పారవేయకుండా సువాసనలు వెదజల్లే సుగంధాలను తయారు చేయాలని టీటీడీ తోటల విభాగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment