ఆశల సాగు
శ్రీకాకుళం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో కుదేలైన జిల్లా రైతులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో పంట సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రకృతి విపత్తుల మాటెలా ఉన్నా.. ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ఎరువులు, విత్తనాల సమస్యకు తోడు ఈసారి పంట రుణాల సమస్య ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రతికూలతలు, అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల బిజీ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అధికారులు ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.
ఏటా విత్తనాలతో సమస్య
జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంట వరి. గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో పంట నష్టపోయి విత్తనాలు తయారు చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో ఖరీఫ్ సగటు సాగు విస్తీర్ణం 2.53 లక్షల హెక్టార్లు. ఇందులో 1.85 లక్షల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగిలిన విస్తీర్ణంలో గోగు, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది సుమారు 2.05 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణమైన 1.85 లక్షల హెక్టార్లకు సుమారు 1.45 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. ఇందులో 30 శాతం అంటే సుమారు 45 వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సాధారణంగా ప్రభుత్వం అందిస్తోంది.
కానీ ఈ ఏడాది 49 వేల క్వింటాళ్ల విత్తనాలు అందనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 20 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఎలా చూసుకున్నా అవసరమైన విత్తనాల్లో ఇది మూడో వంతు మాత్రమే. మిగిలిన విత్తనాలను రైతులే సమకూర్చుకోవలసి వస్తోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్క గింజ కూడా లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పెట్టి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తాయని, గతంలో ఇది తమకు అనుభవమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రైవేటుగా కొనుగోలు చేసే విత్తనాల్లో నకిలీ, నాసిరకం ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు.
ఎరువులదీ అదే దారి
ఎరువుల విషయంలోనూ రైతులు ఇదే రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుకునే స్వేచ్ఛను ఆయా కంపెనీలకే కట్టబెట్టడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. జిల్లాకు ఖరీఫ్‌లో 99373 టన్నుల ఎరువులు అవసరం. ఇందులో డీఏపీ 15950 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 18390 టన్నులు ఉన్నాయి. జిల్లా రైతులు సేంద్రియ ఎరువులపై ఆసక్తి చూపకుండా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. వీటి ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతుండటం.. సీజనులో డిమాండ్ తగినంతగా సరఫరా కాకపోవడం సమస్యగా పరిణమిస్తోంది.
మట్టి నమూనా ఫలితాలు అందేనా..
పంటల సాగులో భూసారం తెలుసుకోవడం అత్యంత ప్రధానం. ఏటా వ్యవసాయ శాఖ భూసార పరీక్షలంటూ రైతుల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తోంది. వాటి ఫలితాలను సకాలంలో రైతులకు అందజేయడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపే పనిలో వ్యవసాయాధికారులున్నారు. అయితే వాటిని ఎప్పుడు పరీక్షిస్తారు.. ఫలితాలు ఎప్పుడు రైతులకు అందజేస్తారన్నవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలే.
అవగాహన లోపం
పంటల సాగు విధానంలో వస్తున్న మార్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అందుబాటులో ఉన్న పథకాలు.. తదితర అంశాలపై రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రకరకాల పేర్లతో గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది గ్రామాల్లో ఎన్నికల హడావుడి, అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో చైతన్య యాత్రలు అటకెక్కాయి. అరకొర పరిజ్ఞానంతోనే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.