Rice crop
-
ఇల వైకుంఠపురంలో..
‘ఇంట్లో దీపం వెలిగితే ఆ కుటుంబానికే వెలుగు.. అదే దీపం గుడిలో వెలిగితే ఊరంతటికీ వెలుగు’నిస్తుందని నమ్మారు ఆ ఊరి వాళ్లంతా. తూరుపు దిక్కున ప్రతి గుమ్మానికి ఆత్మ గౌరవమనే తోరణం కట్టారు. అజ్ఞానపు కట్టుబాట్లను తెంచి పడమర దిక్కున పాతేశారు. ఊరికి ఉత్తరాన అంతరాలను కట్టెలపై కాల్చేసి.. జ్ఞాన దివిటీలను గుండెల్లో వెలిగించుకున్నారు. దారికి దక్షిణాన నాగలి పట్టి పుడమి నుదుటిపై తమ జీవిత రాతలు ఎలా ఉండాలో రాసుకున్నారు. అక్షర కాంతులు నింపుకున్న ఆ గ్రామం ఇప్పుడు సామాజిక చైతన్యపు తిలకాన్ని నుదిట దిద్దుకుని కొత్త పొద్దులకు ఆహ్వానం పలుకుతోంది. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అడవి అంచున వెలసిన గిరిజన గ్రామం వైకుంఠపురం విశేషాలను పరికిస్తే.. ప్రతి గడపా ఓ విజయగాథకు ప్రతిరూపంగా నిలుస్తోంది. సాక్షి, నరసరావుపేట: ఇప్పటికీ అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ‘యానాదులు’. సంప్రదాయ వృత్తులకే పరిమితమైన వీరిలో అత్యధికులు చదువులకు నోచుకోక.. ఎదుగుబొదుగూ లేని జీవితాల్ని గడుపుతున్నారు. అష్టకష్టాలు పడి కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. చేపలు పట్టడం.. పొలాల వెంట తిరుగుతూ ఎలుకల్ని పట్టడం.. పంటలకు కాపలాదారులుగా ఉండటం.. కానీ.. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన యానాదులు తమ చరిత్ర గతిని మార్చుకున్నారు. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టారు. గ్రామం మొత్తం రైతన్నలుగా మారిపోయారు. మరో అడుగు ముందుకేసి ఉద్యాన పంటలు సైతం సాగు చేస్తున్నారు. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతులయ్యారు. ఊరిని మద్యనిషేధ గ్రామంగా మార్చుకున్నారు. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి తొలి తరం అభ్యాసకులుగా అక్షర కాంతులు నింపుకుంటున్నారు. 25 ఏళ్లుగా స్థానిక పాలనలో కూడా వారు కీలకంగా మారారు. నాలుగు కుటుంబాలతో మొదలై.. 1965 నాటికి ఇక్కడ ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ నాలుగు కుంటుంబాలు అక్కడ సారవంతమైన భూములు ఉండటంతో పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కో కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు ఆ గ్రామంలో 310 గడపలయ్యాయి. సుమారు 952 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ప్రతి ఇంటికి పొలం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన జీవనాధారం. ప్రతి చేనుకు బోరు మోటార్ ఉన్నాయి. దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం సారా తయారీ అడ్డాగా ఉన్నా.. ఇక్కడ మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా నిషేధించారు. గ్రామంలో నేరాలు కూడా లేవు. పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉండవు. గిరిజనులు ఇలా కష్టాన్ని నమ్ముకుని ఇలలో వారి గ్రామం వైకుంఠపురం నామాన్ని సార్థకం చేసుకున్నారు. అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ప్రస్తుత తరంలో 154 కుటుంబాలకు వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇక గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. ఏళ్లుగా బంజరు భూములను సాగు చేస్తున్న 18 మంది రైతులకు త్వరలో సాగు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామం మొత్తం దాదాపుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి , ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 12 మంది స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. -
రైతులను నిండా ముంచిన అకాల వర్షం (ఫొటోలు)
-
వరి సిరి పెరిగింది
తెలంగాణ ఏర్పడే నాటికి వరి పంట ఉత్పత్తిలో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. 2022–23లో 156.31 లక్షల మెట్రిక్ టన్ను (ఎల్ఎంటీ)ల వరి ఉత్పత్తితో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 153.87 ఎల్ఎంటీల ఉత్పత్తితో తెలంగాణ ఆ తర్వాతి స్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. 147.36 ఎల్ఎంటీలతో ఉత్తరప్రదేశ్, 135.88 ఎల్ఎంటీలతో పంజాబ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి 2019–20లో 74.28 ఎల్ఎంటీల ఉత్పత్తితో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ఆ ఏడాది పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అయితే కేవలం నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రెట్టింపు స్థాయిలో వరిని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచిందని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ పత్తి, మిర్చిలోనూ అగ్రభాగాన.. పత్తి ఉత్పత్తిలో 54.41 లక్షల బేళ్లతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్ 87.12 లక్షల బేళ్లతో మొదటి స్థానంలో, మహారాష్ట్ర 81.85 లక్షల బేళ్లతో రెండో స్థానంలో నిలిచిందని కేంద్రం ప్రకటించింది. 2014–15లో తెలంగాణలో పత్తి ఉత్పత్తి 50.50 లక్షల బేళ్లు కాగా అప్పుడు కూడా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఎర్ర మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 2021–22లో 6.51 ఎల్ఎంటీల మిర్చి ఉత్పత్తి అయ్యిందని కేంద్రం తెలిపింది. 4.17 ఎల్ఎంటీలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2014–15 సంవత్సరంలో తెలంగాణలో మిర్చి ఉత్పత్తి కేవలం 2.53 ఎల్ఎంటీలు మాత్రమే ఉండగా ఏటా పెరుగుతూ వచ్చింది. 2020–21లో 5.36 ఎల్ఎంటీల ఉత్పత్తి జరిగింది. 2022–23 సీజన్లో అన్నీ రికార్డులే.. 2022–23లో తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలవడానికి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడమే ప్రధాన కారణం. వానాకాలం పంటల సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డు సృష్టించింది. 2020 వానాకాలం సీజన్లో అత్యధికంగా 1,35,63,492 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు కాగా, 2022–23 వానాకాలం సీజన్లో 1,35,75,687 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు కూడా రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. 2021 వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 62.13 లక్షల ఎకరాలు కాగా, 2022–23 సీజన్లో ఏకంగా 64.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు వానాకాలం సీజన్లో రెట్టింపునకు పైగా వరి సాగు కావడం విశేషం. అలాగే యాసంగిలోనూ ఆల్ టైం రికార్డులు నమోదయ్యాయి. 2020–21 యాసంగి సీజన్లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఆ రికార్డును బద్దలు కొడుతూ 2022–23 యాసంగి సీజన్లో 68.53 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ యాసంగిలో వరి సాగు కూడా ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 53.08 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారు వరి ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో నిలవడం హర్షణీయం. మిర్చి మొదటి స్థానం, పత్తి మూడో స్థానంలో ఉండటం కూడా ఎంతో సంతోషకరం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెంచారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ రైతుబంధు సమితి -
అకాల వర్షం! కళ్లముందే కొట్టుకుపోయిన రెక్కల కష్టం (ఫోటోలు)
-
‘ధాన్యం కొనడం చేతకాని సీఎంను గద్దె దించాలి’
గార్ల: ధాన్యం కొనడం చేత గాని సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రస్థానం పాదయా త్రలో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు మీదుగా ఆమె ఆదివారం మహబూబా బాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రైతుదీక్ష చేపట్టారు. దీక్షనుద్దేశించి ఆమె మాట్లాడుతూ గతేడాది యాసంగి సీజన్లో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది సీఎం కేసీఆర్ వరి పంట సాగు చేయవద్దని ఆదేశాలు జారీ చేయడంతో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంట వేశారన్నారు. మిగతా 17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయకుండా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గతంలో కేంద్రంతో స్నేహంగా ఉన్నప్పుడు సీఎం బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ ఒప్పందంపై ఎందుకు సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఆ ఒప్పందం మేరకే కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ వద్దంటోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చు కునేందుకు రాష్ట్రంలో దొంగ ధర్నాలు, ఆందోళనలు చేపడుతోందని షర్మిల ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
Ram Charan: రామ్ చరణ్ బర్త్‌డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్
సాక్షి, గట్టు (మహబూబ్‌నగర్): సినీనటుడు రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి వరి పంటతో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన సంధ్యాజయరాజ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గట్టు మండలంలోని ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని అభిమాన నటుడు రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. డ్రోన్‌తో ఆకాశం నుంచి వరి చేలలోకి చూస్తే ఈ ముఖచిత్రం కనిస్తుంది. రెండు రోజుల క్రితమే అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయు డు ఈ చిత్రాన్ని పరిశీలించి అభినందించారు. కాగా, ఆదివారం రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వరి పంటతో చరణ్ పట్ట తన అభిమానాన్ని చాటుకున్నాడు. చదవండి: అమృత్‌సర్‌కి రామ్ చరణ్, ఎందుకంటే..? -
ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలి
మెట్పల్లి: ముత్యంపేట నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు కదం తొక్కారు. మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతోపాటుగా జిల్లా నలుమూలలనుంచి ఈ మహాధర్నాకు రైతులు తరలివచ్చి అక్కడి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సక్రమంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చిన టీఆర్ఎస్..గద్దెనెక్కిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోకపోగా మూసివేసిందని దుయ్యబట్టారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం.. చక్కెర ఫ్యాక్టరీని తెరిస్తే వరి స్థానంలో చెరుకు పంటను సాగు చేయడానికి ఇక్కడి రైతాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల ధర్నా సమాచారం అందుకున్న కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్ వారి వద్దకు చేరుకున్నారు. రైతులు ఆయనకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. -
తొక్కి పడేస్తున్నాయ్..!
ఎల్.ఎన్.పేట: మండలంలోని జంబాడ, ఇరుకురాయిగూడ, సూదిరాయిగూడ గిరిజన గ్రామాల సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు నాలుగు రోజులుగా సంచరిస్తున్నాయి. పగలంతా సమీపంలోని కొండల్లో ఉంటూ సాయంత్రానికి దిగువ ప్రాంతానికి వచ్చి పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయని బాధిత రైతులు పాలక చిన్నవాడు, ఉయ్యక వైకుంఠరావు, నిమ్మక నూకరాజు, పాలక మల్లేశ్వరావు, నిమ్మక లక్ష్మణరావు, కోలక రాములమ్మ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. జంబాడ సమీపంలోని ఎర్రచెరువు లోపల ఉన్న కొండలు, అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్ట వేస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు. పైడి మంజులకు చెందిన మామిడి తోటలోకి వెళ్లిన ఏనుగుల గుంపు కొమ్మలు విరిచేయటంతో పాటు నీలగిరి మొక్కలను కాలితో తొక్కినాశనం చేశాయి. నాలుగైదేళ్లుగా ప్రతిసారీ వరిచేను నాట్లు వేసిన తరువాత, కోత సమయానికి ఏనుగులు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏనుగుల గుంపు గిరిజన గ్రామాల్లోకి వెళ్లకుండా ట్రాకర్లతో కాపలా ఏర్పాటు చేశామని అటవీశాఖ సరుబుజ్జిలి సెక్షన్ అధికారి సాయిరాం మహాపాత్రో చెప్పారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులను దారి మళ్లించి కొండల్లోకి వెళ్లేలా చేస్తున్నామన్నారు. గిరిజన రైతులను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం లేకుండా అటవీశాఖ ఉద్యోగులు, ట్రాకర్లు నిరంతరం ఏనుగులు కదలికలను గమనిస్తున్నారని తెలిపారు. -
హరిత గ్రామ కథ
మండోవి నది మధ్య ఉందీసెయింట్ ఎస్తేవం. ఉత్తర గోవాలోని ఆ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. పొట్టకొచ్చిన వరి పైరు ఇప్పుడు ఆ ఊరికి సరికొత్త శోభనిస్తోంది. చర్చి ఫాదర్ ప్రభాత ప్రవచనాల్లో పంట చేల తాలూకూ తాజా విశేషాల్ని భాగం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరి పంట పండబోతోంది.అక్టోబర్‌లో వరి పంట చేతికి రాబోతోంది. మరి ఇన్నాళ్లూ పంటలకు వారు ఎందుకు దూరంగా ఉన్నట్లు? రియల్ ఎస్టేట్ వద్దు.. రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా గోవాలో వరి సాగు బాగా క్షీణించింది. సెయింట్ ఎస్తేవం అంతటా బీడు భూములే. ఊళ్లో సగం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. లేదంటే ఓడల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక కుటుంబాలకు (నిన్న మొన్నటి వరకు) తమ పొలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ భూములకు వారు మూడో తరం వారసులు. తమ చిన్న చిన్న కమతాలను వదిలేస్తే అవి ‘రియల్’ వ్యాపారుల పరమవుతాయనే భయం వారిని ఆలోచింపచేసింది. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే హరిత గ్రామ సంఘం (గ్రీన్ విలేజ్ క్లబ్) ప్రాజెక్టు. సమష్టి వ్యవసాయ ఆలోచన. ఊరి జనం ఈ ప్రాజెక్టుకు మొదట అంగీకరించలేదు. భూములు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. జనవరిలో జరిగిన మొదటి సమావేశంలో వ్యవసాయదారులు, భూ యజమానులు సమష్టి వ్యవసాయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత కొంత కాలానికి చర్చలు జరిగాయి. చివరికి సంసిద్ధత వ్యక్తమైంది. భూ సమీకరణ మొదలైంది. 50 హెక్టార్లలో వరి వేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులకు అనువైన గోవా ధన్–1 రకాన్ని సాగు చేస్తున్నారు. 175 మెట్రిక్ టన్నుల పంట చేతికి రావొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఊళ్లో ఉన్న మొత్తం 250 హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలని భావిస్తున్నారు. ఇంటింటికీ తిరిగారు.. ఈ గ్రామంలో నివసించేది ప్రధానంగా నావికులే. వారు వ్యవసాయం గురించి ఆలోచించేలా చేయడం పెద్ద సవాలు. ‘భూమి పత్రాలు, రికార్డులు వెతికి పట్టుకోండి. హక్కుదారులు ఎక్కడున్నారో విచారించండి’ అంటూ ఉదయం సమావేశాల్లో అక్కడి చర్చి ఫాదర్ యుసికో పెరీరా ప్రజలకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు ఓ బృందం గ్రామస్తులు, వారి భూముల వివరాలు సేకరించగలిగింది. అశ్విన్ వరేలా అనే 20 ఏళ్ల కుర్రాడు.. భూముల విషయంలో గ్రామస్తులకు చాలా సాయపడ్డాడు. ‘రాత్రి వేళల్లో ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి అన్ని రికార్డులూ డౌన్లోడ్ చేశాం. విషయాలు నిర్ధారించుకోవడం కోసం ప్రతి ఇంటికీ వెళ్లాం. సాయపడ్డాం. మేం తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టేవాళ్లం. విదేశాల్లో, ఓడల్లో ఉన్న వాళ్లను సంప్రదించేందుకు ఫేస్బుక్ వాడాం’ అని చెబుతున్నాడు అశ్విన్. గోవా వ్యాప్తంగా ఇలాంటి పరిణామం చేసుకోవడం ఇదే తొలిసారంటారు అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు హెడ్ సంజీవ్ మయేకర్. ఇప్పుడు గోవా మొత్తం సెయింట్ ఎస్తేవం వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయాలని భావిస్తోంది. అస్తిత్వ పోరాటంలో భాగమే.. తమ అస్తిత్వం, భాష, సంస్కృతి, పండుగలను కాపాడుకునేందుకు గోవావాసులు పోరాడుతున్నారనీ, సెయింట్ ఎస్తేవం పరిణామాల్ని ఈ కోణం నుంచే చూడాలని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో చెబుతున్నారు. ‘వలసదారులను ఆహ్వానిస్తాం. కానీ ఈ భయం కూడా ఒక నిజం’ అంటారాయన. అనేక కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వదిలి, తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయాయి. వారు భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అవి వివాదాల్లో చిక్కుకోవచ్చు. లేదంటే కబ్జాకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి చిక్కొచ్చు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఈ ప్రాజెక్టు అభినందించదగ్గదేనని మౌజో చెబుతున్నారు. -
ఇది ‘వంగపండు’ వరి?
తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఓ రైతు పొలంలో వరి వంగపండు రంగులో పండి అబ్బు రపరుస్తోంది. ఈ వరి ఏ రకానికి చెందిందో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు శాంపిల్స్ సేకరించారు. కొత్తపల్లికి చెందిన గణేశుల వీరవెంకట సత్యనారాయణ అనే రైతు.. పొలంలో వరి విత్తనాలను నాటాడు. కలుపు తీసే సమయంలో కొన్ని వరి దుబ్బులు వంగపండు రంగులో ఉండటంతో అలాగే వదిలేశాడు. పంట కోత కోసేట ప్పుడు మాత్రం వేర్వేరుగా నూర్చాడు. వంగపండు రంగులో వరిని నూర్పి చూడగా బియ్యం ఎరుపు రంగులో ఉన్నాయి. వరి విత్తనాలలో కొత్త వంగడం ఏదైనా కలసి ఉంటుందని అధికారులు చెప్పారు. –పిఠాపురం -
ఉప్పు నీటిలోనూ వరి పంట
చవుడు నేలల్లో వరి పండుతుందా? అసలు పండదన్నది నిన్నమొన్నటి మాట.. ఇకపై ఆ మాట చెల్లదు.. చైనా శాస్త్రవేత్తలు ఉప్పు నీటిలో వరి పండించడమే కాకుండా సాధారణ వరి మాదిరిగానే దిగుబడులూ సాధించారు. చైనా హైబ్రిడ్ వరి వంగడాల పితామహుడిగా పేరొందిన యువాన్ లాంగ్పింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కింగ్‌డావులో జరిపిన ప్రయోగాల ద్వారా కనీసం 4 వంగడాలు ఉప్పును తట్టుకుని మరీ పెరగగలవని తేలింది. దాదాపు 200 రకాల వరి వంగడాలను వేర్వేరు ఉప్పు మోతాదులున్న నీటిలో పండించినప్పుడు నాలుగు వంగడాలు ఉప్పు ప్రభావాన్ని అధిగమించాయి. ముందుగా వీటన్నింటికి మూడు శాతం లవణాలున్న నీటిని అందించారు. ఆ తరువాత క్రమేపీ ఉప్పు మోతాదును ఆరు శాతానికి పెంచారు. హెక్టారుకు 4.5 టన్నుల వరకు దిగుబడులు వస్తాయని తొలుత అంచనా వేయగా.. అవి కాస్తా 9.3 టన్నులు పండటంతో ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతైంది. చైనాలో దాదాపు పది కోట్ల హెక్టార్ల చవుడు నేలలు ఉన్నాయని, వీటిల్లో ఈ రకమైన వరి వంగడాలు పండిస్తే రైతుకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుందని లాంగ్పింగ్ బృందం అంచనా వేస్తోంది. కొత్త వంగడాలను మరింత మెరుగుపర చడంతో పాటు సాగు పద్ధతులను ప్రామాణీకరించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నామని వారు వివరించారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
తొలకరి ప్రారంభమైంది. సార్వా వరి నారుమళ్ల తయారీకి రైతులు సన్నద్ధమవుతున్నారు. సార్వా పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక, నారుమడి తయారీ, ఎరువులు, సస్యరక్షణ చర్యలు మొదలగు విషయాలలో రైతులు ఈ దిగువ మెళకువలు పాటించాలి. విత్తన రకాల ఎంపిక దీర్ఘ, మధ్యస్థ కాలిక రకాలైన స్వర్ణ (ఎంటీయూ-7092), సాంబమసూరి (బీపీటీ-5204), విజేత (ఎంటీయూ-1001), ఇంద్ర (ఎంటీయూ-1061), అమర (ఎంటీయూ-1064), ప్రభాత్ (ఎంటీయూ-3626), పార్థీవ (ఎన్‌ఎల్‌ఆర్-33892), సోనామసూరి (బీపీటీ-3291), శ్రీకాకుళం సన్నాలు (ఆర్బీఎల్-2537), వసుంధర (ఆర్జీఎల్-2538), నెల్లూరు సోనా (ఎన్‌ఎల్‌ఆర్-3041), స్వర్ణముఖి (ఎన్‌ఎల్‌ఆర్-145), పుష్యమి (ఎంటీయూ-1075) సార్వాకు అనువైన రకాలు. విత్తన శుద్ధి విత్తనం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా కాపాడుకునేందుకు విధిగా విత్తన శుద్ధి చేయాలి. ఒక కిలో పొడి విత్తనానికి 3 గ్రాములు లేదా లీటరు నీటికి 1 గ్రాము కార్బెండిజమ్ కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టాలి. తరువాత 24 గంటలు మండె కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ లేదా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌ను సంప్రదించగలరు. రైతులు మరిన్ని సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-430కు ఫోన్ చేయవచ్చు. డాక్టర్. కె.రాజారెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -522 509 -
అడుగంటిన ఆశలు
► మండుతున్న ఎండలు.. ఎండుతున్న వరి చేలు ► తగ్గుతున్న భూగర్భజలాలు, వట్టిపోతున్న బోరుబావులు ► సాగునీరు అందక 400 ఎకరాల్లో పంట ఎండుముఖం ► పశువులకు మేతగా మారిన పైర్లు ► నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు వరి చేలకు నీళ్లు లేక అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి. మండే ఎండలతో పొలాలు నెర్రెలు బారుతున్నాయి. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా మారుతోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి చేతికందని పరిస్థితులతో రైతులు వేదనకు గురవుతున్నారు. మండుతున్న భానుడితో చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గిపోతోంది. బోర్లు ఎండిపోతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 400 ఎకరాల్లో వరికి నీళ్లు అందక ఎండిపోయింది. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్ సరాఫరా అవుతున్నా.. భూగర్భ జలాలు అడుగంటడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్: సాగునీరు పుష్కలంగా ఉంటుందన్న ఆశతో రైతులు యాసంగిలో ఉత్సాహంగా వరి పంట సాగు చేశారు. ఈసారి కాస్తో కూస్తో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు ఉందనే ఆలోచనతో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేశారు. గత ఖరీఫ్‌లో 425 హెక్టార్లలో సాగవ్వగా.. ఈ యాసంగిలో సాధారణ విస్తీర్ణం 625 హెక్టార్లు కాగా సుమారు 800 హెక్టార్లలో సాగు చేశారు. ఈ నేపథ్యంలో దండుమైలారం, నెర్రపల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్ గ్రామాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేసవికి ముందే భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో చేతికొచి్చన పంటలు ఎండుముఖం పట్టాయి. ఎగువ భాగమైన కప్పపహాడ్, ఎల్మినేడు, కొంగరకలాన్, పోచారం, ఉప్పరిగూడ, తులేకలాన్, రాందాస్‌పల్లి గ్రామాల్లో పెద్దగా పంటలు ఎండిపోలేదు. దిగువభాగంలోని దండుమైలారం, నెర్రపల్లి, ముకునూర్ గ్రామాల్లో 400 ఎకరాలకు పైగా పంట ఎండిపోయింది. ప్రస్తుతం ఎండలు ఏమాత్రం ముదరక ముందే ఈ పరిస్థితి దాపురించిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తున్నప్పటికీ బోరుబావుల్లో నీరు లేకపోవడంతో ఇంతటి గడ్డు పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.25 వేలకుపైగా పంటకు పెట్టుబడులు పెట్టామని, నీళ్లు లేక వరి చేలు కళ్లముందే ఎండిపోతుంటే తల్లడిల్లుతున్నారు. ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే మండలంలో 400 ఎకరాలకు పైగా పంటలు ఎండిపోతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేసిన దాఖలాలు లేకుండా పోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బడి ముబ్బడిగా బోరుబావులు వేసవికాలంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అవగాహన లేకుండా బోర్లు వేసి రైతులు అప్పులపాలవుతున్నారు. కొద్దిగా నీరు వచ్చిన తరువాత ఎండిపోతున్నాయి. సహజ వనరులను కాపాడేందుకు తీసుకొచి్చన వాల్టా చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. మండలంలోని వాల్టా చట్టానికి ప్రత్యేక కమిటీలుంటాయి. తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. బోరు వేసే ముందు తహసీల్దార్ అనుమతి తీసుకుని నిర్ణీత రుసుము చెల్లించాలి. అధికారులు సూచించిన లోతును మాత్రమే బోరుబావులు తవ్వించాల్సి ఉంటుంది. ప్రతి బోరుకు 250 మీటర్ల దూరం ఉండాలి. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వేసే బోరు యంత్రాలను వేసిన బోర్లను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుంది. షాబాద్ పంట నష్టం అంచనా వేస్తాం ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో నెర్రపల్లి, దండుమైలారం, రాయపోల్, ముకునూర్ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్న విషయం మా దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తాం. రైతులను ఆదుకుంటాం. – వరప్రసాద్‌రెడ్డి, ఏఓ, ఇబ్రహీంపట్నం బోరుకు బంగారం తాకట్టు పెట్టాం నాలుగు ఎకరాల్లో వరి పంట వేశా. పుష్కలంగా నీరు ఉందన్న ఆశతో సాగు చేస్తే ప్రస్తుతం ఎండిపోయింది. రూ.70 వేలు ఖర్చు చేసి బోర్లు వేశాం. బంగారం తాకట్టు పెట్టి బోరు వేయిస్తే చుక్క నీరు రాలేదు. అప్పు చేసి సాగు చేసిన పంట ఎండిపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. – దోర్నాల అబ్బసాయిలు, రైతు -
చివరి ఆయకట్టునూ రక్షిస్తాం
⇒ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు ⇒ జిల్లాలో రూ. వెయ్యి కోట్ల సాగు ⇒ నీటిని సద్వినియోగం చేసుకోవాలి ⇒ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల ⇒ డిస్ట్రిబ్యూటరీల వద్ద వీఆర్వో, వీఆర్ఏలను కాపలా ఉంచాలి ⇒ వాహనంలో పర్యవేక్షిస్తా ⇒ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ‘జిల్లాలో దాదాపు రూ. వెయ్యి కోట్ల వరి పంట ఉంది.. ఇది ఆషామాషీ విషయం కాదు.. పంట వేసిన రైతుకు జీవన్మరణ సమస్య... అధికారులు సమష్టి బాధ్యత తీసుకుని చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. వేసిన పంటలను కాపాడాలి’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో నీటి పారుదల అధికారులు, తహసీల్దార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద 2 లక్షల 10 వేల ఎకరాల పంట సాగవుతోందన్నారు. ప్రస్తుతం మూడు విడతలుగా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయగా, ఇంకా మూడు విడతల నీటిని ప్రాజెక్టుల నుంచి ఆన్అఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో రబీ పంటలకు విడుదల చేసే నీటిని సక్రమంగా వాడుకోకపోతే నీరంతా వృథా అవుతుందన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద 82 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు కలిపి 766 డిస్ట్రిబ్యూటరీలు, 218 సబ్ డిస్ట్రి బ్యూటరీలు ఉన్నాయన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద ఒక వీఆర్వో, ప్రతి సబ్ డిస్ట్రిబూట్యరీ వద్ద వీఆర్ఏలను కాపాల ఉంచాలన్నారు. వీరికి షిప్టుల వారిగా డే అండ్ నైట్ డ్యూటీలు వేసే బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. ఎవరెవరు డిస్ట్రిబ్యూటరీల వద్ద ఉంటున్నారో వారి పేర్లతో సహా వివరాలు అందించాలని, తాను పది రోజుల పాటు కెనాల్‌పైనే వాహనంలో పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. మూడు విడతల నీటిలో 850–1000 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయడకుండా అవగాహన కల్పిం చాలని అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీరు నిలువ ఉండగా, అందులోంచి 2.9 టీఎంసీల నీటిని వినియోగించగా, ఇంకా 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. కాలువను బంద్ చేసే సమయంలో ఇరిగేషన్ అధికారులు చివరి ఆయకట్టు వరకు నీరు అందిందో లేదో తెలుసుకున్న తరువాతే బంద్ చేయాలన్నారు. లేదంటే చివరి ఆయకట్టు పంట లకు నష్టం జరుగుతుందన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు యోగితా రాణా, సత్య నారాయణ, జేసీ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరి సాగు వైపే మొగ్గు
-బోర్లు, బావుల ఆధారంగా సాగు -ఆశాజనకంగా లేని భూగర్భజలాలు -సాగర్ ప్రాజెక్ట్ నిండితేనే ఆయకట్టుకు నీరు -వేచి చూడాలంటున్న అధికారులు -తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు హుజూర్నగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో గల నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో పలువురు రైతులు ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. బోర్లు, బావుల ఆధారంగా కొంతమేర నీటి ల భ్యత కలిగిన రైతులు కో టి ఆశలతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు రైతులు తమ బీడు భూము ల్లో సేంద్రియ ఎరువుల విత్తనాలైన జీలుగ, పెసర సాగు చేపట్టారు. అంతేగాక బీడు భూముల ను దున్నడంతో పాటు వరి పెంచుతున్నారు. నిరాశాజనకంగా భూగర్భజలాలు ప్రస్తుతం బోర్లు, బావుల్లో ఆశించిన మేర భూగర్భజలాలు లేకపోవడంతో నారుమళ్లకు మాత్రమే సదరు నీరు సరిపోతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తరుచుగా వర్షాలు పడుతున్నందున చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు భూ గర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యూరు. గత రబీ సీజన్లో కూడా బోర్లు, బావుల ఆధారంగా సాగు చేపట్టిన రైతులు అడుగంటిన భూగర్భ జలాలతో వరిపొలాలకు సాగు నీరందక ఎండిపోవడంతో తీవ్ర నష్టాలపాలయ్యూరు. అయినప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు అనేక ఆశలతో ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 20 వేల ఎకరాలకు పైగా రైతులు వరినార్లు పోసి పెంచుతూ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగర్ నిండితేనే సాగునీరు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 503 అడుగుల అడుగంటిన నీరు ఉండటం, ఆ పైన గల శ్రీ శైలం, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్ట్‌లకు కూడా నేటి వరకూ నీరు చేరకపోవడంతో అవి అడుగంటారుు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ నిండి చివరగా ఉన్న సాగర్ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరితేనే ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉంది. సాగునీరు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో సైతం రైతులు వరి సాగు చేపడుతుండడం చర్చనీయాంశంగా మారింది. -
సోమశిల జలాశయంలో 12.2 టీఎంసీల నీరు
పొట్టదశలో వరి ఆందోళనలో రైతులు సోమశిల : సోమశిల జలాశయంలో ప్రస్తుతం 12.249 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి ఉత్తర కాలువకు 450, దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు ఈ నెల 10వతేదీ లోగా డెల్టా, నాన్‌డెల్టాకు నీటి నిలుపుదల చేసే యోచనలో ఉన్నారు. మొదటి పంటకు ఇంకా మరో 20 రోజుల దాకా నీరు కావాలని రైతులు కోరుతున్నారు. ఉత్తర కాలువ పరిధిలో సుమారు రెండు వేల ఎకరాలు ఇంకా పంట పొట్ట దశలోనే ఉంది. అలాగే దక్షిణ కాలువ కింద వెయ్యి ఎకరాలు ఉంది. మరో 20 రోజులైనా నీరు ఇవ్వకపోతే అధిక శాతం మంది రైతులకు కచ్చితంగా పంట చేతికి రాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు జలాశయం డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంటోంది. ఇంకా వేసవి మరో నాలుగు నెలలు ఉంది. ఈ లెక్కన జిల్లా ప్రజలకు తాగునీటికి కూడా కష్టాలు వచ్చేలా ఉన్నాయి. తాగునీటి సమస్య తీవ్రమయ్యేలోపే జిల్లా యంత్రాంగంప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించారు
-
వరిలో అగ్గి తెగులు
దుగ్గొండి : ఖరీఫ్ సీజన్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. నారు పోసుకున్నా నీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు మాత్రమే వరి పంటను సాగు చేసుకున్నారు. ప్రస్తుతం చిరు పొట్టదశలో ఉన్న పంటకు అక్కడక్కడా అగ్గి తెగులు కనిపిస్తోంది. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే పంటకు తీవ్ర నష్టం వస్తుందని మండల వ్యవసాయ అధికారి చిలువేరు దయాకర్(88866 14612) చెప్పారు. వరి పంటలో అగ్గి తెగులు రెండు రకాలుగా వస్తుంది. ఆకుల మీద వస్తే అగ్గి తెగులు, వెన్నుపై వస్తే మెడవిరుపు తెగులు అని అంటారు. ఈ సందర్భంగా తెగులు లక్షణాలు-నివారణ చర్యలను ఆయన వివరించారు. అగ్గి తెగులు-లక్షణాలు మొదట ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు వస్తాయి. అవి మధ్యలో ఉబ్బుగా చివరలో సన్నగా ఉంటాయి. మధ్యలోని మచ్చ తెల్లగా ఉంటుంది. ఆకులపై ఏర్పడిన మచ్చలు క్రమంగా పెద్దవిగా మారి ఆకు అంతా ఎండిపోతుంది. గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపించే ఈ తెగులు వల్ల తాలు గింజలు ఏర్పడి పంట దిగుబడి తగ్గుతుంది. నివారణ చర్యలు అగ్గి తెగులు మొదట పొలం గట్లపై ఉన్న గడ్డిపై వస్తుంది. తెగులు ఆనవాలు కనిపించినప్పుడు నత్రజని వాడకాన్ని తాత్కాలికంగా ఆపివేయాలి. తెగులు సోకిన తర్వాత మొదట జీవనియంత్రణ పద్ధతిలో సుడామోనాస్ లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. చివరి అస్త్రంగా లీటరు నీటికి 0.7 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ప్రధానంగా విత్తనశుద్ధి చేయకుండా నాటడం వల్ల వస్తుంది. మెడవిరుపు-నివారణ మెడవిరుపు తెగులు వెన్ను మొదటి భాగంలో నల్లని మచ్చలు ఏర్పడి వరి కంకి వెన్ను విరుగుతుంది. దీని వల్ల గింజలన్నీ తాలుగా మారుతాయి. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫేనోపాస్తో పాటు గ్రాము కార్బండైజమ్ కలిపి పిచికారీ చేస్తే మెడవిరుపు నుంచి పంటను రక్షించుకోవచ్చు. ఈ తెగులు సోకితే నివారణకు లీటరు నీటికి 0.7 గ్రాముల ట్రైసైక్లోజోల్ కలిపి పిచికారీ చేయాలి. -
పంటల్లో చీడపీడలు
లింగంపేట : ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు జీవం వచ్చింది. అయితే వాతావరణంలో మార్పుల వల్ల సోయా, వరి పంటలకు చీడపీడలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చాలా చోట్ల సోయా, వరి పంటలను కాండం తొలుచు పురుగు, బొంతపురుగు, పాముపొడ తెగులు ఆశిస్తున్నాయని, ఇవి పంటలకు నష్టం కలిగిస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి రమేశ్ పేర్కొన్నారు. మూడు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతో కాండం తొలుచు పురుగు ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు పంటలను నిత్యం గమనించాలని, పురుగులు, తెగుళ్ల లక్షణాలు కనిపించగానే సస్య రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నివారణ చర్యలు మండలంలో సోయా పంట ప్రస్తుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల కాండం తొలుచు పురుగు ఆశించింది. దీని నివారణకు ట్రైజోపాస్ 200ల గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బొంత పురుగు నివారణకు ఎసిఫేట్ 400ల గ్రాములు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వరిలో పాముపొడ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణ కోసం ప్రొఫెనోపాస్ 400ల మిల్లీ లీటర్ల మందు లేదా లాంబ్డా 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. వరి చిరుపొట్ట దశలో ఎకరానికి 15 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే రసాయన ఎరువును తప్పనిసరిగా వాడాలి. పొటాష్ వాడకం వల్ల గింజ నాణ్యత బాగా పెరుగుతుంది. వరి పొట్ట దశలో నత్రజని తక్కువగా ఉపయోగించాలి. యూరియా ఎక్కువగా వేస్తే గింజ గట్టి పడే దశలో మెడవిరుపు తెగులు(నెక్బ్లాస్ట్) ఆశించి దిగుబడులు తగ్గుతాయి. -
వరిపైనా ‘మొగి’ దాడి
లింగంపేట/బాల్కొండ : ఇప్పటికే మొక్కజొన్న కాండం తొలిచేసిన పురుగు ఇప్పుడు వరి పంటపైనా దాడి చేస్తోంది. దీం తో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్‌లో జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని గతంలో అధికారులు అంచనా వేశారు. అయితే సరైన వర్షాలు కురియకపోవడంతో లక్ష హెక్టార్లలో కూడా పంట సాగు కాలేదని తెలుస్తోంది. వేసిన పంటను మొగి పురుగు ఆశించడంతో దిగుబడులు తగ్గే అవకాశాలున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి నారుమడి దశ, పిలకలు వేసే దశ, ఈనే దశల్లో కాండం తొలుచు పురుగు ఆశించి పంటను నష్ట పరిచే అవకాశాలుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నష్టాలు మొగి పురుగు వల్ల వరి కర్ర ఎరుపు రంగులోకి మారుతుంది. కర్ర పిలకలు పై భాగాన కోతకు గురవుతాయి. ప్రధానంగా 20 రోజుల నుంచి 60 రోజుల మధ్య కాలంలో ఆశించే మొగి పురుగు పంటను కోలుకోకుండా దెబ్బతీస్తుంది. 60 రోజుల తర్వాత ఆశించే మొగి గింజల్లో రసాన్ని పీల్చేస్తుంది. నారు మడి దశలో పురుగు ఆశిస్తే నారు మొలకలు, పిలకలు వేసే సమయంలో ఆశిస్తే పిలకలు చనిపోతాయి. పైరు చిరు పొట్ట దశలో పురుగు ఆశిస్తే తెల్ల కంకులు వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. నివారణ చర్యలు వరి పంటలో మొగి పురుగు నివారణకు ప్రధానంగా పెటిరో గుళికలు వినియోగించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎకరానికి 4 కేజీ ల పెటిరో గుళికలు సరిపోతాయి. ఈ గుళికలు చల్ల డం వల్ల మొగి పురుగు నివారణ జరగడంతోపాటు వరి పిలకలు కూడా వేస్తుంది. మొగి నివారణకు లీటర్ వేప నూనె, క్లోరాంత్రన్ మెనోప్రాస్ 60 ఎంఎల్ 200 లీటర్లలో కలిపి పిచికారి చేయాలి. టకుమి 60 గ్రాములు 200 లీటర్లలో కలిపి పిచికారి చేయొచ్చు. క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు, లేదా ఫాస్ఫామిడాన్ 2 మి.లీ.లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేదా కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2 గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి ఎకరాకు 2 వంద ల లీటర్ల మందును ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారి చేసినా ప్రయోజనం ఉంటుంది. వరి పైరు చిరు పొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు ఎకరాకు 8 కిలోలు, లేదా కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 10 కిలోలు వాడితే కాండం తొలుచు పురుగు ఉధృతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. -
భాస్వరం ఎరువులను పైపాటుగా వేయకూడదు!
వరి పంట ప్రస్తుతం పిలకలు పెట్టే దశ నుంచి అంకురమేర్పడే దశలో ఉంది. ఈ కాలంలో నీరు, ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనవి.నాటిన వారం రోజుల నుంచి పిలకలు పెట్టడం పూర్తిగా ముగిసే వరకు 2 సెం.మీ. మించకుండా పొలంలో నీరు నిలబెట్టాలి. ఈ దశలో నీరు పొలంలో ఎక్కువగా ఉంటే పిలకల సంఖ్య తగ్గి దిగుబడులు తగ్గుతాయి. సారవంతమైన భూముల్లో, అత్యధిక పిలకలు తయారైన దశలో పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 2-3 రోజులు ఆరగట్టాలి. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటారు. దీని వలన వరిపైరు వేర్లు ప్రాణ వాయువును పీల్చుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి. సిఫారసు చేసిన నత్రజనిలో 3వ వంతు పిలకల దశలో పైపాటుగా వేయాలి. పొలంలో నీటిని తీసివేసి బురద పదునులో మాత్రమే నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే నత్రజని నష్టం తగ్గి పైరుకు బాగా ఉపయోగపడుతుంది. 2 రోజుల తర్వాత మళ్లీ నీరు పెట్టాలి. భాస్వరం/భాస్వరం కలిసిన కాంప్లెక్స్ ఎరువును పైపాటుగా వేయొద్దు. డిసెంబర్-జనవరిల్లో నాటిన చెరకు మొక్క తోట, కార్శి తోటలకు జడ చుట్లు వేసుకోవాలి. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న వర్షాధారపు చెర కు సాగులో, జూలైలో నాటిన చెరకు తోటలకు రెండో దఫా నత్రజని (ఎకరానికి 35 కిలోల యూరియా) భూసార పరీక్షాధారంగా వాడుకోవాలి.లోతట్టు ప్రాంతాల్లో, అధిక నత్రజని వాడకమున్న చెరకు తోటలకు దూదేకుల పురుగు, పొలుసు పురుగు, తెల్ల ఈగ ఆశించడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి చెరకు తోటలను పర్యవేక్షించి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎల్లో లీఫ్ వ్యాధి చెరకుకు సోకుతోంది. ఇది సోకిన తోట నుంచి తెచ్చిన విత్తనం వాడకూడదు. కార్శి కూడా చేయకపోవడం శ్రేయస్కరం. మిరప నారుమళ్ల పెంపకానికి సరైన అదును ఇదే. 6 వారాల వయస్సు గల మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారు ముదిరినట్లైతే తలలు తుంచి నాటుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
ఆశల సాగు
శ్రీకాకుళం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో కుదేలైన జిల్లా రైతులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో పంట సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రకృతి విపత్తుల మాటెలా ఉన్నా.. ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ఎరువులు, విత్తనాల సమస్యకు తోడు ఈసారి పంట రుణాల సమస్య ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రతికూలతలు, అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల బిజీ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అధికారులు ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఏటా విత్తనాలతో సమస్య జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంట వరి. గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో పంట నష్టపోయి విత్తనాలు తయారు చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో ఖరీఫ్ సగటు సాగు విస్తీర్ణం 2.53 లక్షల హెక్టార్లు. ఇందులో 1.85 లక్షల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగిలిన విస్తీర్ణంలో గోగు, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది సుమారు 2.05 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణమైన 1.85 లక్షల హెక్టార్లకు సుమారు 1.45 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. ఇందులో 30 శాతం అంటే సుమారు 45 వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సాధారణంగా ప్రభుత్వం అందిస్తోంది. కానీ ఈ ఏడాది 49 వేల క్వింటాళ్ల విత్తనాలు అందనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 20 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఎలా చూసుకున్నా అవసరమైన విత్తనాల్లో ఇది మూడో వంతు మాత్రమే. మిగిలిన విత్తనాలను రైతులే సమకూర్చుకోవలసి వస్తోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్క గింజ కూడా లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తాయని, గతంలో ఇది తమకు అనుభవమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రైవేటుగా కొనుగోలు చేసే విత్తనాల్లో నకిలీ, నాసిరకం ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు. ఎరువులదీ అదే దారి ఎరువుల విషయంలోనూ రైతులు ఇదే రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుకునే స్వేచ్ఛను ఆయా కంపెనీలకే కట్టబెట్టడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. జిల్లాకు ఖరీఫ్‌లో 99373 టన్నుల ఎరువులు అవసరం. ఇందులో డీఏపీ 15950 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 18390 టన్నులు ఉన్నాయి. జిల్లా రైతులు సేంద్రియ ఎరువులపై ఆసక్తి చూపకుండా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. వీటి ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతుండటం.. సీజనులో డిమాండ్ తగినంతగా సరఫరా కాకపోవడం సమస్యగా పరిణమిస్తోంది. మట్టి నమూనా ఫలితాలు అందేనా.. పంటల సాగులో భూసారం తెలుసుకోవడం అత్యంత ప్రధానం. ఏటా వ్యవసాయ శాఖ భూసార పరీక్షలంటూ రైతుల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తోంది. వాటి ఫలితాలను సకాలంలో రైతులకు అందజేయడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపే పనిలో వ్యవసాయాధికారులున్నారు. అయితే వాటిని ఎప్పుడు పరీక్షిస్తారు.. ఫలితాలు ఎప్పుడు రైతులకు అందజేస్తారన్నవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలే. అవగాహన లోపం పంటల సాగు విధానంలో వస్తున్న మార్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అందుబాటులో ఉన్న పథకాలు.. తదితర అంశాలపై రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రకరకాల పేర్లతో గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది గ్రామాల్లో ఎన్నికల హడావుడి, అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో చైతన్య యాత్రలు అటకెక్కాయి. అరకొర పరిజ్ఞానంతోనే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. -
నష్టం అపారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయి. గత నెల చివరి వారంలో కురిసిన అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో గత ఐదురోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో 2,020 హెక్టార్లలో పంటలు నీటి పాలయ్యాయి. ఇందులో ఐదు మండలాల్లో 784 హెక్టార్లలో వరి పంట పూర్తిగా ధ్వంసమైంది. అదే విధంగా 9 మండలాల్లో 1,236 హెక్టార్లలో ఉద్యాన పంటలు పాడై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాలతో కూడిన నివేదిక తయారు చేసింది. ఈ వివరాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే తుది నివేదికలు తయారయ్యేనాటికి నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 50శాతం దాటితేనే లెక్క.. అకాల వర్షాల ధాటికి పెద్దఎత్తున పంట నష్టం జరిగినప్పటికీ అధికారులు మాత్రం నిబంధనలకు లోబడే వివరాలు సేకరిస్తున్నారు. రైతు సాగు చేసిన విస్తీర్ణంలో కనిష్టంగా 50శాతం విస్తీర్ణంలో పంట పాడైతేనే నష్టం జరిగినట్లు లెక్క చూపుతున్నారు. 50శాతం కంటే ఏ మాత్రం తక్కువ నష్టం జరిగినా వాటిని జాబితాలోకి తీసుకోవడం లేదు. సర్కారు నిబంధనలతో రైతులందరికీ నష్టపరిహారం హుళక్కేనని తెలుస్తోంది. అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, దోమ, కందుకూరు మండలాల్లో 784 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. అదే విధంగా షాబాద్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, శంకర్పల్లి మండలాల్లో 1,236 హెక్టార్లలో కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే ప్రభుత్వం పంటలవారీగా నష్టం విలువను ప్రకటించకపోవడంతో కేవలం నష్టం విస్తీర్ణాన్ని గుర్తించినట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. -
ఐకేపీకి 89 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు
25 కేంద్రాలను లాగేసుకున్న పీఏసీఎస్ చైర్మన్లు.. నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా ఉన్నతాధికారులు మహిళా సంఘాలకు అన్యాయం.. సాక్షి, నిజామాబాద్: మహిళా సంఘాలు నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పీఏసీఎస్ చైర్మన్ల కన్ను పడింది. కమీషన్ రూపంలో కాసులు కురిపిస్తున్న ఈ కేంద్రాల నిర్వహణ కోసం వీరు తహతహలాడుతున్నారు. పీఏ సీఎస్‌లకు కేటాయించిన కేంద్రాలే కాకుండా, తమ రా జకీయ పలుకుబడిని ఉపయోగించి ఐకేపీ (ఇందిర క్రాంతి పథం) సంఘాలకు మంజూరైన కొనుగోలు కేంద్రాలను కూడా లాగేసుకున్నారు. ఈ ఖరీఫ్ సీజనులోనే మహిళా సంఘాలకు మంజూరైన వాటిలో ఏకం గా 25 కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్లు ఎగురేసుకుపోయారు. దీంతో ఈ కేంద్రాల ద్వారా వచ్చే కమీషన్ సొ మ్ము మహిళా సంఘాలకు రాకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలను ఐకేపీకి కేటాయించడం ద్వారా ఆ యా గ్రామ సంఘాలు (వీఓ)లు ఆర్థికంగా బలోపేతమవుతాయి. గ్రామంలో ఉన్న స్వయం సహాయక సం ఘాల మహిళలకు ఈ వీఓ నుంచి రుణాలు విరివిగా దొరుకుతాయి. పీఏసీఎస్‌లకు వచ్చే కమీషన్‌తో మా త్రం రైతుల కంటే నేతలే ఎక్కువ ప్రయోజనం పొందుతారనే ఆరోపణలున్నాయి. ఐకేపీకి అనుమతించింది.. 89 కేంద్రాలు.. జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఖరీఫ్ కొనుగోలు సీజను ప్రణాళికను రూపొందించారు. ఈ సారి ఐకేపీ మహిళా సంఘాలకు జిల్లావ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశారు. అయితే నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇందులో 25 కేంద్రాలను పీఏసీఎస్‌లకు కట్టబెట్టేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులకు త లొగ్గి 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను మార్చి వేశారు. 64 కేంద్రాలకు కుదించారు. ఈ మేరకు ఐకేపీకి రీఆర్డర్లు జారీ చేశారు. ఈ కేంద్రాల మంజూరులో మహిళా సంఘాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ఐకేపీ ఉన్నతాధికారులు బసవన్నల్లా తలూపారనే విమర్శలు వస్తున్నాయి. మచ్చుకు కొన్ని... డిచ్పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి కొనుగోలు కేం ద్రాన్ని అధికారులు ఐకేపీ మహిళా సంఘానికి మం జూరు చేశారు. తరువాత అధికార పార్టీ నేత ప్రోద్బలంతో ఈ కేంద్రాన్ని పీఏసీఎస్‌కు కట్టబెట్టారు. ఆర్మూ ర్ మండలం పెర్కిట్ కేంద్రాన్ని కూడా రాజకీయ ఒత్తిడి మేరకు పీఏసీఎస్‌కు అప్పగించారు. ఇలా మహిళా సంఘాలకు మంజూరైన నవీపేట్, తిరుమలాపూర్ (బాన్సువాడ మండలం), రాంపూర్, కారేగాం (పిట్లం), ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్ (బీర్కూర్), పడకల్, పడిగెల (జక్రాన్‌పల్లి), పెర్కిట్ (ఆర్మూర్), తల్వేద (నందిపేట్) తదితర కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్లు తమ రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని లాగేసుకున్నారు. దీంతో ఆయా మహిళా సం ఘాలు ధాన్యం కొనుగోళ్ల ద్వారా కమీషన్ రూపంలో వచ్చే రూ. లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. పెట్టుబడి లేని దందా.. భారీ మొత్తంలో కమీషన్ వచ్చే ఈ కేంద్రాల నిర్వహణకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. రెండు, మూడు నెలలు దృష్టి సారిస్తే రూ.లక్షల్లో వెనుకేసుకోవచ్చు. కొనుగోళ్లకు అవసరమైన పెట్టుబడి ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. రవాణా తదితర ఖర్చులన్నీ సివిల్‌సప్లయ్ కార్పొరేషనే భరిస్తుంది. ఆ ఏర్పాట్లు కూడా ఆ శాఖ అధికారులే చూసుకుంటారు. కేంద్రాని కి వచ్చే ధాన్యం నాణ్యతను పరిశీలించి తూకం వేయి స్తే చాలు కమీషన్ వస్తుంది. ప్రస్తుతం రూ.2.5 శాతం చొప్పున కమీషన్ చెల్లిస్తున్నారు. విచ్చల విడిగా కొనుగోళ్లు.. ధాన్యం కొనుగోళ్లలో జిల్లాలోని ఎస్‌హెచ్‌జీ మహిళ లు ఎంతో నైపుణ్యం సాధించారు. ధాన్యం నాణ్యతను నిశితంగా పరిశీలిస్తారు. కొనుగోళ్లలో ఏళ్ల తరబడి అనుభవం కలిగిన ఈ మహిళలు ఏటా విజయవంతంగా కొనుగోళ్లను సాగిస్తున్నారు. ఇప్పుడు అధికారులు పీఏసీఎస్‌లకు అప్పగించడం ద్వారా విచ్చల విడిగా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేం ద్రాల్లో తూకాలు వేయకుండానే నేరుగా లారీల్లో రైసుమిల్లులకు తరలిస్తున్నారు. దీంతో ఆయా మిల్లర్లు తూకాల్లో మోసాలకు పాల్పడితే ధాన్యం విక్రయిం చిన రైతులు రూ. వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు జరిగితే ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. ఇలా కొన్ని పీఏసీఎస్‌లలో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు కమీషన్ రూపంలో కాసులు కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం పీఏసీఎస్ చైర్మన్ల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. సుమా రు 50 పైగా దరఖాస్తులు సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ అధికారుల వద్ద ఉన్నాయంటే ఈ కేంద్రాల నిర్వహణ కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ కేంద్రాల ఏర్పాటు లో ఐకేపీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తే నిరుపేద స్వయం సహాయక సంఘాల మహిళలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిత్యావసర సరుకుల ధరలు పైపైకి..
చెన్నూర్, న్యూస్‌లైన్ : నిత్యావసర ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నారుు. బియ్యం.. పప్పు.. చింతపండు.. నూనె.. ఇలా.. దేని ధర చూసినా ఆకాశాన్నంటింది. ఇక ఉల్లి ధర.. కళ్లెంట నీళ్లు తెప్పిస్తోంది. కూరగాయల ధరలూ బెదరగొడు తున్నాయి. జీతం డబ్బులు సరుకులకే సరిపోతున్నాయని, ఇలాగైతే బతుకుడు ఎలా అని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చడి మెతుకులు చాలంటున్నారు. భారీగా పెరుగుదల.. గతంలో రూ.45 ఉన్న పామాయిల్ నూనె లీట ర్ ధర ప్రస్తుతం రూ.65కు చేరుకుంది. రూ.20 ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర రూ.60కి చేరుకోగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నారుు. పప్పు.. అల్లం.. ఎల్లిగడ్డ.. ఇతర సరుకులదీ ఇదే పరిస్థితి. ఇదే రీతిన సరుకుల ధరలు పెరుగుతూ పోతే పస్తులుండక తప్పదని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిలో కొనేవారు అరకిలో, అరకిలో కొనేవారు పావుకిలో కొటూ సరిపెట్టుకుంటున్నారు. అత్యవసర సరుకులే కొంటున్నారు. కూరగాయల ధరల పుణ్యమా అని కొన్ని రోజులుగా పప్పులకే ప్రాధాన్యమిస్తున్నారు. వ్యాపారుల దోపిడీ.. నెల రోజల నుంచి సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం కొనసాగుతుండడంతో ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలు నిలిచా రుు. దీని ప్రభావం నిత్యావసర సరుకులు, కూ రగాయలపై పడింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సరుకుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేరే చోట సరుకులు నిల్వ చేస్తూ ధరలు అమాంతం పెంచుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే సరుకుల ధరలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏం కొనలేకపోతున్నం.. ధరలు మండుతున్నయ్. ఏం కొనాలన్నా భయమేస్తంది. ఎన్ని పైసలు తీసుకెళ్లినా సరిపోతలేవు. మార్కెట్‌కు వెళ్లి కిలో తెచ్చేవి అరకిలో తెస్తున్నం. ఏవీ పూర్తిగా కొనలేకపోతున్నం. ఇలాగే ధరలు పెరుక్కుంట పోతే రోజుకు ఒక్కపూట కూడా తినుడు కష్టమే. - ఇంగిలి మల్లయ్య, రిటైర్డ్ సింగరేణి కార్మికుడు ఎలా బతుకుడు ఇద్దరం పనిచేస్తే రోజుకు రెండొందలు కూడా గిట్టుబాటు అరుుతలేదు. మార్కెట్‌కు పోతే ధరలేమో మండుతున్నయి. బియ్యం, పప్పులు, నూనె, కూరగాయల ధరలు బాగా పెరిగినయ్. చేసిన కష్టం ఒక్క పూటకు సరిపోతలేదు. పిల్లలను ఎలా చదివించుడు.. ఎలా బతుకుడు.? - పున్నం నర్మద, చెన్నూర్ -
ఏనుగుల హల్చల్
క్రిష్ణగిరి, న్యూస్‌లైన్: హొసూరు సమీపంలోని పోడూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నాలుగు ఏనుగుల మంద తుప్పుగానపల్లి అగరం, శ్యానమావు గ్రామాల వద్ద గురువారం రాత్రి హల్చల్ చేసింది. శ్యానమావు, తుప్పుగాన పల్లి, అగరం గ్రామాల్లో వరి, టమాట పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. అగరం గ్రామానికి చెందిన రైతులు మునిస్వామి (40) వరి, తక్కాలి పంటలను ధ్వంసం చేశాయి. రామయ్యకు చెందిన వరి నారుమడి, వెంకటేశ్, కుంజప్పలకు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు. లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. ఈ నాలుగు ఏనుగుల మందలో ఒక ఏనుగు అడవిలోకి వెళ్లిపోగా, మరో ఏనుగు తప్పించుకుంది. మిగిలిన రెండు ఏనుగులు తుప్పుగానపల్లి చెరువులో తిష్టవేశాయి. తప్పించుకున్న ఏనుగు ఎటువైపు వెళ్లిందోనని అటవీశాఖ అధికార్లు ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి చెరువులో మకాం వేసిన ఏనుగులు ఎక్కడికి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు. తుప్పుగానపల్లి చెరువులో మకాం వేసిన ఏనుగులను సాయంత్రానికి పోడూరు అటవీ ప్రాంతానికి తరలించనున్నట్లు అటవీశాఖ అధికార్లు తెలిపారు.