లింగంపేట : ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు జీవం వచ్చింది. అయితే వాతావరణంలో మార్పుల వల్ల సోయా, వరి పంటలకు చీడపీడలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చాలా చోట్ల సోయా, వరి పంటలను కాండం తొలుచు పురుగు, బొంతపురుగు, పాముపొడ తెగులు ఆశిస్తున్నాయని, ఇవి పంటలకు నష్టం కలిగిస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి రమేశ్ పేర్కొన్నారు.
మూడు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతో కాండం తొలుచు పురుగు ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు పంటలను నిత్యం గమనించాలని, పురుగులు, తెగుళ్ల లక్షణాలు కనిపించగానే సస్య రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
నివారణ చర్యలు
మండలంలో సోయా పంట ప్రస్తుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల కాండం తొలుచు పురుగు ఆశించింది. దీని నివారణకు ట్రైజోపాస్ 200ల గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బొంత పురుగు నివారణకు ఎసిఫేట్ 400ల గ్రాములు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వరిలో పాముపొడ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణ కోసం ప్రొఫెనోపాస్ 400ల మిల్లీ లీటర్ల మందు లేదా లాంబ్డా 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
వరి చిరుపొట్ట దశలో ఎకరానికి 15 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే రసాయన ఎరువును తప్పనిసరిగా వాడాలి. పొటాష్ వాడకం వల్ల గింజ నాణ్యత బాగా పెరుగుతుంది.
వరి పొట్ట దశలో నత్రజని తక్కువగా ఉపయోగించాలి. యూరియా ఎక్కువగా వేస్తే గింజ గట్టి పడే దశలో మెడవిరుపు తెగులు(నెక్‌బ్లాస్ట్) ఆశించి దిగుబడులు తగ్గుతాయి.
పంటల్లో చీడపీడలు
Published Tue, Sep 9 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement