Soy crop
-
సోయా పొట్టే కదాని.. తగలబెట్టకండి
బాల్కొండ: ఖరీఫ్‌లో సాగుచేసిన సోయా పంట నూర్పిళ్లు ప్రస్తుతం రైతులు చురుగ్గా చేపడుతున్నారు. సోయా పంటను ప్రస్తుత సంవత్సరం నేరుగా నూర్పిడి చేయడంతో పాటు కోత కోసి కుప్ప వేసి హర్వేస్టర్‌తో నూర్పిడి చేస్తున్నారు. ఇలా నూర్పిడి చేయడంతో సోయా విత్తనాలు ఓ వైపు, సోయా పొట్టు మరోవైపు వేరవుతుంటాయి. కాని సోయా పొట్టును రైతులు సాధారణంగా తగలబెడతారు. సోయా పొట్టే కదాని రైతులు నిర్లక్ష్యంగా పంట భూములను శుభ్రం చేయాలనే ఆలోచనతో తగుల బెడుతుంటారు. సోయా పొట్టులో భూమిలో భూసారం పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. సోయా పొట్టును కుప్పలుగా చేసి పంట భూమి వద్ద పెద్ద గుంతను తవ్వి గుంతలో వేయాలి. మంచిగా మాగిన తర్వాత తీసి వేస్తే భూసారం పశువుల పేడ వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా పెంచుతుంది. ఎకరా సోయా పంట లో వెళ్లే పొట్టు ఓ లారీ పశువుల పేడతో సమానం. ఖరీఫ్‌లో పశువుల పేడ లారీ సుమారు రూ.15 వేల ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతులు, సోయా పొట్టుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. తవ్విన గుంతలో సోయా పొట్టు వేసిన త ర్వాత బాగా నీరు పట్టాలి. అలా చేయడం వల్ల అది మంచి ఎరువుగా తయారవుతుంది. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా సాగయ్యే పంట కాబట్టి సోయాలో అనేక పోషకాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. సోయా పొట్టును తగుల పెట్టడం వల్ల పొట్టుతో పాటు భూమికి చేటు అవుతుందంటున్నారు. వేడి వల్ల భూమిలో ఉండే వానపాములు చనిపోతాయి. వాటి తో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పంట పండించే నేలలో నిప్పు పెట్టరాదంటున్నారు. భూసారం కూడా తగ్గుతుందంటున్నారు. భూమి వదులుగా మారుతుంది. సోయా పొట్టును మంచి ఎరువుగా మలుచుకొని పసుపు సాగుచేసే భూమిలో వేయాలి. దీని ద్వారా రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూసారం పెరిగి పంట దిగుబడులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రైతులారా ఆలోచించండి..! -
అంతర పంటలు.. అదనపు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా రైతాంగం అంతర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సోయా పంటలో కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లలో సోయా పంట వే సుకున్నారు. ఇందులో అంతర పంటగా ఎక్కువగా కంది విత్తుకున్నారు. 11 వేల హెక్టార్లలో కంది విత్తుకున్నట్లు తెలుస్తోంది. సోయా దిగుబడి వచ్చేలోపు మరో పంట కూడా చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంటలో 2 వేల హెక్టార్ల వరకు కంది విత్తనం అంతర పంటగా వేసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా జైనథ్, బేల, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల్లో అంతర పంటలుగా కంది వేశారు. నిర్మల్ డివిజన్లో పసుపు పంటలో మొక్కజొన్న వేసుకున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు మరిన్ని సలహలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు. -
పంటల్లో చీడపీడలు
లింగంపేట : ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు జీవం వచ్చింది. అయితే వాతావరణంలో మార్పుల వల్ల సోయా, వరి పంటలకు చీడపీడలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చాలా చోట్ల సోయా, వరి పంటలను కాండం తొలుచు పురుగు, బొంతపురుగు, పాముపొడ తెగులు ఆశిస్తున్నాయని, ఇవి పంటలకు నష్టం కలిగిస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి రమేశ్ పేర్కొన్నారు. మూడు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతో కాండం తొలుచు పురుగు ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు పంటలను నిత్యం గమనించాలని, పురుగులు, తెగుళ్ల లక్షణాలు కనిపించగానే సస్య రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నివారణ చర్యలు మండలంలో సోయా పంట ప్రస్తుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల కాండం తొలుచు పురుగు ఆశించింది. దీని నివారణకు ట్రైజోపాస్ 200ల గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బొంత పురుగు నివారణకు ఎసిఫేట్ 400ల గ్రాములు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వరిలో పాముపొడ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణ కోసం ప్రొఫెనోపాస్ 400ల మిల్లీ లీటర్ల మందు లేదా లాంబ్డా 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. వరి చిరుపొట్ట దశలో ఎకరానికి 15 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే రసాయన ఎరువును తప్పనిసరిగా వాడాలి. పొటాష్ వాడకం వల్ల గింజ నాణ్యత బాగా పెరుగుతుంది. వరి పొట్ట దశలో నత్రజని తక్కువగా ఉపయోగించాలి. యూరియా ఎక్కువగా వేస్తే గింజ గట్టి పడే దశలో మెడవిరుపు తెగులు(నెక్బ్లాస్ట్) ఆశించి దిగుబడులు తగ్గుతాయి. -
విత్తన తిప్పలు తప్పాయిలా
బాల్కొండ : రెంజర్లకు చెందిన రైతు బొమ్మెన భూమేశ్వర్‌కు రెండెకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో సోయా, మరో ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా సోయా పండిస్తున్నాడు. మొదటి రెండేళ్లు సోయా విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. పండించిన పంటలోంచి విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం గురించి తెలుసుకున్నాడు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకున్నాడు. విత్తనాలను ఉత్పత్తి చేసి వాటితోనే ఖరీఫ్‌లో పంట సాగు చేస్తున్నాడు. విత్తనోత్పత్తి గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సోయా పంట చేతికి రాగానే ఒక బస్తా సోయా విత్తనాలను వేరుగా ఆర బెట్టాను. తేమ శాతం 12కు చేరుకున్న తర్వాత మట్టి పెళ్లలను, పగిలిన, ముక్కిన విత్తనాలను తీసివేశాను. తర్వాత కార్బండిజమ్, మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించి, మళ్లీ ఎండలో ఆరబెట్టాను. రెండు రోజుల తర్వాత ప్లాస్టిక్ బస్తాలో నింపి, తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. సోయా పంట విత్తే సమయంలో విత్తనాలను మళ్లీ ఆర బెట్టాను. 100 విత్తనాలను తీసుకొని నీటిలో నానబెట్టాను. అందులోంచి 80 శాతం కంటే ఎక్కువ విత్తనాలకు మొలకలు వచ్చాయి. దీంతో విత్తనాలను పొలంలో చల్లాను. ఎకరానికి 40 కిలోల విత్తనాలు సరిపోయాయి. 80 శాతం కంటే ఎక్కువే మొలకెత్తాయి. పంట బాగా ఎదుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి తెగులూ సోకలేదు. పూత కూడా బాగానే వస్తోంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా’’ అని వివరించాడు.