బాల్కొండ : రెంజర్లకు చెందిన రైతు బొమ్మెన భూమేశ్వర్‌కు రెండెకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో సోయా, మరో ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా సోయా పండిస్తున్నాడు. మొదటి రెండేళ్లు సోయా విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. పండించిన పంటలోంచి విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం గురించి తెలుసుకున్నాడు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకున్నాడు. విత్తనాలను ఉత్పత్తి చేసి వాటితోనే ఖరీఫ్‌లో పంట సాగు చేస్తున్నాడు.
విత్తనోత్పత్తి గురించి ఆయన మాటల్లోనే..
‘‘సోయా పంట చేతికి రాగానే ఒక బస్తా సోయా విత్తనాలను వేరుగా ఆర బెట్టాను. తేమ శాతం 12కు చేరుకున్న తర్వాత మట్టి పెళ్లలను, పగిలిన, ముక్కిన విత్తనాలను తీసివేశాను. తర్వాత కార్బండిజమ్, మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించి, మళ్లీ ఎండలో ఆరబెట్టాను. రెండు రోజుల తర్వాత ప్లాస్టిక్ బస్తాలో నింపి, తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. సోయా పంట విత్తే సమయంలో విత్తనాలను మళ్లీ ఆర బెట్టాను.
100 విత్తనాలను తీసుకొని నీటిలో నానబెట్టాను. అందులోంచి 80 శాతం కంటే ఎక్కువ విత్తనాలకు మొలకలు వచ్చాయి. దీంతో విత్తనాలను పొలంలో చల్లాను. ఎకరానికి 40 కిలోల విత్తనాలు సరిపోయాయి. 80 శాతం కంటే ఎక్కువే మొలకెత్తాయి. పంట బాగా ఎదుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి తెగులూ సోకలేదు. పూత కూడా బాగానే వస్తోంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా’’ అని వివరించాడు.
విత్తన తిప్పలు తప్పాయిలా
Published Fri, Aug 22 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement