బాల్కొండ: ఖరీఫ్‌లో సాగుచేసిన సోయా పంట నూర్పిళ్లు ప్రస్తుతం రైతులు చురుగ్గా చేపడుతున్నారు. సోయా పంటను ప్రస్తుత సంవత్సరం నేరుగా నూర్పిడి చేయడంతో పాటు కోత కోసి కుప్ప వేసి హర్వేస్టర్‌తో నూర్పిడి చేస్తున్నారు. ఇలా నూర్పిడి చేయడంతో సోయా విత్తనాలు ఓ వైపు, సోయా పొట్టు మరోవైపు వేరవుతుంటాయి.
కాని సోయా పొట్టును రైతులు సాధారణంగా తగలబెడతారు. సోయా పొట్టే కదాని రైతులు నిర్లక్ష్యంగా పంట భూములను శుభ్రం చేయాలనే ఆలోచనతో తగుల బెడుతుంటారు. సోయా పొట్టులో భూమిలో భూసారం పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. సోయా పొట్టును కుప్పలుగా చేసి పంట భూమి వద్ద పెద్ద గుంతను తవ్వి గుంతలో వేయాలి. మంచిగా మాగిన తర్వాత తీసి వేస్తే భూసారం పశువుల పేడ వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా పెంచుతుంది.
ఎకరా సోయా పంట లో వెళ్లే పొట్టు ఓ లారీ పశువుల పేడతో సమానం. ఖరీఫ్‌లో పశువుల పేడ లారీ సుమారు రూ.15 వేల ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతులు, సోయా పొట్టుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. తవ్విన గుంతలో సోయా పొట్టు వేసిన త ర్వాత బాగా నీరు పట్టాలి. అలా చేయడం వల్ల అది మంచి ఎరువుగా తయారవుతుంది. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా సాగయ్యే పంట కాబట్టి సోయాలో అనేక పోషకాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు.
సోయా పొట్టును తగుల పెట్టడం వల్ల పొట్టుతో పాటు భూమికి చేటు అవుతుందంటున్నారు. వేడి వల్ల భూమిలో ఉండే వానపాములు చనిపోతాయి. వాటి తో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పంట పండించే నేలలో నిప్పు పెట్టరాదంటున్నారు. భూసారం కూడా తగ్గుతుందంటున్నారు. భూమి వదులుగా మారుతుంది. సోయా పొట్టును మంచి ఎరువుగా మలుచుకొని పసుపు సాగుచేసే భూమిలో వేయాలి. దీని ద్వారా రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూసారం పెరిగి పంట దిగుబడులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రైతులారా ఆలోచించండి..!
సోయా పొట్టే కదాని.. తగలబెట్టకండి
Published Tue, Oct 7 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement