organic fertilizer
-
సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ.. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్‌ను 2021 డిసెంబర్ 20న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు. 21న రైతులకు అవగాహన సదస్సు సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట బ్రాండ్‌తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్‌రావు మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్‌తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు. -
Siddipet: తడి చెత్తతో సీఎన్జీ
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తడి చెత్తతో సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) తయారు చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి, హానికరమైన చెత్తను సేకరిస్తున్నారు. ఇప్పటికే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నా, అంచనాలకు మించి చెత్త రావడంతో బెంగళూరు తరహాలో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. మంత్రి ఆలోచన మేరకు మున్సిపల్ అధికారులు ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యయం.. రూ.4.7 కోట్లు సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.4.7 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షెడ్ నిర్మాణం చివరి దశకు చేరింది. స్వచ్ఛ భారత్ నిధులతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ మున్సిపాలిటీలో 39,616 కుటుంబాల్లో 1.46 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ నిత్యం 25 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నారు. ప్రాజెక్ట్ నమూనా చిత్రం గ్యాస్ తయారీ ఇలా ఇంటింటా సేకరించిన తడి చెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం దీనిని పైపు ద్వారా ఫ్రి డైజెస్టర్ అనే ట్యాంక్‌లోకి పంపిస్తారు. తర్వాత డైజెస్టర్ ట్యాంక్‌లోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు ఉన్న మరో ట్యాంక్‌లోకి ఇక్కడ తయారైన ద్రావణాన్ని పంపిస్తారు. అనంతరం ఆ ట్యాంక్‌లో మైక్రో ఆర్గాన్లను వేస్తారు. ఆ సమయంలో విడుదలయ్యే మిథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరు చేసి సిలిండర్లలో నింపుతారు. నిర్వహణ బాధ్యత ప్రైవేటుకు గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపాలిటీతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. గ్యాస్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం మున్సిపాలిటీ, 75 శాతం కంపెనీ తీసుకుంటాయి. ఆగస్టు చివరి వరకు పూర్తి ఆగస్టు చివరి నాటికి గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తవు తుంది. అనంతరం ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్య తలు అప్పగిస్తాం. దాదాపు ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. –రమణాచారి, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
సిద్దిపేటలో వినూత్న ప్రక్రియ
సాక్షి, సిద్దిపేట: వినూత్న ప్రక్రియలకు సిద్దిపేట వేదికగా నిలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను వార్డు స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి అక్కడ ఎరువు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇలా తయారైన ఎరువును పట్టణంలోని మిద్దె తోటల పెంపకందారులకు నామమాత్ర రుసుముతో అందించాలని యోచిస్తోంది. మున్సిపల్ ఆలోచనకు సత్ఫలితాలు లభిస్తే భవిష్యత్తులో పట్టణంలో మిద్దె తోటల పెంపకానికి సేంద్రియ ఎరువులు అందుబాటులోకి రానున్నాయి. తడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీ ఇలా ఇంట్లో ప్రతిరోజూ మిగిలిపోయిన కూరగాయలు, పూజకు వినియోగించిన పువ్వులు, కుళ్లిన పండ్లు, మిగిలిన అన్నం– కూరలు, మాంస వ్యర్థాలు ఇతరత్రా తడి చెత్త నుంచి సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ ఎరువు తయారు చేసే ప్రక్రియను గతేడాది చేపట్టారు. అందుకు అనుగుణంగానే పట్టణంలోని పాత మాతాశిశు సంక్షేమ కేంద్రం, లింగారెడ్డిపల్లి, మందపల్లి డంప్‌యార్డు, బుస్సాపూర్ డంప్‌యార్డులో తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని ఇళ్ల నుంచి 27 మెట్రిక్ టన్నుల తడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన తడి చెత్తను నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇలా రోజూ సేకరిస్తున్న తడి చెత్త నుంచి ఆయా ప్రాసెసింగ్ యూనిట్లలో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ తొమ్మిది మెట్రిక్ టన్నుల తడి చెత్తను ఎరువుగా మార్చుతున్నట్లు మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి. నాలుగు చోట్ల తయారీ స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా పట్టణంలో నాలుగు చోట్ల ప్రస్తుతం తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు ఆలోచనకు అనుగుణంగా వార్డు స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లను భవిష్యత్తులో విస్తరించే ఆలోచనలో ఉన్నాం. వార్డులో ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను అదే వార్డులో ఎరువుగా తయారు చేస్తాం. ముందుగా హరితహారం మొక్కలకు, మిద్దె తోటల పెంపకందార్లకు సేంద్రియ ఎరువును పంపిణీ చేస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ బల్దియా ఆలోచన బాగుంది మిద్దె తోటలకు తడి చెత్తతో తయారైన సేంద్రియ ఎరువును అందించాలనే మున్సిపల్ అధికారుల ఆలోచన మంచిది. ప్రస్తుతం పట్టణాలో మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే పెద్దసంఖ్యలో మిద్దె తోటల పెంపకం సాగుతోంది. బహిరంగ మార్కెట్లో పది రూపాయలు పెట్టి ఎరువును కొంటున్నాం. మున్సిపల్ అధికారులు ఇప్పుడు నామమాత్ర ధరతో ఎరువు పంపిణీ చేస్తే ఉపయోగకరమే. – నాగరాజు, మిద్దె తోటల పెంపకదారుడు మిద్దె తోటలకు సరఫరా దిశగా.. జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణీకరణ పెరుగుతోంది. ప్రజల జీవనశైలి మారుతోంది. తమ అభిరుచులకు అనుగుణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం పట్టణంలో అపార్ట్మెంట్ల సంస్కృతి 20 శాతం మేరకు పెరిగింది. అదే సమయంలో ఇష్టపడి నిర్మించుకుంటున్న ఇళ్ల పై భాగంలో మిద్దె తోటల పెంపకానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వంద వరకు మిద్దె తోటలను సంబంధిత గృహ యజమానులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పట్టణంలో తడి చెత్త ద్వారా తయారైన సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు, రైతులకు పంపిణీ చేసిన మున్సిపల్ అధికారులు ఇక మీదట మిద్దె తోటలకు సేంద్రియ ఎరువును సరఫరా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే ప్రతిరోజూ తొమ్మిది మెట్రిక్ టన్నుల తడి చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఎరువును మిద్దె తోటలతో పాటు హరితహారం కింద పెంచే మొక్కలకు అందించాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పట్టణంలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద ప్రత్యేకంగా సేంద్రియ ఎరువు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మిద్దె తోటల యజమానులను చైతన్యం చేసే దిశగా మున్సిపల్ యంత్రాంగం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. నామమాత్ర రుసుముతో సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా తడి చెత్త సమస్య పరిష్కారంతో పాటు బల్దియాకు ఆదాయపరంగానూ కలిసొచ్చేలా ద్విముఖ వ్యూహంతో మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ చదవండి: మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా: మంత్రి మల్లారెడ్డి ఆడియో కరోనా సెకండ్ వేవ్: రానున్న మూడు నెలలూ గడ్డురోజులే! -
సేంద్రియ పాల ఆవశ్యకత
రైతులకు బాసటగా నిలుస్తున్నది. మన దేశం సగటున రోజుకు 170 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అధిక పాల ఉత్పత్తితో పాటుగా, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పాల ఉత్పత్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ పూర్వరంగంలో మనం కూడా సేంద్రియ పాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భూమిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన దాణాలను, పశుగ్రాసాలను మేసిన పశువులు ఇచ్చే పాలే సేంద్రియ పాలు. ఇందులో ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండవు. సేంద్రియ పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం, తద్వారా ఖర్చు తగ్గడం. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన, కల్తీ లేని పాలను ఉత్పత్తి చేయటం. ► సేంద్రియ పాలలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలానే పాలీ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే. ► సేంద్రియ పాల పదార్థాలలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ► రసాయనిక ఎరువుల అవశేషాలు పాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి శరీరంలోని ముఖ్యభాగాలను – కాలేయాన్ని, మూత్రపిండాలను, పేగులను దెబ్బతీస్తాయి. ► సేంద్రియ పాలను ఉత్పత్తి చేయటం అంత తేలికైన విషయం కాదు. పశువుకు మేపే దాణా, మేత మొత్తాన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే పండించాలి. మొక్కజొన్న, జొన్నలు, తవుడు మొదలైనవి. ► సాధారణంగా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. రసాయనిక ఎరువుల వాడకం వలన ఇవి నశిస్తాయి. దీని వలన భూసారం తగ్గిపోయి, భూమి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. ► రసాయనిక ఎరువులు గాని, పురుగుమందులు గాని పశుగ్రాసాల సాగులో వాడితే ఆ పశుగ్రాసాలను తిన్న పశువుల పాలలో వాటి అవశేషాలు పేరుకుంటాయి. కొవ్వులతో జత కట్టే గుణం రసాయనాలకు ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి పాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ► పిల్లలు త్వరగా పరిపక్వ దశకు రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి సేంద్రియ పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ఉత్తమం. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి. -
చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..!
గుంటూరు నగరంలో తడి చెత్త, సేంద్రియ వ్యర్థాలపై గృహిణులు సమరం ప్రకటించారు. తడి చెత్త, వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి ఇవ్వకుండా సేంద్రియ ఎరువు తయారు చేస్తూ.. సేంద్రియ ఎరువుతో ఎంచక్కా ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో కుండీలు, కవర్లు, కంటెయినర్లలో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు లభిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమలు, అంటు వ్యాధుల బెడద తగ్గుతోంది. గుంటూరు నగరంలోని 23,24,25,28 వార్డుల్లో గృహిణులు తమ ఇళ్ళల్లో వచ్చే తడి వ్యర్ధాలతో ఇంటి దగ్గరే కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గుంటూరు సాధన కృషిలో భాగస్వాములవుతున్నారు. నగరపాలక సంస్థ, ఐటీసీ ‘బంగారు భవిష్యత్తు’ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్ ప్రాజెక్టు అమలును చేపట్టారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో ఐటీసీ సిబ్బంది, వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రెటరీలు, వార్డు వలంటీర్లు ఎవరికి వారు ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. 1,572 ఇళ్ళలో హోం కంపోస్టింగ్, ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. కంపోస్టు తయారీ విధానం ఇలా.. నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కంపోస్టు తయారీకి 20 లీటర్ల ఖాళీ బక్కెట్ సరిపోతుంది. బక్కెట్ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది. బక్కెట్లో ఒక్కోసారి పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుండడంతో గృహిణులు కంపోస్టు తయారీపై ఆసక్తి చూపుతున్నారు. వ్యర్థాల పునర్వినియోగంతో పాటు నగరవాసుల సేంద్రియ ఇంటిపంటల సాగుకు నగర పాలకుల ఊతం దొరకడం హర్షించదగిన పరిణామం. చెత్తకు కొత్త అర్థం ఇస్తున్నాం ఇంట్లో చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయకుండా హోంకంపోస్టు ద్వారా ఎరువుగా మార్చి చెత్తకు కొత్త అర్ధం ఇస్తున్నాం. జీఎంసీ, ఐటీసీ సహకారంతో మా ఇంట్లోనే నాణ్యమైన ఎరువు తయారు చేసుకుంటున్నాం. మా వీధుల్లో ఎవరూ చెత్త వేయడం లేదు. దోమలు, ఈగలు తగ్గాయి. – ఏలూరి విజయలక్ష్మి, వేమూరివారి వీధి, గుంటూరు వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం తడి వ్యర్ధాల నిర్వహణ ఇంట్లోనే జరుగుతోంది. ఇళ్ళల్లో చక్కని కిచెన్ గార్డెన్ పెంచడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, అంటువ్యాధుల నివారణ జరుగుతోంది. ఐటీసీ సహకారంతో వార్డు వలంటీర్లు, వార్డు ఎన్విరాన్మెంట్ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే కళ్యాణమండపాలు, హోటల్స్‌లో క్లస్టర్ కంపోస్టుల ఏర్పాటు జరుగుతోంది. ఇళ్లలోనే చెత్తతో కంపోస్టు చేయడం, కిచెన్ గార్డెన్ల సాగుపై నగర ప్రజలందరూ దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించాలి. – చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ సొంత కంపోస్టుతో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం మా ఇంటిలో చెత్తను బక్కెట్లో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాను. ఆ కంపోస్టును మొక్కలు, ఆకుకూరలకు ఎరువుగా వేస్తుంటే ఎంతో ఏపుగా, చక్కగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు సేంద్రియ ఎరువును మేమే తయారు చేసుకొంటున్నాం. చెత్తను మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం లేదు. – వేమూరి విశాలక్షి, ఏటీఅగ్రహారం, గుంటూరు కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం గుంటూరు నగరంలో తడి చెత్త, వ్యర్థాల నిర్వహణపై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గృహిణులకు అవగాహన కల్పించాం. అందుకు అవసరమైన కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువుతో రసాయన మందులు వినియోగం లేకుండా, చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు కిచెన్ గార్డెన్లో పెంచుకోవచ్చు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి. – ఐ.శామ్యూల్ ఆనందకుమార్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్, గుంటూరు – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు – గజ్జెల రాంగోపాల్‌రెడ్డి, స్టాప్ ఫొటోగ్రాఫర్, గుంటూరు -
భూసారాన్ని బట్టే చీడపీడల బెడద!
రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసుకోవాలన్న ఆసక్తి గాఢంగా ఉండాలే గాని సొంతిల్లే అవసరం లేదు. క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవచ్చని రుజువు చేస్తున్నారు డా. వి. శ్రీనివాసరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన కుటుంబంతో క్యాంపస్ క్వార్టర్లో నివాసం ఉంటూ.. పెరటి స్థలంలో ఇంటిపంటలు పండించుకుంటున్నారు. గతంలో క్వార్టర్ పై అంతస్తులో ఉండగా టెర్రస్ మీద ఐదేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతంతో ఇంటిపంటలు సాగు చేసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి పెరట్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాటావుల మాగిన పేడ ఎరువు, మేకల ఎరువు సమపాళ్లలో కలిపి మొక్కలకు వేస్తున్నారు. వేసవిలోనే దగ్గర్లోని గ్రామానికి వెళ్లి రైతు నుంచే కొనుగోలు చేసి తెచ్చుకొని వాడుతున్నారు. అరటి గెల ఆయన పెరటి తోటకు దీపస్థంభంలా భాసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన పెరటి తోటలో దొండ/బీర పాదులతోపాటు బెండ మొక్కలు, వంగ మొక్కలు, పుదీన ఉన్నాయి. వంగ మొక్కలకు వేసవికి ముందు 4–5 అంగుళాల ఎత్తున ప్రూనింగ్ చేశారు. కొత్త కొమ్మలకు ఇప్పుడు కాయలు వచ్చాయి. పుదీన, తోటకూర ఉంది. మృగశిర కార్తెతో పాటే రుతుపవనాలు పలుకరించిన తర్వాత వారం క్రితమే అనేక ఆకుకూరలు విత్తుకున్నారు.కూరగాయ మొక్కల విత్తనాల నారు పోసుకున్నారు. టెర్రస్ గార్డెన్లో కన్నా పెరటి తోటలో పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉన్నట్లు గమనించానని డా. శ్రీనివాసరావు తెలిపారు. భూమిలో సారం బాగుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. కట్టెల బొగ్గు పొడిని అప్పుడప్పుడూ మొక్కలపై చల్లుతుంటానన్నారు. వారానికోసారి లీటరు నీటికి 10–15 ఎం.ఎల్. నాటావు మూత్రాన్ని కలిపి పెరటి తోటలో పిచికారీ చేస్తున్నానని తెలిపారు. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో తమ పెరటి తోట కూరగాయలు, ఆకుకూరలనే తింటామని డా. శ్రీనివాసరావు(94922 93299) సంతోషంగా చెప్పారు. కొత్తిమీర, ఎరువును చూపుతున్న డా. శ్రీనివాసరావు -
ఆదర్శప్రాయం ఆమె సేద్యం!
వ్యవసాయంపై మక్కువ ఆమెను వృద్ధాప్యంలోనూ విశ్రాంతి తీసుకోనివ్వటంలేదు. బీఏ బీఈడీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు పల్లె రమాదేవి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కపల్లి పంచాయతీలోని ఎత్బార్పల్లి ఆమె స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమాదేవి 2002లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 38 ఎకరాలలో వ్యవసాయం చేపట్టారు. ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చునని నిరూపిస్తున్నారు. శ్రీ వరి సాగు విధానంలో వరి సాగు చేసి ఎకరాకు 50 బస్తాల దిగుబడి సాధించి ప్రశంసలు పొందారు. అధిక శాతం సేంద్రియ ఎరువులతోనే పంటలను సాగు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. తోటి రైతులకు సైతం సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతులను నేర్పిస్తున్నారు. గ్రామంలోని రైతులను కూడగట్టి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతు పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి పొదుపును ప్రోత్సహిం చారు. ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కష్టపడి పనిచేసుకుంటే లాభాలు వస్తాయని, పంటల సాగుతో పాటు పాడి పశువులను పెంచుకుంటే పాల ఉత్పత్తితో పాటు సేంద్రియ ఎరువులకూ కొరత ఉండదంటున్నారు ఆదర్శ మహిళా రైతు రమాదేవి(90003 02289). ఉత్తమ రైతుగా 5 పురస్కారాలు పొందడం విశేషం. – వడ్ల విశ్వనాథాచారి, మొయినాబాద్ రూరల్(చేవెళ్ల), రంగారెడ్డి జిల్లా -
ఎకరాకు 200 క్వింటాళ్లు
- ఉల్లిసాగులో సీతారామాపురం రైతు ప్రతిభ సీతారామాపురం(బేతంచెర్ల): ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న చందంగా ఏటా పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులు మరుసటి ఏడాది అంతకు రెట్టింపు ఆశలతో పంట సాగు చేస్తారు. ఈ ఏడాదైనా పంట కలసి రాకుండా పోతుందా అన్న ఆశ వారిని నడిపిస్తోంది. ఈ దశలో బేతంచెర్ల మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్వరరెడ్డి ఈ ఏడాది ఉల్లి సాగులో సక్సెస్ అయ్యాడు. బోరు నీటి ఆధారంగా రెండెకరాల్లో వెస్టు రకం ఉల్లి సాగు చేసిన ఇతడు 400 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ పంటకు ముందు సేంద్రియ ఎరువులను దుక్కిలో వేసినట్లు తెలిపారు. నారు నాటింది మొదలు కోత వరకు డ్రిప్ విధానంలో నీటి తడులు, ఎరువులు అందించాడు. వ్యవసాయ అధికారులు, నిపుణుల సలహాలు పాటించాడు. తాను పడిన కష్టానికి ఫలితం దిగుబడి రూపంలో వచ్చింది. ఎకరాకు 100 నుంచి 150 క్వింటాళ్లకు మించని దిగుబడి ఈయన పొలంలో 200 క్వింటాళ్లు వచ్చింది. క్వింటా రూ. 950 ప్రకారం అమ్మగా మొత్తంగా ఖర్చులు పోను రూ. 2లక్షల వరకు మిగిలిందని మల్లేశ్వరెడ్డి తెలిపారు. -
ప్రకృతి సాగే రైతుకు అండ
‘సాగుబడి’ పుస్తకావిష్కరణలో జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: ప్రతి రైతు రసాయన ఎరువులకు దూరంగా ఉండి ప్రకృతి సాగుబడి చేస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సాక్షి దినపత్రిక సాగుబడి డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు రాసిన ‘సాగుబడి’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులొచ్చి పల్లెల్లో ఊర పిచ్చుకలను చంపేశాయని, అలా పల్లెల్లో సాగు దెబ్బ తిన్నదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రపంచీకరణ ఫలితంగా మన దేశంలో ప్రకృతి నుంచి దూరమైన వ్యవసాయాన్ని తిరిగి ప్రకృతి ఒడిలోకి చేర్చేందుకు తెలుగులోకి వచ్చిన పుస్తకంగా ‘సాగుబడి’ని కొనియాడారు. ప్రకృతి సాగుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. రైతులు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే అప్పుల బాధతో ఏ రైతూ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరముండదని ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రకృతి సాగును ప్రోత్సహించి ఒక ఉద్యమంలా చైతన్యపరిస్తేనే సత్ఫలితాలుంటాయని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, నాబార్డ్ మాజీ సీజీఎం మోహనయ్య, బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడులు
జోగిపేట: సేంద్రియ ఎరువులతోనే మంచి ఫలితాలు ఉంటాయని సెర్ప్ నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం) రాష్ట్ర డెరైక్టర్ డి.వి.నాయుడు అన్నారు. గురువారం అందోలు మండలం పరిధిలోని నాదులాపూర్, నేరడిగుంట గ్రామాల్లో పర్యటించారు. ఈ ఎరువుల వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వస్తాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు వాడుతూ పంటలను సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రసాయన ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న నాదులాపూర్ గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య పొలాన్ని సందర్శించారు. ఆయన పండిస్తున్న పాలకూర, కొత్తిమీర, బీర తదితర పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు తయారు చేసుకున్న అజోలాను పరిశీలించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నాడెపు కంపోస్టును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఫెర్టిలైజర్ వాడకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. డీపీఎం వాసుదేవ్, ఏపీఎం సీఎంఎస్ఏ సంగీత, ఏపీఎం విశ్వేశ్వర్‌గౌడ్, సీఏ చెన్నయ్య, సీఆర్పీ రమేశ్, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామమ్మ భూమయ్య, వైస్ ఎంపీపీ రమేష్ , సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ సభ్యురాలు నల్లోల బాలమ్మ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
వ్యవసాయంలో.. ఆవుసాయం!
విచ్చలవిడిగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల సాగు ఖర్చు విపరీతంగా పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారని స్తంభాద్రిరెడ్డి అన్నారు. భూసారాన్ని పెంచడం, ఆచ్ఛాదన (మార్చింగ్), సహజ వనరులతో కషాయాలను తయారు చేసుకుని పిచికారీ చేయడం వల్ల పంట ఉత్పత్తులు విషతుల్యం కావన్నారు. రసాయన ఎరువులు వాడిన ధాన్యాన్ని తినడం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ట్రస్టు వ్యవ స్థాపకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్నదాతలకు తమ వంతు సాయంగా ఏదైనా చేయాలనే తలంపుతో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, వ్యవసాయశాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డెరైక్టర్ సుధాకర్, జాన్‌లు పుడమి పుత్రులకు సాగుపై సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ పిండి కనకయ్య పాల్గొన్నారు. భూసారం పెంపునకు పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు వాడాలి. జీవన ఎరువులు, ఘన, ద్రవ ఎరువులు తయారు చేసుకోవాలి. పొలాల్లో చెరువు మట్టిని వేసుకోవాలి. అంతర పంటలు సాగు చేయాలి. భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను రక్షించుకునేందుకు పంట వ్యర్థాలను వాడటంతో పాటు మిశ్రమ పంటలు సాగు చేయాలి. చీడపీడలు సోకిన చేలపై ఆవు పెడ, మూత్రంతో కొన్ని మిశ్రమాలు కలుపుకొని నిమ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్రి అస్త్రం, భీజామృతం, పుల్లటి మజ్జిగ, సొంటి పాల కషాయం తయారు చేసుకోవాలి. కషాయాల తయారీ జీవామృతం... 5 కిలోల ఆవు పేడను పల్చటి గుడ్డలో కట్టి 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల ఆవు పంచకం, 50గ్రాముల సున్నం, గుప్పెడు మట్టిని కలిపి 12 గంటల వరకు నానబెడితే ఎకరాకు కావాల్సిన జీవామృతం సిద్ధమవుతుంది. వరి, ఉల్లి, మిరప, టమాట, వంగ తదితర పంటలు వేసుకునే ముందు విత్తనాలను వీటిలో ముంచి విత్తుకుంటే తెగుళ్లను బాగా తట్టుకుంటాయి. ఘన జీవామృతం పంటకు కావలసిన సూక్ష, స్థూల పోషకాలు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసులు (రైతులు పండించినవి), గుప్పెడు మట్టిని ఆవు మూత్రంతో తడిపి 7 రోజుల పాటు నీడలో ఆరబెడితే ఘనజీవామృతం రెడీ అవుతుంది. 20 కిలోల ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి దుక్కిలో వేసుకోవాలి. పంట వేసిన నెల నుంచి రెండు నెలల కాలంలో సాళ్ల మధ్య వేయాలి. ద్రవ జీవామృతం... పంటకు అవసరమైన పోషకాలను అందజేయడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల గోవు మూత్రం, 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం, 2 కిలోల రైతులు పండించిన పప్పు దినుసులు, గుప్పెడు మట్టిని కలిపి 4 రోజులు పులియబెట్టాలి. దీనిని డ్రిప్పు ద్వారా, స్పే చేయడం ద్వారా పంటలకు అందించవచ్చు. నిమ్మాస్త్రం... రసం పీల్చే పురుగు, చీడపీడల నివారణకు బా గా పనిచేస్తుంది. 10 కిలోల వేపాకును మెత్తగా రుబ్బి 10 లీటర్ల గోమూత్రం, 2 కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో కలిపి 48 గంటలు ఆరబెట్టి పంటలపై పిచికారీ చేసుకోవాలి. బ్రహ్మాస్త్రం... పంటలను తిని నష్టం చేసే పురుగుల నివారణకు దీన్ని వాడొచ్చు. 10 లీటర్ల ఆవు మూత్రం, 3 కిలోల వేప ఆకు, 2 కిలోల సీతాఫల ఆకులు, 2 కిలోల ఆముదం ఆకులు, 2 కిలోల కత్తెర ఆకులు, 2 కిలోల బొప్పాయి ఆకు, 2 కిలోల ఉమ్మెత్త ఆకులు, 2 కిలోల జామ, 2 కిలోల వయ్యారిభామ ఆకులను మెత్తగా నూరి నీటిలో ఉడికించాలి. ఎకరాకు 2.5 లీటర్లు, 100 లీటర్ల నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి. అగ్ని అస్త్రం... కాండం, కాయతొలుచు పురుగు నివారణకు దీన్ని వాడాలి. మట్టి కుండను తీసుకుని 15 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో వెల్లుల్లి, 500 గ్రాముల పచ్చిమిర్చి, 500 గ్రాముల వేపాకు, పొగాకును వేసి వేడి చేయాలి. పురుగు ఆశించిన పంటకు 100 లీటర్ల నీటికి 3 లీటర్ల మిశ్రమాన్ని కలిపి పంటపై స్ప్రే చేసుకోవాలి. పుల్లటి మజ్జిగ... ఆకు మచ్చ, కాయమచ్చ, బూజు తెగులు నివారణకు ఉపకరిస్తుంది. 6 లీటర్ల పుల్లటి మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లను 100 లీటర్ల నీటిలో కలిపి మూడు రోజులు పులియబెట్టాలి. పురుగు ఆశించిన పంటను 20, 40 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సొంటి పాల కషాయం... అన్ని రకాల తెగుళ్ల నివారణకు దీన్ని వాడుకోవచ్చు. 200 గ్రాముల సొంటిని మెత్తగా నూరి నీటిలో మరిగించాలి. 2 లీటర్ల ఆవు పాలు లేదా మజ్జిగలో వేసి రెండిటికి కలిపి మరిగించాలి. అదే రోజు పంటపై పిచికారీ చేయాలి. పంచగవ్య... మొక్కలు ఆరోగ్యంగా పెరిగి తెగుళ్ల దాడిని తట్టుకునేందుకు వాడాలి. 5 కిలోల ఆవుపేడ, 3 లీటర్ల గోమూత్రం, 2 లీటర్ల ఆవుపాలు, 2 లీటర్ల పెరుగు, 500 గ్రాముల నెయ్యి, 1 కిలో వేరుశనగ పట్టీలు, 12 మాగిన అరటిపండ్లు, 3 లీటర్ల కొబ్బరి నీళ్లు, 3 లీటర్ల చెరుకు రసం, లేదా బెల్లం, 3 లీటర్ల కల్లును కలిపి ప్లాస్టిక్ డ్రమ్ములో 20 రోజులు పులియనివ్వాలి. 100 లీటర్ల నీటిలో మిశ్రమాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పిచికారీ చేయాలి. -
సోయా పొట్టే కదాని.. తగలబెట్టకండి
బాల్కొండ: ఖరీఫ్‌లో సాగుచేసిన సోయా పంట నూర్పిళ్లు ప్రస్తుతం రైతులు చురుగ్గా చేపడుతున్నారు. సోయా పంటను ప్రస్తుత సంవత్సరం నేరుగా నూర్పిడి చేయడంతో పాటు కోత కోసి కుప్ప వేసి హర్వేస్టర్‌తో నూర్పిడి చేస్తున్నారు. ఇలా నూర్పిడి చేయడంతో సోయా విత్తనాలు ఓ వైపు, సోయా పొట్టు మరోవైపు వేరవుతుంటాయి. కాని సోయా పొట్టును రైతులు సాధారణంగా తగలబెడతారు. సోయా పొట్టే కదాని రైతులు నిర్లక్ష్యంగా పంట భూములను శుభ్రం చేయాలనే ఆలోచనతో తగుల బెడుతుంటారు. సోయా పొట్టులో భూమిలో భూసారం పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. సోయా పొట్టును కుప్పలుగా చేసి పంట భూమి వద్ద పెద్ద గుంతను తవ్వి గుంతలో వేయాలి. మంచిగా మాగిన తర్వాత తీసి వేస్తే భూసారం పశువుల పేడ వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా పెంచుతుంది. ఎకరా సోయా పంట లో వెళ్లే పొట్టు ఓ లారీ పశువుల పేడతో సమానం. ఖరీఫ్‌లో పశువుల పేడ లారీ సుమారు రూ.15 వేల ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతులు, సోయా పొట్టుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. తవ్విన గుంతలో సోయా పొట్టు వేసిన త ర్వాత బాగా నీరు పట్టాలి. అలా చేయడం వల్ల అది మంచి ఎరువుగా తయారవుతుంది. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా సాగయ్యే పంట కాబట్టి సోయాలో అనేక పోషకాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. సోయా పొట్టును తగుల పెట్టడం వల్ల పొట్టుతో పాటు భూమికి చేటు అవుతుందంటున్నారు. వేడి వల్ల భూమిలో ఉండే వానపాములు చనిపోతాయి. వాటి తో పాటు మిత్ర పురుగులు చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా పంట పండించే నేలలో నిప్పు పెట్టరాదంటున్నారు. భూసారం కూడా తగ్గుతుందంటున్నారు. భూమి వదులుగా మారుతుంది. సోయా పొట్టును మంచి ఎరువుగా మలుచుకొని పసుపు సాగుచేసే భూమిలో వేయాలి. దీని ద్వారా రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూసారం పెరిగి పంట దిగుబడులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రైతులారా ఆలోచించండి..! -
సేంద్రియ ఎరువులతో సత్ఫలితాలు
సేంద్రియ ఎరువుల్లో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, దశపత్రి ఎరువులను సుద్దాల రైతులు తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తున్నారు. ఘన జీవామృతం ఎరువు ద్వారా భూసారం పెరుగుతుంది. ఘన జీవామృతం తయారు చేయడానికి పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఒక డ్రమ్ములో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఘన జీవామృతం ఎరువు ఎకరానికి సరిపోతుంది. ఈ ఎరువును దుక్కి దున్నాక మాత్రమే చల్లుకోవాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా శత్రు పురుగులు నశించి, మిత్ర పురుగులు పెరుగుతాయి. పంట దిగుబడీ పెరుగుతుంది. ద్రవ జీవామృతం పంటలు వేసి మొలకలు వచ్చాక ద్రవ జీవామృతం ఎరువు చల్లుకోవాలి. పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్ట మట్టి లేదా చెట్టు కింది మట్టిని తీసుకొని డ్రమ్ములో వేసుకోవాలి. అందులో 200 లీటర్ల నీటిని పోసి ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి. 48 గంటల తర్వాత ఎకరానికి సరిపడా ద్రవజీవామృతం తయారు అవుతుంది. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని పంటలకు నీరందించే కాలువల్లో వేయాలి. ఇలా చేస్తే ఎరువు మొక్కల వేర్లకు పట్టుకొని బలంగా తయారవుతాయి. ఇలా 15 రోజులకోసారి చల్లుకుంటే పంటలకు చీడ, పీడలు ఆశించవు. దశపత్రి.. దశపత్రి ఎరువు తయారు చేయడానికి పది రకాల ఆకులు అవసరం. ఒక్కో రకం ఆకులు 2 కిలోలు.. ఇలా పది రకాల ఆకులు 20 కిలోలు తీసుకొని ఒక డ్రమ్ములో ఉంచాలి. ఆ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల ఆవు పేడ వేసి నలభై రోజులపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఎరువు 30 ఎకరాలకు సరిపోతుంది. దీనిని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దశపత్రి ఎరువును వినియోగించడం ద్వారా పంటలకు తెగుళ్లు ఆశించకుండా కాపాడుతుంది. ఉత్తమ దిగబడులూ సాధించొచ్చు. దశపత్రి ఎరువును నెల రోజులకోసారి పంటలపై పిచికారీ చేయాలి. ఈ మూడు ఎరువులను సుద్దాలకు చెందిన సుమారు 10 మంది రైతులు చేల వద్ద తయారు చేస్తూ పంటలకు వినియోగిస్తున్నారు. ఈ ఎరువుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడులూ పొందుతున్నామని వారంతా చెబుతున్నారు. -
అభివృద్ధిలో ఆదర్శం ‘లింగంపల్లి’
సదాశివనగర్ : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదు రు చూస్తూ కూర్చోలేదు లింగంపల్లి వాసులు. చేయి చేయి కలిపి.. కలిసి కట్టుగా పనులు చేసుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా నడుంబిగించిన వా ళ్లు మొదట చేయి చేయి కలిపారు. వారంతా కలిసి ఓ సంఘంగా మారారు. గ్రామంలో 301 కుటుంబాలు ఉన్నాయి. అందులో 114 కుటుం బాలు ‘శ్రీ గోపాల మిత్ర గ్రామ రైతు సం ఘం’లో రూ.250 చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంఘాన్ని 2010లో ప్రారంభిం చారు. మొదటగా 20 మంది సంఘ సభ్యులుం డగా, ప్రస్తుతం 114 కుటుంబాలు చేరాయి. రిలయన్స్ సహకారం.. లింగపల్లి గ్రామస్తులు చేపడుతున్న అభివృద్ధి పనులకు రిలయన్స్ సంస్థ సహకారం అందించింది. వెనుకబడిన గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఆ సంస్థ గోపాలమిత్ర గ్రామ రైతు సంఘానికి సహకారం అందిస్తోంది. వారి కష్టానికి రిలయన్స్, పంచాయతీ సహకారం తోడు కావడంతో అభివృద్ధి వేగవంతమవుతోంది. సేంద్రియ ఎరువులతో సాగు గ్రామంలోని 114 కుటుంబాల ఇళ్ల వద్ద సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తున్నారు. ప్రతీరోజు ఒక్కోరకం కూరగాయలు వాడుకుంటున్నారు. గ్రామంలో బయోగ్యాస్‌ను వినియోగించుకుంటున్నారు. పంటలకు ఎరువుగా వర్మికంపోస్టు తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. తాగునీటికి ఊటబావి తవ్వారు. మినీవాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, పంట పొలాలకు వెళ్లేందుకు దారులు, చెట్లు నాటడం.. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామానికి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో తరచు ప్రమాదాలు జరిగేవి. దీంతో గ్రామస్తులు సంఘం ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపుల మట్టి వేయడంతో ప్రమాదాలు తప్పాయి. ఇలా తమకు తాము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న లింగంపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
సరైన యాజమాన్య పద్ధతులతో శ్రీవరి సాగు లాభదాయకం
ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది ఎరువుల ఖర్చు తక్కువ 40 నుంచి 45 బస్తాల దిగుబడి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చు, నీటితో శ్రీవరి సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులు నిరూపిస్తున్నారు. పీలేరు మండలం మొరవవడ్డిపల్లెకు చెందిన ఏ.చంద్రశేఖర్ (9440959227) ఐదేళ్లుగా శ్రీవరి సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. యాజమాన్య పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.. - పీలేరు శ్రీవరి సాగు పద్ధతి భూమిలోని సూక్ష్మ జీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగానే పైరుకు కావాల్సిన పోషక పదార్థాలను అందజేస్తుంది. కాబట్టి ఈ పద్ధతి భూసారాన్ని పెంచుతూ సుస్థిర దిగుబడినిస్తుంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు నీరు చాలా అవసరమవుతుంది. శ్రీవరి సాగుకు ఇందులో మూడో వంతు నీరు సరిపోతుంది. ఈ పంటలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరమైతే ఇందులో రెండు కిలోలు సరిపోతాయి. పైగా వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది లోతుకు చొచ్చుకుపోయి భూమి లోపల పోషక పదార్థాలను తీసుకుని ఏపుగా పెరుగుతుంది. ఒక్కో మొక్కకు 50 నుంచి 100కు పైగా బలమైన పిలకలు వచ్చి అన్నీ కూడా ఒకేసారి పొట్ట దశకు చేరి పెద్ద పెద్ద కంకులు వేస్తాయి. కంకులలో గింజలు (400 వరకు) బాగా పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతి కన్నా ‘శ్రీ’ పద్ధతిలో వరిపంట సాగు చేయడం ద్వారా 20 నుంచి 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 30 నుంచి 32 బస్తాలు (75 కేజీలు) పండిస్తే శ్రీ పద్ధతిలో 40 నుంచి 45 బస్తాలు దిగుబడి వస్తుంది. కలుపు నివారణ.. పొలంలో నీరు నిల్వకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు నాటిన 10 రోజులకోసారి రోటరీ, కోనోవీడర్‌తో నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. పంటకాలం లోపు ఇలాగే మరో రెండుసార్లు రోటరీ- కోనోవీడర్‌తో పనిచేసినపుడు అధిక దిగుబడి వస్తుంది. నీటి యాజమాన్యం.. నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండాలి. నీరు నిల్వకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 5 సెంటీమీటర్లకూ ఒక కాలు వ చేయాలి. మధ్య మధ్యలో పొలం ఆరితే నీరు పెడుతుండాలి. తద్వారా వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. సేంద్రియ ఎరువులు.. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూసారం పెరగడమేగాక ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తడి దశలో వాడవచ్చు. కానీ ముందు సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి. లేత నారు నాటుకోవాలి.. 8 నుంచి 12 రోజుల వయసు గల రెండు ఆకుల నారు మాత్ర మే నాటాలి. తద్వారా వేర్లు బాగా వ్యాపించి 30 నుంచి 100 పిలకలు వేస్తుంది. నారుమడి నుంచి మొక్క ను జాగ్రత్తగా వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. తద్వారా పీకేటపుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడికి మొక్క గురికాకుండా బతుకుతుంది. త్వరగా అధిక సంఖ్యలో పిలకలు వేస్తుంది. మొక్కకు మొక్కకు ఎటుచూసినా 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూడాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు. -
సేంద్రియ సాగు.. బాగు
చెన్నూర్ రూరల్ : మండలంలోని శివలింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దిగుబడి సాధిస్తూ మిగితా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి వద్దే సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ పంటలు పండిస్తున్నారు. గ్రామానికి చెందిన పది మంది రైతులు సుమారు 20 ఎకరాల్లో కూరగాయలు, బెండ, వంకాయ, బీరకాయ, కాకరకాయ, గోరుచిక్కుడు, మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది 20 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో పత్తి, వరి పంటలు పండించారు. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో కూరగాయల సాగు వైపు మొగ్గు చూపారు. వివిధ రకాల చెట్ల ఆకులతో రసాయనాలు తీసి అందులో ఆవు మూత్రాన్ని కలిపి పురుగు నివారణ మందులు తయారు చేస్తూ ఖర్చు తగ్గించుకుంటున్నారు. రైతులు సతీశ్, అక్కెం బానయ్య, రాజయ్య ఎరువుల తయారీపై వివరించారు. ఎరువుల తయారీ విధానం దుక్కులు దున్నేందుకు మూడు నెలల ముందే నాడెపు కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలి. ముందుగా ఇటుకలతో ఒక తొట్టి ఏర్పాటు చేసుకుని అందులో వివిధ రకాల చెట్ల ఆకులు, వ్యర్థ పదర్థాలు, పేడ వేయాలి. మూడు నెలల తర్వాత నాడెపు కంపోస్టు ఎరువు తయారవుతుంది. దుక్కులు దున్నిన తర్వాత ఎకరానికి 2 క్వింటాళ్ల చొప్పున నీటిలో కలిపి చల్లాలి. ఆ తర్వాత మొలకలు వచ్చాక 15రోజుల నుంచి 20 రోజులలోపు మళ్లీ ఈ ఎరువు వేయాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా మొక్కల వేర్లు బలంగా తయారవుతాయి. మొక్కలకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా వేప ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రెండు వారాలకోసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడంతో ఎటువంటి చీడపీడలు సోకవు. ద్రవ జీవామృతం, నీమాస్త్రం అనే సేంద్రియ ఎరువులు మొక్కలు బలంగా ఎదగాడానికి ఉపయోగపడుతాయి. వీటిని ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శెనగపిండి, పుట్టమట్టి తదితర మిశ్రమాలతో తయారు చేసి సుమారు 48గంటలపాటు డబ్బాలో ఉంచి గట్టిగా మూత పెట్టాలి. అనంతరం ఈ కషాయాన్ని కర్రతో కలిపిన తర్వాత మొక్కలకు అందించే నీటి కాలువల్లో కలిపి మొక్కలకు అందించాలి. ఇలా ఎకరానికి ఐదు లీటర్ల వరకు నీటిలో కలపాలి. ఈ సేంద్రియ ఎరువుల వాడకంతో మొక్కలు బలంగా తయారై ఎలాంటి చీడపీడలు సోకకుండా దిగుబడులు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడడంతో ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఇలా ఇళ్ల వద్ద సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటే ఖర్చు చాలా తగ్గుతుంది. -
కొబ్బరి పొట్టుతో ప్రయోజనాలెన్నో!
సేంద్రియసాగు ►సేంద్రియ ఎరువు తయారీకి అవకాశం ►నీటి లభ్యత లేని ప్రాంతాలకు వరం అమలాపురం : కొబ్బరి చెట్టు కల్పతరువు. దీని నుంచి వచ్చే కాయలే కాదు.. అన్ని పదార్థాలు రైతుకు ప్రయోజనం చేకూర్చేవే. కొబ్బరి కాయ లు ఒలిచిన తర్వాత వచ్చే డొక్కలు, పీచు వృథా పోకుండా వంట చెరుకుగా వాడుతున్నారు. దీనిని మరింత ఉపయుక్తంగా నారతీసి రకరకాల అవసరాలకు వినియోగించినప్పుడు ఉప ఉత్పత్తిగా ‘పొట్టు’ వస్తుంది. గతంలో ఇటుక బట్టీల్లో దీనిని వినియోగించేవారు. అయితే వ్యవసాయ అవసరాల కోసం కొబ్బరి పొట్టును విని యోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. అమలాపురం రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ (94402 50552, 93925 50552) అడ్డాల గోపాలకృష్ణ. వివరాలు ఆయన మాటల్లోనే... కొబ్బరి పీచును ఉత్పత్తి చేసే సమయంలో వచ్చే కొబ్బరి పొట్టుతో ఎన్నో వ్యవసాయ ఉపయోగాలున్నాయి. ఈ పొట్టును నేరుగా పొలంలో వినియోగించకూడదు. దానిని శుద్ధిచేసి.. ఆ తరువాత కుళ్లబెట్టి రకరకాలుగా వినియోగించవచ్చు. దీంతో మంచి సేంద్రియ ఎరువును తయారుచేసుకోవచ్చు. శుద్ధి చేసి వాడాలి డొక్కల నుంచి నార (కోకోనట్ యార్న్) తీయగా వచ్చే ‘కొబ్బరిపొట్టు’లో ముందుగా చిన్న చిన్న నారముక్కలు వేరయ్యేలా జల్లెడ పట్టాలి. తర్వాత పెద్ద సిమెంట్ తొట్టెలో నీరు నింపి నాలుగు రోజులు ఉంచాలి. ఆపై ఆ నీరు తీసి మళ్లీ కొత్త నీటితో తొట్టె నింపాలి. ఒక రోజు ఉంచి మరుసటి రోజు పొట్టును తీసి ఎండలో ఆరనివ్వాలి. ఇలా ఆరిన పొట్టులో ‘లిగ్నన్’ బాగా తగ్గుతుంది. దీనిని ప్రత్యేక యంత్రాలతో ఇటుకల మాదిరిగా కంప్రెస్ చేసి మార్కెటింగ్ చేస్తారు. ప్రత్యేకించి పోషక విలువలు ఏమీ లేకపోయినా ఎడారి ప్రాంతాల్లో నీటి సామర్థ్యం పెంచేందుకు ఈ కొబ్బరి పొట్టు ఇటుకలు బాగా ఉపకరిస్తాయి. త్వరత్వరగా నీరు పోయనవసరం లేకుండా ఈ ఇటుకలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుండీల్లో, నేలలో వేసి నీరు పెడతారు. ఆపై 10 నుంచి 15 రోజుల వరకు మొక్కలకు కావాల్సిన తేమ ఈ ఇటుకల నుంచి నెమ్మదిగా విడుదలవుతుంది. నేరుగా ఎందుకు వాడకూడదంటే... ►కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే దీనిలో ఉన్న లిగ్నన్ మొక్కలకు హాని చేస్తుంది. ►కుళ్లబెట్టకపోతే మొక్కలకు ఎరువుగా ఉపయోగపడదు. ► పోషకాలను పట్టి ఉంచే లక్షణాన్ని కోల్పోతుంది. ►నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. ►సి : ఎన్ (కర్బనం, నత్రజనిల నిష్పత్తి) మొక్కలకు అనుకూలంగా ఉండదు. దీనిని శుద్ధి చేసి కొన్ని రకాలుగా, కుళ్లబెట్టి మరికొన్ని అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎరువు తయారీ ఇలా.. ►కొబ్బరి పొట్టును సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలంటే దీనిని తప్పని సరిగా కుళ్లబెట్టాలి. ►ఒక టన్ను కొబ్బరి పొట్టులో ఐదు కేజీల రాతి భాస్వరం, ఐదు కేజీల యూరియా వేసి తడిపి 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఇలా ఉంచిన పొట్టును పొరలు పొరలుగా తడుపుతూ ఐదు కేజీల ప్లూరోటస్ సాజర్కాజూ అనే శిలీంధ్రాన్ని (పుట్టగొడుగుల తయారీలో వాడతారు) చల్లి నీటితో పలుచగా తడపాలి. ►పొట్టును నాలుగు అడుగుల వెడల్పు, సుమారు మూడడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు కలిగిన కుప్పలా చేయాలి. దీనికి సూర్యరశ్మి నేరుగా తగలకుండా (నీడ) ఏర్పాటు చేయాలి. బాగా పైభాగంలో కొబ్బరి ఆకులు కప్పితే మరింత చల్లగా ఉండడం వల్ల శిలీంధ్రం వేగంగా విస్తరించి పొట్టు త్వరగా కుళ్లిపోతుంది. ►సాధారణంగా శీతాకాలం చల్లగా ఉండ డం వల్ల ఈ ప్రక్రియ వేగంగా 60 నుంచి 90 రోజుల్లో కొబ్బరి పొట్టు కుళ్లిపోతుంది. ఆవు పేడ, దాని మూత్రం, గ్లైరిసిరియాలను ఈ పొట్టులో పొరల మధ్య వేయడం ద్వారా పొట్టు మరో పది రోజులు ముందుగా కుళ్లడమే కాకుండా మరింత నత్రజని శాతం పెరిగి వ్యవసాయాని బాగా ఉపయోగపడుతుంది. ►ప్లూరోటస్ సాజర్ కాజూను కేరళ, ధవళేశ్వరంల్లో క్వాయర్ బోర్డు కార్యాలయాలు, అంబాజీపేట హెచ్‌ఆర్‌ఎస్‌లో గాని రైతులు పొందవచ్చు. ►పొట్టు కుళ్లే 90 రోజుల సమయంలో రెండు లేదా మూడుసార్లు బాగా తడిపితే పొట్టు మరింత త్వరగా కుళ్లుతుంది. కలిగే ప్రయోజనాలు ►పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువును అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ►దీనికి నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. నీరు లభ్యత తక్కువగా ఉండే కరువు ప్రాంతాలకు ఇది వరం. ►అతి తక్కువ బరువు ఉండడం వల్ల విమానాల్లో రవాణా చేసే మొక్కలకు ఉపయోగకరం. ప్రయాణాల్లో నీరు వేయాల్సిన పని లేదు. ►పాలీ హెజ్ల్లో, నర్సరీ ట్రేలల్లో, జర్జెరా, కార్నేషన్ వంటి పూలమొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. ►కూరగాయల విత్తనాలు ట్రేలలో పెంచేందుకు వాడుకోవచ్చు. ►సేంద్రియ, జీవన, రసాయనిక ఎరువులను నీటితో కలిపి సులువుగా దీనిలో వేసి మొక్కలకు నెమ్మదిగా అందించవచ్చు. ►ఈ పొట్టు వల్ల మొక్కల వేర్లకు గాలి బాగా సోకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతాయి. ►వేసవిలో మొక్కలకు నీటి ఎద్దడికి గురి కాకుండా నర్సరీ కవర్లో పైన వేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. ►నీరు లేని (కంప్రెస్డ్) కుళ్లిన కొబ్బరి పొట్టు బరువు చాలా తక్కువగా ఉండడం వల్ల దూర ప్రాంతాలకు తక్కువ వ్యయంతో ఎక్కువ పొట్టును రవాణా చేయవచ్చు. -
సేంద్రియ ఎరువులు వాడాలి
ఆసిఫాబాద్ : సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక లాభాలుంటాయని వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ‘ఆత్మ’ ఆధ్వర్యంలో ఆదర్శరైతులకు కిసాన్ గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మానవులకు కలిగే ఉపయోగాలు, రసాయనిక ఎరువుల వల్ల మానవుని ఆరోగ్యంపై కలిగే నష్టాలు వివరించారు. బీటీఎం గురుమూర్తి మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆహార పంటలు సాగు చేయాలని సూచించారు. ఎరువులు సమతుల్యంతో వాడడం వల్ల సూక్ష్మధాతువులను నివారించవచ్చని పేర్కొన్నారు. సస్యరక్షణపై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్, కెరమెరి ఏవోలు ఖాదర్ హుస్సేన్, గోపికాంత్, ఏఈవోలు యాకూబ్, అఖిల్, రామకృష్ణ, ఆసిఫాబాద్, కెరమెరి మండలాలకు చెందిన ఆదర్శరైతులు పాల్గొన్నారు. -
తమలపాకుల తోటల పెంపకంపై రైతుల ఆసక్తి
ముందుగా సడ చెట్లను పెంచాలి తమలపాకు తోటలను పెంచాలనుకుంటున్న రైతులు ముందుగా సడ చెట్ల కాయలను సేకరించాలి. కాయలు పగులగొట్టి విత్తనాలను పొలంలో ప్రతీ గజం దూరానికి ఒకటి చొప్పున నాటాలి. మొక్కలు పెరిగేందుకు నీటి సరఫరా సౌకర్యం ఏర్పాటు చేయాలి. 5 నుంచి 6 నెలల తర్వాత మొక్కలు చెట్లుగా మారుతాయి. అనంతరం అర గజం పొడవు ఉన్న తమలపాకు తీగలను తెచ్చి ప్రతీ చెట్టు మొదలు వద్ద గుంతను తవ్వి నాటాలి. ఈ విధంగా నాటిన తమలపాకు తీగలు 6 నెలల తర్వాత పెద్దవై సడచెట్ల తీగలకు అల్లుకుంటాయి. ఒక్కసారి తమలపాకుల తోటలను పెంచడం మొదలు పెడితే 5 ఏళ్ల దాకా తెంచిన తమలపాకుల స్థానంలో కొత్త ఆకులు చిగురిస్తాయి. ఒకసారి ఆకులు తెంచితే తిరిగి పది రోజుల్లోగా కొత్త ఆకులు వస్తుంటాయి. ఇలా వీటి పెంపకం రైతులకు లాభదాయకంగా కూడా ఉంటోంది. సేంద్రియ ఎరువులతోనే.. తమలపాకు తోటల పెంపకానికి ఎలాంటి రసాయన ఎరువులను వినియోగించకూడదు. కేవలం వేప పిండి, వేరుశనగ పిండి, పశువుల పేడతో సొంతంగా ఎరువులను తయారు చేసి తోటల పెంపకానికి వినియోగించాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో వేలకు వేలు ఖర్చు చేసి రసాయనిక ఎరువులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో మేలు రకమైన తమలపాకులను ఉత్పత్తి చేసే వీలుంది. తమలపాకులలో లేత, ముదురు అని రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు తోట ల పెంపకానికి వేర్వేరుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. పట్టణాల నుంచి వచ్చి కొనుగోలు తమలపాకు తోటలు పెంచుతున్న గ్రామాలకు హైదరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్, తాండూరు తదితర పట్టణాల నుంచి వ్యాపారులు నేరుగా వచ్చి సంచులకొద్దీ తమలపాకులను కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. చిరు వ్యాపారులకు తమలపాకులను చర్కా (20 తమలపాకుల కట్టలు)లుగా రూపొందించి విక్రయిస్తుంటారు. ఒక్కో కట్టలో 400 తమలపాకులుండి రూ. 200 ధర పలుకుతోంది. ఇవి పోనూ మిగిలిన తమలపాకులను సమీపంలో ఉన్న పరిగి, కుల్కచర్ల, షాద్‌నగర్ తదితర మార్కెట్లకు తీసుకు వెళ్లి విక్రయిస్తుంటారు. వినియోగదారుల అవసరార్థం నేరుగా తోటల వద్ద కూడా విక్రయిస్తారు. -
ఎరువులు మోతాదు మించొద్దు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అవగాహన లేమి.. పంటలను కాపాడుకోవాలనే ఆతృతతో కొందరు రైతులు ఇష్టానుసారంగా ఎరువులు వేస్తుంటారు. ఒకరిని చూసి మరొకరు.. కంపెనీల ప్రచారార్భాటం మాయలో పడి అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తుంటారు. అలా చేయడం వల్ల రైతులు ఆర్థికంగా, దిగుబడుల పరంగా నష్టపోవాల్సి వస్తుందని ఆదిలాబాద్ ఏరువా కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ వివరించారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతతో రసం పీల్చే పురుగులు, పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, పత్తి, సోయాబీన్ వంటి తెగుళ్ల బారిన పడుతున్నాయి. అధికంగా ఎరువులు వాడడం వల్ల మొక్కలు త్వరగా పచ్చబడి పురుగులకు ఆహారంగా మారుతాయి. హార్మోన్లు వాడడం వల్ల చెట్టుపైన చిగురు ఆకులు పసుపు రంగులోకి మారడం, మాడిపోవడం జరుగుతుంది. పత్తి పంటలో.. రైతులు పత్తి విత్తుకునే సమయంలో గానీ, విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత గానీ ఎకరానికి 50 కిలోల డీఏపీ వేయాలి. ఒకవేళ డీఏపీ అందుబాటులో లేకుంటే సింగిల్ సూపర్ ఫాస్పెట్ ఎకరానికి మూడు బస్తాలు వేయాలి. ఇది మొదటి దఫా.. ప్రతీ 20 రోజులకోసారి 15 కిలోల యూరియా, 10 నుంచి 15 కిలోల పొటాష్ కలిపి ఒక ఎకరం చొప్పున వేసుకోవాలి. ఇలా నాలుగైదుసార్లు వేయడం వల్ల మొక్కలో పెరుగుదల వస్తుంది. పురుగు పట్టదు. రైతు చేసే పొరపాట్లు.. పత్తి రైతులు సాధారణంగా మొత్తం యూరియా 50కిలోలు ఒకేసారి వేసేస్తారు. డీఏపీని రెండోసారి వేస్తారు. 20-20-0, యూరియా కలిపి వేస్తారు. ఇలా వేయడం వల్ల మొక్కల్లో పెరుగుదల శక్తి నశిస్తుంది. చీడపీడలు వస్తాయి. సోయాబీన్, ఇతర పంటల్లో.. సోయాబీన్ విత్తే సమయంలో ఎకరానికి ఎస్ఎస్పీ మూడు బస్తాలు ఎకరం చొప్పున నేలలో కలపాలి. విత్తనం వేసిన పక్షం రోజుల తర్వాత డీఏపీ+పొటాష్ 25 కిలోల విశ్రమాన్ని కలిపి వేయాలి. ఇలా వేసిన 30 రోజుల తర్వాత పంట పెరుగుదల స్థితి అవసరాన్ని బట్టి 15 కిలోల యూరియా వేయాలి. కందులు, మినుములు, పెసర, జొన్న పంటలకు విత్తుకునే సమయంలో ఏడీఏ 50 కిలోలు ఎకరం చొప్పున వేస్తే సరిపోతోంది. రసాయన ఎరువులపైనే ఆధారపడొద్దు మొత్తంగా రసాయన ఎరువులపైనే ఆధారపడితే చాలా ప్రమాదం. ఇవి భూ సారాన్ని దెబ్బతీసి నేలను నిర్జీవంగా తయారు చేస్తాయి. భూమిలో నీరు+సూక్ష్మ పోషకాల వృద్ధి, భూమిని గుల్లగా మార్చే వానపాములు, ఇతర సేంద్రియ సూక్ష్మజీవులు రసాయన పిచికారీ వల్ల అంతమై పంటలకు చాలా నష్టం వాటిల్లుతుంది. నేలలో 30శాతం సేంద్రియ ప దార్థం ఉండి మిగితా 70శాతం రసాయన ఎరువులు వాడినా పరవాలేదు. కానీ మొత్తం రసాయనాలు అంటే మొదటికే మోసం. పంటలు పెరగాలని పురుగుల మందులను మార్చి మార్చి కొట్టడం వల్ల పురుగులకు రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. రసాయన పురుగు మందులు కొడితే మొ క్క నిగనిగలాడడంతోపాటు లేతగా మారుతుందని, ఆకులు పచ్చగా ఏర్పడి మొక్క పెరుగుతుందనే నమ్మకాల్ని తీసేయా లి. మోనోక్రోటోపాస్, కాన్ఫిడార్, ప్రైడ్ లాంటివి పురుగు మందులు మాత్రమే. ఇవి పంట పెరుగుదలకు ఏమాత్రం దోహదం చేయవు. వీటిని అవసరానికి మించి వాడొద్దు. పురుగుమందులు, ఎరువుల వాడకంపై వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ఏ ఎరువులో ఏముందంటే.. ఎరువుల్లో రెండు రకాలు.. సూటి ఎరువులు : ఈ ఎరువు చాలా ముఖ్యమైనది. ఇందులోనూ యూరియా, పొటాష్, సూపర్ అనే రకాలున్నాయి. వీటితోపాటు సహజమైన సేంద్రియ ఎరువులూ వాడొచ్చు. సూటి ఎరువుల్లోని 100 కిలోల యూరియాలో నత్రజని 46శాతం, పొటాష్‌లో నత్రజని 60శాతం, సూపర్, డీఏపీ(డైఅమోనియం పాస్ఫెట్)లో నత్రజని 18 శాతం, భాస్వరం 46 శాతం ఉంటాయి. వీటిపై రైతులకు అవగాహన లేక ఫలనా యూరియా, డీఏపీ వేస్తేనే పంట బాగుంటుందనే అపోహలు పడుతుంటారు. నిజానికి నాగార్జున, క్రిప్కో, ఇఫ్కో, ఆర్ఎలెఫ్, ఐపీఎల్, ఎఫ్‌సీఆర్, కేపీఆర్ ఇలా రకరకాల కంపెనీలు యూరియా, డీఏపీలు తయారు చేస్తున్నాయి. కానీ ఏ రకం కంపెనీ డీఏపీ, యూరియాలోనైనా నత్రజనిస మపాళ్లలో ఉంటుంది. మొక్కకు నత్రజని మూలపదార్థం. కాబట్టి ఏ కంపెనీ యూరియా వేసినా అదే రకమైన రసాయనిక స్థితి ఉంటుంది. ఎరువుల కంపెనీల ఉత్పత్తి, సామర్థ్యం, వినియోగదారుల అవసరాన్ని బట్టి ప్రభుత్వం రకరకాల కంపెనీలకు జిల్లాల వారీగా కోటా ఇస్తుంది. కొరత ఉన్న ఎరువు మంచిదనే భావన సరికాదు. ప్రభుత్వం గుర్తించిన ఏ కంపెనీ ఎరువైనా వాడవచ్చు. మిశ్రమ ఎరువులు : మిశ్రమ ఎరువుల విషయానికొస్తే 20-20-0-13, 28-28-0, 14- 35-14 రకాలు ఉన్నాయి. ఈ మూడింటిలో వరుసగా మొదటి అంకె నత్రజని, రెండో అంకె భాస్వరం, మూడోది పాస్ఫరస్ల మిశ్రమం. ఏది ఎంత కలిపి ఉన్నాయనే ఫార్ములానే ఇది. డీఏపీ ఎరువు వేసిన రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన పనిలేదు. -
సేంద్రియ విజయం
కెరమెరి : సేంద్రియ ఎరువులతో సుస్థిర సాగుపై రైతులు దృష్టి సారించారు. ఒక్కరితో మొదలైన సేంద్రియ వ్యవసాయ వి ధానాన్ని నేడు 2,467 మంది రైతులు అనుసరిస్తున్నారు. వీరి కి చేతన ఆర్గానిక్ ఫార్మర్ అసోసియేషన్ చేయూతనందిస్తోం ది. మొదటిసారిగా మండలంలోని చౌపన్‌గూడ గ్రామానికి చెందిన ఆత్రం కుసుంభరావు 2004లో పత్తి సాగు చేశాడు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడంతో ఇతర మండలాలకు రైతులకు అవగాహన కల్పించారు. చేతన ఆర్గానిక్ ఫార్మర్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గతంలో ఐటీడీఏ, ఐకేపీలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా స్వతంత్రంగా పనిచేస్తోంది. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్, నార్నూర్, ఉట్నూర్ మండలాల్లోని 148 గ్రామాల్లో సేంద్రియ ఎరువులతో పం టలు సాగవుతున్నాయి. ఆయా మండలాల్లోని 13,775 ఎకరాల్లో 2,467 మంది రైతులు పత్తి, ఇతర పం టలు సాగు చేస్తున్నారు. వీరంతా 154 గ్రూపులుగా ఏర్పడ్డారు. నాన్‌బీటీ విత్తనాలతోనే పత్తి పంటలు పండిస్తున్నారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. పత్తి ధర అధికంగా, ఖర్చులు తక్కువ కావడం, వర్షాపాతం తక్కువగా ఉన్నా పంటలు పండే అవకాశం ఉంది. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
కంది, కొర్ర,, వేరుశనగ సాగు మేలు * ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని కంది, కొర్ర, రాగి, వేరుశనగ, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు. * విత్తే ముందు రైతులు తమ సొంత విత్తనాన్ని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా శుద్ధి చేసిన విత్తనాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలి. * వర్షాధారపు పంటలన్నింటిలోనూ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వలన భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, వేరుశనగ చెక్క, వేప చెక్క, కానుగ చెక్కలను వాడుకోవచ్చు. * నూనె గింజ పంటలకు తప్పనిసరిగా సల్ఫర్ ఉన్న భాస్వరపు ఎరువులను వాడాలి. అన్ని పంటలకు మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దుక్కిలోనే వేయాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. * వర్షాలు తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకుగాను, వాలుకు అడ్డంగా విత్తుకోవడం, వాలును అనుసరించి మడులను చిన్నవిగా చేసుకోవడం, వాలు ఎక్కువగా ఉన్నచోట్ల లోతైన గొడ్డు చాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వాలు ఉన్న చోట్ల మట్టితోగాని, రాతి కట్టడంతో లేదా జీవ కంచెతో గాని అడ్డు ఏర్పాటు చేసుకోవడం వలన నీటిని అక్కడే ఇంకేలా చేసుకోవడమే కాకుండా మట్టి కొట్టుకు పోకుండా నివారించవచ్చు. * వర్షాకాలంలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 గంటల్లోపు ఆయా పంటలకు సిఫారసు చేసిన కలుపు పైమందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. * కంది పంటకు పెండిమిథాలిన్ 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు. ఆముదం పంటకు పెండిమిథాలిన్ 1.3 - 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 800 మి.లీ. నుంచి ఒక లీటరు. పత్తిలో విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 1 లీటరు/ విత్తిన తర్వాత పెండిమిథాలిన్ 1.3 నుంచి 1.6 లీ./ అలాక్లోర్ 1.5-2 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
పాత పంటలకు పూర్వ వైభవం
కొండాపూర్, న్యూస్‌లైన్: పాత పంటలకు పూర్వ వైభవం వచ్చింది. వాణిజ్య పంటల సాగులో ప్రతిఏటా నష్టపోతున్న రైతులు తిరిగి పాతపంటలపై దృష్టి సారించారు. నీటివినియోగం, పెట్టుబడులు తక్కువగా ఉండడం, ఆదాయం అధికంగా ఉండడంతో ఆహార పంటల సాగుకు వారం తా మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల క్రితం వరకు మండల పరిధిలోని మారెపల్లి, అనంతసాగర్, తొగర్పల్లి, మన్సాన్పల్లి, మునిదేవునిపల్లి, మల్కాపూర్, గిర్మాపూర్, గారకుర్తి తదితర గ్రామాల్లో మిరప, జొన్న, ఆముదం, వామ ఉల్లిగడ్డ, కంది, కుసుమ, కొర్ర, శనగ పంటలను విరివిగా సాగు చేసేవారు. సేంద్రియ ఎరువులు వాడటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించేవారు. కాలక్రమేణా బోరుబావుల తవ్వకాలు పెరిగి నీటి లభ్యత పెరగడంతో రైతులు చెరకు, వరి, పసుపు, మొక్కజొన్న పంటలను సాగుచేశారు. ఈ పంటలపై రసాయన మందులు పిచికారీ చేయడం తప్పనిసరి కావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దిగుబడి కూడా పెరిగినప్పటికీ రైతన్నలు మాత్రం నష్టాలపాలయ్యారు. దీంతో చా లామంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొంత మంది సాగుపైనే దృష్టి సారించినా అనుకున్న ఫలితం రాలేదు. దీంతో పునరాలోచనలో పడిన అన్నదాతలు ఇపుడు మళ్లీ పాతపంటలపై దృష్టిసారించారు. ప్రస్తుతం మండలంలో చాలామంది రైతులు మిరప, ఉల్లి, వామ, కుసుమ, కంది, జొన్న, ఆముదం, శనగ పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించడంతో అందరూ ఆహార ధాన్యాలైన పాత పంటల వైపే మొగ్గు చూపుతున్నారు.