కొండాపూర్, న్యూస్‌లైన్: పాత పంటలకు పూర్వ వైభవం వచ్చింది. వాణిజ్య పంటల సాగులో ప్రతిఏటా నష్టపోతున్న రైతులు తిరిగి పాతపంటలపై దృష్టి సారించారు. నీటివినియోగం, పెట్టుబడులు తక్కువగా ఉండడం, ఆదాయం అధికంగా ఉండడంతో ఆహార పంటల సాగుకు వారం తా మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల క్రితం వరకు మండల పరిధిలోని మారెపల్లి, అనంతసాగర్, తొగర్‌పల్లి, మన్‌సాన్‌పల్లి, మునిదేవునిపల్లి, మల్కాపూర్, గిర్మాపూర్, గారకుర్తి తదితర గ్రామాల్లో మిరప, జొన్న, ఆముదం, వామ ఉల్లిగడ్డ, కంది, కుసుమ, కొర్ర, శనగ పంటలను విరివిగా సాగు చేసేవారు.
సేంద్రియ ఎరువులు వాడటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించేవారు. కాలక్రమేణా బోరుబావుల తవ్వకాలు పెరిగి నీటి లభ్యత పెరగడంతో రైతులు చెరకు, వరి, పసుపు, మొక్కజొన్న పంటలను సాగుచేశారు. ఈ పంటలపై రసాయన మందులు పిచికారీ చేయడం తప్పనిసరి కావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దిగుబడి కూడా పెరిగినప్పటికీ రైతన్నలు మాత్రం నష్టాలపాలయ్యారు. దీంతో చా లామంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇంకొంత మంది సాగుపైనే దృష్టి సారించినా అనుకున్న ఫలితం రాలేదు. దీంతో పునరాలోచనలో పడిన అన్నదాతలు ఇపుడు మళ్లీ పాతపంటలపై దృష్టిసారించారు. ప్రస్తుతం మండలంలో చాలామంది రైతులు మిరప, ఉల్లి, వామ, కుసుమ, కంది, జొన్న, ఆముదం, శనగ పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించడంతో అందరూ ఆహార ధాన్యాలైన పాత పంటల వైపే మొగ్గు చూపుతున్నారు.
పాత పంటలకు పూర్వ వైభవం
Published Sun, Jan 12 2014 11:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement