వ్యవసాయంపై మక్కువ ఆమెను వృద్ధాప్యంలోనూ విశ్రాంతి తీసుకోనివ్వటంలేదు. బీఏ బీఈడీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు పల్లె రమాదేవి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కపల్లి పంచాయతీలోని ఎత్‌బార్‌పల్లి ఆమె స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రమాదేవి 2002లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 38 ఎకరాలలో వ్యవసాయం చేపట్టారు. ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చునని నిరూపిస్తున్నారు. శ్రీ వరి సాగు విధానంలో వరి సాగు చేసి ఎకరాకు 50 బస్తాల దిగుబడి సాధించి ప్రశంసలు పొందారు.
అధిక శాతం సేంద్రియ ఎరువులతోనే పంటలను సాగు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. తోటి రైతులకు సైతం సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతులను నేర్పిస్తున్నారు. గ్రామంలోని రైతులను కూడగట్టి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతు పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి పొదుపును ప్రోత్సహిం చారు. ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కష్టపడి పనిచేసుకుంటే లాభాలు వస్తాయని, పంటల సాగుతో పాటు పాడి పశువులను పెంచుకుంటే పాల ఉత్పత్తితో పాటు సేంద్రియ ఎరువులకూ కొరత ఉండదంటున్నారు ఆదర్శ మహిళా రైతు రమాదేవి(90003 02289). ఉత్తమ రైతుగా 5 పురస్కారాలు పొందడం విశేషం.
– వడ్ల విశ్వనాథాచారి, మొయినాబాద్ రూరల్(చేవెళ్ల), రంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment