Sagubadi: ఆహార భద్రత చేకూరడమే కాదు.. గృహహింస కూడా తగ్గింది! | Urban Farming In Philippines Women Nourishing Cities Program | Sakshi
Sakshi News home page

Urban Agriculture: ఆహార భద్రత చేకూరడమే కాదు.. గృహహింస కూడా తగ్గింది!

Published Mon, Oct 24 2022 4:38 PM | Last Updated on Mon, Oct 24 2022 4:41 PM

Urban Farming In Philippines Women Nourishing Cities Program - Sakshi

అర్బన్‌ ప్రాంతాల్లో ప్రజలను సేంద్రియ ఇంటిపంటల సాగుపై దృష్టి కేంద్రీకరింపచేయడానికి కరోనా మహమ్మారి దోహదం చేసిన సందర్భాలు ప్రపంచం అంతటా కనిపిస్తున్నాయి. సంక్షోభ సమయంలో కిక్కిరిసిన నగరాల్లో తమ ఇళ్ల చుట్టుపక్కల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలాల్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పరిమితులకు లోబడి పండించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇళ్ల దగ్గరే కాకుండా నలుగురూ కలసి కమ్యూనిటీ గార్డెన్లలో సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభించి, ఇప్పటికీ కొనసాగిస్తుండటం సంతోషించవలసిన విషయం. 

ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్‌ నగరంలోని మురికివాడల్లో పేద గృహిణుల కథ కూడా ఇలాంటిదే. కరోనా కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులకు ఆహారాన్ని అందించటం కోసం గృహిణులు సేంద్రియ కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టారు. పేదలు నివసించే ప్రాంతాలను ఫిలిప్పీన్స్‌లో పాయటాస్‌లు అంటారు. ఈ వాడల్లో ప్రజలు లాక్‌డౌన్‌ కాలంలో ఆకలికి అల్లాడిపోయారు.

ఆ క్లిష్ట సమయంలో మహిళల నేతృత్వంలో నడిచే ‘అగ్రియా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ, పుసో ఎన్జీ అమ ఫౌండేషన్‌ తదితర సంస్థలు పేద కుటుంబాలకు తొలిదశలో కూరగాయలను విరాళంగా అందించి ఆదుకున్నాయి. అయితే, ఎన్నాళ్లని ఎక్కడి నుంచో కూరగాయలు తెచ్చిస్తాం.. వాటిని పండించుకోవటం వారికే నేర్పిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది.

ఆ విధంగా క్యూజోన్‌ నగరంలో సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. అగ్రియా సంస్థ చొరవతో మహిళలకు శిక్షణ ఇచ్చింది. పోషకాహారం ఆవశ్యకత, నగర వాతావరణంలో సాంద్ర పద్ధతిలో సేంద్రియ పంటలు పండించే వివిధ పద్ధతులు, వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకోవటం, చీడపీడలను నియంత్రించే పద్ధతులతో పాటు ఆహారోత్పత్తులను విక్రయించడం, ఆర్థిక విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి ప్రధాన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈస్ట్‌వెస్ట్‌ సీడ్‌ ఫౌండేషన్, గుడ్‌ షెఫర్డ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్‌ రాయబార కార్యాలయాలు ఈ అర్బన్‌ అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌కు అండగా నిలిచాయి.  

సుమారు 200 మంది మహిళలు ఆహారోత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. అందరూ కలసి తమ ఇళ్లదకు దగ్గర్లోని ఖాళీ స్థలంలో 800 చదరపు మీటర్ల ఉమ్మడి కూరగాయల తోటను నిర్మించుకున్నారు. వాడేసిన ప్లాస్టిక్‌ సంచులు, గ్రోబ్యాగ్‌లు, కుండీల్లో, నేలపై ఎత్తు మడుల్లో కూరగాయల సాగు చేపట్టారు.

ఈ గార్డెన్‌ మహమ్మారి నెమ్మదించిన తర్వాత కూడా ఇప్పటికీ రోజూ చక్కని వంకాయలు, చిక్కుళ్లు, ఆకు కూరలు, బొప్పాయి వంటి పండ్లను అందిస్తోంది. ఇంటిపంటల శిక్షణ కార్యక్రమానికి ‘ఫుడ్‌ హైవ్స్‌: విమెన్‌ నౌరిషింగ్‌ సిటీస్‌ ప్రోగ్రామ్‌’  అని ‘అగ్రియా’ సంస్థ పేరు పెట్టింది. శిక్షణ పొందిన మహిళలు తమ ఇళ్లల్లో కిచెన్‌ గార్డెన్లను ఏర్పాటు చేసుకున్నారు.

కొందరు కలసి కమ్యూనిటీ గార్డెన్‌ ఆరోగ్యకరమైన సేంద్రియ కూరగాయలు పండించగలుగుతున్నారు. చెర్రీ అటిలానో అనే యువతి ‘అగ్రియా’ సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. ఆమె స్వయంగా అర్బన్‌ ఫార్మర్‌ కూడా. సేంద్రియ ఇంటిపంటల సాగు నేర్పిన తర్వాత పేదల కుటుంబాలకు ఆహార భద్రత కొంతమేరకు చేకూరిందని, గృహహింస కూడా తగ్గిందని ఆమె అన్నారు. 

మహమ్మారి కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఈ కారణంగా ఇద్దరు తల్లులు ఆత్మహత్య చేసుకున్నారు కూడా. మహిళా సాధికారతపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది ప్రధాన కారణమని, మహిళలకు సేంద్రియ ఇంటిపంటల సాగు నేర్పించడం వెనుక కారణం కూడా ఇదే అంటారామె. 

మురికివాడల దగ్గరల్లో భూమి చెత్త కుప్పలు, రసాయనిక వ్యర్థాలతో కూడినదై ఉండటం వల్ల మట్టి విషపూరితమై ఉంది. ఆ నేల ఆహారోత్పత్తికి అనుకూలం కాదు. అందుకని, గ్రామీణ ప్రాంతం నుంచి 800 చదరపు మీటర్ల కమ్యూనిటీ గార్డెన్‌లో ఎత్తు మడులు నిర్మించడానికి 40 టన్నుల నాణ్యమైన మట్టిని లారీల్లో తేవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నిబంధనలు, ఇరుకైన రోడ్ల కారణంగా లారీలను దూరంగానే ఆపేయాల్సి వచ్చింది.

మహిళలే పట్టుదలగా మట్టి బస్తాలను కిలోమీటరు దూరం మోసుకొచ్చి పంటలు పండించడం ప్రారంభించారని ఆమె వివరించారు. నగరవాసులైన పేద, మధ్యతరగతి మహిళలకు సరైన శిక్షణను అందిస్తే ఆరోగ్యదాయకమైన కూరగాయలు పెంచి కుటుంబానికి పోషకాహారాన్ని అందించడంతో పాటు, అదనపు ఆదాయాన్ని సైతం పొందగలుగుతారని మా అనుభవం రుజువు చేసిందని చెర్రీ అంటున్నారు. 
– పంతంగి రాంబాబు
చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement