ఈ వారం వ్యవసాయ సూచనలు
కంది, కొర్ర,, వేరుశనగ సాగు మేలు
* ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని కంది, కొర్ర, రాగి, వేరుశనగ, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు.
* విత్తే ముందు రైతులు తమ సొంత విత్తనాన్ని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా శుద్ధి చేసిన విత్తనాన్ని మార్కెట్‌లో కొనుగోలు చేయాలి.
* వర్షాధారపు పంటలన్నింటిలోనూ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వలన భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, వేరుశనగ చెక్క, వేప చెక్క, కానుగ చెక్కలను వాడుకోవచ్చు.
* నూనె గింజ పంటలకు తప్పనిసరిగా సల్ఫర్ ఉన్న భాస్వరపు ఎరువులను వాడాలి. అన్ని పంటలకు మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దుక్కిలోనే వేయాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
* వర్షాలు తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకుగాను, వాలుకు అడ్డంగా విత్తుకోవడం, వాలును అనుసరించి మడులను చిన్నవిగా చేసుకోవడం, వాలు ఎక్కువగా ఉన్నచోట్ల లోతైన గొడ్డు చాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వాలు ఉన్న చోట్ల మట్టితోగాని, రాతి కట్టడంతో లేదా జీవ కంచెతో గాని అడ్డు ఏర్పాటు చేసుకోవడం వలన నీటిని అక్కడే ఇంకేలా చేసుకోవడమే కాకుండా మట్టి కొట్టుకు పోకుండా నివారించవచ్చు.
* వర్షాకాలంలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 గంటల్లోపు ఆయా పంటలకు సిఫారసు చేసిన కలుపు పైమందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.
* కంది పంటకు పెండిమిథాలిన్ 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు. ఆముదం పంటకు పెండిమిథాలిన్ 1.3 - 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 800 మి.లీ. నుంచి ఒక లీటరు. పత్తిలో విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 1 లీటరు/ విత్తిన తర్వాత పెండిమిథాలిన్ 1.3 నుంచి 1.6 లీ./ అలాక్లోర్ 1.5-2 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్