పత్తి, కంది, సోయా కట్టెతో బయోచార్ ఉత్పత్తి
ఎకరానికి 1 టన్ను చల్లి.. 15% వరకు అదనపు దిగుబడులు
మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పిఓ) అనుభవం
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..
పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్‌డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్‌మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది.
బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్‌మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి.
బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్‌ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్‌పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు.
2021 జనవరిలో ఎఫ్‌పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్‌కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్‌పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్‌పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్‌పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్‌ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్‌పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్‌ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్‌పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్‌గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి.
ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క.
అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు.
2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.
ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టు
యవత్‌మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్‌ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్‌పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్‌కు అవకాశాలు పెంపొందించాలి.
– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే
Comments
Please login to add a commentAdd a comment