korra
-
వివాహేతర సంబంధం అంటగట్టడంతో.. యువకుడి ఆత్మహత్య..!
సంగారెడ్డి: అవమానం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యపురి కాలనీలో చోటచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. చైతన్య పురి కాలనీకి చెందిన కొర్ర జగన్(21) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలనీకి చెందిన రషీద్ తన స్నేహితులతో కలిసి కొర్ర జగన్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం అంటగట్టి బెదిరించాడు. దీంతో అవమానానికి గురైన జగన్, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. కొర్ర జగన్‌ను హత్య చేశారు.. తమ కుమారుడిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జగన్ తండ్రి రాములు ఆరోపించారు. గ్రామస్తులతో కలసి మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం గది వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఐ వారిని సముదాయించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పీడీఎస్‌లోకి కొర్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులు పండించిన చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు) ఉత్పత్తులను మద్దతు ధరకు సేకరించి, తిరిగి వాటిని పీడీఎస్‌లోకి తీసుకొచ్చి లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. తాజాగా కొర్రలను సైతం కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 750 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 60వేల టన్నులకు పైగా చిరుధాన్యాల సేకరణకు సమాయత్తం అవుతోంది. ఫలించిన సీఎం జగన్ ప్రయత్నం రాష్ట్రంలోని రైతులను చిరుధాన్యాల సాగువైపు నడిపించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పండించే చిరుధాన్యాలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. గత రబీ సీజన్లో పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే కొర్రలకు కూడా మద్దతు ధర ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తోంది. కానీ, సీఎం జగన్ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖరీఫ్ సన్నద్ధతపై జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగులకు ఇచ్చే మద్దతు ధర క్వింటా రూ.3,846కే కొర్రలు కూడా కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇక జొన్నలను క్వింటా మద్దతు ధర రూ.3,225గా నిర్ణయించింది. 1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలు అవసరం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీ ప్రారంభించింది. తాజాగా కొర్రలు కూడా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో పీడీఎస్ వినియోగానికి ఏడాదికి రూ.1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలను సేకరించాల్సి ఉంది. వీటిలో రాగులు అత్యధికంగా ఏడాదికి 89,760 టన్నుల అవసరం కాగా, మిగిలినవి జొన్నలు, కొర్రలు పంపిణీ చేస్తారు. ఏపీలో రాగులు, జొన్నలు, కొర్రలు పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఖరీఫ్‌లో రైతుల నుంచి సుమారు 60వేల టన్నుల వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 1.20లక్షల టన్నులను ఎఫ్‌సీఐ నుంచి సేకరించనున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి కొర్రలు, అక్టోబర్ చివరి వారం నుంచి రాగులు, జొన్నలు సేకరించనున్నారు. చిరుధాన్యాలకు మద్దతు చిరుధాన్యాల పంపిణీని తొలి దశలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రారంభించాం. కార్డుదారుల ఇష్ట్రపకారం ఉచితంగానే బియ్యం బదులు రెండు కిలోల రాగులు, జొన్నలు అందిస్తున్నాం. రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలోనే ఈ పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా తక్కువ ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకే వెనుకబడిన జిల్లాలను ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నాం. ఇక ధాన్యం సేకరణ మాదిరిగానే చిరుధాన్యాలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ క్షేత్రం నుంచి గోడౌన్లకు తరలించే వరకు స్వయంగా ప్రక్రియను చేపడుతోంది. రైతే స్వయంగా తరలిస్తే మద్దతు ధరతోపాటు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తోంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం
సాక్షి, అమరావతి: కరోనా కారణంతో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులొచ్చాయి. ఎన్నో పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగింది. సంప్రదాయ అల్పాహారాలైన ఉప్మా–పెసరట్టు, మసాలా దోశ, ఇడ్లీ, ఊతప్పం తదితరాల స్థానంలో ఇప్పుడు చిరుధాన్యాలతో తయారుచేసే కొర్రల ఉప్మా, పుట్టగొడుగుల దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటివి వచ్చి వచ్చాయి. ఇది సేంద్రీయ వ్యవసాయ రైతులో లేక ప్రకృతి సేద్యం చేస్తున్న వారో చెబుతోంది కాదు.. కార్పొరేట్ సంస్థలే స్పష్టంచేస్తున్న వాస్తవం. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు చేసిన ఓ సర్వే ప్రకారం.. లాక్డౌన్ అనంతర కాలంలో పోషక విలువలున్న ఆహారానికి ఎక్కడలేని గిరాకీ పెరిగింది. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నాపెద్ద అందరూ చిరుతిళ్ల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ప్యాక్ చేసిన చిరు ధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. దీన్ని ఆసరా చేసుకున్న వాటి తయారీ సంస్థలు, పేరున్న మల్టీచైన్ కంపెనీలు చిరుధాన్యాలతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ పదార్థాలపై ఎక్కువ దృష్టిపెట్టాయి. కొత్త పదార్థాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. లాక్డౌన్ అనంతరం కూడా చిరుధాన్యాల వినియోగం పెరిగింది. అల్పాహారంలో ఎక్కువ వినియోగం ప్రస్తుతం చిరు ధాన్యాలను ఎక్కువగా అల్పాహారంలో తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కెల్లాగ్స్ ఫ్రూట్ లూప్స్ కంపెనీ వెల్లడించింది. కార్న్‌ఫ్లేక్స్ మాదిరే చిరు ధాన్యాల ఫ్లేక్స్ ప్రస్తుతం మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. వీటిని పాలల్లో కలుపుకుని తీసుకుంటున్నారు. ఇక జొన్న రవ్వ ఇడ్లీలు, కొర్ర, ఆండ్రు కొర్రలు, రాగి ఇడ్లీల పిండిని ప్యాక్‌చేసి రెడీ టూ కుక్‌గా విక్రయిస్తున్నారు. అటుకులు సరేసరి. చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీలు.. వాటిల్లోకి కూరలు కూడా ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. ఉప్మా, ఇడ్లీ, ఓట్స్, దోశ మిక్స్ వంటివీ తయారుచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు, ఓట్స్ వ్యాపారం గత ఏడాది కాలంలో 300 మిలియన్ డాలర్లకు చేరింది. ఏడాది కిందట 11–12 శాతంగా ఉన్న వీటి వినియోగం ఇప్పుడు 18–20 శాతానికి పెరిగింది. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటికి తీసుకువెళ్లి నీళ్లలో ఉడికించి తినడమే. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
కంది, కొర్ర,, వేరుశనగ సాగు మేలు * ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని కంది, కొర్ర, రాగి, వేరుశనగ, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు. * విత్తే ముందు రైతులు తమ సొంత విత్తనాన్ని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా శుద్ధి చేసిన విత్తనాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలి. * వర్షాధారపు పంటలన్నింటిలోనూ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వలన భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, వేరుశనగ చెక్క, వేప చెక్క, కానుగ చెక్కలను వాడుకోవచ్చు. * నూనె గింజ పంటలకు తప్పనిసరిగా సల్ఫర్ ఉన్న భాస్వరపు ఎరువులను వాడాలి. అన్ని పంటలకు మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దుక్కిలోనే వేయాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. * వర్షాలు తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకుగాను, వాలుకు అడ్డంగా విత్తుకోవడం, వాలును అనుసరించి మడులను చిన్నవిగా చేసుకోవడం, వాలు ఎక్కువగా ఉన్నచోట్ల లోతైన గొడ్డు చాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వాలు ఉన్న చోట్ల మట్టితోగాని, రాతి కట్టడంతో లేదా జీవ కంచెతో గాని అడ్డు ఏర్పాటు చేసుకోవడం వలన నీటిని అక్కడే ఇంకేలా చేసుకోవడమే కాకుండా మట్టి కొట్టుకు పోకుండా నివారించవచ్చు. * వర్షాకాలంలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 గంటల్లోపు ఆయా పంటలకు సిఫారసు చేసిన కలుపు పైమందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. * కంది పంటకు పెండిమిథాలిన్ 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు. ఆముదం పంటకు పెండిమిథాలిన్ 1.3 - 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 800 మి.లీ. నుంచి ఒక లీటరు. పత్తిలో విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 1 లీటరు/ విత్తిన తర్వాత పెండిమిథాలిన్ 1.3 నుంచి 1.6 లీ./ అలాక్లోర్ 1.5-2 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్