‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం | Benefits Of Cereals and Wholegrain Foods In Telugu | Sakshi
Sakshi News home page

‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం

Published Tue, Aug 17 2021 2:29 PM | Last Updated on Tue, Aug 17 2021 3:58 PM

Benefits Of Cereals and Wholegrain Foods In Telugu - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కారణంతో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులొచ్చాయి. ఎన్నో పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగింది. సంప్రదాయ అల్పాహారాలైన ఉప్మా–పెసరట్టు, మసాలా దోశ, ఇడ్లీ, ఊతప్పం తదితరాల స్థానంలో ఇప్పుడు చిరుధాన్యాలతో తయారుచేసే కొర్రల ఉప్మా, పుట్టగొడుగుల దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటివి వచ్చి వచ్చాయి. ఇది సేంద్రీయ వ్యవసాయ రైతులో లేక ప్రకృతి సేద్యం చేస్తున్న వారో చెబుతోంది కాదు.. కార్పొరేట్‌ సంస్థలే స్పష్టంచేస్తున్న వాస్తవం.

2020 మార్చి నుంచి ఇప్పటివరకు చేసిన ఓ సర్వే ప్రకారం.. లాక్‌డౌన్‌ అనంతర కాలంలో పోషక విలువలున్న ఆహారానికి ఎక్కడలేని గిరాకీ పెరిగింది. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నాపెద్ద అందరూ చిరుతిళ్ల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ప్యాక్‌ చేసిన చిరు ధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. దీన్ని ఆసరా చేసుకున్న వాటి తయారీ సంస్థలు, పేరున్న మల్టీచైన్‌ కంపెనీలు చిరుధాన్యాలతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్‌ పదార్థాలపై ఎక్కువ దృష్టిపెట్టాయి. కొత్త పదార్థాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. లాక్‌డౌన్‌ అనంతరం కూడా చిరుధాన్యాల వినియోగం పెరిగింది. 

అల్పాహారంలో ఎక్కువ వినియోగం
ప్రస్తుతం చిరు ధాన్యాలను ఎక్కువగా అల్పాహారంలో తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కెల్లాగ్స్‌ ఫ్రూట్‌ లూప్స్‌ కంపెనీ వెల్లడించింది. కార్న్‌ఫ్లేక్స్‌ మాదిరే చిరు ధాన్యాల ఫ్లేక్స్‌ ప్రస్తుతం మార్కెట్‌లో బాగా దొరుకుతున్నాయి. వీటిని పాలల్లో కలుపుకుని తీసుకుంటున్నారు. ఇక జొన్న రవ్వ ఇడ్లీలు, కొర్ర, ఆండ్రు కొర్రలు, రాగి ఇడ్లీల పిండిని ప్యాక్‌చేసి రెడీ టూ కుక్‌గా విక్రయిస్తున్నారు. అటుకులు సరేసరి.

చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీలు.. వాటిల్లోకి కూరలు కూడా ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. ఉప్మా, ఇడ్లీ, ఓట్స్, దోశ మిక్స్‌ వంటివీ తయారుచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు, ఓట్స్‌ వ్యాపారం గత ఏడాది కాలంలో 300 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఏడాది కిందట 11–12 శాతంగా ఉన్న వీటి వినియోగం ఇప్పుడు 18–20 శాతానికి పెరిగింది. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటికి తీసుకువెళ్లి నీళ్లలో ఉడికించి తినడమే.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement