raagi crop
-
1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాగిపిండి పంపిణీ
సాక్షి, అమరావతి: వచ్చే నెల 1 నుంచి రేషన్ లబ్దిదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది. ముందు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలవర్థక ఆహారంగా రాగి పిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది. బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి రూ.40పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, రాయలసీమలోని వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని మిల్లింగ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. పౌరసరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగిపిండి పంపిణీకి శ్రీకారం చుడుతోంది. నేరుగా రైతుల నుంచే కొనుగోలు రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో భాగంగా స్థానిక రైతులకు సంపూర్ణ మద్దతు కల్పిస్తూ పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులను చిరుధాన్యాల సాగువైపు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాయితీపై చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. కొర్రల కొనుగోలుకు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ మద్దతు ధరల జాబితాలో చేర్పించింది. కొర్రలు కోతలకు వచ్చే సమయంలో వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాగులు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో జొన్నల కొనుగోలును చేపడుతోంది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా వ్యవసాయ క్షేత్రం నుంచే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతుకు బాసటగా నిలుస్తోంది. వాటిని ప్రాసెసింగ్ చేసి తిరిగిన స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేస్తోంది. దీంతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా ఇతర రాష్రా్టల నుంచి రాగులును దిగుమతి చేసుకుంటోంది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రాగులు, జొన్నలు కలిపి సుమారు 6,500 టన్నులకుపైగా సేకరించింది. మరో 20 వేల టన్నుల జొన్నలు.. నంద్యాల జిల్లాలో జొన్నలు మంచి దిగుబడులు వచ్చాయి. రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో అదనంగా జొన్నల కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీని ప్రకా రం మరో 20వేల టన్నుల వరకు జొన్నలను సేకరించనుంది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోనూ మిగిలిన వాటిని ఎఫ్‌సీఐకి అందించనుంది. తద్వారా రాష్ట్ర రైతులకు పూర్తి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపడుతోంది. గోధుమ పిండికి డిమాండ్.. పీడీఎస్‌లో అందిస్తున్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండికి మంచి డిమాండ్ ఉంది. ప్రతి నెలా 2,500 టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు వినియోగం ఉంటోంది. ఇదే గోధుమ పిండిని కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. రాష్ట్రంలో కిలో రూ.16కే అందిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమపిండి లభిస్తుండటంతో కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం.. పీడీఎస్‌లో పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అందుకే నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాం. రాగులుకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే వాటిని మిల్లింగ్ చేసుకుని వాడుకునేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే రాగిపిండిని ఇవ్వాలని నిర్ణయించాం. కిలో ప్యాకెట్ల రూపంలో రూ.11కే మార్చి నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. రాగులను ప్రాసెసింగ్ చేసి.. పిండి ఆడించి, ప్యాకింగ్, రవాణా చేసేందుకయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన పంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీపడతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క విశాఖలో సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 30 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 15 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండి పదార్థాలు ఉండే బియ్యం కంటే, పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్‌ఫుడ్ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలా మంది వీటినే ఆరాధిస్తున్నారు. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకునే నగర వాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊచలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్పై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటీస్ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు..అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్ వినియోగంపై సాక్షి ప్రత్యేక కథనం.. సహజ ఆహారమే ఎందుకు ప్రస్తుత కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 36 ఏళ్ల కిందటే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు నగరాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయస్సులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై రకరాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలా మంది అటువైపే చూస్తున్నారు. పాతవైపు..కొత్త చూపు.. ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియాని ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నానవెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరం ఆహరమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యామైన డిమాండ్ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో దోహదం చేసే రాగులకు స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటికి.. ఒంటికి కూడా.. సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, సబ్బులు, షాంపులు, వంట నూనెలు, కాస్మోటిక్స్ కూడా చేరాయి. పలు వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్‌మాల్ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో మహా నగరానికి పల్లెకు, మధ్య బాటలు వేశాయి. సూపర్ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సాత్విక ఆహారంతో పాటు చిరుధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వాటితో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమిస్తున్నారు. –గట్రెడ్డి రమాదేవి, గృహిణి ఒత్తిడితో ఉన్నవారికి చిరుధాన్యాలు అవసరం నిత్యం పని ఒత్తిడిలో ఉన్న వారికి బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాగి అంబలి, దంపుడు బియ్యం, కొర్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. –బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ -
‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం
సాక్షి, అమరావతి: కరోనా కారణంతో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులొచ్చాయి. ఎన్నో పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగింది. సంప్రదాయ అల్పాహారాలైన ఉప్మా–పెసరట్టు, మసాలా దోశ, ఇడ్లీ, ఊతప్పం తదితరాల స్థానంలో ఇప్పుడు చిరుధాన్యాలతో తయారుచేసే కొర్రల ఉప్మా, పుట్టగొడుగుల దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటివి వచ్చి వచ్చాయి. ఇది సేంద్రీయ వ్యవసాయ రైతులో లేక ప్రకృతి సేద్యం చేస్తున్న వారో చెబుతోంది కాదు.. కార్పొరేట్ సంస్థలే స్పష్టంచేస్తున్న వాస్తవం. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు చేసిన ఓ సర్వే ప్రకారం.. లాక్డౌన్ అనంతర కాలంలో పోషక విలువలున్న ఆహారానికి ఎక్కడలేని గిరాకీ పెరిగింది. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నాపెద్ద అందరూ చిరుతిళ్ల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ప్యాక్ చేసిన చిరు ధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. దీన్ని ఆసరా చేసుకున్న వాటి తయారీ సంస్థలు, పేరున్న మల్టీచైన్ కంపెనీలు చిరుధాన్యాలతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ పదార్థాలపై ఎక్కువ దృష్టిపెట్టాయి. కొత్త పదార్థాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. లాక్డౌన్ అనంతరం కూడా చిరుధాన్యాల వినియోగం పెరిగింది. అల్పాహారంలో ఎక్కువ వినియోగం ప్రస్తుతం చిరు ధాన్యాలను ఎక్కువగా అల్పాహారంలో తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కెల్లాగ్స్ ఫ్రూట్ లూప్స్ కంపెనీ వెల్లడించింది. కార్న్‌ఫ్లేక్స్ మాదిరే చిరు ధాన్యాల ఫ్లేక్స్ ప్రస్తుతం మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. వీటిని పాలల్లో కలుపుకుని తీసుకుంటున్నారు. ఇక జొన్న రవ్వ ఇడ్లీలు, కొర్ర, ఆండ్రు కొర్రలు, రాగి ఇడ్లీల పిండిని ప్యాక్‌చేసి రెడీ టూ కుక్‌గా విక్రయిస్తున్నారు. అటుకులు సరేసరి. చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీలు.. వాటిల్లోకి కూరలు కూడా ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. ఉప్మా, ఇడ్లీ, ఓట్స్, దోశ మిక్స్ వంటివీ తయారుచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు, ఓట్స్ వ్యాపారం గత ఏడాది కాలంలో 300 మిలియన్ డాలర్లకు చేరింది. ఏడాది కిందట 11–12 శాతంగా ఉన్న వీటి వినియోగం ఇప్పుడు 18–20 శాతానికి పెరిగింది. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటికి తీసుకువెళ్లి నీళ్లలో ఉడికించి తినడమే. -
రాగి పంట కుప్పపై నిద్ర.. యువకుడు దుర్మరణం
సాక్షి, దొడ్డబళ్లాపురం : కోత కోసిన రాగి పంటను ఎండబెట్టేందుకు రోడ్డుపై వేసి ఆ కుప్పలమీదే పడుకున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని మెణసి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని తాలూకాలోని మెణసి గ్రామానికి చెందిన యోగీష్ (19)గా గుర్తించారు. దొడ్డబళ్లాపురం-తుమకూరు రహదారిలో దొడ్డబెళవంగల వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక రైతులు తమ పొలాల్లో కోత కోసిన రాగి, జొన్న పంటలను ఎండబెట్టేందుకు, నూర్చేందుకు రోడ్డుపై వేస్తుండడం ఆనవాయితీ. ఇదేవిధంగా ఖాళీగా ఉన్న రోడ్డుపై శుక్రవారం రాత్రి తన పంట కుప్ప వేసి దానిపైనే యోగీష్ నిద్రించాడు. అర్ధరాత్రివేళ గుర్తుతెలియని వాహనం అదే రోడ్డుమీదుగా వెళ్లడంతో కుప్పలపై పడుకున్న యోగీష్ వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేశీ రాగులుంటే దిగులుండదు!
అంతరించిపోతున్న దేశీ రాగి(తైదలు) వంగడాలను ప్రత్యేక శ్రద్ధతో సాగు చేస్తున్నారు కర్ణాటక రైతు సోమశేఖర. అనాదిగా మన రైతులు సాగు చేస్తున్న చిరుధాన్యపు పంట రాగి. దిగుబడి తక్కువగా ఉండటంతో రైతులు వీటి సాగుకు స్వస్తిపలికి ఆహార, వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. అప్పులతో ఆత్మహత్యల పాలైన వారూ ఉన్నారు. కానీ దేశవాళీ రాగి వంగడాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే రైతు జీవితానికి కనీస భద్రత ఉంటుందంటున్నారు సోమశేఖర. వరుస కరువులను తట్టుకొని, వేసవిలో కూడా మంచి దిగుబడినిచ్చే రకాలున్నాయని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లా శివల్లి గ్రామానికి చెందిన సోమశేఖర అనే రైతు అనేక దేశీ రాగి రకాలను సాగు చేస్తూ, వాటిని సంరక్షిస్తున్నారు. ఒకప్పుడు మాండ్యా ప్రాంతంలోనూ రైతులు దేశీ రాగి రకాలను విరివిగా సాగు చేసేవారు. నీటి పారుదల సౌకర్యం వచ్చాక ఏటా చెరకు, రెండు పంటలు వరిని సాగు చేస్తున్నారు. గడచిన రెండేళ్లుగా కరవు ఉండటంతో 275 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండో పంటగా రబీలో మాత్రం రాగులు సాగు చేస్తున్నారు. అయితే సంకరజాతి రకాల వల్ల దేశీ రాగి వంగడాల మనుగడ ప్రశ్నార్థకమయింది. ఈ పరిస్థితుల్లో రైతుల నేతృత్వంలో నడిచే ‘సహజ సమృద్ధ’ అనే సంస్థ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రైతుల నుంచి 40 కు పైగా దేశీ రాగి రకాలను సేకరించింది. ఈ సంస్థ ద్వారా దేశీ వంగడాల ప్రాముఖ్యతను తెలుసుకున్న సోమశేఖర వాటి పరిరక్షణకు నడుం బిగించారు. ఎడాగు రాగి, శరావతి రాగి, రాగల్లి శివల్లి రాగి, బోండా రాగి, కెంపు రాగి, బిలిగడ్డ రాగి, బెన్నెముద్దె రాగి, మరియు హసిరి కడ్డి రాగి వంటి 30 రకాల దేశవాళి రాగి రకాలను ఆయన సాగు చేస్తున్నారు. వీటిలో కొన్ని స్వల్పకాలిక రకాలు, మరికొన్ని పశుగ్రాసం కోసం సాగు చేసే రకాలు. ఇలా ప్రతి దేశీ రాగి రకానికి తమవైన లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. సోమశేఖర తొలుత నర్సరీ బెడ్లపై నారు పోస్తాడు. 25 రోజుల తరువాత మొక్కలను పొలంలో నాటుకుంటాడు. పశువుల ఎరువు మాత్రమే వాడతాడు. మొక్కలు నాటుకున్నప్పుడు, నెల రోజుల దశలో, పశువుల ఎరువు వేసినప్పుడు, పూతకొచ్చినప్పుడు... ఇలా పంటకాలం మొత్తంలోనూ నాలుగు సార్లు మాత్రమే నీటి తడులు ఇస్తాడు. అయినా మంచి దిగుబడులు వస్తున్నాయని సోమశేఖర తెలిపారు. దేశీ రాగి రకాలను సాగు చేస్తే దిగుబడి తక్కువ వస్తుందని కొంతమంది రైతులు భావిస్తున్నారని, ఇది అపోహ మాత్రమే అంటారాయన. ‘జగలూరు రాగి’ రకాన్ని కరువు కాలంలోనూ, వేసవిలోనూ సాగుచేసి తాను మంచి దిగుబడులు పొందుతున్నానని.. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చే దేశీ రాగి రకాలున్నాయని ఆయన చెప్పారు. సోమశేఖర స్ఫూర్తితో ఇప్పుడు ఇరుగు పొరుగు రైతులు దేశీ రాగి వంగడాలను సాగు చేస్తున్నారు. ‘అయ్యన రాగి అనే దేశీ రకం గురించి మా నాయన చెపుతుంటే వినటం తప్పించి మేం ఎన్నడూ చూసింది లేదు. కానీ అలాంటి అంతరించిపోతున్న రకాలను సాగు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని సోమశేఖర భార్య మణి సంతోషంగా చెపుతున్నారు. ఒక్కో రైతు ఒక్క దేశీ రాగి రకాన్ని సాగు చే సినా దేశీ రాగి రకాలను పది కాలాలు పదిలంగా కాపాడుకోవచ్చని సోమశేఖర సాటి రైతులకు సూచిస్తున్నారు. సేంద్రియ సాగుకు అనువైనది ‘జగలూరు రాగి’ కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని చిత్రదుర్గ జిల్లాలోని చిన్న పట్టణం జగలూరు. ఈ ప్రాంతంలో చిరకాలం నుంచి సాగులో ఉంది కాబట్టి ‘జగలూరు రాగి’ రకంగా ప్రసిద్ధి పొందింది. పెద్ద కంకులు, ఎక్కువ పిలకలు, ఎత్తుగా పెరగడం, సాగు నీటి సదుపాయం ఉన్నా, వర్షాధారంగానైనా అధిక దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. జగలూరు రాగుల రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. వినియోగదారులు ఇష్టపడుతుండటంతో మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తే 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీని సాగు కాలం 4 నెలలు. సేంద్రియ సేద్యానికి ఇది బాగా అనువైన వంగడమని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సేంద్రియ వ్యవసాయ సంస్థ రైతులకు సిఫారసు చేసిందని బెంగళూరుకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సహజ సమృద్ధ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. (దేశీ రాగి, చిరుధాన్యాల విత్తనాలు కావలసిన రైతులు మైసూరులోని సహజ సీడ్స్ సంస్థను 099640 31758, 95351 49520 నంబర్లలో లే దా ఈ–మెయిల్ sahajaseeds@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.)