బువ్వబండి వద్ద ఉచిత మిల్లెట్ భోజనం తింటున్న స్థానికులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆహారమే ఔషధం.. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి. ఔషధం లాంటి ఆహారాన్ని ‘ఔరా’అనిపించే విధంగా ఓ బువ్వబండి అందిస్తోంది. ‘తింటే గారెలే తినాలి..’అంటారు కదా! ఈ బువ్వబండిని చూస్తే, ‘తింటే.. చిరుధాన్యాల బువ్వే తినాలి’అని అనిపిస్తుంది. సామల అన్నం, నోరూరించే టమాటా పచ్చడి, పసందైన ఆకుకూర పప్పు, గంజి సూప్.. ఇది బువ్వబండి మెనూ.
ఇది గుడ్‌ఫుడ్ మాత్రమేకాదు, హెల్దీ ఫుడ్ కూడా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే చిరుధాన్యాల ప్రాధాన్యం తెలియజేసేందుకు ప్రతిరోజూ ఉచితంగా మిల్లెట్ భోజనాన్ని వడ్డిస్తున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన కొల్లూరు సత్తయ్య, అమృతమ్మ దంపతులు. సామలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘బువ్వబండి’ని తయారుచేశారు.
ఈ బువ్వబండిని రోజూ ఉద యం 8.30 నుంచి 10.30 గంటల వరకు తెల్లాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచుతారు. వందలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ బండి వద్ద ‘చిరు’బు వ్వ తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
రోజూ రూ.4 వేలు.. ఐదు రకాల చిరుధాన్యాలు
ఒక్కో రకం చిరుధాన్యం భోజనం ఐదు రోజుల చొప్పున వడ్డిస్తుంటారు. ఈ చిరుధాన్యాలను మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు. రోజూ 25 కిలోల చిరుధాన్యంతో చేసిన భోజనం వడ్డిస్తున్నారు. ఈ మిల్లెట్ భోజనంలో రోజూ ఒక రోటి పచ్చడి కూడా ఉంటుంది. టమాటా, పుంటికూర (గోంగూర), మెంతికూర, కొత్తిమీర వంటి వాటితో రోటిపచ్చడి వడ్డిస్తున్నారు.
ఈ ఆహారంలో ఆకుకూర పప్పు కూడా ఉంటుంది. ఒక్కో ఆకుకూర ఒక్కోరోజు అందిస్తున్నారు. వీటితోపాటు గంజి సూప్ ఇస్తున్నారు. ఈ బువ్వబండిని సత్తయ్య 2021 నవంబర్‌లో ప్రారంభించారు. సత్తయ్య కుటుంబసభ్యులు ఉదయం 5 గంటలకే లేచి ఈ బువ్వబండి పనులు మొదలుపెడుతుంటారు. బువ్వబండి నిర్వహణ కోసం ప్రతిరోజూ కనీసం రూ.4 వేల ఖర్చు అవుతోందని సత్తయ్య పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment