free food
-
గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్.. గూగుల్ కంపెనీలో ఉచిత భోజనం మీద ఎందుకు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. 'ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.సంస్థలో ఉచిత భోజనం అందించడం అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన గొప్ప ప్రయోజనం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. నేను గూగుల్‌లో చేరిన మొదట్లో కేఫ్‌లకు వెళ్ళినప్పుడు.. మరికొందరిని కలుసుకునేవాడిని. ఆలా కలుసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్న సమయంలో కొత్త విషయాలు తెలుస్తాయి, అద్భుతమైన కొత్త ఆలోచనలు పుడతాయని అన్నారు.ఉచిత భోజనం అందించడం వల్ల ఉద్యోగులు కలిసే భోజనం తింటారు. అలా ఉద్యోగులు భోజనం తినే సమయంలో ఆవిష్కరణలు పెంపొందించడానికి కావాల్సిన ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీని నుంచి వచ్చే ప్రయోజనంతో పోలిస్తే.. ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువని పిచాయ్ పేర్కొన్నారు. ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకతకు, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి అని అన్నారు. ఉచిత భోజనం మాత్రమే కాకుండా.. కంపెనీ ఉద్యోగుల కోసం స్నేహపూర్వక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.గూగుల్‌లో జాబ్ కోసం..ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 1,82,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులలోని టాలెంట్‌ను గుర్తించి అలాంటి వారికి జాబ్ ఆఫర్స్ అందిస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు. -
ఈ హోటల్లో ఫ్రీగా నచ్చినంత తినొచ్చు.. కానీ ఓ కండిషన్
ఈ హోటల్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వండి.. కడుపు నిండా తినండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు! అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. తిన్నంత తిని డబ్బులు వద్దు అంటున్నారు అని సంతోషపడిపోకండి! ఎందుకంటే డబ్బులకు బదులు ప్లాస్టిక్ ఇవ్వాలండోయ్. ప్లాస్టిక్‌పై నిషేధం విధించినప్పటికీ... ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడంలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు... గుజరాత్‌లోని జునాఘడ్‌కు కలెక్టర్‌గా పనిచేస్తోన్న రచిత్ రాజ్ ‘ప్రకృతి’ పేరిట సరికొత్త కాన్సెప్ట్‌తో ప్లాస్టిక్ కేఫ్‌ను గతేడాది జూన్ ముఫ్పైన ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ఓం శాంతి అనే సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌నకు చెందిన రేఖా బెన్ నడిపిస్తోంది. ఇది సోంపు, నిమ్మకాయ షర్బత్, ఇడ్లీ, పోహా, డోక్లా, మేథీ థోక్లా, గుజరాతీ థాళీలను అందిస్తోంది. వీటిలో ద్రవాహారం కావాలంటే అరకేజీ, ఆహార పదార్థాలు కావాలంటే కేజీ ప్లాస్టిక్ ఇస్తే సరిపోతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉన్న కస్టమర్లు ఈ కేఫ్‌కు ఎగబడి వస్తున్నారు. తరచు వచ్చే కస్టమర్లతో పాటు, పబ్లిక్ హాలిడేస్‌లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కేఫ్ లోనేగాక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో సైతం కేఫ్ ఆర్డర్లు అందిస్తోంది. ప్లాస్టిక్ మనీతో... ప్లాస్టిక్‌ను ఎన్నిసార్లు నిషేధించినప్పటికీ... ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గడం లేదు. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రచిత్ రాజ్ టీమ్ ప్లాస్టిక్ మనీ కేఫ్‌ను ప్రారంభించింది. ప్లాస్టిక్ వాడకంపై ఆసక్తి తగ్గించి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడం, రసాయన ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్నే ప్రజలకు అందించడం , సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళలతో వీటిని నిర్వహించడమే లక్ష్యంతో ప్లాస్టిక్మనీతో ఈ కేఫ్‌ను నడిపిస్తున్నారు. ఆదాయం... ఆరోగ్యం.... డబ్బులకు బదులుగా తీసుకునే ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. సహజసిద్ధ ఎరువులతో పండించిన ఆహారం అందించి ఆరోగ్యం కాపాడుతూ, రసాయనాలు లేని పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా ఈ కేఫ్‌లను నడిపించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్‌లో ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వడ్డిస్తూ ఇటు ప్రజల ఆరోగ్యంతో పాటు, అటు పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు. ఇలాంటి కేఫ్‌లు మరిన్ని ఏర్పాటైతే ప్లాస్టిక్ భూతాన్ని సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు ఈ కేఫ్‌ను ప్రశంసిస్తున్నవారు. -
Vizianagaram: అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఫుడ్‌బ్యాంకులు
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెడితే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది. విజయనగరం పట్టణంలో ఏడాదిన్నరగా వేలాదిమంది పేదల ఆకలితీర్చే బృహత్క్రతువు నిరాటంకంగా కొనసాగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, హోటళ్ల నిర్వాహకులు ఇలా.. మనసున్న ప్రతి ఒక్కరూ ఫుడ్‌బ్యాంకుల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నిర్భాగ్యులకు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. వృథాగా పారబోసే ప్రతి మెతుకుతో మరొకరి ఆకలి తీర్చాలన్న ప్రధాన ఆశయంతో ముందుకు సాగుతున్నారు. – పైడి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం డెస్క్ ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరం పట్టణానికి వచ్చిన పేదలు... స్థానికంగా ఉంటున్న అభాగ్యులు, అనాథల ఆకలి తీర్చాలన్న ఆశయం నుంచి ఏర్పడినవే ఫుడ్ బ్యాంకులు. జిల్లా కేంద్రానికి ఏ దారిలో వచ్చిన వారికైనా ఫుడ్‌బ్యాంకులు తారసపడతాయి. ప్రస్తుతం నలువైపులా నాలుగు ఫుడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు... ఇక్కడ భోజనాల వడ్డింపు కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. వివిధ పనులపై వచ్చేవారు, కూలీలు, ఆటోడ్రైవర్లు, యాచకులు, అనాథలు, వృద్ధులు ఇలా.. అన్నం కోసం ఎదురుచూసేవారందరికీ ఫుడ్‌బ్యాంకులు అన్నంకుండలా మారుతున్నాయి. వారి ఆకలి తీర్చుతున్నాయి. ఒక్కో ఫుడ్‌బ్యాంకులో రోజుకు 100 నుంచి 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని, లేవలేని కొందరు వృద్ధులకు క్యారేజీలతో అందిస్తున్నారు. వీటి నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, హోటళ్ల నిర్వాహకులు, నాయకులు, యువత, కార్పొరేషన్ ఉద్యోగులు భాగస్వాములయ్యారు. ఏ శుభ, అశుభ కార్యమైనా... ఇంటిలో ఎలాంటి శుభ, అశుభ కార్యం జరిగినా పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్‌బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారి స్థాయిని బట్టి అన్నదానం చేస్తున్నారు. కొందరు నాలుగు ఫుడ్‌బ్యాంకులలో ఒక రోజు వడ్డించేందుకు సరిపడా ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండగా, మరికొందరు ఒక ఫుడ్‌బ్యాంకుకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పేదలకు స్వయంగా వడ్డించి, వారి ఆకలితీర్చి ఆత్మ సంతృప్తిపొందుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పరిసర గ్రామాల్లో పుట్టినరోజులు, జయంతి, వివాహాది శుభకార్యాలు, పండగల సమయంలో ముందుగా ఫుడ్ బ్యాంకులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అందుకే... అన్నదాన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతల సాయంబట్టి రాత్రి పూట కూడా భోజనం వడ్డిస్తున్నామని పేర్కొంటున్నారు. ఫుడ్ బ్యాంకుల నిర్వహణ ఇలా... ► ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫుడ్‌బ్యాంకు దాతలతో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయం సహకారంతో కొనసాగుతోంది. ► కోటకూడలిలోని ఫుడ్‌బ్యాంకు హోటళ్ల నిర్వాహకులు, దాతలు సాయంతో సాగుతోంది. ► ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్నదాన కేంద్రం దాతలు, కార్పొరేషన్, గౌరీ సేవాసంఘం సహకారంతో నడుస్తోంది. ► పోలీస్ బ్యారెక్స్ వద్ద ఉన్న కేంద్రం దాతలు, కార్పొరేషన్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వడ్డించే పదార్థాలు అన్నం, సాంబారు, ఒక కూర, పులిహోర, చక్రపొంగలి (దాతలు సమకూర్చితే అరటిపండు, స్వీటు, ఇతర పదార్థాలు) ఫుడ్‌బ్యాంకులలో అన్నదానం ఇలా... ► ప్రతిరోజు ఒక ఫుడ్‌బ్యాంకులో 100 నుంచి 150 మంది చొప్పున నాలుగు ఫుడ్‌బ్యాంకులలో 400 నుంచి 600 మందికి భోజనం వడ్డిస్తున్నారు. ► ఈ ప్రక్రియ ఆగస్టు 13, 2021 నుంచి నిరంతరాయంగా సాగుతోంది. నెలకు 12,000 నుంచి 18,000 మంది ఆకలిని ఫుడ్‌బ్యాంకులు తీర్చుతున్నాయి. కోట వద్ద ఉన్న ఫుడ్ బ్యాంకులో రాత్రి సమయంలో కూడా అన్నదానం చేస్తుండగా, మిగిలిన చోట్ల దాతల సాయం బట్టి రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు. పేదవాని ఆకలి తీర్చడమే ధ్యేయం పేదవాడి ఆకలి తీర్చాలని, సామాన్యులకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో ప్రారంభించినవే ఫుడ్ బ్యాంకులు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 4 ఫుడ్‌బ్యాంక్‌లు పేదలు, అనాథల ఆకలి తీర్చుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్ల పేరుతో రూ.5కే భోజనం పెట్టించామని గొప్పలు చెప్పుకునేవారు. తప్పుడు లెక్కలతో ఖజానా ఖాళీచేసేవారు. ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఫుడ్‌బ్యాంకులకు దాతలే సహకరిస్తూ వేలాదిమంది కడుపునింపుతున్నారు. త్వరలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద మరో ఫుడ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా... వివాహాలు, వేడుకలు, విందుల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫుడ్ బ్యాంకులకు చేర్చుతున్నారు. వీటిని ఫుడ్‌బ్యాంకులలో ఉన్న ఫ్రిజ్‌లలో నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫుడ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం. ఈ ప్రక్రియంలో దాతల భాగస్వామ్యం శుభపరిణామం. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు వేలాది మంది వచ్చిపోతుంటారు. అందులో చాలా మంది ఆర్థిక స్థోమత లేక ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. అటువంటి వారికి ఫుడ్‌బ్యాంక్‌ల సేవలు ఉపయుక్తంగా మారాయి. ప్రతి రోజు రుచి, శుచితో కూడిన భోజానాన్ని అందించగలుగుతున్నాం. – రెడ్డి శ్రీరాములనాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ ఆనందంగా ఉంది ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోంది. ఉద్యోగిగా ఫుడ్‌బ్యాంకు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా... ఆకలితో వచ్చే పేదలకు వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు. అన్నదానం చేసిన దాతలకు చేతులెత్తిదండం పెట్టాలి. వారి దయవల్లే పేదల ఆకలి తీరుతోంది. ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ ఆలోచన గొప్పది. – జె.రవితేజ, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ క్యారేజీ అవసరంలేదు.. విజయనగరం పట్టణానికి చెట్లు కొట్టేందుకు వస్తాను. పట్టణ పరిధిలో ఎక్కడ పని ఉన్నా క్యారేజీ తెచ్చుకోను. ఫుడ్ బ్యాంకు వద్దకు వచ్చి భోజనం చేస్తాను. మా లాంటి కూలిపనివారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – రీసు పైడితల్లి, గొట్లాం ఆకలితీర్చుతోందయ్యా.. నేను కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుతూ జీవిస్తున్నాను. ఎక్కడ ఉన్నా పోలీస్ బ్యారెక్ వద్ద ఉన్న ఫుడ్‌బ్యాంకు వద్దకు సమయానికి చేరుకుంటాను. కడుపునిండా భోజనం చేస్తున్నారు. మాలాంటి పేదలకు అన్నంపెడుతున్న దాతలు నూరేళ్లపాటు చల్లగా ఉండాలి. – రాముపైడమ్మ, గాజులరేగ, విజయనగరం మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ -
దారుణం: పెళ్లి భోజనం చేశాడని.. ప్లేట్లు కడిగించారు
వైరల్: పిలవని పెళ్లికి వెళ్లిన ఓ హాస్టల్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రీగా తిన్నాడని అతనితో బలవంతంగా ప్లేట్లు కడిగించారు అక్కడున్న కొందరు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రీగా తింటే దానికి శిక్ష ఏంటో తెలుసా?.. మీ ఇంట్లోలాగే ఇక్కడ ప్లేట్లు సరిగ్గా కడుగు అంటూ అతని ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తూ ఉండగా.. వీడియో రికార్డు అయ్యింది. ఎందుకు వచ్చావ్? అసలు ఎవడు పెళ్లికి పిలిచాడు నిన్ను.. ఫ్రీగా తినడానికి వచ్చావా?.. ఇదే నీకు సరైన శిక్ష అంటూ వాయిస్ వినిపిస్తుంది ఆ వీడియోలో. బాధిత యువకుడిది జబల్పూర్(మధ్యప్రదేశ్)గా తేలింది. భోపాల్‌కి చదువు కోసం వచ్చాడట. ‘‘ఎంబీఏ చదువుతున్నావ్. నీ తల్లిదండ్రులు నెల నెలా డబ్బు పంపడం లేదా?. నువ్వు ఇలా చేయడం వల్ల మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంటూ అతన్ని మందలిస్తున్నారు మరికొందరు. दो तस्वीर… pic.twitter.com/T8uG6l4te1 — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 కొసమెరుపు ఏంటంటే.. తీరా ప్లేట్లు కడిగాక ‘ఎలా అనిపిస్తోంది’ అంటూ కొందరు అతన్ని అడిగారు. ఫ్రీగా తిన్నప్పుడు.. ఏదో ఒక పని చేయాల్సిందే కదా అంటూ సమాధానం ఇచ్చాడు ఆ స్టూడెంట్. ఇలా పిలవని ఫంక్షన్లకు, కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయడం మామూలు కావొచ్చు. కానీ, దానికే ఇలా ప్లేట్లు కడిగించి మరీ వీడియోలు తీయడం, ఆ విద్యార్థిని అలా అవమానించడం సరికాదంటున్నారు చాలామంది. ఇదిలా ఉంటే.. అదే సమయంలో మరో వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లో ఇలాగే పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేసిన ఓ హాస్టల్ విద్యార్థి.. ఏకంగా పెళ్లి కొడుకు దగ్గరికే వెళ్లి ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే.. ఆ విద్యార్థి బాధను అర్థం చేసుకున్న ఆ పెళ్లి కొడుకు.. పర్వాలేదని, మరికొంత భోజనం హాస్టల్లో ఉన్న అతని స్నేహితులకు సైతం తీసుకెళ్లమని సూచిస్తాడు. God Bless You.❤️ pic.twitter.com/0Cu0rDdZoI — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 ఇదీ చూడండి: పేగుబంధం పక్కన పెట్టి.. కొడుకును పోలీసులకు పట్టించింది -
రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఇక నుండి ఫ్రీ ఫుడ్
-
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ప్రయాణికులకు ఉచిత ఆహారం!
భారతీయ రైల్వే.. రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తూ, ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ప్రయాణికులకు అందించే సర్వీస్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు దుసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలను ప్రవేశపెడుతూ ప్రయాణికుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తుంది ఇండియన్ రైల్వేస్. తాజాగా ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఏకంగా తన ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం! ప్రస్తుత పండుగ సీజన్లో భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీపావళి, ఛత్ వంటి పండుగల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. మరో వైపు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. అయితే గమనించల్సిన విషయం ఏంటంటే.. రైల్వే శాఖ ఈ సదుపాయం ప్రతి రైలులోని ప్రయాణీకులకు అందుబాటులో ఉండదని తెలపింది. కేవలం కొన్ని రైళ్లకు మాత్రమేనని.. ఆ జాబితాలో డుర్యాంటో ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది వంటి లగ్జరీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఉచిత ఆహార సౌకర్యం పొందాలంటే.. రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన రైలులోని ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత సర్వీస్ అందిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, పై తెలిపిన వాటి ప్రకారం ప్రయాణీకులు పూర్తి భోజనం లేదా మధ్యాహ్న అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం మొదలైనవి, అలాగే కొన్ని ఎంపిక చేసిన పానీయాలు కూడా ఉచితంగా అందిస్తారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ! -
Free Chhole Bhature: బూస్టర్ డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్!
చండీగఢ్: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్‌కు చెందిన స్ట్రీట్ వెండర్ ఉచితంగా ఛోల్ భతుర్(సెనగ మసాల పూరీ) టిఫిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. ఉత్తర భారతంలో చోల్ భతురే చాలా ఫేమస్. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్‌లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్. ఈ విషయాన్ని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్ రాణాపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే -
‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆహారమే ఔషధం.. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి. ఔషధం లాంటి ఆహారాన్ని ‘ఔరా’అనిపించే విధంగా ఓ బువ్వబండి అందిస్తోంది. ‘తింటే గారెలే తినాలి..’అంటారు కదా! ఈ బువ్వబండిని చూస్తే, ‘తింటే.. చిరుధాన్యాల బువ్వే తినాలి’అని అనిపిస్తుంది. సామల అన్నం, నోరూరించే టమాటా పచ్చడి, పసందైన ఆకుకూర పప్పు, గంజి సూప్.. ఇది బువ్వబండి మెనూ. ఇది గుడ్‌ఫుడ్ మాత్రమేకాదు, హెల్దీ ఫుడ్ కూడా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే చిరుధాన్యాల ప్రాధాన్యం తెలియజేసేందుకు ప్రతిరోజూ ఉచితంగా మిల్లెట్ భోజనాన్ని వడ్డిస్తున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన కొల్లూరు సత్తయ్య, అమృతమ్మ దంపతులు. సామలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘బువ్వబండి’ని తయారుచేశారు. ఈ బువ్వబండిని రోజూ ఉద యం 8.30 నుంచి 10.30 గంటల వరకు తెల్లాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచుతారు. వందలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ బండి వద్ద ‘చిరు’బు వ్వ తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రోజూ రూ.4 వేలు.. ఐదు రకాల చిరుధాన్యాలు ఒక్కో రకం చిరుధాన్యం భోజనం ఐదు రోజుల చొప్పున వడ్డిస్తుంటారు. ఈ చిరుధాన్యాలను మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు. రోజూ 25 కిలోల చిరుధాన్యంతో చేసిన భోజనం వడ్డిస్తున్నారు. ఈ మిల్లెట్ భోజనంలో రోజూ ఒక రోటి పచ్చడి కూడా ఉంటుంది. టమాటా, పుంటికూర (గోంగూర), మెంతికూర, కొత్తిమీర వంటి వాటితో రోటిపచ్చడి వడ్డిస్తున్నారు. ఈ ఆహారంలో ఆకుకూర పప్పు కూడా ఉంటుంది. ఒక్కో ఆకుకూర ఒక్కోరోజు అందిస్తున్నారు. వీటితోపాటు గంజి సూప్ ఇస్తున్నారు. ఈ బువ్వబండిని సత్తయ్య 2021 నవంబర్‌లో ప్రారంభించారు. సత్తయ్య కుటుంబసభ్యులు ఉదయం 5 గంటలకే లేచి ఈ బువ్వబండి పనులు మొదలుపెడుతుంటారు. బువ్వబండి నిర్వహణ కోసం ప్రతిరోజూ కనీసం రూ.4 వేల ఖర్చు అవుతోందని సత్తయ్య పేర్కొంటున్నారు. -
Hyderabad: కరోనా రోగుల ఇంటి వద్దకే ఫ్రీ ఫుడ్ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: కరోనా మొదటివేవ్ లాక్డౌన్ సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం, సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పోలీసులు, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత సరఫరా చేపట్టారు. సేవా ఆహార్ పేరుతో సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొనసాగించనున్నారు. దాతలు, ఫుడ్ డెలివరీ సంస్థలు ముందుకు వస్తే త్వరలోరాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. కరోనా బారినపడి ఇంటికే పరిమితమై, బయటికి రాలేని వారికోసం ఈ సేవలు అందిస్తున్నారు. రెండు విధాలుగా ఆర్డర్ ఈ సేవా ఆహార్ పథకంలో రెండు రకాలుగా ఉచిత ఆహారం కోసం ఆర్డర్ చేయవచ్చు. మొదటిది 7799616163 ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో ఉదయం 7 గంటల్లోగా ఆర్డర్ చేయాలి. ఏడింటి తరువాత చేస్తే దాన్ని మరుసటి రోజు ఆర్డర్ కింద పరిగణిస్తారు. సేవా ఆహార్ యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ రెండురోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆర్డర్ సమయంలో రోగి పేరు, నివసిస్తున్న ప్రాంతం, కాంటాక్ట్ నంబర్, ఇంట్లో ఎందరు పాజిటివ్ అయ్యారు? తదితర వివరాలను పంపాలి. వీరికి ఐదురోజుల పాటు ఉచితంగా ఆహారం అందజేస్తారు. ఇలా రోజుకు 1,000 నుంచి గరిష్టంగా 2,000 మందికి నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇందులో వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యం ఇస్తారు. గతేడాది డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరుకులు, ఆహారం అందజేశారు.కాగా సేవా ఆహార్ కార్యక్రమాన్ని సత్యసాయిసేవా సంస్థతో పాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా, డీఐజీ బడుగుల సుమతి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. -
కోవిడ్ బాధితులకు ఆహారం ఫ్రీ.. ఎక్కడంటే..
సాక్షి, కూకట్పల్లి: కోవిడ్ బారిన పడి వంట చేసుకోలేని వారికి యోగా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నట్లు అన్నపూర్ణేశ్వరి దేవి యోగా గురూజీ జగన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ఇంటి వద్దకే నేరుగా భోజనం, ఆహార పానీయాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఏవరికైతే తమ సేవలు కావాలో ముందస్తుగా ఫోన్‌చేసి పేరు, చిరునామా లొకేషన్ పెడితే అన్నం ఇతర పదార్థాలు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9441887766 ఈ నెంబరుకు కాల్ చేయాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు. -
కస్టమర్లకు చిలిపి ప్రశ్న విసిరిన జొమాటో
ఎప్పుడూ ఆఫర్లను అందించే ప్రముఖ ఆహార సంస్థ జొమాటోకు ఓ డౌట్ వచ్చింది. ఆఫర్లు పెడితే చాలు.. ఆహారాన్ని ఎగబడి కొనే జనం దాన్ని ఉచితంగా సంపాదించడానికి ఏం చేస్తారబ్బా అని ఓ ప్రశ్న తలెత్తింది. దీంతో వెంటనే ‘ఉత్తిపుణ్యానికే ఆహారం తినడానికి ఏం చేశారో చెప్మా?’ అని చిలిపి ప్రశ్న విసిరింది. క్షణం ఆలస్యం! జనాలు లెక్కలేనన్ని సమాధానాలతో జొమాటోను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘ఏముంది, బంధువుల పెళ్లికో, ఫంక్షన్‌కో వెళితే చాలు, తిన్నోడిని తిన్నంత’, ‘మాజీ ప్రియుడు/ ప్రియురాలి పెళ్లికి వెళ్తే ఉచితంగా విందు భోజనం’ అని కొందరు కొంటెగా కామెంట్ చేస్తున్నారు. ‘ఫ్యామిలీతో వెళ్లినా మనం చిల్లిగవ్వ ఖర్చు పెట్టకుండా తినొచ్చు!’ అని కొందరు పిసినారితనాన్ని ప్రదర్శిస్తూ కామెంట్ చేశారు. ‘రాత్రి 10 దాటిపోయినా ఆఫీసులోనే ఏదో పని చేస్తున్నట్టు నటిస్తే చచ్చినట్టు హెచ్ఆర్ వాళ్లే భోజనం పట్టుకొస్తారు’, ‘పార్టీ ఇవ్వమని పక్కనోడిని వేపుకుతింటే ఆహారం అప్పనంగా దొరుకుతుంది’, ‘పిలవని పేరంటానికి వెళ్లినా కావలసినంత ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది’ అని చమత్కార సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి సరదా సమాధానాలకు కొదవేం లేదు గానీ మరి మీరు కూడా ఫ్రీగా ఫుడ్ దొరకడానికి ఏం చేశారో ఆలోచించుకొని సరదాగా నవ్వుకోండి. -
ఆకలి తీర్చే.. దాతలు
సాక్షి, ఆదిలాబాద్ : సేవ చేయాలనే ఆలోచన ఉంటే చాలూ.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కొత్త ఆలోచనతో మిగులు ఆహారాన్ని పేదలకు అందిస్తున్నారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, సత్యసాయి సేవా సమితి ముందుకొస్తున్నాయి. జానెడు పొట్ట కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతోమంది ఎండ, వాన, చలీలో కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది వికలాంగులు, వృద్ధులు, అనాధలు, చిన్నారులు యాచకులుగా మారుతున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సేవా సమితి సభ్యులు కడుపునిండా భోజనం పెడుతున్నారు. దీంతోపాటు శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని వృథాగా పోనివ్వకుండా అక్కడి నుంచి కార్మికవాడల్లో, రైల్వేస్టేషన్, రిమ్స్ ఆస్పత్రిలో ఆకలితో ఉన్నవారికి భోజనం వడ్డిస్తున్నారు. కడుపునిండా తిన్నవారు అన్నదాత సుఖీభవ అంటూ వారిని ఆశీర్వదిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ.. మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సంఘం సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లిన సమయంలో మిగిలిపోయిన ఆహారాన్ని పారవేసే సమయంలో ఈ సంఘం సభ్యులకు ఓ ఆలోచన తట్టింది. మిగులు ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్న పేదలకు వడ్డిస్తే కడుపునిండా భోజనం చేస్తారని.. ఇలా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. పెండ్లీలు, బర్త్‌డే పార్టీలు, చిన్నచిన్న శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం కార్మిక వాడల్లోకి తీసుకెళ్లి వారికి భోజనం వడ్డిస్తున్నారు. ఈ సంఘంలో బాధ్యులు పస్పుల రాజు, శివగణేష్, దేవిదాస్, రామకృష్ణ, ప్రశాంత్, సంతోష్, అభికృత్, కనక నర్సింగ్, శశికళ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన అన్నం వృధా కాకుండా సేవ సమితి సెల్: 7382747696 లపై సంప్రదించవచ్చు. రోగుల బంధువులకు అండగా.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం రోజుకు ఎంతో మందికి కడుపునిండా ఉచితంగా ఒకపూట భోజనం పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేని పేద ప్రజలే నిత్యం రిమ్స్‌కు చికిత్స కోసం వస్తుంటారు. అలాంటి వారు భోజనం చేయలేని పరిస్థితుల్లో వారికి కడుపునిండా భోజనం అందిస్తున్నారు. 2012 ఆగస్టు 21న శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నదానం చేయాలనుకునేవారు సెల్: 9440871776, 9705692816 సంప్రదించాలి. ఆరోగ్యానికి జొన్నరొట్టె మంచిర్యాల : రోజురోజుకు ప్రాచీన వంటకాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యాన్ని వ్యాధుల నుంచి కాపాడు కోవడానికి పలు రకాల ప్రాచీన వంటకాలను భుజిస్తున్నారు. ప్రాచీన వంటకాల్లో జొన్నరొట్టెలకు పట్టణంలో బలే గిరాకి పెరిగింది. జొన్నరొట్టె వలన శారీరానికి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క దుకాణంతో మొదలైన జొన్నరొట్టె వ్యాపారం పన్నెండు దుకాణాలుగా వెలిసాయి. ఒక్క రొట్టెకు పది రూపాయల చొప్పున అమ్మతున్నారు. నిత్యం చాల మంది జొన్నరొట్టెల కోసం ఆసక్తిని చూపుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు నిత్యం జొన్నరొట్టెలు తింటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కొంతమంది మహిళలు నిత్యం మధ్యాహ్నం వచ్చి జొన్నపిండి కలుపుకుని కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తు వేడివేడిగా కారం చెట్నితో ప్రజలకు అందిస్తు జీవనోపాధిని పొందుతున్నారు. జొన్నరొట్టెలతో ఆర్యోగానికి కలిగే మేలా చాల ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. దీంతో పట్టణంలో ప్రాచీన వంటకం జొన్నరొట్టెకు భలే గిరాకీ పెరిగింది. -
జీవితాంతం ఫుడ్ ఫ్రీ..
విమానంలో పాప పుట్టింది.. ఆ పాపకు జీవితాంతం మా విమానంలో ప్రయాణం ఫ్రీ.. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడూ మనం ఎప్పుడో ఓసారి చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సంఘటనే ఇటీవల అమెరికాలో జరిగింది. అదేంటంటే ఓ హోటల్లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫాలన్ గ్రిఫిన్ నిండు గర్భిణి. భర్తతో కలసి తన స్నేహితురాలి పిల్లలను ఇంటి వద్ద వదిలివచ్చేందుకు వెళుతున్నారు. టెక్సాస్‌లోని శాన్‌ఆంటోనియోలో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముందుకు రాగానే ఆమెకు తీవ్రంగా నొప్పులు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ స్టోర్ డైరెక్టర్ ఎన్రిక్ వచ్చి సాయం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఫాలన్. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎన్రిక్ చెప్పింది. ఆ పాపకు జీవితాంతం వారి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో ఫుడ్ ఫ్రీగా ఇస్తామని, ఆ పాపకు 14 ఏళ్లు రాగానే ఏదైనా ఉద్యోగం కూడా ఇస్తామని యాజమాన్యం సంతోషంగా ప్రకటించింది. -
తినడానికి డబ్బుల్లేవా.. ఆ రెస్టారెంట్లో ఫ్రీ
తిరువనంతపురం : ఆదివాసి యువకుడు మధు హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం బియ్యం దొంగలించినందుకు ఒక గుంపు ఎగబడి ఆ యువకుడిని(27) దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. మతిస్థిమితం లేని ఆ ఆదివాసీ కొడుతూ... ఆ సమయంలో సెల్ఫీ, సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత కేరళ ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆకలి చావుల రహిత రాష్ట్రంగా కేరళను తీర్చి దిద్దేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో అలప్పుఝా జిల్లాలో క్యాష్ కౌంటర్ లెస్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. జనకీయ భక్షణశాల పేరుతో స్నేహజలకమ్ అనే ఎన్జీవో సంస్థ ప్రజలకు ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది. శనివారం ఈ రెస్టారెంట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ప్రారంభించారు. ‘మధులా మరెవరూ బలి కాకూడదు. అందుకే ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాం’ స్నేహజలకమ్ కన్వీనర్ వెల్లడించారు. ఆకలితో ఉండి.. జేబులో డబ్బులు లేని వాళ్లు ఇక్కడికొచ్చి కడుపు నిండా తినోచ్చు. ఒకవేళ తమకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే మాత్రం అక్కడే ఉండే డ్రాప్ బాక్స్‌లో వేయాలి. ఎవరూ బలవంతం చెయ్యరు. సుమారు రూ.11లక్షల తో ఏర్పాటు చేసిన ఈ హోటల్ రోజుకు రోజుకు సుమారు 2వేల మందికి ఈ హోటల్ భోజనం సమకూరుస్తోంది. ఈ హోటల్ కోసం సీఎస్ఆర్ ఫండ్ ఆఫ్ కేరళ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(కేఎస్ఎఫ్ఈ) ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టగా... డొనేషన్ల రూపంలో ఇప్పటిదాకా రూ. 20 లక్షల సేకరించారు. ఈ రెస్టారెంట్‌తోపాటు పక్కనే రెండున్నర ఎకరాల భూమిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. రెస్టారెంట్ అవసరాలతోపాటు ప్రజలకు అతితక్కువ ధరలకే కూరగాయలను అమ్ముతున్నారు. త్వరలో ఇలాంటి రెస్టారెంట్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పెట్రోల్ బంక్‌లో ఫుడ్ ఫ్రీ
సాక్షి, బెంగళూరు: సాధారణంగా ఏ పెట్రోల్ బంకుకైనా వెళితే మీ వాహనానికి మాత్రమే ఇంధనాన్ని నింపుకోవచ్చు. కానీ, బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంకులోనికి వెళితే మాత్రం వాహనానికి మాత్రమే కాదు మీ బొజ్జకు కూడా ఇంధనం లభించినట్లే. ‘మీరు మీ ట్యాంకును నింపుకోండి...మేము మీ పొట్టను నింపుతాము (యు ఫిల్ యువర్ ట్యాంక్! వి ఫిల్ యువర్ టమ్మీ)’ పేరిట ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బెంగళూరు వాసులు వృత్తి ఉద్యోగాల కోసం ఇళ్లలో కంటే నగర రోడ్ల పైనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. దీంతో చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌ని, భోజనాన్ని కూడా వదిలేస్తుంటారు. పెట్రోల్ బంకు దగ్గర మాత్రం ఓ ఐదు నుండి పది నిమిషాల పాటు తప్పక వేచి ఉండాల్సిన సందర్భం ఉంటుంది. ఆ సమయంలోనే వారికి కాస్తంత భోజనం కూడా అందజేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ కార్యక్రమం. గత వారం ఆరంభమైన ఈ కార్యక్రమంలో నెలపాటు వాహనదారులకు ఉచిత ఆహారం లభిస్తుంది. పైలెట్ ప్రాజెక్టుగా... ఇందిరానగరలోని వెంకటేశ్వర సర్వీస్ సెంటర్ యజమాని ప్రకాష్‌రావు ఆలోచన నుంచి పుట్టినదే ఈ కార్యక్రమం. ‘పెట్రోల్ బంకుల వద్ద ఉంటే ఖాళీ స్థలంలో ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఐఓసీ అధికారులు అంగీకరించారు. పైలెట్ ప్రాజెక్టుగా మా పెట్రోల్ బంకులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మా వినియోగదారులకు ఉచితంగా భోజనాన్ని అందించనున్నాం. ఆ తరువాత కొంత మొత్తాన్ని వసూలు చేస్తాం. మా వద్ద శాకాహార, మాంసాహార భోజనాలతో పాటు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అల్పాహారం, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమకు ఏ పదార్థాం కావాలో చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆహారాన్ని ప్యాక్ చేసి అందిస్తాం. మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే 100 ఐఓసీ పెట్రోలు బంకులకు ఈ కార్యక్రమానికి విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని ప్రకాష్‌రావు తెలిపారు. ప్రత్యేక వంటశాల నుంచి ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో నిపుణులైన చెఫ్‌లు అన్ని రకాల వంటలను తయారుచేసి పెట్రోల్ బంకులో అందుబాటులో ఉంచుతారు. బేకరీ ప్రాడక్ట్స్ తయారీ కోసం ఇస్కాన్‌తో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. వినియోగదారులు కాని వారు కూడా కొంత మేరకు డబ్బులు చెల్లించి, ఇక్కడ ఆహారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.