సాక్షి, హైదరాబాద్: కరోనా మొదటివేవ్ లాక్‌డౌన్ సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం, సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పోలీసులు, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత సరఫరా చేపట్టారు. సేవా ఆహార్ పేరుతో సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొనసాగించనున్నారు. దాతలు, ఫుడ్ డెలివరీ సంస్థలు ముందుకు వస్తే త్వరలోరాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. కరోనా బారినపడి ఇంటికే పరిమితమై, బయటికి రాలేని వారికోసం ఈ సేవలు అందిస్తున్నారు.
రెండు విధాలుగా ఆర్డర్
ఈ సేవా ఆహార్ పథకంలో రెండు రకాలుగా ఉచిత ఆహారం కోసం ఆర్డర్ చేయవచ్చు. మొదటిది 7799616163 ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో ఉదయం 7 గంటల్లోగా ఆర్డర్ చేయాలి. ఏడింటి తరువాత చేస్తే దాన్ని మరుసటి రోజు ఆర్డర్ కింద పరిగణిస్తారు. సేవా ఆహార్ యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ రెండురోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆర్డర్ సమయంలో రోగి పేరు, నివసిస్తున్న ప్రాంతం, కాంటాక్ట్ నంబర్, ఇంట్లో ఎందరు పాజిటివ్ అయ్యారు? తదితర వివరాలను పంపాలి. వీరికి ఐదురోజుల పాటు ఉచితంగా ఆహారం అందజేస్తారు.
ఇలా రోజుకు 1,000 నుంచి గరిష్టంగా 2,000 మందికి నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇందులో వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యం ఇస్తారు. గతేడాది డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరుకులు, ఆహారం అందజేశారు.కాగా సేవా ఆహార్ కార్యక్రమాన్ని సత్యసాయిసేవా సంస్థతో పాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా, డీఐజీ బడుగుల సుమతి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment