పెట్రోల్ బంక్‌లో ఫుడ్ ఫ్రీ
సాక్షి, బెంగళూరు: సాధారణంగా ఏ పెట్రోల్ బంకుకైనా వెళితే మీ వాహనానికి మాత్రమే ఇంధనాన్ని నింపుకోవచ్చు. కానీ, బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంకులోనికి వెళితే మాత్రం వాహనానికి మాత్రమే కాదు మీ బొజ్జకు కూడా ఇంధనం లభించినట్లే. ‘మీరు మీ ట్యాంకును నింపుకోండి...మేము మీ పొట్టను నింపుతాము (యు ఫిల్ యువర్ ట్యాంక్! వి ఫిల్ యువర్ టమ్మీ)’ పేరిట ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
బెంగళూరు వాసులు వృత్తి ఉద్యోగాల కోసం ఇళ్లలో కంటే నగర రోడ్ల పైనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. దీంతో చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌ని, భోజనాన్ని కూడా వదిలేస్తుంటారు. పెట్రోల్ బంకు దగ్గర మాత్రం ఓ ఐదు నుండి పది నిమిషాల పాటు తప్పక వేచి ఉండాల్సిన సందర్భం ఉంటుంది. ఆ సమయంలోనే వారికి కాస్తంత భోజనం కూడా అందజేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ కార్యక్రమం. గత వారం ఆరంభమైన ఈ కార్యక్రమంలో నెలపాటు వాహనదారులకు ఉచిత ఆహారం లభిస్తుంది.
పైలెట్ ప్రాజెక్టుగా...
ఇందిరానగరలోని వెంకటేశ్వర సర్వీస్ సెంటర్ యజమాని ప్రకాష్‌రావు ఆలోచన నుంచి పుట్టినదే ఈ కార్యక్రమం. ‘పెట్రోల్ బంకుల వద్ద ఉంటే ఖాళీ స్థలంలో ఫుడ్ కౌంటర్‌లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఐఓసీ అధికారులు అంగీకరించారు. పైలెట్ ప్రాజెక్టుగా మా పెట్రోల్ బంకులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మా వినియోగదారులకు ఉచితంగా భోజనాన్ని అందించనున్నాం. ఆ తరువాత కొంత మొత్తాన్ని వసూలు చేస్తాం. మా వద్ద శాకాహార, మాంసాహార భోజనాలతో పాటు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అల్పాహారం, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమకు ఏ పదార్థాం కావాలో చెప్పిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఆహారాన్ని ప్యాక్ చేసి అందిస్తాం. మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే 100 ఐఓసీ పెట్రోలు బంకులకు ఈ కార్యక్రమానికి విస్తరించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని ప్రకాష్‌రావు తెలిపారు.
ప్రత్యేక వంటశాల నుంచి
ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో నిపుణులైన చెఫ్‌లు అన్ని రకాల వంటలను తయారుచేసి పెట్రోల్ బంకులో అందుబాటులో ఉంచుతారు. బేకరీ ప్రాడక్ట్స్ తయారీ కోసం ఇస్కాన్‌తో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. వినియోగదారులు కాని వారు కూడా కొంత మేరకు డబ్బులు చెల్లించి, ఇక్కడ ఆహారాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.