నీటి సంరక్షణతో ఏడాదిలో మూడు పంటల సాగు
మండుటెండల్లో సైతం తగ్గని భూగర్భజలం
ప్రతి చినుకు ఒడిసి పట్టడమే లక్ష్యం.. చతుర్విద పద్ధతిలో నీటి సంరక్షణ
కరువును జయించిన సంగారెడ్డి జిల్లా గొట్టివారిపల్లిపై గ్రౌండ్ రిపోర్టు
ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న రాజస్తాన్
ఒక ఆలోచన, సమష్టి కృషి ఆ గ్రామ రూపురేఖలను మార్చేసింది. తాగునీటి కోసం తండ్లాట, బీడువారిన పొలాలు, కరువు కాటకాలు, వలసలతో సతమతమైన ప్రాంతం.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నారు. నాడు కూలి పనులకు వలస వెళ్లినవారే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలకు పనులు కల్పిస్తున్నారు.
ఇక్కడ అవలంబించిన నీటి సంరక్షణ పద్ధతులను రాజస్తాన్ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారంటే.. ఈ పథకం ఎంత విజయవంతం అయిందో అర్థమవుతుంది. ఇలా కరువును జయించిన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొట్టిగారిపల్లి (Gotigarpally) గ్రామంపై గ్రౌండ్ రిపోర్టు ఇది.
సంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో రైతులు వర్షాధారంగానే పంటలు పండించేవారు. వానలు సరిగా కురవకపోయినా, క్రమం తప్పినా పంటలు దెబ్బతిని నష్టపోయేవారు. నీళ్లులేక, పంటలు వేయలేక కూలి పనులకు వెళ్లేవారు. అయితే 2001లో చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు గ్రామ గతిని మార్చేశాయి. వాటర్ షెడ్ పథకం (watershed scheme) ఆరో దశ కింద గొట్టిగారిపల్లికి రూ.22 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది.
నీటి వనరుల నిపుణుడు టి.హనుమంతరావు తక్కువ వ్యయంతో చతుర్విద జల ప్రక్రియ పద్ధతిపై గ్రామస్తులకు అనేక సార్లు అవగాహన కల్పించారు. చైనాలోని హుబై రాష్ట్రంలో ఆ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని రైతులకు వివరించారు. వాన నీళ్లు వృథా పోకుండా ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు చేపట్టారు.
సమీపంలోని గుట్టలపై నుంచి దిగువకు వచ్చే నీటిని పొలాల వైపు వచ్చేలా మట్టి కట్టలు నిర్మించారు. కందకాలు తవ్వారు, నీటి చెక్‌డ్యాంలు కట్టారు. ఆ నీరు చెక్ వాల్వ్‌లోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో కురిసిన వాన నీరు (Rain Water) ఊరు దాటడం లేదంటే ఎంత పకడ్బందీగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారో అర్థమవుతుంది.
తక్కువ లోతులోనే భూగర్భ జలాలు
గతంలో ఇక్కడ 500 ఫీట్ల దాకా బోరు వేసినా చుక్క నీటి జాడ కనిపించకపోయేది. ఇప్పుడు 60 నుంచి 120 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తోంది. గ్రామంలో 350కిపైగా బోరుబావులు, 50 వరకు బావులు ఉన్నాయి. వాటితో గ్రామంలోని సుమారు 1,600 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. పొలం గట్లు, పంటల చుట్టూ వేసిన ఫెన్సింగ్‌పై సైతం తీగ జాతికి చెందిన పంటలు సాగు చేస్తున్నారు.
ఒక ఎకరా విస్తీర్ణంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి కంది, పసుపు, ఆవాలు, కర్బూజా, మిరప, ఉల్లి, బెండకాయ, పలు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో మడులుగా ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. చెరుకు, మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఏటా మూడు పంటలు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు.
జాతీయ స్థాయి అవార్డు
వాటర్ షెడ్‌తో పాటు 2010– 11లో ఇందిరా జలప్రభ పథకంలో భాగంగా వ్యవసాయ బో ర్లు తవ్వించి, విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించారు. రూరల్ డె వలప్‌మెంట్‌లో భాగంగా అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టడంతో.. 2010 అక్టోబర్ 2న నిర్వహించిన ఉపాధి హామీ ఉత్సవాల్లో గ్రామానికి జాతీయస్థాయిలో అవార్డు దక్కింది. పంటలు సమృద్ధిగా పండుతుండటంతో జీవన ప్రమాణాలు మారాయి. తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తున్నా..
నేను ఎంబీఏ చదివిన. మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. చెరుకుతోపాటు అన్నిరకాల కూరగాయలు సాగు చేస్తున్నా. వాటర్ షెడ్ పథకంతో పుష్కలంగా నీరు ఉండటంతో ఏడాదికి మూడు పంటలు పండిస్తూ.. ఎకరాకు రూ.లక్షన్నర వరకు సంపాదిస్తున్నా.
– కనకరాజు, యువ రైతు, గొట్టిగారిపల్లి
వలసలు ఆగిపోయాయి..
గతంలో గ్రామంలో పనులు లేకపోవటంతో ఉపాధి కోసం దుండిగల్, గోమారాం, మద్దికుంట తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లేవాళ్లం. వాటర్ షెడ్ పథకం చేపట్టిన సమయంలో చేసిన పనులకు కూలీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు మారి పంటలను సాగు చేసుకుంటున్నాం. వలసలు ఆగిపోయాయి.
– బాలప్ప, రైతు, గొట్టిగారిపల్లి
రైతులకు అవగాహన కల్పించి పనులు చేపట్టాం
వాటర్ షెడ్ పథకం ప్రారంభంలో రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. అప్పటి నీటి వనరుల నిపుణుడు హనుమంతరావు గ్రామానికి వచ్చి ఆ పనులు చేయటంతో కలిగే ప్రయోజనాలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. అందరి కృషితో పథకాన్ని పూర్తి చేశాం. రెండేళ్ల తర్వాతి నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం నీటి సమస్య అనేది లేకుండా అన్ని సమయాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయగలుగుతున్నాం.
– రాచయ్య, మాజీ సర్పంచ్, గొట్టిగారిపల్లి
Comments
Please login to add a commentAdd a comment