తరచూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న గ్రామం
మధ్యాహ్నం కూడా చలి.. సాయంత్రం ఆరు గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యం
విస్తారంగా చెట్లు, చుట్టూ నీటి వనరులు, నల్లరేగడి నేలలు వంటివే కారణం
ఈసారి చలికాలం ప్రారంభంలోనే 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రం ప్రత్యేకత
వచ్చే రెండు నెలలు ఇంకా తగ్గొచ్చంటున్న నిపుణులు
యెర్భల్ శ్రీనివాస్‌రెడ్డి / జహీరాబాద్: అక్కడ ఉదయం తొమ్మిది అయినా ఎక్కడా జనం కనిపించరు.. సాయంత్రం ఆరు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం.. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం పూట కూడా స్వెట్టర్లు వేసుకోనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇది ఎక్కడో మంచు ప్రాంతాల్లోనో, పర్వతాలున్న చోటనో కాదు.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఏటా చలికాలం వచ్చిందంటే ఇక్కడి జనం గజగజ వణికిపోతుంటారు.
ఆ ప్రాంతంలోని నేలలు.. చుట్టూరా పచ్చదనం.. చెరువులు, ఇతర జల వనరులు గణనీయంగా ఉండటం వంటివి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కోహీర్ గ్రామ శివార్లలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ఆధ్వర్యంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి.. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
నల్లరేగడి నేలలు, పెద్ద సంఖ్యలో చెట్లతో..
కోహీర్ గ్రామ పరిధిలో 7 వేల ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులో 5 వేల ఎకరాల మేర నల్ల రేగడి భూములు, 500 ఎకరాలు పడావ్‌పడ్డ భూములున్నాయి. ఈ నేలల్లో నీటి నిల్వ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామం చుట్టూరా పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోటిగార్‌పల్లిలో 1,500 ఎకరాల్లో, బడంపేట, పర్శపల్లిలో వెయ్యి ఎకరాల చొప్పున అడవులు ఉన్నాయి. గోటిగార్‌పల్లికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని కుంచవరం, బోనస్‌పూర్, శివరాంపూర్ ప్రాంతాల్లో సుమారు 5 వేల ఎకరాలకుపైగా అడవి ఉంది.
చుట్టూ నీటి వనరులే..
కోహీర్‌కు ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలోని బడంపేటలో రెండు చెరువులు, పక్కనే ఉన్న గొటిగార్‌పల్లిలో 1,100 ఎకరాలకు నీరందించే పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. 6 కిలోమీటర్ల దూరంలోని పర్శపల్లిలో తైదల, రాముని చెరువులు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిగుమ్మల్‌లో మైసమ్మ చెరువు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జాపూర్‌లో చిన్న చెరువు ఉంది. కోహీర్‌లో భూగర్భ జలమట్టం 10 అడుగులలోపే. పలుచోట్ల బావుల్లో నీళ్లు బిందెలతో ముంచుకునేంత పైవరకు ఉంటాయి. కొన్ని బోర్లలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తుంటాయి. దీనికితోడు కోహీర్ ప్రాంతం సముద్ర మట్టానికి 629 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అంశాలన్నీ కలసి ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రెండేళ్ల కింద 6.2 డిగ్రీలకు..
కోహీర్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి చలికాలం ప్రారంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల వరకు తగ్గాయి. ఈ నెల 19న 9.5 డిగ్రీలు, 20న 9.0 డిగ్రీలు, 21న 12 డిగ్రీలు, 22న 10.9 డిగ్రీలు, 23న 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక డిసెంబర్, జనవరిలలో ఉష్ణోగ్రతలు ఇంకెంత తగ్గుతాయోనని స్థానికులు పేర్కొంటున్నారు.
ఐదింటికే ఇంటి ముఖం
చలి తీవ్రత అధికంగా ఉండటంతో కోహీర్‌లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు వెళ్లేవారు సాయంత్రం ఐదు గంటలకే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకే ప్రధాన కూడళ్లు, రోడ్లు జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. ఉదయం 8, 9 గంటల వరకు ఎవరూ బయటికి రావడం లేదు.
గ్రీనరీ, జల వనరులు కారణం
కొన్నిరోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పొగ మంచు కురుస్తోంది. కోహీర్‌లో నేల స్వభావం, చెట్లు అధికంగా ఉండటం, చుట్టుపక్కల అడవులు ఉండటం, జల వనరులు ఉండటం వంటివి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం. నీటి పారుదల ప్రాజెక్టులు, పెద్ద చెరువులు వంటివి ఉన్నచోట చలి తీవ్రత పెరుగుతుంది. – వెంకటరమణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీజీడీపీఎస్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment