Kohir
-
ఎంత పెద్ద చిలగడదుంపో..!
కోహీర్ (జహీరాబాద్): చిలగడ దుంప, రత్నపురిగడ్డ, మొర్రం గడ్డ ఇలా పలు పేర్లతో పిలిచే స్వీట్ పొటాటో సాధారణంగా 50 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువు తూగుతుంది. ప్రత్యేక శ్రద్ధతో సాగు చేస్తే అరకిలో బరువు తూగే అవకాశముంది. అయితే సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన రైతు రాఘవేందర్‌రెడ్డి పొలంలో పండిన చిలగడ దుంప ఒకటి ఏకంగా 5 కిలోలకు పైగా బరువు తూగుతోంది. కోతకొచ్చిన పంటను వారం రోజుల కిందట రాఘవేందర్‌రెడ్డి నాగలి సాయంతో దున్నించారు. పొలంలో పండిన ఇతర చిలగడ దుంపలు అరకిలో కంటే తక్కువ బరువున్నాయని ఈ ఒక దుంప మాత్రం 5 కిలోలకు పైగా బరువు ఉందని తెలిపారు. (క్లిక్: ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు..) -
ఎన్నికల్లో పోటీ కోసం పెళ్లి
కోహీర్(జహీరాబాద్) : కోహీర్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు ఎస్కే జావెద్ ఓ ఇంటి వారయ్యారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని నూర్ మసీదులో ఆయన వివాహం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కోహీర్ సర్పంచ్ పదవికి పోటీ చేయాలని జావెద్ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే రిజర్వేషన్లో జనరల్ (మహిళ)కు కేటాయించారు. దీంతో జావెద్ మొదట తన సహోదరి చేత ఎన్నికల్లో పోటీ చేయిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అనంతరం కోహీర్ పట్టణంలోని కాజీవాడకు చెందిన బాబుమియా కూతురు అతియా సుల్తానతో నూర్మసీద్లో వివాహం జరిగింది. టీఆర్ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉమర్ అహమద్‌తో పాటు గ్రామపెద్దలు, నాయకులు పెళ్లి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. -
పంటలకు భారీ నష్టం
కోహీర్: మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 46.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నారింజ, పెద్దవాగు ప్రాజెక్ట్ పొంగి ప్రవహించాయి. పరివాహక, లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. వర్షాలకు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, కంది, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా ఏడిళ్లు కూలిపోయాయి. మండల కేంద్రమైన కోహీర్ పట్లూర్‌బేస్‌లో మధుకర్ అనే వ్యక్తి ఇళ్లు కుప్ప కూలింది. పరిస్థితిని గమనించి కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ప్రాణాలను కాపడుకోగలిగారు. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిళ్లింది. తహసీల్దార్ గీత, వ్యవసాయాధికారి రత్న, ఆర్ఐ శ్రావణి దెబ్బతిన్న పొలాలు, కూలిన ఇళ్లను పరిశీలించారు. -
ఎల్ అండ్ టీ ఔధార్యం
కోహీర్: మండలంలోని కవేలి క్రాస్‌రోడ్డు వద్ద 65 నంబరు జాతీయ రహదారి పక్కన ఎల్ అండ్ టీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్ధం బస్‌షెల్టర్ నిర్మించారు. రోడ్డు విస్తరణలో భాగంగా 20 ఏళ్ల క్రితం నిర్మించిన బస్‌షెల్టర్‌ను కూల్చివేశారు. నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదు. నిలువ నీడ లేక ఏడాది కాలంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ షెల్టర్‌ను నిర్మించడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయి. -
యువర్ అటెన్షన్ ప్లీజ్..!
ఎక్స్‌ప్రెస్ రైళ్లు కోసం ఎదురుచూపు ‘లూజ్‌టైమ్’ ఉన్నా ఆపని వైనం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని వినతి కోహీర్: దేశంలో చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉన్న ఏకైనా రవాణా వ్యవస్థ రైల్వే శాఖ మాత్రమే. దేశ జనాభాలో ఎక్కువ శాతం దూరప్రయాణాలు చేసేది కూడా రైలులోనే. భద్రతతోపాటు అలసట చెందకుండా గమ్యస్థానాలకు చేరుకోవడం ఒక్క రైలులోనే సాధ్యం. అయితే కొన్ని స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌రైళ్లు ఆపకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తమకు కూడా రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అటువంటి రైల్వేస్టేషన్లలో ఒకటి కోహీర్ దక్కన్. కోహీర్ రైల్వేస్టేషన్ అతిపురాతనమైన రైల్వేస్టేషన్. రైల్వేస్టేషన్‌ను దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నిర్మించారు. అప్పట్లో కేవలం రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడిచేవి. కోహీర్ ప్రాంతంలో భూగర్భ జలాల్లో లవణాలు, క్యాల్షియం శాతం తక్కువగా ఉండడంతో రైలుకు అవసరమైన నీటిని ఇక్కడే తీసుకునేవారు. దాని కోసం స్టేషన్లో అరగంటపాటు రైలును నిలిపేవారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం వృద్ధితో బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజన్లకు బదులుగా, డిజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టారు. దీంతో నీటితో అవసరం లేకుండా పోయింది. కోహీర్ రైల్వేస్టేషన్లో రైలు ఆగే సమయాన్ని పూర్తిగా తగ్గించి వేశారు. ప్రస్తుతం నాలుగు ప్యాసింజర్ రైళ్లతో పాటు 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే నాలుగు ప్యాసింజర్ రైళ్లు, ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ మినహా మిగతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో 65 వేల జనాభా ఉన్న కోహీర్ మండల ప్రజలు ఎక్స్ ప్రెస్ సేవలు పొందలేకపోతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ లేదా 40 కిలోమీటర్ల దూరం ఉన్న వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న కోహీర్ మండల ప్రజలకు ఆ రాష్ట్రంలోని బీదర్, గుల్బర్గా, హుమ్నాబాద్ తదితర ప్రాంతాల ప్రజలతో సంబంధ భాందవ్యాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వ్యవసాయ మార్కెట్ కేంద్రాలైన మర్పల్లి, వికారాబాద్‌కు రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పుణ్యక్షేత్రాలైన షిర్డీ, తిరుపతికి ఎక్కువగా వెళుతుంటారు. అయితే కాకినాడ-షిర్డీ, విజయవాడ-షిర్డీ, సికింద్రాబాద్-షిర్డీ, నాందేడ్-బెంగుళూరు, యశ్వంత్‌పూర్-బీదర్, ఔరంగబాద్-రేణిగుంట రైళ్లు కోహీర్ రైల్వేస్టేషన్ గుండానే వెళ్లుతుంటాయి. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గతంలో కోహీర్‌లో ఆగేదికాదు. కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని మండల ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళన ఫలితంగా రెండేళ్ల క్రితం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కోహీర్‌లో నిలిపే అవకాశాన్ని కల్పించారు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను బట్టి మిగతా రైళ్లను ఆపే ప్రయత్నం చేస్తామని రైల్వే అధికారులు అప్పట్లో హామి ఇచ్చారు. ప్రయాణికుల సంఖ్య అధికారుల అంచనాలకు తగ్గట్టుగాఉన్నా కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడంలేదు. ఈ రూట్లో ప్రయాణిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ‘లూజ్‌టైమ్’ ఉన్నప్పటికీ రైళ్లను ఆపకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. కోహీర్ రైల్లేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులను, రైల్వే అధికారులను కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపక ఇబ్బందులు కోహీర్ రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం చేపట్టిన ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయాలేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. - చందునాయక్, లాల్‌సింగ్‌తండా రైలు సౌకర్యాన్ని కోల్పోతున్నాము కోహీర్ రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో హైదరాబాద్‌తోపాటు షర్డీ, తిరుపతి, హుమ్నాబాద్ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. వ్యాపార కేంద్రాలైన మర్పల్లి, వికారాబాద్, బీదర్ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయలేక పోతున్నాం. స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో లేక తీవ్రంగా నష్టపోతున్నాం. కోహీర్ రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి. - మొగులయ్య, రైతు నాగిరెడ్డిపల్లి. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి అర్హత ఉంది కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ప్యాసింజరు రైళ్ల కంటే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇంటర్‌సిటీలో రోజుకు సరాసరి 80 మంది ప్రయాణిస్తారు. ప్రస్తుతం కోహీర్ రైల్వేస్టేషన్‌కు ఇంటర్ సిటీ ద్వారానే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగితే మరింత ఆదాయం లభించే అవకాశం ఉంది. - అరుణ్‌కుమార్, స్టేషన్‌మాస్టర్ -
డ్యూటీ డాక్టర్ తొలగింపు
కోహీర్: విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సుధీర్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించామని క్లస్టర్ వైద్యాధికారి వెంకట్ రంగారావు తెలిపారు. శనివారం ఆయన కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం విధులకు హాజరై ఎలాంటి అనుమతి లేకుండా మధ్యాహ్నం నుంచి వెళ్లి పోయారని తెలిపారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందలేదన్నారు. స్థానిక అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారి అధికారి అమర్‌సింగ్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని, దీంతో తరుచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీ కోసం జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపిస్తామన్నారు. ఆస్పత్రి పనివేళల్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. -
బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన
కోహీర్: విచక్షణ లేని ఓ వృద్ధుడు ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి అందించిన సమాచారం ప్రకారం.. గురుజువాడకు చెందిన శివకుమార్ (56).. గ్రామంలో ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులో ఉన్న పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. శివకుమార్ తీరును గమనించిన సమీపంలోని రైతు ఒకరు సెల్‌ఫోన్ ద్వారా బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పొలానికి చేరుకొని తన కుతూరును చేరదీసి శివకుమార్‌ను చితకబాదారు. గ్రామానికి తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్బంధించారు. కోహీర్ ఎస్ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో తన సిబ్బందితో గురుజువాడకు వెళ్లారు. బాలిక కుటుంబసభ్యులకు నచ్చచెప్పి వారి అదుపు నుంచి నిందితుడు శివకుమార్‌ను విడిపించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
పల్లె ప్రగతితో దేశాభివృద్ధి
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వినయ్, బాలకృష్ణ కోహీర్: పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలని, పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వినయ్, బాలకృష్ణ అన్నారు. సెర్ప్ అధికారులతో కలిసి వారు మండలంలోని బడంపేట, ఖానాపూర్, కోహీర్‌లో మంగళవారం పర్యటించి ఉత్పత్తిదారులు, సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మండలాల్లో, జిల్లాలోని 17 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రపంచ బ్యాంకుతో కలిసి రూ. 650 కోట్లతో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో రూ. 450 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు, రూ. 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెర్ప్ అధికారులు వంశీ, సత్యదేవ్, డీపీఎంలు వాసుదేవ్, రాజు, ఏసీ యాదయ్య, ఎంపీపీ జంపాల అనిత, సర్పంచులు పుష్ప, శంకర్, ఈఓపీఆర్డీ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎంలు సమ్మయ్య, సమత, పంచాయతీ కార్యదర్శులు అశోక్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
అదుపు తప్పిన స్కూల్ బస్సు
తప్పిన పెను ప్రమాదం ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు తాగి నడిపిన డ్రైవర్.. కేసు నమోదు కోహీర్: డ్రైవర్ తాగిన మైకంలో అజాగ్రత్తగా నడపడంతో దిగ్వాల్ జీఎంఆర్ పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డుదిగింది. ఈ ఘటన మండలంలోని సజ్జాపూర్ శివారులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం... మండలంలోని దిగ్వాల్ జీఎంఆర్ పాఠశాల బస్సు 20 మంది విద్యార్థులతో బయలు దేరింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సజ్జాపూర్ శివారులో అదుపుతప్పి రోడ్డు కిందికి దిగిపోయింది. కుదుపులతో కొద్ది దూరంలో ఆగింది. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనతో ఆహాకారాలు చేశారు. రోడ్డు ఎత్తులో ఉండడంతో ఆ పక్కనే గోతుల మాదిరిగా ఉంది. కిందికి దిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. బస్సు పైనే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన బయలుదేరి ఘటనా స్థలానికి వెళ్లి తమ పిల్లలను తీసుకెళ్లారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకొన్నారు. బిలాల్పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజు తాగిన మైకంలో అజాగ్రత్తగా బస్సును తోలడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులకు గాయాలైనట్లు తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. తాగిన మైకంలో బస్సు నడిపిన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రుణమాఫీ కోరుతూ టవరెక్కిన యువరైతు
కోహీర్ : రుణమాఫీ పథకంలో స్పష్టత కొరవడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువరైతు ప్రభాకర్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కారు. ఈ సంఘటన మండలంలోని బిలాల్పూర్ గ్రామం లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు గంటల పాటు ఉత్కంఠ రేపిన సంఘటన చివరికి పోలీసుల జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. వివరాలు యువ రైతు ప్రభాకర్ మాటల్లోనే.. ‘నాపేరు కాసుబాగుల ప్రభాకర్. తల్లి పేరు మాణ్యమ్మ. నా తల్లి పేరిట 340 సర్వే నంబరులో 2.20 ఎకరాల పొలం ఉంది. పొలంపై తీసుకున్న పంట రుణం రూ. 50 వేలు గత మార్చి నెలలో తీర్చా. రుణాలు కట్టిన వారికి సైతం రుణ మాఫీ వర్తింప చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.. ప్రస్తుతం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో నా తల్లి పేరు లేదు. సకాలంలో రుణం చెల్లించినప్పటికీ రీషెడ్యూల్ చేయడం లేదు. రుణ మాఫీ జాబితాలో పేర్లున్న రైతులను సైతం బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ పథకంపై ప్ర భుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. గ్రామంలో ఉపాధి పథకం, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి.. విచారణకు చర్యలు తీసుకోవాలి. ఉన్నత చదువులు చదవిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు, తక్కువ చదువు చదవిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి’ అని డిమాండ్ చేశారు. అంతకు ముందు సమాచారం అందుకున్న కోహీర్ ఏఎస్ఐ యూసుఫ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మైకు ద్వారా టవర్‌పైన ఉన్న ప్రభాకర్ తో మంతనాలు జరిపారు. డిమాండ్లు అధికారుల దృష్టికి తీసికెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ప్రభాకర్ టవర్ దిగారు. -
సర్వే కోసం వెలసిన ఇళ్లు!
- ఒకే రోజులో 18 ఇళ్ల నిర్మాణం - కర్ణాటకలోనూ వారికి ఇళ్లు - ఇక్కడే ఉంటామంటున్న లబ్ధిదారులు - దిక్కు తోచని అధికారులు కోహీర్: సర్వే సమయంలో ఇంటి వద్ద లేకుంటే సంక్షేమ పథకాలు అందవేమోననే ఆందోళనతో ఇతర ప్రాంతాల్లో ఉన్న జిల్లా ప్రజలు స్వస్థలాలకు క్యూ కట్టారు. కర్ణాటక తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు భారీ సంఖ్యలో సర్వేలో పాల్గొన్నారు. కర్ణాటకలోని బోనస్పూర్ తండాలో నివాసముంటున్న 18 మంది రైతులకు కోహీర్ మండలంలోని సిద్దాపూర్ తండా శివారులో వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఈ రెండు తండాల మధ్య కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. వారు ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి పొలం పనులు చూసుకొని సాయంత్రానికి స్వగ్రామానికి వెళుతుంటారు. వారు నివాసముంటున్న బోనస్పురం తండాలోనూ, పొలం ఉన్న సిద్దాపురం తండాలోను ఓటు హక్కు, రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. ఇరుప్రాంతాల్లోను వారు ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ తంతు గత 25 ఏళ్లుగా జరుగుతున్నా ఇంత వరకు ఏలాంటి చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. ఈ సారి ప్రభుత్వం చేపట్టిన సర్వేతో వారిలో చలనం మొదలైంది. దీంతో వారు ఒక్కరోజులోనే 18 పూరిళ్ల నిర్మాణం చేపట్టారు. చెట్ల కొమ్మలు, పైన రేకులతో ఇళ్లు తయారయ్యాయి. డోరు నంబర్లు వేసే సమయంలో లేని ఇళ్లు ఎలా వచ్చాయబ్బా అంటూ అధికారులు తలలు పట్టుకొన్నారు. రేషన్, ఆధార్ కార్డులు ఉన్నందున తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందే నని రైతులు, డిమాండ్ చేశారు. ఒక్కరోజులో పచ్చి కొమ్మలతో కచ్చాగా నిర్మించిన ఇళ్లను పరిగణలోకి తీసుకోవాలో లేదో తెలియక అధికారులు అమోమయానికి గురయ్యారు. స్థానికులు సర్వే చేయాల్సిందేనని వారికి వంతపాడారు. దీంతో సర్వే పూర్తయింది. వారు ఇక్కడ ఎన్నాళ్లుంటారో వేచిచూసి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. తాము ఇక్కడే ఇళ్లు నిర్మించుకొని ఉంటామని రైతులు పేర్కొన్నారు. -
పదేళ్లుగా నిర్లక్ష్యం
కోహీర్, న్యూస్‌లైన్: అధికారుల అలసత్వం.. పట్టించుకోని పాలకులు..ఫలితంగా రోడ్డు పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. దీంతో ప్రజలు కష్టాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రంగారెడ్డి జిల్లాలో ని వాణిజ్య కేంద్రమైన మర్పల్లి నుంచి కోహీర్ మండలంలోని మనియార్‌పల్లి వరకు సుమారు పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పదేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జాజిగుబ్బడి తండాకు వెళ్లాలంటే కోహీర్ మండలంలోని లాల్‌సింగ్ తండా సమీపం నుంచి వెళ్లాల్సిఉంది. ఈ నేపథ్యంలో కోహీర్ మండలంలో కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే 10 కిలోమీటర్ల రోడ్డులో సుమారు 3 కిలో మీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 కిలోమీటర్లు రోడ్డు మెదక్ జిల్లా పరిధిలో ఉంది. కేవలం ఏడు ఇళ్లున్న జాజిగుబ్బడి తండా ప్రజల సౌకర్యార్థం రంగారెడ్డి జిల్లా ఇంజనీరింగ్ విభాగం అధికారులు పదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు ఫార్మేషన్ చేసి బీటీ రోడ్డు వేశారు. తమ పరిధిలో లేకపోయినా రంగారెడ్డి జిల్లా అధికారులు జాజిగుబ్బడి తండా ప్రజల కోసం 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అంటే మెదక్ జిల్లాలో అదనంగా రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. అయితే కోహీర్ మండల పరిధిలో మరో 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఒక కిలోమీటరు రోడ్డు నిర్మిస్తే 120 ఇళ్లున్న కోహీర్ మండలంలోని లాల్‌సింగ్ తండా వాసులకు, మరో 4 కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తే మనియార్‌పల్లి వాసులకు నేరుగా రంగారెడ్డి జిల్లాకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుంది. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అదనంగా పది కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోంది. మెదక్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మండల ప్రజల విన్నపాలను పట్టించుకోవడంలేదు. తద్వారా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లాల్‌సింగ్ తండా వాసు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో తండాకు కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఇదిలా ఉండగా మెదక్ జిల్లా పరిధిలోని రోడ్డుపై కల్వర్టు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా అధికారులు పైపులు తెచ్చారు. ఏ కారణం చేతనో గత పదేళ్లుగా పనులు మాత్రం చేపట్టడం లేదు. అటు రంగారెడ్డి జిల్లా అధికారులు, ఇటు మెదక్ జిల్లా అధికారులు కల్వర్టు నిర్మాణం గురించి పట్టించు కోవడంలేదు. కల్వర్టు నిర్మించక పోవడంతో భారీ వర్షాలు కురిస్తే తండాకు వెళ్లడం కష్టమైపోతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పం్దంచి కల్వర్టుతో పాటు రోడ్డు నిర్మించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. -
బైక్ కోసం విద్యార్థి హత్య
కోహీర్, న్యూస్‌లైన్ : పైసాపైసా కూడబెట్టి ఎంతో ఇష్టంగా కొన్న మోటార్ సైకిల్‌పై మోజు తీరకనే ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. పుల్కల్ ఎస్ఐ రమేష్ కథనం మేరకు.. పుల్కల్ మండలం శివంపేటకు చెందిన కిష్టయ్య, శివమ్మ దంపతుల రెండో కుమారుడైన శ్రావణ్‌కుమార్ (19) సంగారె డ్డిలోని శ్రీనిధి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పేదవారైన తన తల్లిదండ్రులను కష్టపెట్టకుండా కష్టపడి సంపాదించి 15 రోజుల క్రితం టీవీఎస్ స్పోర్ట్స్ మోటారు సైకిల్‌ను కొన్నాడు. ఇదిలా ఉండగా అవసరం నిమిత్తం కొండాపురం మండలం హరిదాస్‌పూర్‌కు చెందిన మిత్రుడు దశరథ్‌సింగ్‌ను డబ్బు అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని తన అన్న వరసకు అయిన బానో త్ రాందాస్ వద్ద ఇప్పిస్తానని చెప్పడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై హరిదాస్పూర్ వెళ్లారు. అక్కడ కూడా వారికి డబ్బు దొరకలేదు. కర్ణాటక రాష్ట్రం బోనస్పూర్ తండాలోని తన బంధువుల వద్ద డబ్బులు ఇప్పిస్తానని రాందాస్ శ్రావణ్‌కుమార్‌కు చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి గత శనివారం బైక్‌పై బోనస్పూర్ వెళ్లారు. అక్కడ కూడా వారికి డబ్బులు దొరకలేదు. దీంతో బోనస్‌పుర్‌లో మద్యం సేవించి సాయంత్రం అదే మోటార్ సైకిల్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాందాస్‌కు శ్రావణ్‌కుమార్‌ను చంపి బైక్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్బుద్ధి కలిగింది. ఈ విషయాన్ని వరుసకు తమ్ముడైన దశరథ్‌సింగ్‌కు తెలిపాడు. ఇందుకు దశరథ్ ఒప్పుకోలేదు. రాందాస్ ఒత్తిడి చేయడంతో సరేనన్నాడు. దీంతో శ్రావణ్‌ను మాటల్లో పెట్టి రోడ్డుకు దూరంగా అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇరువురూ కలిసి శ్రావణ్‌కుమార్ గొంతు నొక్కి చంపేశారు. అనంతరం బైక్‌ను బోనస్‌పూర్‌కు తీసుకెళ్లి విక్రయించే ప్రయత్నంచేశారు. వారి ప్రయత్నం విఫలమైంది. దీంతో చేసేది లేక ఆదివారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కోహ ర్ మండలంలోని కవేలి క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల కంట పడ్డారు. వారు బైక్‌కు సంబంధించిన పత్రాలు అడగడంతో చూపించలేకపోయారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. శ్రావణ్‌కుమార్ బైక్‌ను తమ వద్ద ఉంచి ఎటో వెళ్లాడని వాహనం పత్రాలు కావాలని శ్రావణ్‌కుమార్ అన్న శ్రీశైలానికి దశరథ్ ఫోన్ చేశాడు. అనుమానంతో శ్రీశైలం పుల్కల్ పోలీసులను ఆశ్రయించాడు. దశరథ్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసిన విషయం బయటికి వచ్చింది. నిందితుల సమాచారం మేరకు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
రాక్‌వూల్ పరిశ్రమలో కార్మికుడి మృతి
కోహీర్, న్యూస్‌లైన్: మండలంలోని కవేలి రాక్‌వూల్ కర్మాగారంలో పని చేస్తున్న ఓ కార్మికుడు విధి నిర్వహణలో అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు పరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆందోళన పోలీసుల చొరవతో రాత్రి 8 గంటలకు ముగిసింది. మృతుని బంధువులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పర్తుగారి సంగయ్య (55) కవేలి రాక్‌వూల్ కర్మాగారంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన అతను తెల్లవారుజామున 3.30 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు అతన్ని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అయితే విధి నిర్వహణలో చనిపోయిన సంగయ్య కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని బంధువులు ఆందోళనకు దిగారు. కర్మాగారంలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట సంగయ్య మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. రూ.15 లక్షలు నష్ట పరిహారం, సంగయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంధువుల తరఫున కార్మిక సంఘం నాయకులు కర్మాగారం అధికారులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అయితే మరోసారి కవేలి సర్పంచు మొగులయ్య, వెంకటాపూర్ సర్పంచు మల్లికార్జున్, మాజీ ఎంపీటీసీ మణ్యయ్యగౌడ్ల ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు కర్మాగారం అధికారులు అడ్మినిస్ట్రేషన్ జనరల్ మేనేజర్ ర త్నాకర్, ఆపరేషన్ జనరల్ మేనేజర్ సతీష్ గుప్తలతో చర్చలు జరిపారు. అయితే యాజమాన్యం స్థానికంగా లేనందున వారితో మాట్లాడేంతవరకూ తాము ఏమీ చెప్పలేమని కర్మాగారం అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించన కార్మికులు కూడా మృతుడు సంగయ్య బంధువులతో కలిసి కర్మాగారం ఆవరణలో బైఠాయించారు. కర్మాగార యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నించారు. అయితే పరిహారం చెల్లించేందుకు కర్మాగారం అధికారులు ఒప్పుకోకపోవడంతో సీఐ కూడా ఏమీ చేయలేకపోయారు. మరోవైపు పలువురు కార్మిక, రాజకీయ పార్టీల నేతలు మృతుని కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం కోసం ఇప్పించేందుకు కర్మాగారం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో సీఐ నరేందర్ మరోసారి కార్మాగారం అధికారులు, మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి తక్షణ అవసరం కింద రూ.50 వేలు చెల్లిస్తామని ఒప్పుకున్న కర్మాగారం అధికారులు, పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు 10 రోజుల అనంతరం యాజమాన్యంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇందుకు సంగయ్య కుటుంబీకులు ఒప్పుకోవడంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.