ప్రమాదానికి గురైన బస్సు
- తప్పిన పెను ప్రమాదం
- ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
- తాగి నడిపిన డ్రైవర్.. కేసు నమోదు
కోహీర్: డ్రైవర్ తాగిన మైకంలో అజాగ్రత్తగా నడపడంతో దిగ్వాల్ జీఎంఆర్ పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డుదిగింది. ఈ ఘటన మండలంలోని సజ్జాపూర్ శివారులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం...
మండలంలోని దిగ్వాల్ జీఎంఆర్ పాఠశాల బస్సు 20 మంది విద్యార్థులతో బయలు దేరింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో సజ్జాపూర్ శివారులో అదుపుతప్పి రోడ్డు కిందికి దిగిపోయింది. కుదుపులతో కొద్ది దూరంలో ఆగింది. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనతో ఆహాకారాలు చేశారు. రోడ్డు ఎత్తులో ఉండడంతో ఆ పక్కనే గోతుల మాదిరిగా ఉంది. కిందికి దిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది.
బస్సు పైనే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన బయలుదేరి ఘటనా స్థలానికి వెళ్లి తమ పిల్లలను తీసుకెళ్లారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊపిరి పీల్చుకొన్నారు.
బిలాల్‌పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజు తాగిన మైకంలో అజాగ్రత్తగా బస్సును తోలడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులకు గాయాలైనట్లు తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. తాగిన మైకంలో బస్సు నడిపిన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.