ప్రమాదంలో ధ్వంసమైన బస్సు, లోయలోకి పడిపోయిన బస్సు. ఇన్‌సెట్‌లో మృతి చెందిన బాబాఫక్రుద్దీన్ (ఫైల్)
కదిరి/బెంగళూరు/యశవంతపుర: ఆ విద్యార్థి వయసులో చిన్నవాడైనా ఉన్నతమైన ఆలోచనలతో మెలిగేవాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఉపాధ్యాయులకు చెప్పేవాడు. అదే నమ్మకంతో ఉపాధ్యాయులు సైతం అతడిని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. కానీ.. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన అతడి ప్రాణాలను మృత్యువు కబళించింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సును నిర్లక్ష్యంగా నడపడమే ఇందుకు కారణమైంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి–మురిడి మధ్య అటవీ ప్రాంతంలో బెంగళూరు–హొన్నావర్ జాతీయ రహదారి పైనుంచి శుక్రవారం రాత్రి బస్సు లోయలోకి బోల్తా పడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవలీ కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి టి.బాబాఫక్రుద్దీన్ (15) మృతి చెందాడు. ప్రమాదంలో మరో విద్యార్థి షాహిద్, ఉపాధ్యాయులు ఆదినారాయణరెడ్డి, విశ్వేశ్వరయ్య, నాగిరెడ్డి తీవ్రంగా గాయపడగా.. మరో 26 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిందిలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 46 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు, నలుగురు వంట మనుషులు కలిసి మొత్తం 60 మంది ఈనెల 2న కర్ణాటకకు చెందిన ప్రైవేట్ బస్సులో విహార యాత్ర నిమిత్తం కర్ణాటక బయలుదేరారు. శుక్రవారం రాత్రికి మురిడి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణం సాగిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో సురేఖ మురిగి వ్యూ పాయింట్ వద్ద బస్సు అదుపు తప్పి ఎడమ వైపున లోయలోకి బోల్తా కొట్టింది. విద్యార్థి బాబాఫక్రుద్దీన్‌పై తోటి ప్రయాణికులు పడటంతో ఊపిరాడక మరణించాడు. మరో విద్యార్థి షాహిద్ తలకు బలమైన గాయమైంది. ఉపాధ్యాయుడు ఆదినారాయణరెడ్డికి చేయి విరగ్గా, మరో ఉపాధ్యాయుడు విశ్వేశ్వరయ్య తలకు, మరో టీచర్ నాగిరెడ్డి దవడకు తీవ్ర గాయాలయ్యాయి.
సీఎం వైఎస్ జగన్ ఆరా
బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందేవిధంగా అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థి ఫక్రుద్దీన్ కుటుంబానికి సీఎం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment